
కర్ణాటక: నవమాసాలు మోసి కని పెంచిన పిల్లలను ఓ తల్లి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటన బెంగళూరు జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంగాదేవి తన ఇద్దరు పిల్లలైన లక్ష్మీ (9), గౌతమ్ (7)లను చంపేసి పోలీస్ సహాయవాణికి ఫోన్ చేసి చెప్పింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగాదేవి కుటుంబం కొన్నేళ్ల క్రితం వలసవచ్చి జాలహళ్లిలో నివాసం ఉంటుంది. ఆమె ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేసేది, ఆమె భర్త బీబీఎంపీ కాంట్రాక్టు పౌర కార్మికుడు.
గత నెలలో భర్తపై గంగాదేవి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కిందకేసు నమోదు చేసి అరెస్ట్‌చేశారు. ఇద్దరు పిల్లలతో మంగళవారం ఉగాది పండుగ చేసుకున్న గంగాదేవి అర్ధరాత్రి ఇద్దరు పిల్లలను దిండుతో ఉపిరాడకుండా చేసి హత్యచేసింది. రాత్రి 1 గంట సమయంలో పోలీస్ సహాయవాణికి ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతోంది, రావాలని కోరింది. జాలహళ్లి పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా, పిల్లలను తానే చంపానని ఆమె చెప్పిందని ఉత్తర విభాగం డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. భర్తతో గొడవలు, ఆర్థిక సమస్యల వల్ల మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహిళను జాలహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment