ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జామెట్రీ కంపాస్‌తో విచక్షణారహితంగా 108 సార్లు దాడి చేసి గాయపరిచారు. నవంబర్ 24వ తేదీన ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల దాడి ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(డబ్ల్యూసీ) తీవ్రంగా స్పందించింది.
ఘటనపై వెంటనే తమకు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ‘‘ గొడవ సందర్భంగానే చిన్నారులు ఇలా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. నిందితులైన విద్యార్థులకు హింసాత్మకమైన సన్నివేశాలున్న వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? నాలుగో తరగతి విద్యార్థుల్లో ఇంతటి హింసాప్రవృత్తి ఎలా సాధ్యం? దీనికి కారణాలేంటి? ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తాం. పోలీసుల నివేదిక కోరాం’’ అని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ పల్లవి చెప్పారు.
‘‘ మా అబ్బాయి రక్తమోడుతూ ఇంటికొచ్చాడు. అసలేం జరిగిందో తెలీడం లేదు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ ఇచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. వారు బహుశా తమ తప్పును కప్పిపుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారేమో’’ అని బాధిత విద్యార్థి తండ్రి వాపోయాడు.
‘‘ బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులైన విద్యార్థుల వయసు పదేళ్లలోపే. సంబంధిత చట్టాల ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతోంది’’ అని నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వివేక్ సింగ్ చౌహాన్ చెప్పారు. ‘‘కొంతకాలంగా స్కూలు చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనిపై అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment