బాల్యవివాహాన్ని వ్యతిరేకించిన రేఖా కాళింది | Rekha Kalindi against child marriages | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాన్ని వ్యతిరేకించిన రేఖా కాళింది

Published Sat, Dec 13 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

బాల్యవివాహాన్ని వ్యతిరేకించిన రేఖా కాళింది

బాల్యవివాహాన్ని వ్యతిరేకించిన రేఖా కాళింది

సాహస బాలిక
 
ప్రస్తుతం 16 సంవత్సరాల వయసున్న రేఖా కాళింది పశ్చిమబెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించింది. తన 13 వ యేట పాఠశాలకు వెళ్లి చదువుకోవాలనే లక్ష్యంతో బాల్యవివాహాన్ని వ్యతిరేకించి తనలాంటి ఎంతోమంది బాలికలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. పేద కుటుంబంలో పుట్టిన రేఖ బాల్యం నుంచి చిన్నా చితకా పనులు చేస్తూ తండ్రికి తోడుగా నిలిచింది. ఒక ఎన్‌జివో ఆమెను బాలకార్మిక వ్యవస్థనుండి తప్పించి ఒక ప్రత్యేక పాఠశాలలో చేర్పించింది. ఆ బడిలో ప్రాథమిక విద్యతో పాటు నాయకత్వ లక్షణాలను కూడా బోధించేవారు.

ఆ ఊరిలోని మిగతా ఆడపిల్లలలానే రేఖ తల్లితండ్రులు ఆమెకు పదకొండేళ్లు రాగానే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి ఇక చదువెందుకని ఆమెను బడి మాన్పించారు. కానీ రేఖ తల్లితండ్రుల నిర్ణయానికి ఎదురుతిరిగింది. ఈ సమాచారాన్ని తాను చదివే పాఠశాలలోని వారికి తెలివిగా చేరవేసింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు ఆమె సంకల్పానికి మద్దతుగా ఇరుకైన మురికి వీధుల్లో నడిచి రేఖ ఇంటికి చేరి రేఖకు అప్పుడే పెళ్ళి చెయ్యొద్దనీ, చదువుకోనిమ్మనీ ఆమె తల్లిదండ్రులను అభ్యర్థించారు. దాంతో రేఖ తల్లితండ్రులు ఒప్పుకోక తప్పలేదు.

రేఖ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఎందరో తల్లితండ్రులు బాలికలపట్ల చూపుతున్న సంఘవివక్షతను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది. అంతేకాదు, తనతోటి బాలికలలో కూడా బాల్యవివాహాన్ని వ్యతిరేకించే ధైర్యం కలిగించింది. రేఖకు 2010 సం॥జాతీయ సాహస బాలల పురస్కారం లభించింది. నాటి రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement