8 నెలలు.. 356 మిస్సింగ్ కేసులు | missing cases in adilabad district | Sakshi
Sakshi News home page

8 నెలలు.. 356 మిస్సింగ్ కేసులు

Published Tue, Aug 30 2016 3:23 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

8 నెలలు.. 356 మిస్సింగ్ కేసులు

8 నెలలు.. 356 మిస్సింగ్ కేసులు

  ఇంకా దొరకని 47 మంది ఆచూకీ
  అక్రమ రవాణాకు గురవుతున్న పిల్లలు 
  అదృశ్యంతో కుటుంబాల్లో విషాదం 
  పెరుగుతున్న మిస్సింగ్ కేసులు
 
జిల్లాలో మిస్సింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పలువురి ఆచూకీ దొరుకుతుండగా.. మరికొందరేమో మాయమై ‘పోతున్నారు’.. ఇంకొందరి ఆచూకీ అసలే దొరకడం లేదు. ఎనిమిది నెలల్లో 356 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పిల్లల నుంచి యువత వరకు మిస్ అవుతున్నారు. అదృశ్యమవుతున్న వారిలో 18 ఏళ్ల లోపు బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
 
 
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో రోజురోజుకూ మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. చిన్నపెద్ద తేడా లేకుండా అదృశ్యమవుతున్నారు. ఇంటి నుంచి మాయమై.. సొంత వారికి దూరమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 356 మిస్సింగ్ కేసులు నమోదుకాగా 309 కేసులను గుర్తించారు. ఇంకా 47 మంది ఆచూకీ దొరకలేదు. 2014 సంవత్సరంలో 336 కేసులు నమోదుకాగా 299 మందిని గుర్తించారు, 37 మంది ఆచూకీ తెలియలేదు. 2015 సంవత్సరంలో 504 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 427 మందిని గుర్తించారు. 77 మంది ఆచూకీ దొరకలేదు. మొత్తం మూడేళ్లలో 162 మంది ఇంకా అదృశ్యంలోనే ఉన్నారు. దీంతో తమవారు కనిపించక అదృశ్యమైన వారి కుటుంబాలు శోకసంద్రంలో ఉండిపోయాయి. అదృశ్యమైన వారిలో 18 సంవత్సరాల్లోపు బాలబాలికలు, మహిళలు, పురుషులు ఉన్నారు.
 
వీరంతా అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇటీవల అక్రమ రవాణాకు సంబంధించి ఘటనలు కూడా  వెలుగులోకి వచ్చాయి. కారణమేదైనా జిల్లాలో మిస్సింగ్ కేసులు పెరిగిపోవడం కలకలంరేపుతోంది. పోలీసు స్టేషన్లలో బాధిత కుటుంబాలు తమవారు అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాన్ని మిస్సింగ్ కేసు కింద నమోదు చేస్తున్నారు. ఇందులో ఇంటి నుంచి పారిపోయారా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా, మరేదైనా కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోయారా అనే దానిపై స్పష్టమైన వివరాలు లేవు. 
 
పెళ్లి చేసుకుంటున్నారు..
యువతుల మిస్సింగ్ కేసుల్లో చాలా మట్టుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నవే ఎక్కువ. సాధారణంగా యువతులు అదశ్యమైనప్పుడు వారి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెడుతున్నారు. ఇలాంటి చాలా కేసుల్లో యువత కొన్ని నెలల తర్వాత ప్రేమ వివాహం చేసుకొని జంటలుగా తిరిగివస్తున్నారు. యువతి మైనార్టీ తీరిన పక్షంలో ఆమె వాంగ్మూలం తీసుకొని ఆ కేసులను కొట్టివేస్తారు. కాగా మరికొందరి ఆచూకీ దొరకడం లేదు. వీరు కూడా ఏదైనా ప్రేమవివాహం చేసుకున్నారా లేదా ఎక్కడైనా వేధింపులకు గురవుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా చేతికొచ్చిన పిల్లలు అందకుండా పోతున్నారనే బాధ తల్లిందుడ్రుల్లో నెలకొంటుంది. ఒకవేళ అదశ్యమై పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఇంటికి రాకుండా బయటే ఉండే పిల్లల గురించి తల్లిదండ్రులు.. వారు ఏమయ్యారనే ఆవేదనతోనే మరి కొంత మంది గడుపుతున్నారు. 
 
మిస్సింగ్ కేసులపై గాలిస్తున్నాం..
ప్రస్తుతం మిస్సింగ్ కింద నమోదైన కేసుల్లో చాలా వరకు పురోగతి ఉంది. ఎప్పటికప్పుడు కేసును దర్యాప్తు చేసి అదృశ్యమైన వారికోసం గాలిస్తున్నాం. కొంత మంది యువతులు ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నాం. కానీ వారు కొన్ని రోజుల తర్వాత ప్రేమవివాహాం చేసుకుని వస్తున్నారు. ఇకా పిల్లల అదృశ్యంపై పోలీసు నిఘా ఉంచాం. 
 - సత్యనారాయణ, వన్‌టౌన్ సీఐ
 
పిల్లల అక్రమ రవాణా..
జిల్లాలో అదృశ్య కేసులను బట్టి చూస్తే మనుషుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అదృశ్యమైన వారిలో 10 శాతం మంది ఆచూకీ దొరకడం లేదు. ఇందులో ఎక్కువగా 18 సంవత్సరాలలోపు పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో చిన్నపిల్లలను అపహరించడమే లక్ష్యంగా కొన్ని ముఠాలు తిరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి ముంబాయి, నాగ్‌పూర్‌లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడేళ్లలో ఇప్పటి వరకు 60 మంది పిల్లల ఆచూకీ తెలియలేదు. బాలబాలికల్లో కొంత మంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంతో ఇంటిని విడిచివెళ్లిపోగా, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి కార్మిక పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, కెరమెరి, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఇలా అదశ్యమైన వారిలో కొంత మంది ఇంటికి తిరిగివస్తుండగా మరికొందరి ఆచూకీ దొరకడం లేదు.
 
అదృశ్యమైన మహిళలను రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి వివాహం చేసుకుంటున్నారని, కొంత మందిని లైంగిక వేధింపులకు గురిచేసి మళ్లీ తిరిగి ఇక్కడ వదిలేసి వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక మహిళలకు డబ్బులు ఎరవేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కింద నమోదు చేసిన చాలా కేసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చిన్నపిల్లలు అదృశ్యమై. ఎంత వెతికినా దొరకని కేసులపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గళ్లీలో ఆడుకుంటున్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలపై నిఘా పెట్టాలి. ఐసీడీఎస్, పోలీసులు ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మిస్సింగ్ కేసుల కోసం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్ కరీంనగర్‌లో ఉంది. పోలీసులతో పాటు ఈయూనిట్ బృందం కూడా మిస్సింగ్ కేసులపై గాలించాల్సి ఉంటుంది. 
 
ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్‌రోడ్ ప్రాంతానికి చెందిన చల్లవార్ పుష్ప ( 72)  అనే వృద్ధురాలు 2015 ఆగస్టు 7న సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరింది. ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె అదృశ్యమై ఏడాది గడుసున్నా ఇంకా ఎలాంటి వివరాలు తెలియలేదు. 
 
జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన సంతోష్ కుమారుడు వినోద్ (7), కూతురు రాధ ( 5) గత ఏడాది డిసెంబర్ 22న సాయంత్రం ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లిన వీరు ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సంతోశ్ వన్‌టౌన్‌పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియలేదు. 
 
జిల్లా కేంద్రంలోని వికలాంగుల కాలనీకి చెందిన నన్నెపు సంపత్‌రాజ్ ( 26)  ఈ ఏడాది జూలై 3న ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు ఇంటర్వ్యూకి వెళ్తున్నాని చెప్పి బయల్దేరాడు. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఇంక ఛేదనలోనే ఉంది. 
 
సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన బోరె సురేశ్ ( 21) ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి కనపించడం లేదు. మెకానిక్‌గా పనిచేస్తున్న సురేశ్ 23 నుంచి ఇంటిని వదిలి వెళ్లి ఇప్పటికీ  కనిపించకుండా పోయాడు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement