మహానగరంలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది కనిపించకుండా పోయారు. ఆదివారం వివిధ పోలీస్‌స్టేషన్లలో ఈ మేరకు కేసులునమోదయ్యాయి.
ఆటో డ్రైవర్..
మీర్‌పేట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆటోడ్రైవర్ అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాఘవేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నందనవనం ప్రాంతానికి చెందిన చెందిన రమావత్ కరుణాకర్ (30) కొన్ని రోజుల క్రితం ఆటోతో బయటకు వెళ్లి నల్లకుంట ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రంకన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. అప్పటి నుంచి అతను ఇంటికి తిరిగిరాలేదు. ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో కటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాపీమేస్త్రీ...
వనస్థలిపురం వెంకటరమణ కాలనీకి చెందిన చిన బ్రహ్మయ్య తాపీ మేస్త్రీగా పని చేసేవాడు. హస్తినాపురం గోకుల్‌ఎన్‌క్లేవ్‌కు చెందిన కాశిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అనే బిల్డర్ వద్ద అడ్వాన్స్ తీసుకుని వారం రోజుల క్రితం భార్యను ఊరికి పంపించాడు. మరుసటి రోజు పనిలోకి వచ్చిన బ్రహ్మయ్య బాత్‌రూమ్‌కి వెళ్లి వస్తానని తోటి మేస్త్రీకి చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వెంకటేశ్వర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పరీక్ష రాసేందుకువెళ్లిన విద్యార్థిని..
బృందావన్ కాలనీకి చెందిన రత్లావత్ రాములు కుమార్తె హరిత (21) గత కొన్ని రోజుల క్రితం ఆర్‌ఎన్‌రెడ్డినగర్‌లోని టీకేఆర్ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదు. స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి రాములు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సాయికుమార్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కుమారుడితో సహా తల్లి..
జిల్లెలగూడ వెంకటేశ్వరకాలనీకి చెందిన కె.అంజన్‌దాస్, ఉపేంద్రమ్మ (32) భార్యాభర్తలు. కొన్ని రోజుల క్రితం ఉపేంద్రమ్మ పుట్టింటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి కుమారుడి (3)తో సహా బయటికి వెళ్లింది. అటు పుట్టింటికి వెళ్లక, ఇటు ఇంటికి తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భర్తతో గొడవపడి ..
నందనవనంకు చెందిన వడ్త్యావత్ రమేష్, నాన్‌కో (24)లు భార్యాభర్తలు. వారం రోజుల క్రితం నాన్‌కో భర్త రమేష్‌తో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె భర్త రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తేనె విక్రయించేందుకు వెళ్లి ..
తేనె విక్రయించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. నందనవనం ప్రాంతానికి చెందిన పతోలియా మండల్ (28) వారం రోజుల క్రితం తీనె విక్రయించేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వేస్టేషన్ నుంచి వస్తూ చిన్నారి..
భాగ్యనగర్‌కాలనీ: తల్లిదండ్రులతో కలిసి ఎంఎంటీఎస్ రైలు దిగిన చిన్నారి అదృశ్యమైన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బోరబండ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన షఫీక్ శనివారం ఉదయం బోరబండ రైల్వేస్టేషన్‌లో కుటుంబంతో సహా ఎంఎంటీఎస్ రైలు దిగాడు. ఈ క్రమంలో అతని కుమార్తె పర్హానా (7) తల్లిదండ్రుల కంటే ముందుగా ఇంటికి వెళ్లాలని వేగంగా ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్ళింది. తల్లిదండ్రులు ఇంటికి చేరుకోగా పర్హానా మాత్రం కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే హెడ్ కానిస్టేబుల్..
మల్కాజిగిరి:విధులకు వెళ్లిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లికార్జుననగర్‌కు చెందిన కేవీ రమణారెడ్డి జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్‌గా కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 6న మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం రమణారెడ్డి సహోద్యోగి వీ.ఎల్.చారి, రమణారెడ్డి కుమారుడు భార్గవ తేజకు ఫోన్ చేసి రమణారెడ్డి విధులకు హాజరుకాలేదని తెలిపాడు. అతని కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐస్‌క్రీం కోసం వెళ్లి..
చైతన్యపురి: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యం అయ్యారు. పోలీసుల సమాచారం మేరకు... మోహన్‌నగర్ జనప్రియ అపార్టుమెంట్స్‌లో నివసించే మహమ్మద్ సిరాజుద్దీన్ ప్రైవేటు కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేస్తుంటాడు. సిరాజుద్దీన్‌కు ఫిబ్రవరిలో హుస్నా జబీన్(21)తో వివాహం జరిగింది. శనివారం ఉదయం అతను డ్యూటీకి వెళ్లి రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. ఇంట్లో భార్య కనిపించకపోవటంతో ఎదురుగా ఉండే అత్తగారిని అడిగాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఐస్‌క్రీం తీసుకొస్తానని చెప్పి వెళ్లిందని సమాధానం ఇచ్చింది. ఫోన్ చేయగా సెల్ స్విచ్ ఆఫ్ ఉంది. ఆమె కోసం పలు ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేక పోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మందలించినందుకు...
మందులు వేసుకోలేదని మందలించినందుకు ఓ తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వివరాలివీ... కూలీ పనిచేసుకునే రమావత్ లిచ్చరాం(57) భార్యతో కలిసి చైతన్యపురి అంంబేడ్కర్‌నగర్ కాలనీలో నివసిస్తున్నాడు. ఇటీవల లచ్చిరాంకు జ్వరం వచ్చింది. డాక్టర్‌కు చూపించారు. మందులు రాసి ఇవ్వగా వేసుకోకుండా మద్యం సేవిస్తున్నాడు. కుటుంబ సభ్యులు మద్యం మాని టాబ్లెట్స్ వేసుకోమని మందలించారు. దీంతో శనివారం సాయంత్రం మూడు గంటల సమయలో బయటకు వెళ్లిన లచ్చిరాం తిరిగి రాలేదు. వెతికినా జాడ తెలియక పోవటంతో అతని కుమారుడు భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేర్వేరుగా కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment