ఓ వైపు బాగా చదువుకున్న అమ్మాయిలు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. దీనికారణంగా 40 దాటే వరకూ పిల్లలు కలగక ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు పదహారేళ్లు నిండకముందే కొందరు అమ్మాయిలు తల్లులవుతున్నారు. పరస్పర ఈ వైరుధ్యం పలువురు వైద్యులు, నిపుణులను విస్మయపరుస్తున్న అంశం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు వస్తున్న గర్భిణుల్లో 3 శాతానికి పైగా మైనర్ అమ్మాయిలు వస్తున్నట్టు తేలింది.
బాల్యవివాహాల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 458 మంది మైనర్ అమ్మాయిలు గర్భం దాల్చారు. ఇందులో 16 ఏళ్లలోపు అమ్మాయిలు 107 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.శ్రీసత్యసాయి జిల్లాలోనూ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. మొత్తం ప్రసవాల్లో 3.23 శాతం మైనర్లవే కావడం గమనార్హం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో మైనార్టీ తీరని అమ్మాయిలు ప్రేమ– పెళ్లి బాట పడుతున్నారు.
ప్రతిబంధకంగా బాల్య వివాహాలు
గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయి అంటేనే భారంగా భావిస్తున్నారు. అందుకే 15 ఏళ్లకే పెళ్లి చేస్తున్నారు. రాయదుర్గం, మడకశిర, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పదో తరగతి చదువుతూండగానే పెళ్లి చేస్తున్నారు. బాగా చదువుకుని కెరీర్‌లో స్థిరపడాల్సిన సమయంలో వారికి పెళ్లి తీవ్ర ప్రతిబంధకంగా మారుతోంది.
నిఘా పెట్టినా ఆగడం లేదు
స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలను అడ్డుకుంటున్నా మరోవైపు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. బాల్యవివాహాలు కుదిర్చిన పెద్దలు, ఇరువురు తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడే అవకాశమున్నా కొన్ని ప్రాంతాల్లో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చైల్డ్‌లైన్ 1098, హెల్ప్‌లైన్ 181, డయల్ 100కు ఫోన్ చేస్తే పెళ్లిళ్లు ఆపేస్తారు. దీన్ని వినియోగించుకోవాలని ఐసీడీఎస్ అధికారులు కోరుతున్నారు.
= ‘అనంత’ జిల్లాలో 4 మాసాల్లో 458 ‘మైనర్’ ప్రెగ్నెన్సీలు
= ఇందులో పదహారేళ్లలోపు అమ్మాయిలు 107 మంది
= శ్రీసత్యసాయి జిల్లాలో మరింత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు
= చిన్న వయసులోనే గర్భం దాలుస్తున్న యువతులు 3.23 శాతం
= అమ్మాయిలను వెంటాడుతున్న సామాజిక మాధ్యమాల దు్రష్పభావం
బాల్యవివాహాలతో భారీ నష్టం
= చదువు ఆగిపోయి కెరీర్ అర్ధంతరంగా ముగుస్తుంది
= చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల బరువు తక్కువ పిల్లలు పుట్టే అవకాశం
= చిన్న వయసులో తల్లి కావడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది
= ప్రీ మెచ్యూర్ అంటే 9 నెలలకు ముందే పిల్లలు పుట్టే అవకాశం
= దీనివల్ల కాన్పు సమయంలో తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ ప్రాణాపాయం
కౌన్సెలింగ్ ఇస్తున్నాం
కొన్ని ప్రాంతాల్లో 15 ఏళ్లు దాటగానే అమ్మాయిలను తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ముందస్తుగా పెళ్లి చేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. మరికొన్ని చోట్ల సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై యువతీ యువకులు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌ల ప్రభావం ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం.
–శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్
Comments
Please login to add a commentAdd a comment