
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. సగటున రోజుకి వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వెలుగులోకి రానివి మరెన్నో?. తాజాగా.. హర్యానాలోని జింద్‌లో ఘోరమైన ఘటన జరిగింది. నలుగురు దుండగులు అయిదేళ్ల చిన్నారిని హత్య చేసి, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాత గొడవల కారణాంగానే నిందితులు ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం చెత్త ఏరుకుంటూ జింద్ జిల్లా(Jind) శివారులోని గుడిసెల్లో నివసిస్తోంది. కొన్నిరోజుల కిందట అమిత్ అనే వ్యక్తికి, బాధిత మహిళ భర్తకి గొడవ జరిగింది. ఈ గొడవలో ఆమె భర్త తలకు గాయం కాగా పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు నిందితుడు అమిత్‌పై చర్యలు తీసుకోకుండా.. గొడవను సర్దిచెప్పి పంపించారు.
ఇది మనసులో పెట్టుకున్న అమిత్, అతని మైనర్ సోదరుడు కోపంతో రగిలిపోయారు. మంగళవారం రాత్రి ఆమె భర్త లేని సమయం చూసి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోయాక.. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతానికి లాక్కెళ్లారు.
అక్కడ చిన్నారి గొంతునులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళ వాళ్లను గుర్తించి స్థానికులకు సమాచారం అందించింది. చిన్నారిని ఖననం చేశాక.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు తన ఐదేళ్ల వయసున్న బిడ్డపైనా నిందితులు అత్యాచారానికి ఒడిగొట్టారని చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో స్థానిక ఎస్సై యశ్‌వీర్, సమాధి నుంచి పసికందు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. మరోవైపు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అమిత్‌తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.