
‘‘బై రియో! నేను వెళ్తున్నా. మళ్లీ నేనొచ్చే వరకు ఏడ్వద్దు. వచ్చేప్పుడు నీకిష్టమైన స్ట్రాబెర్రీ చాక్లెట్లు తీసుకొస్తాను,’’ అని ప్రేమగా కూతుర్ని ముద్దు పెట్టుకుంది సుచిత్ర. ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌గా పని చేస్తోంది. తాను వెళ్లే సమయానికి కూతుర్ని స్కూల్‌లో దింపి, వచ్చేటప్పుడు తీసుకొస్తుంది. రియో స్మైల్ కిడ్స్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. అమ్మకు బై చెప్పిన రియో అక్కడే ఉన్న వ్యాన్‌డ్రైవర్ సంతోష్‌ని చూసి ఒక్కసారిగా భయపడింది. సంతోష్ రియోను దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించినా.. వదిలించుకొని క్లాస్ రూంలోకి పరుగుపెట్టింది. సంతోష్ పెరిగిన జుట్టు, గడ్డంతో ఉండటం వల్లనేమో పిల్లలు అతని దగ్గరకు వెళ్లడానికి భయపడతారు.కిడ్స్ స్కూల్ కావడంతో దాదాపుగా టీచర్లంతా మహిళలే. ప్రిన్సిపల్ ఉమాదేవి వీరందరినీ కోఆర్డినేట్ చేస్తుంది. స్కూల్ వ్యవ హారాలు మొత్తం ఉమాదేవి భర్త కరస్పాండెంట్ సురేందర్ చూసుకుంటాడు. సురేందర్ పిల్లల తల్లిదండ్రులందరికీ తెలుసు. పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారని పిల్లల తల్లి దండ్రులకు ఆ స్కూల్ అంటే మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ప్రారంభంలో ఇరవై మంది ఉన్న పిల్లల సంఖ్య 150కి చేరింది. ఒకసారి పిల్లలు ఏడుస్తున్నారని టీచర్ చేయి చేసుకోగా, ఆమెను ఉద్యోగం నుంచే తొలగించాడు. అది పిల్లల తల్లిదండ్రుల ముందే జరగడంతో స్కూల్‌పై నమ్మకం ఇంకా పెరిగింది.
సాయంత్రం రియోను తీసుకెళ్లడానికి సుచిత్ర రానే వచ్చింది. ఫీజు విషయమై ప్రిన్సిపల్ ఉమాదేవితో ఏదో మాట్లాడుతుండగా రియో తల్లి చుట్టూ తిరుగుతూ చీర కొంగుతో ఆడుకుంటోంది. అమ్మ తీసుకెళ్లడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్న రియో డ్రైవర్ సంతోష్‌ను చూడగానే తెలియని భయానికి లోనైంది. తల్లిని గట్టిగా పట్టుకుంది. రియో ఫీజు గురించి మాట్లాడి తన కారులో రియోను తీసుకెళ్లింది సుచిత్ర.
‘‘రియో! హోమ్‌వర్క్ చేస్కో. టీవీ చూడటం ఆపేయ్’’ అని వంటింట్లో నుంచి గద్దించింది సుచిత్ర. రియో పోగో చానల్‌లో కార్టూన్లను చూస్తూ అల్లరి చేస్తోంది. ‘‘డాడీ వస్తారు. వచ్చే వరకు నువ్వు ఇలాగే టీవీ చూస్తుండు. నిన్ను కొడతాడు’’ అంది బెదిరింపుగా. రియో ఆ విషయాన్ని వినీ విననట్లుగా, భయం లేనట్టుగా టీవీకి అంకితమైంది. రియో అల్లరిని ఆపడానికి సుచిత్ర డ్రైవర్ సంతోష్‌కి చెప్తా తీసుకెళ్తాడు అంది. అంతే ఆ ముక్క విన్నదో లేదో రియో ‘మమ్మీ!’ అంటూ భయంగా పరుగెత్తుకొచ్చింది. ఎన్నడూ భయపడని విధంగా విచిత్రంగా రియో భయ పడటాన్ని సుచిత్ర గమనించింది. ‘‘లేదు.. లేదు.. ఊరికే అన్న. ఏం లేదు’’ అని ఊరడించింది.
తెల్లారాక రియో సాధారణంగా కనిపించడం చూసి సుచిత్ర మనసు కుదుట పడింది. ‘డాడీ ఈ బాల్ పట్టుకో’ అంటూ డాడీతో ఆడుకుంటూ సాధారణంగా ఉంది రియో. ‘‘స్కూల్ టైమౌతోంది. త్వరగా రా.. రెడీ అవ్వాలి’’ అని సుచిత్ర పిలిచింది. కొద్దిసేపటి తర్వాత సుచిత్ర రియోను రెడీ చేసి తానూ రెడీ అయింది. ఇద్దరూ కార్లో బయల్దేరారు. దారిలో సిగ్నల్ దగ్గర తన స్కూల్ బస్సు పక్కనే వాళ్ల కారు ఆగడంతో అటువైపు తనను పిలుస్తున్న ఫ్రెండ్స్ కనిపించారు. వారికి హాయ్ అని చేతులూపింది. అదే సందర్భంలో వ్యాన్ డ్రైవర్ సంతోష్‌ను చూసి చటుక్కున మొహాన్ని తిప్పేసింది రియో.సుచిత్ర రియోను స్కూల్లో దింపి ఆస్పత్రికి వెళ్లింది. ఫస్ట్ అవర్ క్లాస్ అయిపోయింది. ఇంటర్వల్ పీరియడ్‌లో రియో తన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటోంది. ఇంతలో ఒక టీచర్ వారి దగ్గరకొచ్చి ‘’చిల్డ్రన్ గోటూ యువర్ క్లాస్ రూమ్స్’’ అని అంది. పిల్లలంతా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడు ఫ్లోర్లున్న బిల్డింగ్‌లో తమ తమ క్లాస్ రూమ్స్‌లోకి వెళ్తున్నారు. రియో క్లాస్ రూమ్ రెండో ఫ్లోర్‌లో ఉంది. మూడో ఫ్లోర్‌లో మొత్తం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. రియో తన క్లాస్‌రూమ్‌కి వెళ్తూ.. తన క్లాస్‌మేట్ చిన్నూ ఏడుస్తుండగా, ఆయా తనని బలవంతంగా మూడో ఫ్లోర్‌కి తీసుకెళ్లడం చూసింది. ‘‘ఏయ్ చిన్నూ..! ఎక్కడికి?’’ అంటూ ఆమె వెనుకే మూడో ఫ్లోర్‌కి వెళ్లింది. రియో రావడం గమనించని ఆయా చిన్నూని బరబరా గుంజుకెళ్లి హాల్లో ఉన్న పీఈటీ టీచర్ ముందు ఉంచింది. ‘‘ఈ పిల్ల అస్సలు కుదురుగా ఉండట్లేదు. పైగా బాగా ఏడుస్తోంది’’ అని ఆయా ఆ టీచర్‌తో అంది.
‘‘అవునా! ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావ్’’ అని పాలుగారే ఆ చెంపలపై చెళ్లున చరిచింది. చిన్నూ ఇంకా ఏడుపు ఎక్కువ చేసింది. దాంతో టీచర్ కోపం ఇంకా పెరిగింది. చిన్నూని పట్టుకోమని ఆయాతో చెప్పి, గదిలోకెళ్లి ఏదో ఇంజెక్షన్ తెచ్చింది. చేతులను గట్టిగా పట్టుకోమని, నోరు మూయమని ఆయాతో చెప్పి చిన్నూకి ఆ ఇంజెక్షన్ చేసింది. అంతే, అప్పటి వరకూ బిగ్గరగా ఏడ్చిన చిన్నూ ఒక్కసారిగా కూలబడిపోయింది. చిన్నూ రెక్కల్ని పట్టుకుని ఈడ్చుకుంటూ అదే ఫ్లోర్‌లోని ఒక గదిలోకి తీసుకెళ్లింది టీచర్. ఈ తతంగాన్నంతా దూరం నుంచి బిక్కుబిక్కుమంటూ గమనించిన రియో మెల్లిగా మెట్లు దిగి రెండో ఫ్లోర్‌లోని తన క్లాస్‌రూమ్‌కి వెళ్లింది. ఉమాదేవి రియో ఇదంతా చూడటాన్ని గమనించింది.సాయంత్రం సుచిత్ర వచ్చింది. స్కూల్ వదిలాక పిల్లలంతా తాము ఎక్కాల్సిన వ్యాను దగ్గరకు వెళ్తున్నారు. మిగతా పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తున్నారు. రియో కోసం సుచిత్ర ఆత్రంగా చూస్తోంది. చివరగా రియో దిగాలుగా వస్తుండటాన్ని సుచిత్ర చూసింది. ప్రిన్సిపల్ ఉమాదేవి వేరే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూనే, రియో సుచిత్రకు ఏం చెబుతుందోనని టెన్షన్ పడుతోంది. సుచిత్ర దగ్గరకు వచ్చిన రియో ‘‘మమ్మీ! మరేమో చిన్నూ.. చిన్నూ...’’ అని ఏదో చెప్పబోయేసరికి ఉమాదేవి సుచిత్ర దగ్గరికొచ్చి నవంబర్ పద్నాలుగున జరగబోయే చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడుతూ సుచిత్ర దృష్టిని రియో చెప్పే మాటలపైకి వెళ్లకుండా అడ్డుపడింది. కొద్దిసేపు మాట్లాడాక సుచిత్ర రియోతో ఇంటికి బయల్దేరింది.
ఇంటికెళ్లాక రియో విషయాన్ని భర్త సురేందర్‌కి చెప్పింది ఉమాదేవి. ‘‘ఏవో మాయమాటలు చెప్పి ఆ పిల్లని మరిపించలేకపోయావా? ఈ విషయం సుచిత్రకు తెలిస్తే ఏమైనా ఉందా? పదేళ్లుగా కష్టపడుతున్న దానికి ఫలితం ఉండదు. స్కూల్ రెప్యుటేషన్ పోతుంది. అందరికీ తెలిస్తే కొత్తగా పిల్లలను ఎవరూ చేర్పించరు’’ అంటూ ఉమాదేవితో సురేందర్ తన మనసులోని అనుమానాల్ని బయటికి తీసుకొస్తున్నాడు.
‘‘అలా ఏం జరుగదు లేండి. రియో చిన్నపిల్ల. వెంటనే మర్చిపోతుంది’’ అని భర్తతో అంది ఉమాదేవి. ఈ మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఆలోచనల్లో మునిగిపోయాడు సురేందర్.ఇంటికెళ్లిన రియో.. చిన్నూ విషయం మర్చిపోయి ఆడుకుంటోంది. నానమ్మ పిలి చినట్టుగా వినిపిస్తే రియో వెళ్లింది. అప్పుడే భోజనం చేసిన నానమ్మ రియోతో టీవీ పక్కనున్ను ట్యాబ్లెట్స్‌ను తీసుకురమ్మంది. టీవీ పక్కన ట్యాబ్లెట్ల కవర్‌లో ఇంజెక్షన్‌లు చూసింది. అంతే, పరుగున వంట గదిలో ఉన్న తల్లి దగ్గరకు వచ్చి.. ‘‘మమ్మీ.. చిన్నూకి స్కూల్‌లో ఇంజెక్షన్ చేశారు’’ అని చెప్పింది. ‘‘అవునా ఎక్కడ.. ఇక్కడా.. ఇక్కడా’’ అని చెక్కిలిగింతలు పెట్టి, ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు సుచిత్ర. ‘‘త్వరగా హ్యాండ్‌వాష్ చేసుకుని రా.. డిన్నర్ చేద్దాం’’ అని పిలిచింది. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకున్నారు. నిద్రలో రియో ‘మమ్మీ..! డ్రైవర్.. డ్రైవర్..’ అంటూ భయంగా కేకలు వేసింది. దిగ్గున లేచిన సుచిత్ర ‘‘రియో.. రియో.. ఏమైంది’’ అంటూ.. తన చేతులతో రియోని నెమ్మదిగా తడుతూ పడుకోబెట్టింది.తెల్లారి ఉదయం రియోని స్కూల్‌లో దింపడానికి సుచిత్ర వెళ్లింది. వెళ్లేసరికి ఎవరో పేరెంట్స్ డ్రైవర్ సతీష్‌ని కొడుతుండటాన్ని చూసింది. అక్కడే సురేందర్, ఉమాదేవి.. కొందరు టీచర్లు ఉన్నారు. వేరే వ్యాన్‌లో వెళ్లే పాపను ఇతని వ్యాన్‌లో తీసుకెళ్లాడని, చీకటి పడ్డాక పాప తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టారని, ఇప్పుడొచ్చి సతీష్‌ని కొడుతూ సురేందర్‌ని వివరణ అడుగుతున్నారని అక్కడి వారిలో ఒకరు సుచిత్రకు చెప్పారు. రియోని దింపి సుచిత్ర ఆస్పత్రికి వెళ్లింది. సురేందర్ ఆ పాప పేరెంట్స్‌తో పొరపాటు జరిగిందని చెప్పి తక్షణమే సతీష్‌ని ఉద్యోగం నుంచి తీసేశాడు. ఇదంతా తనకు పట్టనట్లు రియో క్లాస్‌కి వెళ్లింది. బ్రేక్ సమయంలో పిల్లలంతా ఆడుకుంటుండగా రియో దిగాలుగా కూర్చుంది. ఈ విషయాన్ని టీచర్ అశ్విని గమనించింది. రియోకి కూడా అశ్విని టీచర్‌తో చనువు ఉంది. కాబట్టి టీచర్ అడక్కుండానే చిన్నూకి ఇంజెక్షన్ ఇచ్చారని చెప్పింది. ‘‘ఇంజెక్షన్ ఏంటి రియో?’’ అని నవ్వింది ఆ టీచర్. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్సిపల్ ఉమాదేవి భర్త సురేందర్‌కి చెప్పింది.
ఆ రోజు రియోని తీసుకెళ్లడానికి సుచిత్ర లేట్‌గా వచ్చింది. పిల్లలంతా వెళ్లిపోయారు. రియో ఎక్కడని అక్కడున్న టీచర్‌ని అడిగింది. ప్రిన్సిపాల్‌ని కలవమని చెప్పగా కలిసింది. ప్రిన్సిపాల్ ఉమాదేవి ‘‘మీరొచ్చి తీసుకెళ్లా రనుకున్నాం. మీరు తీసుకెళ్లలేదా?’’ అని ఎదురు ప్రశ్నించింది.‘‘ఏం మాట్లాడుతున్నారు? నేనొచ్చిందే ఇప్పుడు’’ అంటూ రియో ఎక్కడని నిలదీసింది. దాంతో భయపడ్డ ఉమాదేవి, భర్త సురేందర్‌కి ఫోన్ చేయగా స్కూల్‌కి వచ్చాడు. ‘‘డ్రైవర్ సతీష్ వచ్చాడా?’’ అని అడిగాడు. ‘‘ఆ వచ్చాడు సర్. మిమ్మల్ని కలవాలని చెప్పి ఇంతకు ముందే వెళ్లాడు’’ అని మరో డ్రైవర్ చెప్పాడు. ‘‘రియోను సతీష్ తీసుకెళ్లాడా?’’ అనుమానంగా అన్నాడు సురేందర్. అనుమానం వచ్చి సుచిత్ర, ప్రిన్సిపాల్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చీకటి పడటంతో రేపు ఉదయం స్కూల్‌కి వస్తామని చెప్పారు.రోజూ రియో ఆటలతో సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా మూగబోయినట్లైంది. మర్నాడు ఉదయమే స్కూల్‌ని పరిశీ లించడానకి వచ్చాడు ఎస్సై రమణ. రియో స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, టీచర్ల గురించి ఆరా తీశాడు. అంతా డ్రైవర్ సతీష్ ప్రవర్తన గురించి చెప్పారు. సురేందర్ కూడా సతీష్‌ను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో ఎస్సైకి వివరించాడు. ఈ క్రమంలో పిల్లలు బ్రేక్ టైమ్‌లో బయటకొచ్చారు. కొందరు అక్కడ పడి ఉన్న ఇంజెక్షన్ నీడిల్‌తో ఆడుకోవడం ఎస్సై గమనించాడు. స్కూల్ మొత్తాన్నీ చూడాలని చెప్పాడు ఎస్సై. మూడో ఫ్లోర్‌లో 304 గది ఏంటి తాళం వేసి ఉందని అడిగాడు. ‘‘సార్! లోపల సీలింగ్ చేయలేదు. అందుకే దాన్ని స్టోర్‌రూమ్‌గా వాడుతున్నాం’’ సమాధానమిచ్చాడు సురేందర్.
సుచిత్రను సాయంత్రం స్టేషన్‌కి రావాలని ఎస్సై కబురు పంపాడు. సాయంత్రం సుచిత్ర, భర్త రఘుతో కలిసి స్టేషన్‌కి వెళ్లింది. గంటన్నరసేపు వారితో విడివిడిగా మాట్లాడిన ఎస్సై... కేసు నమోదు చేశామని, ఎంక్వైరీ జరుగుతోందని, ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే చెబుతామని వాళ్లను పంపించేశాడు.మర్నాడు ఉదయం రఘు ఇంటికెళ్లాడు ఎస్సై రమణ. కాలింగ్ బెల్ కొట్టేసరికి రఘు వచ్చి డోర్ తీశాడు. మీరొకసారి స్టేషన్‌కు రావాలన్నాడు. పాప విషయం ఏమైందని రఘు అడిగేసరికి స్టేషన్‌లో చెబుతానని సుచిత్ర, రఘులను తీసుకెళ్లాడు.సుచిత్రను ఇంటరాగేషన్ రూమ్‌లోకి తీసుకెళ్లి ‘‘నేనడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో అనే సమాధానమే చెప్పాలి’’ అని బెదిరించాడు. దాంతో కంగుతిన్న సుచిత్ర అలాగే ఉండిపోయింది.‘‘రియో మీకు పుట్టిన బిడ్డ కాదు. ఎస్ ఆర్ నో’’ అని అడగ్గా.. ‘‘నో’’ అని చెప్పింది సుచిత్ర. ‘‘రఘుకు నువ్వు రెండో భార్యవి. అవునా?’’ అనే ప్రశ్నకు ‘‘అవును’’ అని భయంగా చెప్పింది. ‘‘ఇప్పుడు చెప్పు రియోను ఎందుకు చంపావు?’’ అని అడగ్గా బిత్తరపోయిన సుచిత్ర, ‘‘నేను చంపడం ఏంటీ?’’ అని ఎదురు ప్రశ్నించింది.
పోలీసులు తమ స్టైల్‌లో అడిగేసరికి నిజాన్ని ఒప్పుకుంది. చిన్న పాపను చంపడానికి మనసెలా వచ్చిందని ఎస్సై కోపంగా అడిగేసరికి... ‘‘రఘు మొదటి భార్య అర్చన రోడ్డు ప్రమాదంలో మరణించగా.. రఘు ఇంట్లో వాళ్ల ఒత్తిడితో ఏడాది క్రితం నన్ను పెళ్లి చేసుకున్నాడు. అర్చన కూతురు రియోనే తన సర్వస్వం అన్నాడు. ఇంకా పిల్లలొద్దు అన్నాడు. దాంతో నా ప్రాణం ఆగినంత పనైంది. రియో ఉండబట్టేగా రఘు ఇలా అన్నాడని తట్టుకో లేకపోయాను. అందుకే రియోని కిడ్నాప్ చేయించి హత్య చేయించాను. చిన్నూకి ఇంజెక్షన్ చేశారని రియో చెప్పినప్పుడు కావాలనే పట్టించుకోలేదు. హత్య చేయడానికి ఇదే సరైన సమయమని అనుకున్నాను. ఇప్పుడు అనుమానం మొత్తం కరెస్పాండెంట్ సురేందర్ పైకి వెళ్తుందని పథకం చేసి అమలు చేశాను’’ అంది.
‘‘రియో మిస్సింగ్ తర్వాత అందర్నీ విచారించాం. డ్రైవర్ సతీష్ తల్లి అనారోగ్యంగా ఉండటంతో అలా డిప్రెషన్‌లో ఉన్నాడని తేలింది. అలాగే స్కూల్ కరస్పాండెంట్ సురేందర్‌ని కూడా ఇంటరాగేట్ చేశాం. చిన్నపిల్లలపై డ్రగ్స్ ప్రయోగిస్తున్నాడన్న ఆధారాలు దొరకడంతో కరెస్పాండెంట్ సురేందర్ దంపతులను అదుపులోకి తీసుకున్నాం. అయితే రియో విషయంలో వాళ్లకేమీ సంబంధం లేదని తేలింది. దాంతో వాళ్లందరి మీదా అనుమానాలు తీరిపోయాయి. దాంతో మీ ఇద్దరినీ విడివిడిగా ఇంటరాగేట్ చేశాం. నువ్వు రియోకి కన్నతల్లివి కాదని తెలియడంతో, అనుమానం నీవైపు తిరిగింది. చివరికి మా అనుమానమే నిజమైంది’’ అన్నాడు ఎస్సై రమణ.
-ఉమేశ్ కోమటి
Comments
Please login to add a commentAdd a comment