‘అమ్మ నన్ను అట్లకాడతో కాల్చింది.. నొప్పిగా ఉంది’
♦ కంటతడి పెట్టించిన బాలుడి మాటలు
♦ రెండున్నరేళ్ల బాలుడిపై కన్నతల్లి కర్కశత్వం
ఒంగోలు క్రైం: చెప్పిన మాట వినలేదని కన్నబిడ్డకు అట్లకాడతో వాతలు పెట్టిందో మహాతల్లి. ‘అమ్మ నన్ను అట్లకాడతో కాల్చింది.. బాగా నొప్పిగా ఉంది’ అంటూ బాలుడు చెబుతున్న మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఒంగోలులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న శ్రావణ్‌కుమార్, గీత దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు అఖిరానందన్. బాలుడు చెప్పిన మాట వినలేదనే కోపంతో తల్లి గీత సోమవారం ఇంట్లో ఉన్న అట్లకాడను స్టవ్‌పై ఎర్రగా కాల్చి పిరుదులు, తొడ, మూతి మీద వాతలు పెట్టింది. దీనిపై స్థానికులు మంగళవారం చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి బి.వి.సాగర్ బాలుడి ఇంటి వద్దకు చేరుకుని శరీరంపై ఉన్న వాతలు గమనించి జిల్లా బాలల సంక్షేమ కమిటీ, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాలుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.