
పటమట(విజయవాడతూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటమట పోలీసులు తెలిపిన వివరాల మేరకు దాడి చంద్రశేఖర్ మంగళగిరిలోని ఏపీ సీఐడీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు 2012లో కాకినాడకు చెందిన జ్యోతి(33)తో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.. ఉద్యోగరీత్యా వీరిరువురూ పటమటలోని తోటవారి వీధిలో కాపురముంటున్నారు. కొంతకాలంగా వీరిరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం కోసం పిలిస్తే రాకపోవటంతో అనుమానం వచ్చిన పిల్లలు తలుపులు కొట్టగా అవి గడియపెట్టి ఉన్నాయి. దీంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లటంతో అప్పటికే ఫ్యానుకు ఉరేసుకుని ఉంది. పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు ఆత్మహత్యగా కేసును నమోదు చేసినట్లు పటమట సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు.