ఏడో తరగతి చదువుతున్న ఆ చిన్నారికి పాఠశాలకు వెళ్లే దారిలో ఓ స్టిక్కరింగ్ షాపు నిర్వాహకుడి(23)తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరైన అతగాడితో కలిసి ఓ రోజు ఇంట్లో చెప్పకుండా పరారైంది. తండ్రి లేకపోవడంతో తల్లి బంధువులు, స్నేహితుల ఇళ్లన్నీ గాలించి చివరకు బందరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసులు వారిని పట్టుకుని ఆ చిన్నారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లి దగ్గరకు పంపారు.
ఓ కార్పొరేట్ స్కూల్‌లో చదువుతున్న బాలికకు సోషల్ మీడియాలో కాకినాడకు చెందిన ఓ 26 ఏళ్ల యువకునితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వీడియో చాటింగ్ ఆపై వీడియోలు, నగ్న చిత్రాలు పంపే వరకు వెళ్లింది. వీటిని అడ్డం పెట్టుకుని ఆ యువకుడు బ్లాక్‌మెయిల్ చేయడంతో.. ఇంట్లో దొంగతనం చేసి విలువైన వస్తువులు, డబ్బులు పంపేది. విషయం గ్రహించిన ఆ బాలిక తండ్రి నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. బందరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.
కుటుంబ, సామాజిక పరిస్థితులు.. కొరవడిన తల్లి దండ్రుల పర్యవేక్షణ.. స్నేహితులు, సినిమాలు, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో ఆకర్షణకు లోనై కొందరు టీనేజర్స్ బంగారు భవిష్యత్‌ను ఛిద్రం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో జిల్లాలో నమోదవుతున్న అదృశ్యం, కిడ్నాప్ కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో గత కొన్నేళ్లుగా బాలికల అదృశ్యం, కిడ్నాప్ కేసులు పెరుగుతున్నాయి. వీటిలో 90 శాతానికి పైగా ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై అదృశ్యమవుతున్నట్టుగా విచారణలో తేలుతున్నాయి. ముఖ్యంగా వారిలో ఎక్కువగా 12–16 మధ్య వయస్సున్న వారే కావడం గమనార్హం. గడిచిన మూడేళ్లుగా ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
ఇదీ కేసుల సరళి..
►మహిళల మిస్సింగ్, బాలికల కిడ్నాప్ కేసులు గతేడాది 274 కేసులు నమోదైతే..
ఈ ఏడాది సెపె్టంబర్ 20 నాటికి 306 కేసులు నమోదయ్యాయి.
♦ప్రధానంగా కిడ్నాప్ కేసులు గతేడాది 94 నమోదైతే.. ఈ ఏడాది 88 కేసులు రిపోర్టయ్యాయి.
♦ఇక బాలికల అదృశ్యం కేసులు గతేడాది 180 నమోదైతే.. ఈ ఏడాది ఇప్పటికే 218 కేసులు నమోదయ్యాయి.
♦కిడ్నాప్ కేసులు నూజివీడు డివిజన్‌లో అత్యధికంగా నమోదైతే.. మిస్సింగ్ కేసులు గుడివాడలో రిపోర్టయ్యాయి.
♦కాగా ఈ మొత్తం కేసుల్లో 18–25 ఏళ్లలోపు యువతులు 130 మంది ఉంటే, 15–17 ఏళ్లలోపు వారు ఏకంగా 150 మంది ఉన్నారు. ఇక 15 ఏళ్లలో 25 మంది వరకు ఉన్నారు. 26–60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలు 70 మంది ఉన్నారు.
90 శాతం అవే కేసులు..
బాలికల అదృశ్యం. కిడ్నాప్ కేసుల్లో 90 శాతం ఆకర్షణ పేరుతో ప్రేమ మోజులో పడి ఇంట్లో నుంచి పరారైన ఘటనలే ఎక్కువగా ఉంటున్నాయి. తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న తమ పిల్లలపై నిఘా ఉంచాలి. వారి కదలిక లను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
– ఎం.రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ
స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావమే ఎక్కువ
టీనేజ్‌లోకి వచ్చే చిన్నారులపై స్మార్ట్ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లాక్‌డౌన్ వల్ల స్మార్ట్ ఫోన్‌ల వినియోగం బాగా పెరిగింది. ఆన్‌లైన్ క్లాసుల వల్ల పిల్లలకు ప్రత్యేకంగా ఫోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి. 13–18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతీ, యువకుల కదిలకలు, పరిచయాలపై నిఘా ఉంచాలి. యాప్‌లకు లాక్‌పెట్టి ఓపెన్ చేస్తే మీకు అలర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.
–డాక్టర్ బి. ప్రభురామ్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ఆస్పత్రి, బందరు
Comments
Please login to add a commentAdd a comment