తన బృందంతో కోయెల్ (ఎర్ర దుస్తుల అమ్మాయి)
20 ఏళ్లు కూడా లేని కోయెల్‌ని ఆ ఊళ్లో అంతా విలన్‌గా చూస్తారు. చంపుతాం అన్నారు. అత్యాచారం చేస్తాం అని బెదిరించారు. కాని కోయల్ వినదు. భయపడదు. కోవిడ్ కాలంలో అనేక కారణాల వల్ల బాల్య వివాహాలు పెరిగిపోయాయి. ఆడపిల్లలు విలపిస్తున్నారు. సిలిగురి ప్రాంతంలో కోయెల్ తనలాంటి అమ్మాయిలతో కలిసి గస్తీ కాస్తోంది. బాల్యవివాహం జరిగే మంటపంలో ప్రత్యక్షమై ‘ఆపరా’ అని అంటోంది.ఆమె వస్తే పెళ్లి ఆగాల్సిందే.
‘తల్లిదండ్రుల ఆలోచన, నిస్సహాయత ఏదైనా కావచ్చు. కాని అది ఆడపిల్ల భవిష్యత్తును దెబ్బ తీసే విధంగా ఉండకూడదు’ అంటుంది 19 ఏళ్ల కోయెల్ సర్కార్.
ఈ అమ్మాయి సిలిగురి (పశ్చిమ బెంగాల్) సమీపంలో ఉండే ఒక గ్రామంలో ‘వరల్డ్ విజన్ ఇండియా’ అనే ఎన్.జి.ఓతో కలిసి పని చేస్తుంది. ఆమె చేసే ప్రధానమైన పని బాల్య వివాహాలను నిరోధించడం. ఇందుకు ఆమెతో పాటు పని చేసే, ఆమె వయసు ఉండే మరో 25 మంది అమ్మాయిల దళం ఉంది. అందరూ రహస్య పోలీసుల కంటే సమర్థంగా తమ ఊళ్లో చుట్టుపక్కల పల్లెల్లో బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతాయా అని చూస్తూ ఉంటారు.
‘ఈ రెండేళ్లలో నేను 8 బాల్య వివాహాలను ఆపించాను’ అంటుంది కోయెల్.
కాని పెద్దవాళ్లు ఊరికే ఉంటారా? పెద్దవాళ్లు అంటే ఎవరు? వధువు తల్లిదండ్రులు... వరుడి తల్లిదండ్రులు. మాకు లేని నొప్పి నీకెందుకు అని కోయెల్‌తో తగాదాకు వస్తారు. ‘ఇప్పటికి రెండుసార్లు మా ఇంటి మీదకు జనం దాడికి వచ్చారు. నన్ను, మా చెల్లెల్ని చంపుతాం అన్నారు. నన్ను రేప్ చేస్తాం అన్నారు. ట్యూషన్ నుంచి వస్తుంటే ఒకసారి నా మీద రాళ్ల దాడి జరిగితే సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లడమే మానేశాను. కాని బాల్య వివాహాలను ఆపడం మాత్రం మానలేదు’ అంటుంది కోయెల్.
ఆమెకు ఈ పని ఇంత గట్టిగా చేయాలని ఎందుకు అనిపించింది? స్వీయ జీవితం నుంచే. ‘మా అమ్మకు 17 ఏళ్ల వయసులో 35 ఏళ్ల మా నాన్నతో పెళ్లి జరిపించారు. నేను పుట్టిన మూడేళ్లకు నన్ను. అమ్మను, చెల్లిని వదిలి మా నాన్న వెళ్లిపోయాడు. మా అమ్మకు ఎన్నో ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలు ఉండేవి. అన్నీ నాశనం అయ్యాయి. మేము చాలా కష్టాలు పడ్డాం. అలా ఎవరూ పడకూడదనే నా తపన’ అంటుంది కోయెల్.
వెస్ట్ బెంగాల్‌లో బహుశా దేశంలో చాలా చోట్ల ఈ రెండేళ్లలో పరిస్థితి చాలా మారింది. మధ్యతరగతి, పేద వర్గాల ఆదాయం గండి పడింది. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా పిల్లను సాగనంపితే చాలు అనుకుంటున్నారు. కోవిడ్ కాలంలో పెళ్లిళ్లు జనం ఊసు లేకుండా జరిపించే వీలు ఉండటంతో అదీ ఒకందుకు మంచిదే అనుకుంటున్నారు. స్కూళ్లు మూతబడి, చదువు మానేసి, ఫ్రెండ్స్‌కు దూరమయ్యి ఇరవై నాలుగ్గంటలు ఇంట్లో ఉంటున్న ఆడపిల్లలు తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తున్నారు. అందుకని కూడా పెళ్లిళ్లకు తొందరపడుతున్నారు.
‘పెళ్లి తొందరలో అమ్మాయి తల్లిదండ్రులు ఎవరికో ఒకరికి కట్టబెడుతున్నారు. ఆ వెళ్లినచోట ఆ ఆడపిల్లలు ఏ మాత్రం సురక్షితంగా ఉండటం లేదు. సుఖంగా కూడా’ అంటుంది కోయెల్. ‘ఆడపిల్లను క్షేమంగా ఉంచలేమని, ప్రేమలో పడి ఎవరితోనైనా వెళ్లిపోతారని కూడా ఈ పని చేస్తున్నారు’ అంటుంది కోయెల్.
అయితే తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నా ఆడపిల్లలు నిజంగా చదువుకోవాలని కోరుకుంటున్నారు. జీవితంలో ఏదో ఒక మేరకు స్థిరపడాలనుకుంటున్నారు. అందుకే పెళ్లి సంబంధం చూడగానే కోయెల్‌కు ఉప్పందిస్తున్నారు. కోయెల్ తన దళంతో వెళ్లి పెళ్లి ఆపు చేస్తోంది. ‘పెళ్లి ఆపించి ఊరుకోవడం లేదు. అలాంటి ఆడపిల్లల స్వయం ఉపాధికి లేదా తల్లిదండ్రుల ఉపాధికి ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నాం.’ అంటుంది కోయెల్.
బాల్య వివాహాలు ఆపడమే కాదు నేపాల్ సరిహద్దుకు దగ్గర కాబట్టి చైల్డ్ ట్రాఫికింగ్ జరక్కుండా కూడా అడ్డుకునే పని కోయెల్ దళం చేస్తోంది. ‘అమ్మాయిలను ఏమార్చేవారు పెళ్లి కొడుకుల వేషంలో వస్తుంటారు’ అంటుందామె.
ఆడపిల్లల గురించి ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహక చర్యలు చేపట్టినా తల్లిదండ్రుల అండ లేకపోతే వాళ్లు ముందుకు పోరు. తల్లిదండ్రులు విఫలమైన చోట కోయెల్ వంటి సామాజిక కార్యకర్తలు కావాలి. తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు కలిసి పని చేస్తే ఏ ఆడపిల్లకు కూడా పరిణిత వయసుకు ముందే అనవసర పెళ్లిళ్లు జరగవు. అక్కర్లేని సమస్యలు రావు.
Comments
Please login to add a commentAdd a comment