కృష్ణా జిల్లా: కాళ్ల పారాణి ఆరకముందే వరుడు కానరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి అయిన 18 రోజులకే వరుడ్ని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించడంతో మండల పరిధిలోని ములపర్రు గ్రామంలోని విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు గౌరిశెట్టి నాగబాబుకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహమవ్వగా కుమారుడు ఉదయభాస్కర్ (28) పైళెన 18 రోజులకు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉదయభాస్కర్ ఐటీఐ పూర్తి చేసి 15 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులను కూడా హైదరాబాదు తీసుకువెళ్లి వారితోనే కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గత సంవత్సర కాలంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వెల్డింగ్ సెక్షన్‌లో భాస్కర్ విధులు నిర్వహిస్తున్నాడు.
మే 12వ తేదీన పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన నాగలక్ష్మీతో వివాహమైంది. 31వ తేదీన భాస్కర్ స్వగ్రామానికి చేరుకుని అదే రోజు సాయంత్రం పెళ్లికుమార్తె ఇంటికి కుటుంబసభ్యులంతా కలిసి చేరుకోవాల్సి ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎప్పుడూ ఉదయం పది గంటలకు విధులకు హాజరయ్యే ఉదయభాస్కర్ స్వగ్రామానికి సాయంత్రం త్వరగా బయలుదేరాలనే ఉద్దేశంతో 30వ తేదీ ఉదయం 8 గంటలకు ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లాడు. ఎయిర్‌పోర్టు రోడ్డులో వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ భాస్కర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భాస్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం భాస్కర్ మరణించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బుధవారం స్వగ్రామం ములపర్రు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. చేతికి అందివచ్చిన కొడుకు కాళ్ల పారాణి ఆరకముందే మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని సముదాయించడం ఎవరివల్ల కాలేదు.
ఇంటి ముందు పందిరి వేసి ఘనంగా వివాహం చేశారు. ఆ పందిరికి వేసిన కొబ్బరి ఆకులు, కట్టిన తోరణాలు వడిలిపోక ముందే పెళ్లి కొడుకును చేసిన పందిరి కిందే భాస్కర్ మృతదేహం చేరడం గ్రామస్తులను, బంధువులను కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment