Geometry
-
జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జామెట్రీ కంపాస్‌తో విచక్షణారహితంగా 108 సార్లు దాడి చేసి గాయపరిచారు. నవంబర్ 24వ తేదీన ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల దాడి ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(డబ్ల్యూసీ) తీవ్రంగా స్పందించింది. ఘటనపై వెంటనే తమకు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ‘‘ గొడవ సందర్భంగానే చిన్నారులు ఇలా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. నిందితులైన విద్యార్థులకు హింసాత్మకమైన సన్నివేశాలున్న వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? నాలుగో తరగతి విద్యార్థుల్లో ఇంతటి హింసాప్రవృత్తి ఎలా సాధ్యం? దీనికి కారణాలేంటి? ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తాం. పోలీసుల నివేదిక కోరాం’’ అని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ పల్లవి చెప్పారు. ‘‘ మా అబ్బాయి రక్తమోడుతూ ఇంటికొచ్చాడు. అసలేం జరిగిందో తెలీడం లేదు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ ఇచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. వారు బహుశా తమ తప్పును కప్పిపుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారేమో’’ అని బాధిత విద్యార్థి తండ్రి వాపోయాడు. ‘‘ బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులైన విద్యార్థుల వయసు పదేళ్లలోపే. సంబంధిత చట్టాల ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతోంది’’ అని నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వివేక్ సింగ్ చౌహాన్ చెప్పారు. ‘‘కొంతకాలంగా స్కూలు చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనిపై అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
అక్కడ వారికి పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌లు మాత్రమే దొరుకుతాయి!
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా ఇలాంటి దాడులే జరిగాయని, ఏమి కనగొనలేకపోయారని అన్నారు. అమెరికా ప్రసిద్ధ వార్త పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆయన పనితీరుని ప్రశంసించి ఫ్రంట్ పేజీలో ప్రచురిస్తే... కేంద్ర ప్రభుత్వం సీబీఐ దాడులు నిర్వహిస్తుందని పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు. అయినా మనీష్ సిసోడియా ఇంట్లో కేవలం పుస్తకాలు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు మాత్రేమ కనిపిస్తాయని ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సుమారు వంద మందికి పైగా ఆప్ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని, ప్రతికేసులో ఒక్కొక్కరిగా తాము కేసు నుంచి బయటపడ్డామని రాఘవా అన్నారు. ఐతే సీబీఐ విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా తొమ్మిది నెలలుగా అమలు చేసిన కొత్త మద్యం పాలసీపై విచారణ జరుపుతోంది. ఢిల్లీలో కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా మద్యం విక్రయించడానికి ఎవరికి అనుమతి ఇవ్వాలనే దానిపై సిసోడియా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని సీబీఐ పేర్కొంది. అంతేకాదు లైసెన్సులతో మధ్యం విక్రయించుకునేలా ప్రైవేట్ వ్యక్తులకే అధిక సంఖ్యలో కట్టబెట్టేందుకు చూసిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఐతే అవినీతిని అరికట్టేందుకు, శక్తివంతమైన మద్యం మాఫియాపై పోరాడేందుకు ఈ విధానాన్ని ఉద్దేశించినట్లు సిసోడియా చెబుతుండటం గమనార్హం. (చదవండి: సీబీఐ దాడుల మధ్య కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్) -
బాల్యవివాహాన్ని వ్యతిరేకించిన రేఖా కాళింది
సాహస బాలిక ప్రస్తుతం 16 సంవత్సరాల వయసున్న రేఖా కాళింది పశ్చిమబెంగాల్లోని పురులియా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించింది. తన 13 వ యేట పాఠశాలకు వెళ్లి చదువుకోవాలనే లక్ష్యంతో బాల్యవివాహాన్ని వ్యతిరేకించి తనలాంటి ఎంతోమంది బాలికలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. పేద కుటుంబంలో పుట్టిన రేఖ బాల్యం నుంచి చిన్నా చితకా పనులు చేస్తూ తండ్రికి తోడుగా నిలిచింది. ఒక ఎన్జివో ఆమెను బాలకార్మిక వ్యవస్థనుండి తప్పించి ఒక ప్రత్యేక పాఠశాలలో చేర్పించింది. ఆ బడిలో ప్రాథమిక విద్యతో పాటు నాయకత్వ లక్షణాలను కూడా బోధించేవారు. ఆ ఊరిలోని మిగతా ఆడపిల్లలలానే రేఖ తల్లితండ్రులు ఆమెకు పదకొండేళ్లు రాగానే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి ఇక చదువెందుకని ఆమెను బడి మాన్పించారు. కానీ రేఖ తల్లితండ్రుల నిర్ణయానికి ఎదురుతిరిగింది. ఈ సమాచారాన్ని తాను చదివే పాఠశాలలోని వారికి తెలివిగా చేరవేసింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు ఆమె సంకల్పానికి మద్దతుగా ఇరుకైన మురికి వీధుల్లో నడిచి రేఖ ఇంటికి చేరి రేఖకు అప్పుడే పెళ్ళి చెయ్యొద్దనీ, చదువుకోనిమ్మనీ ఆమె తల్లిదండ్రులను అభ్యర్థించారు. దాంతో రేఖ తల్లితండ్రులు ఒప్పుకోక తప్పలేదు. రేఖ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఎందరో తల్లితండ్రులు బాలికలపట్ల చూపుతున్న సంఘవివక్షతను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది. అంతేకాదు, తనతోటి బాలికలలో కూడా బాల్యవివాహాన్ని వ్యతిరేకించే ధైర్యం కలిగించింది. రేఖకు 2010 సం॥జాతీయ సాహస బాలల పురస్కారం లభించింది. నాటి రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకుంది.