Injections
-
Pregnancy: సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
నాకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. రెండు నెలలు. కొంచెం బ్లీడింగ్ అవుతోంది. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏమైనా వాడాలా? వాటికి సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. హారిక, గన్నవరంప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ అనేది సర్వసాధారణం. అయితే బ్లీడింగ్ అవటంతోటే గర్భస్రావం అవుతుందేమోననే భయం ఉంటుంది చాలామందిలో. ప్రతి ముప్పైమందిలో ఒకరికి మాత్రమే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకానీ ప్రతి గర్భిణికీ అలాగే అవుతుందేమోనని హైడోస్ హార్మోన్స్, సపోర్ట్ మెడిసిన్స్ ఇవ్వటం సరికాదు. కేస్‌ను బట్టే నిర్ణయించాలి. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ చాలా కీలకం. ఇది గర్భసంచి పొర పెరగటానికి తోడ్పడి, గర్భస్రావం కాకుండా ఉండటానికి సాయపడుతుంది. అయితే వజైనల్ బ్లీడింగ్ అవుతున్నవారికి ఈ హార్మోన్ సప్లిమెంటేషన్ వల్ల ఉపయోగం ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అలాగని అందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ హార్మోన్.. టాబ్లెట్స్, పెసరీస్, ఇంజెక్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజుకి రెండుసార్లు, నాలుగవ నెల అంటే 16 వారాల వరకు ఇస్తే సరిపోతుంది. కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని నివారించడానికి భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. పొట్టలో నొప్పి, వాంతులు, బ్రెస్ట్ పెయిన్, నీరసం, మలబద్ధకం లాంటివి ఉండవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉన్న వారికి వజైనల్ లేదా రెక్టల్ రూట్లో యూజ్ చెయ్యమని సూచిస్తారు.నాకిప్పుడు మూడోనెల. తొలి చూలు. ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటున్నాను. ఎమోషనల్‌గా బేబీకి దగ్గరవటానికి, ప్రెగ్నెన్సీ నుంచే కొన్ని చెయ్యాలంటుంటారు. అవేంటో సజెస్ట్ చేయగలరా? – సి. సత్య, కదిరితొలిసారి తల్లి కాబోతున్నప్పుడు చాలా సందేహాలు, ఇంకెన్నో భయాలుంటాయి. ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో కొంత అవగాహన పెరిగింది. అయితే భయాలు కూడా పెరిగాయి. గర్భస్థ శిశువుకు భావోద్వేగాలు, చొరవ తీసుకునే సామర్థ్యాలు, తల్లిదండ్రుల ప్రేమ వంటివి అర్థమవుతాయని పరిశోధనల్లో రుజువైంది. హెల్దీ అటాచ్మెంట్ ఉంటే బయటి వాతావరణం సురక్షితంగా, భద్రంగా ఉందని గర్భస్థ శిశువు భావిస్తుంది. అయిదవ నెల నుంచి గర్భస్థ శిశువు శబ్దాలను వినే చాన్స్ ఉంది. అందుకే పొట్టలో బిడ్డతో తల్లి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది పుట్టిన తరువాత బిడ్డ మీ వాయిస్‌ని గుర్తుపట్టేందుకు సాయపడుతుంది. పాజిటివ్ థింకింగ్ అండ్ థాట్స్ ఉంటే లోపల బిడ్డ గ్రోత్ బాగుంటుంది. పొట్టలో బిడ్డ గురించి ఆలోచించటం, మాట్లాడటం 5వ నెల నుంచి మొదలు పెట్టవచ్చు. దీని వలన మంచి బాండింగ్ డెవలప్ అవుతుంది. 5 నుంచి 6వ నెల మధ్య బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూండాలి. ఈ కదలికల తీరు అందరికీ ఒకేలా ఉండదు. ఒక వారం గమనిస్తే ఎప్పుడు, ఎలా కదులుతోందనేది తెలుస్తుంది. అకస్మాత్తుగా కదలికలు నెమ్మదిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మంచి బుక్స్ చదవటం, హెల్దీ డైట్ తీసుకోవటం చాలా అవసరం.నాకు ఏడాది కిందట అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్‌ని. మూడోనెల. రొటీన్ బ్లడ్ టెస్ట్‌లో హెపటైటిస్ – బి పాజిటివ్ అని చెప్పారు డాక్టర్. దీని వలన నాకు, నావల్ల బేబీకి ఎలాంటి రిస్క్ ఉండొచ్చు?– రుక్మిణి, మహబూబ్నగర్హెపటైటిస్ – బి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చాలామందిలో ఏ సింప్టమ్స్ లేకుండా సైలెంట్‌గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో అందరికీ రొటీన్‌గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ని చెక్ చెస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు వచ్చిన వారికి ముందే చెక్ చేసి, అవసరమైన వాళ్లకి ప్రివెంటివ్ వాక్సినేషన్ ఇస్తారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా లివర్‌కి వాపు ఉంటుంది. ఇది చాలావరకు కలుషిత ఇంజెక్షన్స్, రక్తం, వీర్యం, ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి మీ భర్త కూడా హెపటైటిస్–బి టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరిస్థితుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ చూసే డాక్టర్ని సంప్రదించాలి. డెలివరీ తరువాత బేబీకి కూడా స్పెషలిస్ట్ కేర్, వాక్సినేషన్స్ అవసరం. ప్రెగ్నెన్సీలో మీకు లివర్ సమస్య ఎక్కువవకుండా కొన్ని మందులను సూచిస్తారు. వైరల్ లోడ్ తగ్గిందా లేదా అని తరచు బ్లడ్ టెస్ట్స్ చెయ్యవలసి ఉంటుంది. లివర్ స్కాన్ చెయ్యాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా నార్మల్ డెలివరీ అవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చెయ్యవచ్చు. బేబీకి హెపటైటిస్–బి రాకుండా ప్రాపర్ టెస్ట్స్, వాక్సిన్స్ చేయించాలి. పుట్టిన వెంటనే నాలుగు వారాలకు, ఏడాదికి వాక్సిన్స్ ఇవ్వాలి. మీకు వైరల్ లోడ్ ఎక్కువుంటే, బేబీకి ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అందరికీ ఇచ్చే రొటీన్ వాక్సిన్స్ కూడా ఇవ్వాలి. బేబీకి ఏడాది వయసు వచ్చే వరకు క్లోజ్‌గా ఫాలో అప్ చెయ్యాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
చిన్న పాప.. పెద్ద జబ్బు... నయం కావాలంటే రూ. 16 కోట్లు కావాలి
మైసూరు: చిత్రంలో కనిపించే చిన్నారికి పెద్ద జబ్బే సోకింది. ఆ జబ్బు నయం కావాలంటే రూ. 16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కన్నవారు హడలిపోయారు. తమ బిడ్డను కాపాడేందుకు దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. వివరాలు.. మైసూరులో దేవరాజు మొహల్లాలో నివసించే హెచ్.నాగశ్రీ, ఎన్.కిశోర్ దంపతులకు 22 నెలల కీర్తన అనే కూతురు ఉంది. కానీ చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన జబ్బు సోకిందని ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనివల్ల పాప ఎప్పుడూ నీరసంగా ఉంటుంది, కండరాలు బలహీనంగా ఉంటాయి, కనీసం ఆహారం నమలడం కూడా చేత కాదు. ఇక ఆడుకోవడం అనేదే ఉండదు. ఈ జబ్బు రెండవ దశలోకి వచ్చిందని, పాప మరింత బలహీనమైందని వాపోయారు. జన్యు చికిత్స, అరుదైన ఇంజెక్షన్లతో వైద్యం చేయిస్తే నయమవుతుందని వైద్యులు తెలిపారు, కానీ అందుకు రూ. 16 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. నిత్యం ఒక టానిక్ తాగాల్సి ఉంటుంది, ఒక్క బాటిల్ ధర రూ. 6 లక్షలని చెప్పారు. పేదవాళ్లయిన తమకు అంత స్తోమత లేదని, దాతలే ఆదుకోవాలని అభ్యర్థించారు. వివరాలకు చిన్నారి తండ్రి కిశోర్‌ని 9901262206 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్!
మనసులో అనుకోగానే బరువు తగ్గిపోవాలి. చిటికె వేయగానే కండలు తిరిగిన బాడీ సొంతం కావాలి. ప్రతీదీ షార్ట్ కట్లో అయి పోవాలి. ప్రస్తుతం యువత మనుసుల్లోమెదులుతున్న ట్రెండ్ ఇదే. ఈ క్రేజ్‌నే కొంతమంది కేడీగాళ్లు సొంతం చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ యువత ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వారి ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అక్రమంగా మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను టాస్క్ఫోర్క్ అదుపులోకి తీసుకుంది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నిందితుల నుండి 75 ఇంజక్షన్లను సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ ప్రకటించారు. కండరాల పెరుగుదలకు ఇంజక్షన్లు దోహదపడతాయని నమ్మబలుకుతారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీన్ని నమ్మిన బాడీ బిల్డర్లు డాక్టర్ట సిఫారసు, ప్రికాషన్స్ లేకుండానే ఈ ఇంజక్షన్లను ఎడా పెడా వాడేస్తున్నారు. దీంతో కండలు పెరగడం సంగతి మాట అటుంచి గుండెకు తీరని ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలి ఇంజెక్షన్లను అమ్ముతున్నగ్యాంగ్కు సంబంధించి ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగర్లో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్ నడిపిస్తున్నాడు. ఇతనికి సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్ట్ లుగా వర్క్ చేస్తున్నారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంజక్షన్లను అక్రమంగా విక్రయించడమే వీరి దందా. ఈ ఇంజక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్‌కు వచ్చేవారిని నమ్మిస్తారు. ముంబై నుండి ఈ ఇంజక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజక్షన్లను అక్రమంగా 2000 వరకు విక్రయిస్తారు. ఇంజక్షన్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోకులు, సడన్ కార్డియాక్ అరెస్ట్ దారి తీయవచ్చుని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
'16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్.. నా గుండె పగిలిందన్న స్టార్ హీరోయిన్'
టాలీవుడ్లో దేశముదురు మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఇటీవలే 'మై నేమ్ ఈజ్ శృతి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హన్సిక ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తన భర్త సోహెల్ కతురియాలో వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అయితే హన్సిక సినీ కెరీర్ కంటే ఎక్కువగా వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే గతంలో హన్సిక 16 ఏళ్ల వయసులోనే హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి. ఈ వివాదంలో ఇప్పటి వరకు ఏదో ఓ సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంది. హన్సిక తల్లి మోనా మోత్వానీ వృత్తిరీత్యా స్కిన్ స్పెషలిస్ట్ కావడంతో హన్సిక మరింత యంగ్‌గా కనిపించేందుకు ఆమెకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హన్సిక చాలాసార్లు వివరణ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హన్సిక మరోసారి ఈ వివాదంపై నోరు విప్పింది. అయితే హన్సికకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చానన్న వార్తలను ఆమె తల్లి మోనా మోత్వానీ కొట్టిపారేశారు. హన్సిక మాట్లాడుతూ.. 'ఇలాంటి వార్తలు మా అమ్మను బాధపెట్టినంతగా నన్ను బాధించలేదు. ఎందుకంటే ఈ వార్తలు పూర్తిగా తప్పు ప్రచారమే. నాపై వచ్చినవన్నీ రూమర్స్. దానికి మా అమ్మ చాలా బాధపడింది. అమ్మ పరిస్థితిని చూసి మేమే ఏడ్చాం. ఇలాంటివి వార్తలు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వినలేదు. ఇలాంటి పుకార్లు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి. సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి వ్యక్తిగత జీవితం ఎలా పడితే అలా రాయమని చెప్పలేదు కదా.' అని అన్నారు. కాగా.. డిసెంబర్ 2, 2022న ప్రియుడు సోహైల్ కతురియాను హన్సిక వివాహం చేసుకుంది. జైపూర్‌లోని జరిగిన వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. -
ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!
పెళ్లి సంబంధం కుదరగానే వారి వారి స్థోమత మేరకు పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేయాలనే ఆలోచన చేస్తుంటారు పెద్దవాళ్లు. పెళ్లిలో కాబోయే అత్తగారి డిమాండ్ మేరకు వధువు అమ్మానాన్నలు నడుచుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవల మరో కొత్త డిమాండ్ కూడా వచ్చి చేరింది.కాబోయే పెళ్లికూతురు వివాహ వేడుకలో దేదీప్యమానంగా వెలిగిపోవాలి. అందరూ ‘అందమైన కోడలిని సెలెక్ట్ చేసుకున్నారు అనే కితాబులు అందుకోవాలి. అందుకు, చికిత్స చేయించుకున్నా సరే!’ అంటున్నారు. మరి, కాబోయే వధువులు వేడుకకు సిద్ధం కావడానికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అందం పట్ల తీసుకుంటున్న చికిత్సలు.. వికటిస్తున్న పరిమాణాలు ఏమిటి? భేష్ అనదగిన విధానాలేమిటి? అనే విషయాలపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ‘‘ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న సుష్మ పెళ్లి వచ్చే డిసెంబర్లో జరగనుంది. పెళ్లి ఫిక్స్ అయ్యాక అత్తగారు నవ్వుతూ – ‘అమ్మాయీ, నీ వంటి రంగు బ్రైట్ చేయించుకో. ఫెయిర్ నెస్ కోసం ఇంజెక్షన్లు మార్కెట్లో దొరుకుతాయని విన్నాను. వాటిని ట్రై చేయి. ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకో. కానీ, పెళ్లి టైమ్‌కి అందంగా తయారవ్వాలి’ అని ఆర్డర్ వేసింది. ఆమె తన కోడలు పందిట్లో చందమామలా కనిపించాలని, కోడలు మొహం చూసి బంధుమిత్రులంతా నిశ్చేష్టులవ్వాలని కోరుకుంటుంది. ‘అత్తగారి డిమాండ్ ఇప్పుడు నాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటోంది సుష్మ. ఇందుకోసం బ్యూటీ ట్రీట్మెంట్స్తో పాటు చర్మ ఛాయలో కూడా తేడా వచ్చేలా మార్పులు చేసుకోవడానికి తెగ కష్టపడుతోంది. ‘పెళ్లి అంటేనే ఎంతో ఉత్సాహం. ఫొటోల్లో, వీడియోల్లో బాగా కనిపించాలని, అందరిలో ప్రత్యేకంగా వెలిగిపోవాలని నాకూ ఉంటుంది. ఇందుకు బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లడం, మేకప్ చేయించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. పెళ్లి ఖర్చులే కాకుండా ఈ కొత్త తరహా ఖరీదైన ఖర్చు తలనొప్పిగా మారింది అంటున్నారు అమ్మనాన్నలు’ అని బాధపడుతోంది సుష్మ. కాబోయే అత్తగారు కోరడంతో రూప (పేరు మార్చడమైంది) తన కంటి కింది భాగం లోతుగా ఉండటం వల్ల ‘అండర్ ఐ ఫిల్లర్’ ఇంజక్షన్ చేయించుకుంది. దీంతో కంటి కింది భాగంలో రక్తం గడ్డకట్టి, వాపు వచ్చి, బయటకు రాలేని పరిస్థితి. త్వరలో పెళ్లి. ఆ క్లాట్ అంత తొందరగా తగ్గదు. దిక్కుతోచని పరిస్థితి. శిల్ప అందం కోసం బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంది. డోస్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి వీలు లేకుండా మారిపోయింది. అందం పెంచుకునే విషయంలో ఒకరో ఇద్దరు కాదు అమ్మాయిలు ఎప్పుడూ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లి అంటే చెప్పనక్కర్లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి ప్రతి సంబరాన్నీ పదిలపరుచుకోవడానికి ఎన్నో పాట్లు పడతారు. దీంట్లో భాగంగా బ్యూటీ కాన్షియస్ అమ్మాయిల్లోనూ, అబ్బాయిల్లోనూ పెరిగింది. ఈ విషయంలో ఎలాంటి చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం మంచిది అంటున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్న ప్రియ. వాటిలో... ఇంట్లో ప్రయోగాలు.. చాలా మంది అందానికి ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. సహజంగా లభించే వాటితో బ్యూటీప్యాక్‌లు వేసుకుంటూ ఉంటారు. వాటి ద్వారా ఎంత సమయంలో ఎంత ప్రయోజనం ఉంటుందో కూడా చూడాలి. ఎందుకంటే, కొంతమందికి స్కార్స్, పింపుల్స్, యాక్నె, డల్ స్కిన్, కలర్ ఛేంజ్, చుండ్రు... ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటికి చికిత్సనే సరైన మార్గం. ఆహారానికి సంబంధించినవి తప్పనిసరిగా పెళ్లికి రెండు నుంచి మూడు నెలల ముందు మార్పులు చేసుకోవాలి. సహజంగా చర్మంలో మార్పులు రావాలంటే పోషకాహారం మంచి ఎంపిక. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. బ్యూటీ స్పాలో చికిత్స మంచిదేనా? స్కిన్ టైటనింగ్, రింకిల్స్, స్కిన్ హైడ్రేషన్.. వంటి ట్రీట్మెంట్స్ బ్యూటీ స్పాలలో చేయించుకుంటారు. దీనికి కూడా ముందు సరైన కౌన్సెలింగ్ అవసరం. ఒక్కో వ్యక్తి చర్మ తత్త్వం ఒక్కో విధంగా ఉంటుంది. ఈ విధానంలో చర్మం రికవరీ అవడానికి కూడా సమయం పడుతుంది. ఇంజక్షన్లు సరైనవేనా... కృత్రిమంగా కొలాజన్, స్కిన్ బూస్టర్స్.. అని తీసుకుంటున్నారు. ఎవరో చెప్పారని కొంతమంది నర్సులను ఇంటికి పిలిపించుకొని ఇంజక్షన్లు చేయించుకుంటారు. మంచి లుక్ కోసం ట్రై చేయచ్చు. కానీ, వాటి డోసుల్లో తేడాలొస్తే మొత్తం తిరగబడుతుంది. ఆన్లైన్లో చూసి ... సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆన్లైన్లో బ్యూటీ ఉత్పత్తులు తెప్పించుకొని, అప్లై చేసుకోవడం చూస్తుంటాం. వాటి వల్ల ఇబ్బందుల పాలైన వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే, అవి వారికి ఎంత వరకు నప్పుతాయో తెలియదు. కెమికల్ పీలింగ్ కెమికల్ పీల్లో బయటి నుంచి చర్మంలోకి ఎలాంటి రసాయనాలు చొప్పించరు. మృతకణాలను తొలగిస్తారు, చర్మం పై పొర నుండి టానింగ్, పిగ్మెంటేషన్ తగ్గి కొత్త పొర కనిపిస్తుంది. అయితే, దీని ద్వారా చర్మంపై కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిపుణుల సలహా అవసరం. ఇంకొన్ని పీఆర్పీ చికిత్సలు చర్మ నిగారింపును తీసుకువస్తాయి. అయితే, వధువులు కాబోయే అమ్మాయిలు పెళ్లికి 3 నుండి 6 నెలల ముందు ఈ కాస్మెటిక్ విధానాలను ప్రారంభించాలి. ఎందుకంటే వారి సిట్టింగ్‌లలో కనీసం 3 వారాల గ్యాప్ ఉండాలి. లైటర్ టోన్లకు డిమాండ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు తమ ప్రీ–బ్రైడల్ విధానంలో రంగు ఫెయిర్‌గా మారడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి, సూర్యకిరణాల నుండి మన చర్మాన్ని మనం రక్షించుకోనప్పుడు, చర్మంలో పాచెస్ ఏర్పడతాయి. కొన్నిసార్లు సూర్యకాంతి కుడి వైపున, మరి కొన్నిసార్లు ఎడమ వైపున ఎక్కువగా పడుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలను దెబ్బతీస్తాయి. పిగ్మెంటేషన్‌ను ప్రేరేపిస్తాయి. దీంతో అంతటా ’చర్మపు రంగు’ ఒకే విధంగా ఉండదు. అంటే ముఖం మీద చాలా చోట్ల టాన్ ఉంటుంది. ఈవెన్ టో ని కలిగి ఉండాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముఖంపై సన్ స్క్రీన్‌ని అప్లై చేయడం చాలా ముఖ్యం. కాస్మొటిక్ ఫిల్లర్స్... నిఖిత పెదవులు చాలా సన్నగా ఉంటాయి. రంగు చాలా తక్కువ. ఒకరోజు ఆమె కాబోయే అత్తగారు ఫోన్ చేసి ‘నీ ముఖంలో పెదవులు కనిపించడం లేదు. ఏదైనా చికిత్స తీసుకో’ అంది. దీంతో నిఖిత నర్సులను కాస్మెటిక్ ఫేషియల్ ఫిల్లర్లను ఆశ్రయించింది. దీనిని లిప్ ఫిల్లర్ అని కూడా అంటారు. దీర్ఘకాలిక ఫలితాల కోసం, ప్రతి 6 నుండి 8 నెలలకు ఇంజెక్షన్లు చేయాలి. కాస్మెటిక్ ఫేషియల్ ఫిల్లర్లే కాకుండా, హైలురానిక్ యాసిడ్ ఫిల్లర్ ఇంజక్షన్లు కూడా ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ డెర్మా ఫిల్లర్లతో పెదవులు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. పగుళ్లు రావు, పూర్తి పరిమాణంలో కనిపిస్తాయి. అలాగే, కొందరు అమ్మాయిలు అత్తింటి వారు బరువు తగ్గమన్నారు కదా అని లైపోసక్షన్ వంటి చికిత్సలు చేయించుకుంటారు. దీని వల్ల చర్మంపై చారలు ఏర్పడతాయి. అవి అంత త్వరగా పోవు. ముక్కు, పెదాలు, బ్రెస్ట్ సరిచేసుకోవడానికి కాస్మొటిక్ సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఏ చికిత్స అయినా కనీసం ఆరు నెలల ముందు చేయించుకుంటే వచ్చే సైడ్ఎఫెక్ట్నూ నివారించవచ్చు. సహజమైన మెరుపే మేలు పెళ్లి 10–15 రోజులు ఉందనగా ఏ బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోకూడదనే విషయం ముందు గ్రహించాలి. కనీసం ఆరు లేదా మూడు నెలల ముందు బ్యూటీ చికిత్సలు చేయించుకోవచ్చు. దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే నివారించుకునే అవకాశం ఉంటుంది. కృత్రిమ అందాన్ని ఎవరూ ఇష్టపడరు. ఎప్పుడైనా సహజమైన మెరుపును ఇచ్చే బ్యూటీ ట్రీట్మెంట్ మాత్రమే మంచిదని గమనించాలి. అయినా తప్పదు అనుకునేవారు స్కిన్ బూస్టర్స్, ఇతర ట్రీట్మెంట్ వైపుగా వెళ్లచ్చు. ఇందుకు నిపుణుల పర్యవేక్షణ అవసరం. డాక్టర్ స్వప్నప్రియ, డర్నటాలజిస్ట్ (చదవండి: అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!) -
కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!
శరీరంలో కొవ్వును కరిగించుకునే ప్రక్రియలో అనేకమంది చాలా చేదు అనుభవాలున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా కొవ్వును కరిగించే ఇంజెక్షన్లు తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలన్న ఒక మహిళ కల పీడకలగా మిగిలిపోయింది. స్వయంగా శరీరాన్ని తినేసే అరుదైన బాక్టీరియాతో జీవన్మరణ పోరాటం చేస్తున్న మాజీ స్విమ్‌సూట్ మోడల్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గాథ ఒకటి వైరల్ అవుతోంది. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ బీట్రిజ్ అమ్మ ఫాట్‌ను కరిగించుకునే క్రమంలో లాస్ ఏంజెల్స్ లోని ఒక లగ్జరీ స్పాను సంప్రదించింది. విటమిన్ ఇంజెక్షన్లు భారీ తీసుకునేది. విటమిన్ బీ1, సీ మిశ్రమంగా "వేగంగా కరిగిపోయే" డియోక్సికోలిక్ యాసిడ్‌తో కలిపి 60 ఇంజక్షన్లు తీసుకుంది. చేతులు, పిరుదులు, కడుపులోకి వీటిని తీసుకుంది. దాదాపు 66వేల కంటే ఎక్కువే ఖర్చుపెట్టింది. కొవ్వు కరగడం సంగతి ఏమోగానీ ఇపుడు అరుదైన మైకోబాక్టీరియం అబ్సెసస్ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి నరక యాతన అనుభవిస్తోంది. ఇంజెక్షన్ తీసుకున్న ప్రతీ చోట భయంకరమైన పుండ్లతో భరించలేని భాధ పడుతోంది. దాదాపు మంకీ పాక్స్ లాంటి గాయాలతో ఆ బాక్టీరియా శరీరం మొత్తాన్ని తినేస్తోంది. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) డియోక్సికోలిక్ యాసిడ్ సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోవడం వల్లే ఇది జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాక్టీరియా బారిన పడి కుళ్ళిపోయిన చర్మాన్ని తొలగించేందుకు పలు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ప్రతీ రోజూ ఆరు గంటల ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్‌ను భరిస్తోంది. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) మంచానికే పరిమితమై ప్రాణం నిలుపుకునేందుకు ఆరాటపడుతోంది. ఒకరి సాయం లేకుండా రెస్ట్‌రూమ్‌కి వెళ్లలేక..కనీసం లేచి నిలబలేక ఇలా అన్నింటికి మరొకరి మీద ఆధారపడి బతుకేదాన్ని..శరీరం మంచం మీదే కుళ్ళిపోతోంది అంటూ తన అనుభవాన్ని పంచుకుంది బీట్రిజ్. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ, జీవితంలో సాధించాలని కలగన్నదో, ఇపుడు ఏమి కోల్పోయిందో గుర్తు చేసుకుని బోరున విలపించింది. అటు వైద్యులు కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలనే కలను వదులుకోండి ఇది జీవితాంతం మిమ్మల్ని వదలదని తెగేసి చెప్పారు. అంతేకాదు ఇతరులను భయపెట్టకుండా బహిరంగ ప్రదేశాల్లో బికినీలు ధరించ వద్దని కూడా సలహా ఇచ్చారు. కానీ ఇక్కడే బీట్రీజ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఇక నా శరీరం పోరాడలేదు ఓడిపోయింది..ఇక చనిపోతాను అనుకున్న క్షణంలో ధైర్యాన్ని కూడ దీసుకుంది. మాంసాన్ని తినేసే వికృతమైన, భయంకరమైన ఈ బాక్టీరియా గురించి అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే బాడీ పాజిటివిటీ మూవ్‌మెంట్‌ను మొదలు పెట్టింది. మన శరీరంలో ఎన్ని వైరుధ్యాలు, ప్రతికూలతలు, మచ్చలున్నా భయపడకుండా, ఆత్మన్యూనతతో దాచు కోకుండా శరీర ఆకృతితో సంబంధం లేకుండా అంతర్గతంగా, బాహ్యంగా అందంగా ఉండాలని పిలుపు నిస్తోంది. -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ జిమ్‌లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్‌లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్‌లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్‌ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్‌ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్‌నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
పెళ్లైన 5 నెలలకే ఘోరం.. నర్సుతో లవ్ ఎఫైర్.. భార్యకు ఇంజెక్షన్లు ఇచ్చి..
ముంబై: ఆ జంటకు పెళ్లై అయిదు నెలలు. భవిష్యత్తుపై ఎన్నో ఊహలు, ఆశలతో వైవాహిక బంధంలోకి అడ్డుగుపెట్టిన ఆ ఇల్లాలి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లై ఏడాది గడవకముందే భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. జీవితంలో తోడూ నీడై తనకు అండగా ఉండాల్సిన వ్యక్తే ఆమె పాలిట యముడయ్యాడు. వాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే కారణంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ఓ పెద్ద కథను కూడా అల్లాడు. కానీ అదికాస్తా బెడిసి కొట్టడంతో చివరకు తప్పను ఒప్పుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. స్వప్నిల్ సావంత్(23) అనే యువకుడు పుణెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాడు. అయిదు నెలల క్రితం ప్రింయాంక క్షేత్రేని వివాహం చేసుకొని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కొంతకాలంగా అక్కడే నర్సుగా చేస్తున్న సహోద్యోగితో సావంత్ ఎఫైర్ నడుపుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పెళ్లికి తన భార్య అడ్డుగా ఉందని భావించి ఆమెను అంతమొందించాలనుకున్నాడు. నవంబర్ 14న భార్యకు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చి చనిపోయేలా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వివాహితను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. భార్య హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు కుట్ర పన్నాడు. ప్రియాంక రాసినట్లు ఓ సుసైడ్ లేఖ కూడా రాశాడు. అయితే పోలీసులకు భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దర్యాప్తులో చేసిన నేరాన్ని అంగీకరించాడు. పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి వెకురోనియం బ్రోమైడ్, నైట్రోగ్లిజరిన్ ఇంజెక్షన్లు,లోక్స్ 2% సహా కొన్ని మందులు ఇంజెక్షన్లను దొంగిలించాడని తేలింది. వాటిని భార్యకు ఇచ్చి హత్య చేసిన్టలు ఒప్పుకున్నాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని.. పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఇన్స్పెక్టర్ మనోజ్ యాదవ్ వెల్లడించారు. చదవండి: కోవిడ్‌లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు -
పాపం చిట్టితల్లి.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వస్తేనే వైద్యం
సాక్షి,దుమ్ముగూడెం(ఖమ్మం): బోసినవ్వులతో ఇంట్లో ఆడుకోవాల్సిన పసిపాప అరుదైన వ్యాధి బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వేలల్లో ఒకరికి వచ్చే జన్యుసంబంధిత వ్యాధితో 14 నెలల ఎల్లెన్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడం హృదయాలను కలిచివేస్తోంది. చికిత్సకు రూ.16కోట్లు అవసరమని వైద్యులు చెప్పగా.. అంత స్థోమత లేని పాప తల్లిదండ్రులు బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. సహృదయం కలిగిన దాతలు ముందుకొస్తే తప్ప తమ పాపను దక్కదని వేడుకుంటున్నారు. సత్వర వైద్యం అందకపోతే.. దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ప్రవీణ్ ప్రైవేట్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి 2018లో వివాహం కాగా 14నెలల ఎల్లెన్ పాప ఉంది. పాప నాలుగో నెల నుంచి మెడ భాగం పటిష్టంగా లేకపోవడం, కిందకు వాలిపోతుండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. నెలలు గడుస్తున్నా శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన వారు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయినా ఏమీ తెలియకపోవడంతో జన్యుసంబంధిత సమస్యగా అనుమానిస్తూ మరో రెండు పరీక్షలు నిర్వహించారు. అయినా చిన్నారి సమస్య బహిర్గతం కాలేదు. రోజురోజుకూ చిన్నారి కదల్లేని పరిస్థితికి చేరుతుండడంతో తల్లిదండ్రులు చెన్నైలోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. తమ స్థోమతకు మించి అప్పులు చేసి గత ఏడాది డిసెంబర్ 7న జెనెటిక్ పరీక్షలు చేయిస్తే ఈ నెల 10న రిపోర్టులు వచ్చాయి. ఈ నివేదిక ఆధారంగా ఎల్లెన్ జన్యుసంబందిత వ్యాధితో బాధపడుతోందని.. నరాలు, కండరాలు బలహీనంగా అయ్యాయని వైద్యులు వెల్లడించారు. సత్వర వైద్యం అందకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకమేనని చెప్పడం... రానురాను చిన్నారి శరీర భాగాల్లో కదలికలు తగ్గుతుండడంతో తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం రోజుకు చిన్నారి మందులు, చికిత్స కోసం రూ.25వేల వరకు ఖర్చు అవుతుండగా ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. రూ.కోట్లల్లో ఖర్చు... చిన్నారి ఎల్లెన్‌కు నిర్వహించిన పరీక్షలలో జన్యుసంబంధిత వ్యాధిగా నిర్ధారించారు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ (జోల్జెన్స్మా)ను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితిల్లో ఇంత ఖర్చు అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం చేస్తున్న వైద్యం అంతా తాత్కాలికమేనని వైద్యులు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి చిన్నారి ఎల్లెన్‌కు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్ – స్టెల్లా కోరుతున్నారు. కాగా, ఎల్లెన్‌కు ప్రస్తుతం విజయవాడలోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమె చికిత్స కోసం సాయం చేయాలనుకునే దాతలు 99085 89604 నంబర్లో సంప్రదించాలని ప్రవీణ్ కోరారు. చదవండి: అంగన్వాడీల్లో గుడ్డు వెరీబ్యాడ్ -
బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి..
సాక్షి, చెన్నై: కేన్సర్‌తో తన కుమారుడు అనుభవిస్తున్న నరకయాతనను చూడలేక ఓ తండ్రి కారుణ్య హత్యకు పాల్పడ్డాడు. బంధువు సాయంతో తన కుమారుడికి విషం ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చాడు. సేలంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం కరుసవల్లి గ్రామానికి చెందిన పెరియ స్వామి లారీ డ్రైవర్. ఆయనకు వన్నతమిళ్(14) కుమారుడు ఉన్నాడు. గత ఏడాది వన్న తమిళ్ కూడి వైపు కాలిలో ఓ కణితి బయట పడింది. వైద్యులు దీన్ని కేన్సర్ గడ్డగా తేల్చారు. దీనికి కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల పాటు చికిత్స అందించారు. ఆ తదుపరి తరచూ చికిత్సకు తీసుకెళ్తూ వస్తున్నారు. వైద్య ఖర్చులు భారం కావడమే కాకుండా, కేన్సర్ క్రమంగా శరీరం అంతా వ్యాపించడం, ఆ కణితి భాగం చీము పట్టడంతో వన్నతమిళ్ పడుతున్న నరకాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేక పోయాడు. ఆ వేదన నుంచి కుమారుడికి విముక్తి కల్గించేందుకు నిర్ణయించారు. ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్న సమీప బంధువు ప్రభు సాయం తీసుకున్నాడు. విషం ఇంజెక్షన్ ద్వారా కారుణ్య హత్యకు సిద్ధం అయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు ఆదివారం రాత్రి ఆ టీకాను ఆ బాలుడికి వేశారు. నిద్రలోనే ఆ బాలుడు మరణించాడు. సోమవారం ఉదయాన్నే కేన్సర్ కారణంగా మరణించినట్టు ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే, పోలీసులకు ఆ బాలుడిని కారుణ హత్య చేసినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ బాలుడి తండ్రి, బంధువును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
తల్లి, సోదరిని చంపి తానూ చావాలనుకుంది..
సూరత్: తల్లి, సోదరికి ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని గుజరాత్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ ప్రయత్నించారు. గుజరాత్‌లోని కాటగ్రామ్లో జరిగిన ఈ ఘటనలో తల్లి, సోదరి మరణించగా ఆత్మహత్యాయత్నం చేసిన డాక్టర్ దర్శన ప్రజాపతి (30) మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక ఏసీపీ డీజే చద్వా ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి డాక్టర్ దర్శన తన తల్లి మంజులాబెన్ (59), సోదరి ఫాల్గుని (28)లకు డ్రగ్స్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు. అనంతరం ఆమె కూడా నిద్రమాత్రలు మింగారు. ఆదివారం ఉదయానికి తల్లీ, సోదరి మరణించగా ఆమె మాత్రం ప్రాణాలతో మిగిలారు. తనకు జీవితంపై విరక్తి కలిగిందనీ, తల్లి్ల, సోదరి తనపైనే ఆధారపడి ఉండటంతో వారిని కూడా అంతం చేయాలని భావించినట్లు దర్శన పోలీసులకు వెల్లడించారు. -
బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.22 లక్షలు తీసుకున్నారు!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరితే, ఇంజక్షన్ల కొరత ఉందంటూ ఓ డ్యూటీ వైద్యురాలు తమ వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిందని ఓ వ్యక్తి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము చెల్లింపులన్నీ డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదుకు జత చేయడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పొట్టెం విజయలక్ష్మి శరన్ ఈ ఏడాది మే 28న బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆ వార్డులో డ్యూటీ డాక్టర్‌గా ఉన్న (కోవిడ్ నియామకం) తోట వాణి సుప్రియ లయోఫిలైజుడ్ యాంఫోటెరిసిన్ బి అనే యాంటి ఫంగల్ ఇంజెక్షన్స్ కొరత ఉందని, డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని, ముడుపులు చెల్లిస్తే కానీ ఇంజెక్షన్లు సమకూర్చలేమని చెప్పినట్లు విజయలక్ష్మి భర్త రఘుకులేశ శరన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విడతల వారీగా తాము రూ.22 లక్షలు డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఉచితంగా యాంటీ ఫంగల్ మందులను ఇస్తుంటే, ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం దారుణమని, తమని మోసం చేసిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకుని, ఆమె వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ సీరియస్.. బ్లాక్ ఫంగస్ రోగి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆస్పత్రి అధికారులను తమ కార్యాలయానికి పిలిపించుకుని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఇతర వివరాలను సేకరించారు. కాగా ఈ విషయమై బాధితులు వారం కిందటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి ఫిర్యాదు చేసినా, దానిని ఆస్పత్రి అధికారులకు పంపకుండా వారి వద్దే ఉంచుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఘటన వెలుగులోకి రావడంతో హడావుడిగా తమకు వచ్చిన ఫిర్యాదును ఆస్పత్రి అధికారులకు పంపారు. విచారణ జరుగుతోంది రోగి నుంచి రూ.22 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై జేసీ నేతృత్వంలో విచారణ జరుపుతున్నాం. తమకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు మొత్తం జేసీకి ఇచ్చాము. రోగి ప్రభుత్వాస్పత్రి నుంచి వెళ్లిన తర్వాత ఇంటి వద్ద కూడా ఈ వైద్యురాలు చికిత్స చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలు విచారణలో తేలుతాయి. – డాక్టర్ ఎం జగన్మోహనరావు, సూపరింటెండెంట్ -
Corona Vaccine: సూది గుచ్చడంలో తేడాతో రక్తంలో గడ్డలు!
మ్యూనిచ్: సూది మందు గుచ్చేతీరులో తేడాల వల్ల రక్తంలో గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, అందువల్లే కోవిడ్ టీకా తీసుకున్న కొంతమందిలో బ్లడ్ క్లాట్స్ కనిపించాయని నూతన అధ్యయనం వెల్లడించింది. తప్పుగా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కండరంలోకి ఎక్కించాల్సిన మందు పొరపాటున రక్తనాళాల్లోకి ఇంజెక్ట్ అవుతుందని, అందువల్ల తేడా చేస్తుందని మ్యూనిచ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్ సహా పలు టీకాల విషయంలో ఈ రక్తంలో గడ్డల(పోస్ట్ వ్యాక్సినేషన్ థ్రోంబాటిక్ థ్రోంబోసైటోపెనిక్ సిండ్రోమ్– టీటీఎస్ లేదా వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రోంబాటిక్ థ్రోంబోసైటోపీనియా– వీఐటీటీ) ఫిర్యాదులు వినిపించాయి. అయితే ఇది టీకాలో సమస్య కాదని, టీకా ఎక్కించడంలో సమస్యని తాజా నివేదిక తెలిపింది. ‘‘ఇంజక్షన్ నీడిల్‌ను కండరంలోకి చేరేంత లోతుగా పంపించకుండా పైపైన గుచ్చినప్పుడు టీకామందు కండరంలోకి బదులు రక్తంలోకి నేరుగా వెళ్తుంది. సూది మందు ఇచ్చే సమయంలో చేతిపై చర్మాన్ని వత్తి పట్టుకోకూడదు. ఇంట్రామస్కులార్ ఇంజెక్షన్లు(కండరాల్లోకి పంపే సూదిమందు) ఇచ్చేటప్పుడు ఏమాత్రం చర్మాన్ని పించప్(వత్తి పట్టుకోవడం) చేయకుండా సాఫీగా ఉన్న చర్మంపై టీకానివ్వాలి. లేదంటే సూది మొన కేవలం చర్మాంతర్గత కణజాలం వరకే చేరుతుంది. దీంతో టీకా మందు కణజాలంలోకి పీల్చుకోవడం జరగదు. పైగా కొన్నిమార్లు ఇలా చేయడం వల్ల సూదిమొన రక్తనాళాల్లోకి వెళ్తుంది. అప్పుడు టీకా మందు రక్తంలోకి ప్రవేశించి క్లాట్స్ కలిగించే ప్రమాదం ఉంది’’అని కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు రాజీవ్ జయదేవన్ వివరించారు. టీకా ఇచ్చేముందు సూది గుచ్చిన అనంతరం పిస్టన్ను వెనక్కు లాగి చెక్ చేసుకోవడం ద్వారా సూది మొన రక్తనాళంలోకి చేరలేదని నిర్ధారించుకోవాలన్నారు. -
కరోనా టీకా కోసం వెళ్తే.. కుక్క కాటు వ్యాక్సిన్ వేశారు
కట్టంగూర్: చదువురాని మహిళ.. కరోనా వ్యాక్సిన్ కోసమని ఆస్పత్రికి వెళ్లింది. కోవిడ్ వ్యాక్సిన్ వేయాలంటూ ఆమె పనిచేస్తున్న బడి హెడ్మాస్టర్ రాసిచ్చిన లేఖనూ తీసుకెళ్లి చూపించింది. కానీ ఆస్పత్రి సిబ్బంది ఆమెకు కుక్కకాటు టీకా వేయడంతో భయాందోళనకు లోనైంది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. కట్టంగూర్ మండలం బొల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో పి.ప్రమీల స్కావెంజర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని వైద్యాధికారిని కోరుతూ పాఠశాల హెచ్ఎం లెటర్ రాసి ఇచ్చారు. ప్రమీల ఆ లేఖ తీసుకుని మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూర్ పీహెచ్‌సీకి వచ్చింది. చదువురాని ఆమె కరోనా వ్యాక్సిన్ క్యూ ఏదో తెలియక.. సాధారణ టీకాలు వేసే లైన్లో నిలబడింది. ఆమె ముందు అయిటిపాముల గ్రామానికి చెందిన ఓ మహిళ ఉంది. నర్సు ఆ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) ఇచ్చింది. తర్వాత ప్రమీల వంతురాగా.. కరోనా వ్యాక్సిన్ వేయాలంటూ హెచ్ఎం ఇచ్చిన లెటర్‌ను నర్సుకు ఇచ్చింది. కానీ నర్సు ఆ లెటర్‌ను చదవకుండానే.. అదే సిరంజితో ప్రమీలకు ఏఆర్వీ వ్యాక్సిన్ వేసింది. ఒకే సిరంజితో ఇద్దరికి వ్యాక్సిన్ ఎలా ఇస్తారని ప్రమీల నిలదీయగా.. నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే సమయంలో పక్కన ఉన్నవారు లెటర్ చదివి.. ఇది కరోనా లైన్ కాదని, తనకు వేసింది కుక్కకాటు వ్యాక్సిన్ అని చెప్పడంతో ప్రమీల భయాందోళనకు గురైంది. ఒకే సిరంజితో ఇద్దరికి ఏఆర్వీ వ్యాక్సిన్‌ను వేయడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు ఏఆర్వీ వేయలేదు: వైద్యాధికారి ప్రమీల కరోనా వ్యాక్సిన్ క్యూలో కాకుండా సాధారణ ఏఆర్వీ, టీటీ వ్యాక్సిన్ లైన్లో నిలబడిందని.. దాంతో నర్సు ఆమె కుక్కకాటు టీకా కోసం వచ్చినట్టు భావించి టీటీ ఇంజక్షన్ వేశారని వైద్యాధికారి కల్పన వివరణ ఇచ్చారు. వేర్వేరు సిరంజిలతో అయిటిపాముల మహిళకు ఏఆర్వీ, ప్రమీలకు టీటీ ఇచ్చినట్టు తెలిపారు. టీటీతో ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. చదవండి: -
రూ.7444 ఇంజెక్షన్ @రూ.35 వేలు!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే ఔషధాలను అనధికారికంగా సేకరించి, నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్ షాపు నిర్వాహకులు ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్‌్కఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన కె.క్రాంతి కుమార్ వీవీ నగర్లో మెడిక్స్ ఫార్మసీ పేరుతో, వివేకానంద నగర్‌కు చెందిన ఎన్.వెంకట దినేష్ స్థానికంగా శంకరి పార్మసీ పేరుతో మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆల్విన్ కాలనీకి చెందిన బాలాజీ మెడిసిన్ వరల్డ్ యజమాని శ్రీనివాస్‌తో కలిసి వారు బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే ఎంపోటెరిసరిన్–బి సంబంధిత ఇంజెక్షన్లను సేకరించారు. కొందరు రోగుల వద్ద మిగిలిన వాటిని దళారుల ద్వారా ఖరీదు చేయడంతో పాటు నకిలీ పత్రాలతో రోగుల బంధువుల మాదిరిగా సమీకరించిన వారి నుంచి వీరు కొనుగోలు చేసేవారు. అనంతరం రూ.7444 ఖరీదైన ఫంగ్లిప్ ఇంజెక్షన్‌ను రూ.35 వేలకు, రూ.8500 ఎంఆర్పీ కలిగిన పోసాకొంజోలీ ఇంజెక్షన్‌ను రూ.50 వేల చొప్పున విక్రయించేందుకు పథకం వేశారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబీకులు, బంధువుల్ని టార్గెట్‌గా చేసుకుని ఈ దందాకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల జావేద్ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షపీ వలపన్నారు. సోమవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి 35 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రామ్‌గోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. టాస్‌్కఫోర్స్ పోలీసులు కోవిడ్, బ్లాక్ ఫంగస్ మందుల అక్రమ దందాపై నిఘా పెంచారని సీపీ తెలిపారు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి 56 కేసులు నమోదు చేసి 136 మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి 450 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. -
బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి, 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్‌లో ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఈ ముఠా.. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.35 వేల నుంచి రూ.50 వేల చొప్పున అమ్ముతున్నారు. మొదటి గ్యాంగ్‌లో ఐదుగురిని, రెండో గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేశామని.. మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. బ్లాక్మార్కెట్లో ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. చదవండి: ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్ ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం.. -
రిమ్స్‌లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స..
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్‌లో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోగం నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వస్తున్న వారికి కాలం చెల్లిన ఇంజక్షన్ ఇస్తూ వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. పట్టించుకోవాల్సి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలోని మూడో అంతస్తు మేల్ జనరల్ వార్డులో దాదాపు 30 మంది రోగులు వివిధ రోగాలతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఆ వార్డులోని నర్సు ఐదుగురు రోగులకు ఇంజక్షన్లు ఇచ్చింది. వ్యాక్సిన్ బాటిళ్లను రోగుల బెడ్లపై ఉంచడంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడి కుమారుడు గమనించి ఇంజక్షన్‌కు కాలం చెల్లిందని వైద్యసిబ్బందికి చెప్పడంతో వెంటనే చెత్తబుట్టలో పారేశారు. బంధువుల ఆందోళన.. రోగుల బంధువులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీ జేపీ నాయకులు అక్కడికి చేరుకుని వైద్య సిబ్బందిని నిలదీశారు. రిమ్స్ డైరెక్టర్‌ను ఫోన్లో సంప్రదించగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు ఇచ్చిన యాంటి బయోటిక్ ఇంజక్షన్ 2019లో తయారుకాగా 2021 జనవరితో గడువు ముగిసింది. ఈ విషయమై ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, బీజేపీ నాయకులు పాయల్ శరత్ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రిమ్స్ సిబ్బంది, డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ బలరాం రాథోడ్‌ను వివరణ కోరగా కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బందిపై కేసు నమోదు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాంధీచౌక్‌కు చెందిన గౌరీశంకర్‌శర్మ కుమారుడు కైలాస్‌శర్మ ఆస్పత్రి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ వివరించారు. చదవండి: ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదు : చైనా వైరాలజిస్ట్ -
బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే
దేశవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లకు కొరత ఏర్పడటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ బాధితుల చికిత్స కోసం వినియోగించే యాంఫోటెరిసిన్ బి, పొసకొనజోల్ ఇంజక్షన్ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, ఒక్కో పేషెంటుకు ఎక్కువ ఇంజక్షన్లు వాడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 శాతం మంది పేషెంట్లకు కూడా యాంఫోటెరిసిన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయాలపై కృషి జరుగుతోంది. ఈ క్రమంలో ఆయుర్వేద మందులకు ప్రాధాన్యం పెరుగుతోంది. గతంలో ఎన్నో రకాల ఫంగస్‌లను నియంత్రించిన చరిత్ర ఆయుర్వేద ఔషధాలకు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆయుర్వేద మందులు వాడితే బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. సాక్షి, అమరావతి: కేంద్ర ఆయుష్ శాఖ మూడు రకాల ఆయుర్వేద మందులను బ్లాక్‌ఫంగస్ నిరోధక ఔషధాలుగా ప్రకటించింది. శంషమన వటి 500 మిల్లీగ్రాములు, నిషామలకి వటి 500 మిల్లీ గ్రాములు, సుదర్శన ఘణవటి 500 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్రలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాడితే మ్యూకార్ మైకోసిస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి ప్రత్యామ్నాయమని ఆయుష్ శాఖ పేర్కొంది. దీంతోపాటు ఆయుష్ – 64 అనే మందునూ వాడుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. నిపుణుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అల్లోపతి మందులు వాడుకుంటూనే ఆయుర్వేద మందులూ తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారంలో ఇవి తీసుకోవాలి.. ఆహారంలో ప్రధానంగా ఔషధ గుణాలున్నవి ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండాలి. తులసి, దాలి్చన చెక్క, నల్లమిరియాలు కూడా మంచివి. నల్లద్రాక్ష, వేరుశనగ పప్పు, పిస్తా, మల్బరీస్, స్ట్రాబెర్రీ లాంటివి రోగ నిరోధక శక్తి పెరిగేలా దోహదం చేస్తాయి. జామకాయ, బత్తాయి, కమలా, నిమ్మ, కాప్సికం లాంటి వాటితోపాటు, మునగాకుతో వండిన కూరలతో మంచి ఉపయోగం ఉంటుంది. చికిత్స, నివారణ.. రెండిటికీ ‘‘ఆయుర్వేద మందులకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే చాలా రకాల వ్యాధులు వచి్చన తర్వాత వాటిని తగ్గించేందుకు, రాకుండా కాపాడేందుకూ ఉపయోగపడతాయి. ఈ ఔషధాలను వైద్యుడి పర్యవేక్షణలోనే తీసుకోవాలి. బ్లాక్‌ఫంగస్ ప్రధానంగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడే వస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఆయుర్వేద మందుల్లో ఉన్నాయి. క్రమం తప్పకుండా సూచించిన మేరకు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. శతాబ్దాల క్రితమే చరక సంహితలో ఈ వ్యాధులకు సంబంధించి సూచనలు చేశారు’’ –డా.కె.విజయభాస్కర్‌రెడ్డి, ప్రొఫెసర్, శల్య విభాగం, ఎస్వీ ఆయుర్వేద కాలేజీ, తిరుపతి నియంత్రించే నేత్ర బిందువులు.. ‘‘నిషామలకి, మహాలక్ష్మీ విలాస రస్ మందులతో పాటు ఎలనీర్ కుజాంబు అనే నేత్ర బిందువులు వేసుకుంటే బ్లాక్ ఫంగస్ నియంత్రణకు బాగా ఉపయోగపడతాయి. కబాసురా కుడినీర్ అనే మందు ఉదయం పూట, ఆయుష్ క్వాత అనే మందు రాత్రిపూట తీసుకుంటే ఫంగస్ నియంత్రణకు ఎంతో ఉపకరిస్తాయి. క్రమం తప్పని వ్యాయామం శరీర పటుత్వాన్ని పెంచుతుంది’’ –డా.కేదార్నాథ్, ఆయుర్వేద వైద్యుడు బ్లాక్ ఫంగస్ చికిత్స, నివారణకు ఆయుర్వేద ఔషధాలు ఇలా ► పంచ వల్కల కషాయంతో వ్యాధి సోకిన ప్రాంతాన్ని శుభ్రపరచి ఆరిన తర్వాత మహాతిక్త ఘృతం పూయాలి. ► పథ్యాది కాడ మూడు పూటలా 15 ఎంఎల్ మోతా దు మించకుండా వాడాలి ► నింబామృతాది ఏరండ తైలం 10 ఎంఎల్ పడుకునే ముందు 3 రోజుల పాటు వాడాలి ► సంశమనవటి/గిలోయి ఘణవటి మూడు పూటలా వాడాలి ► గంధక రసాయనం 500 ఎంజీ మోతాదుతో మూడు పూటలా వాడాలి ► నిషామలకి 500ఎంజీ ఉదయం, సాయంత్రం వాడాలి ► సుదర్శన ఘణవటి 500 ఎంజీ మూడు పూటలా వాడాలి ► బృహత్వాత చింతామణి ఉదయం, సాయంత్రం వాడాలి ► క్రమేవృద్ధి లక్ష్మీ విలాస రస్ ఉదయం, సాయంత్రం వాడాలి. చదవండి: రాష్ట్రంలో 1,551 బ్లాక్‌ఫంగస్ కేసులు -
ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై
ముంబై: కామవాంఛతో కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. యువతికి కోరికలు రేకెత్తేలా ఇంజెక్షన్లు.. మందుబిల్లలు ఇస్తూ 8 సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. భర్తకు భార్యనే ప్రోత్సహించడం గమనార్హం. మైనర్‌గా ఉన్నప్పుడు కిడ్నాప్ చేయగా ఇప్పుడు ఆ బాలిక యువతిగా మారింది. ఎట్టకేలకు నిందితుల చెర నుంచి ఆ యువతి బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ఇంటర్ చదువుతుండేది. 16 ఏళ్లు ఉన్న ఆ బాలికను ఎనిమిదేళ్ల కిందట కొందరు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. బాలికకు కామ కోరికలు కలిగేలా ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. ఆమెపై ఇష్టమొచ్చినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను బెదిరింపులకు పాల్పడేవారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది. చివరకు వారి చెర నుంచి బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీసులను సంప్రదించింది. 27 పేజీలతో ఆమె ఫిర్యాదు చేసింది. అయితే నిందితుల్లో ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్‌కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. కేసు నమోదు అనంతరం పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో నిందితుడి భార్య కూడా ఉంది. ఆమె తన భర్తకు సహకరించింది. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. బాలిక తప్పిపోయినప్పుడు ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. 8 ఏళ్ల తర్వాత తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమెను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిందితులు బాధిత యువతి కుటుంబానికి తెలిసిన వారిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. -
పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రాల వారీగా బ్లాక్‌ఫంగస్ కేసులెన్ని.. ఇంజక్షన్లను ఎలా సమకూర్చుకుంటున్నారు.. రాష్ట్రాలకు వాటిని ఎలా కేటాయిస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్ల నిల్వలు తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే కోవిడ్ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నపిల్లల్లో వచ్చే మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్)ను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజ యలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా విషయంలో హైకోర్టులో పలు ప్ర జాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యాలను కొద్ది వారాలుగా విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్ల విషయంలో ధర్మాసనం గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ మెమోను కోర్టు ముందుంచింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఏపీకి గతంలో కేటాయించిన 13,830 ఇంజక్షన్లు కాక, ఈ నెల 5న మరో 7,770 వయల్స్ కేటాయించా మన్నారు. మే నెలాఖరుకు కేంద్రం వద్ద బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లు 4.38 లక్షలున్నాయని, వాటిలో 2.02 లక్షలు దేశీయంగా ఉత్పత్తి చేసినవి, 2,33,971 ఇంజక్షన్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని వివరించారు. రాష్ట్రాలకు సరఫరా చేయగా ప్రస్తుతం కేంద్రం వద్ద 80 వేల ఇంజక్షన్లు ఉన్నాయని తెలిపారు. కేంద్రం కేటాయింపులు ఏ మాత్రం సరిపోవు ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో గత నెలాఖరు నాటికి 1,400 ఉన్న బ్లాక్‌ఫంగస్ కేసులు ప్రస్తుతం 1,770కి పెరి గాయని తెలిపారు. బాధితుల చికిత్సకు కేంద్రం కేటాయించిన 7,770 వయల్స్ ఎంతమాత్రం సరిపోవన్నారు. కేటాయింపులను పెంచకపోతే రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. అనంతరం ధర్మాసనం కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి సన్నద్ధ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సుమన్ స్పందిస్తూ.. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్ ముఖ్యమంత్రికి ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందితోసహా దాదాపు 38 వేల మంది అదనపు సిబ్బందిని నియమించామని, ఈ విషయంలో ఇప్పటికే కోర్టు ముందు మెమో కూడా దాఖలు చేశామని సుమన్ చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ డాక్టర్లు, నర్సుల నియామకాలు చేపట్టాలని, పారామెడికల్ సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకో వాలని ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ మెమో దాఖలు చేయాలంది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తిచేసి పీజీ ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి సేవల్ని కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలని పేర్కొంది. -
తగినన్ని ఇంజక్షన్లు కేటాయించండి
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా ఉన్న చోట.. అందుకు అనుగుణంగా యాంఫోటెరిసిన్ ఇంజక్షన్లు కూడా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో నమోదైన 1,400 బ్లాక్ ఫంగస్ కేసులను దృష్టిలో పెట్టుకుని.. ఇంజక్షన్లు కూడా తగినన్ని కేటాయించాలని సూచించింది. ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాలకు చేసిన యాంఫోటెరిసిన్ ఇంజక్షన్ల కేటాయింపు వివరాలను కూడా తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గత కొన్ని వారాలుగా విచారణ జరుపుతూ వస్తున్న ధర్మాసనం.. శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల లభ్యత, కేటాయింపుల వివరాలను కేంద్ర ప్రభుత్వం మెమో రూపంలో ధర్మాసనం ముందుంచింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసే కేటాయింపుల గురించి మెమోలో ప్రస్తావించలేదన్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు 21 రోజుల కోర్సు ఇవ్వాల్సి ఉంటుందని.. తగినన్ని యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మందులు వాడాల్సి వస్తోందని వివరించారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ స్పందిస్తూ.. 9.5 లక్షల ఇంజక్షన్ల దిగుమతి కోసం అమెరికాకు ఆర్డర్లు ఇచ్చినట్లు చెప్పారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో.. కొరత ఏర్పడిందన్నారు. అనంతరం విచారణను ధర్మాసనం 7వ తేదీకి వాయిదా వేసింది. -
డిమాండ్ కొండంత.. ఉత్పత్తి గోరంత..
సాక్షి, అమరావతి: కరోనాను జయించి బయటపడిన వారిలో కొందరిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. మధుమేహవ్యాధి నియంత్రణ లేని, అతిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో 11,717 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. చికిత్సలో ఒక్కొక్కరికి 100 చొప్పున యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు అవసరం. అంటే.. ఇప్పుడు వ్యాధిబారిన పడినవారికే 11.71 లక్షల ఇంజక్షన్లు కావాలి. ప్రస్తుతం దేశంలో 5 సంస్థలు నెలకు 1,63,747 ఇంజక్షన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. మరో 5 సంస్థలకు వాటిని ఉత్పత్తి చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ 10 సంస్థలు జూన్ నాటికి నెలకు 2,55,114 వయల్స్ మాత్రమే ఉత్పత్తి చేయగలవు. విదేశాల నుంచి తొమ్మిది లక్షల ఇంజక్షన్లను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో జూన్‌కు 3.15 లక్షల వయల్స్ వస్తాయని చెబుతోంది. ఈ లెక్కన జూన్ నాటికి నెలకు 5.70 లక్షల వయల్స్ మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ వ్యాధి బారినపడిన వారి చికిత్సకే ఇవి చాలవని స్పష్టమవుతోంది. నానాటికీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో.. ఆ వ్యాధి చికిత్సలో వాడే కీలకమైన యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా మారుతుందని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా దోపిడీదారులు.. ఈ ఇంజెక్షన్లను దారిమళ్లించి బ్లాక్ మార్కెట్లో 6 నుంచి 10 రెట్లు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 18 రాష్ట్రాల్లో 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో గుజరాత్లో అత్యధికంగా 2,859 కేసులు నమోదవగా.. కర్ణాటకలో 2,770 కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వ్యాధికి చికిత్సలో ప్రధానంగా యాంపోటెరిసిన్–బి ఇంజక్షన్లు ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగికి రోజుకు 3, 4 డోసుల చొప్పున కొన్ని వారాలపాటు ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ ఫంగస్ వ్యాధుల చికిత్సలోను రెండు దశాబ్దాలుగా ఈ ఇంజక్షన్‌ను ఉపయోగిస్తున్నారు. దేశంలో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్, బీడీఆర్ ఫార్మాస్యూటికల్స్, సన్ ఫార్మా, సిప్లా, లైఫ్ కేర్ ఇన్నొవేషన్స్ సంస్థలు మాత్రమే ఈ ఇంజక్షన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. గతంలో వీటి తయారీలో ఏడాదికి 100 నుంచి 150 కిలోల లిపిడ్లు (ముడిపదార్థం) వరకు అవసరమయ్యేవి. ఈ ఫంగస్ కేసులు కనిష్ఠస్థాయిలో నమోదవడం వల్ల ఆ ఇంజెక్షన్లకు కొరత ఉండేది కాదు. కానీ.. 2 నెలలుగా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ ఇంజక్షన్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉత్పత్తి పెంచారు. ప్రస్తుత డిమాండ్ మేరకు ఇంజక్షన్ల ఉత్పత్తికి ఏడాదికి 1,000 కిలోల లిపిడ్లు అవసరం. కానీ.. ప్రపంచంలో లిపిడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వాటిని దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. వైద్యనిపుణుల్లోను ఆందోళన బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కేంద్రం 9 లక్షల యాంపోటెరిసిన్–బి ఇంజక్షన్లను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 50 వేల వయల్స్‌ను దిగుమతి చేసుకుని.. మే 21 నుంచి 24 మధ్యన 43 వేల వయల్స్‌ను రాష్ట్రాలకు అందజేసింది. ఓ వైపు దిగుమతి చేసుకుంటూనే ఉత్పత్తి సామర్థ్యం పెంచడం ద్వారా డిమాండ్ మేరకు ఇంజక్షన్లను అందుబాటులోకి ఉంచడానికి చర్యలు చేపట్టామని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో నాట్కో ఫార్మాస్యూటికల్స్, ఆలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, గుపిక్ బయోసైన్సెస్, ఎమెక్యూర్ ఫార్మాస్యూటికల్స్, లిక్య సంస్థలకు ఆ ఇంజక్షన్ల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. ఈ 10 సంస్థల ద్వారా దేశీయంగా జూన్ నాటికి 2,55,114 వయల్స్ అందుబాటులోకి వస్తాయి. జూన్‌లో మిలాన్ ల్యాబ్స్ ద్వారా 3.15 లక్షల వయల్స్ దిగుమతి చేసుకుంటామని కేంద్రం చెబుతోంది. వీటితో కలిపి జూన్ నాటికి 5,70,114 ఇంజక్షన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. కానీ.. ఈ ఇంజక్షన్లు ఇప్పటికే బ్లాక్ ఫంగస్ బారిన పడినవారికే సరిపోవని.. ఇకపై నమోదయ్యే కేసుల మాటేమిటని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో బ్లాక్ ఫంగస్ వ్యాధిని గుర్తించి.. యాంపోటెరిసిన్–బి ఇంజక్షన్లను వేయకపోతే మరణాల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రెమ్‌డెసివిర్ మాఫియా ముఠా గుట్టు రట్టు
ఏలూరు టౌన్: కోవిడ్ బాధితుల అత్యవసర వైద్యానికి వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను పక్కదారి పట్టిస్తున్న మరో ముఠాను ఏలూరు పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే నాలుగు ముఠాలను అరెస్టు చేయగా తాజాగా ఏలూరులోని ఆశ్రం కోవిడ్ ఆస్పత్రికి చెందిన 10 మంది సిబ్బందిని బుధవారం అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కె.నారాయణనాయక్ బుధవారం వివరాలు వెల్లడించారు. ఏలూరు ఆశ్రం కోవిడ్ హాస్పిటల్లో ముగ్గురు స్టాఫ్ నర్సులు, నలుగురు టెక్నీషియన్లు, ముగ్గురు సిబ్బంది ముఠాగా ఏర్పడి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను దారి మళ్లిస్తున్నారు. బయట మార్కెట్లో ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.15 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కేసులో ఏలూరు కొత్తపేట నూకాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన స్టాఫ్‌నర్స్ వేల్పూరి రేఖాదేవి, పెదవేగికి చెందిన స్టాఫ్‌నర్స్ గారపాటి సులోచన, దెందులూరుకు చెందిన స్టాఫ్‌నర్స్ చిగురుపల్లి అరుణ, ఏలూరు వెంకటాపురం చెంచుకాలనీకి చెందిన వార్డ్బాయ్ నకినాల రమేష్, ఏలూరు తంగెళ్లమూడి బీడీ కాలనీకి చెందిన డయాలసిస్ టెక్నీషియన్ గూడపాటి రాజేష్, ఏలూరు వెంకటాపురం రామానగర్ కాలనీకి చెందిన డయాలసిస్ టెక్నీషియన్ కెల్లా పూర్ణచంద్రరావు, ఏలూరు జాలిపూడికి చెందిన డయాలసిస్ టెక్నీషియన్ డొల్ల సుధాకర్, ఏలూరు తంగెళ్లమూడికి చెందిన కార్డియాలజీ టెక్నీషియన్ గూడపాటి సురేష్, ఏలూరు కంకణాలవారి వీధికి చెందిన సెక్యూరిటీ గార్డ్ కడగాల అనురాధ, ఏలూరు పవర్‌పేట గంగానమ్మగుడి ప్రాంతానికి చెందిన శీలవలస రమణను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 27 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, రెమ్‌డెసివిర్ ఖాళీ వయల్స్ 15, రూ.1.45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఏలూరులో ‘రెమ్‌డెసివిర్’ ముఠా గుట్టురట్టు
ఏలూరు టౌన్: ప్రభుత్వాస్పత్రి నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు దొంగిలించి.. బయట అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న లావణ్య, రాయల వెంకటలక్ష్మితో పాటు మరో 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 13 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, రూ.40 వేల నగదు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరును కేంద్రంగా చేసుకున్న మూడు ముఠాలు.. కరోనా బాధితులకు అవసరమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డీఎస్పీ దిలీప్‌కిరణ్ నేతృత్వంలో టూటౌన్ సీఐ ఆదిప్రసాద్ బృందం రంగంలోకి దిగింది. పక్కా ఆధారాలతో ఏలూరు జీజీహెచ్‌లో పనిచేసే స్టాఫ్ నర్సులు లావణ్య, రాయల వెంకటలక్ష్మి, ఎంఎన్‌వో బొమ్మకంటి రవి బ్రహ్మయ్య, గోగులమూడి అశోక్‌తో పాటు ఏలూరు కొత్తపేటకు చెందిన విష్ణుసాయికుమార్, కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రేడియాలజిస్ట్ ఏకాంబరేశ్వర అలియాస్ బాబి, విజయవాడ సన్‌రైజ్ ఆస్పత్రిలోని కార్డియాలజీ టెక్నీషియన్ గుమ్మల సాయిబాబు, ఏలూరు సత్రంపాడుకు చెందిన గండేపల్లి సుబ్బారావు, గ్లోబల్ మెడికల్స్‌లో పనిచేసే నారాయణ సాయి మోహన్, సూర్య మెడికల్స్‌లో పనిచేసే ముక్కాల సుధీర్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
‘రెమ్‌డెసివిర్’ల బ్లాక్‌మార్కెట్‌పై నిఘా
సాక్షి, అమరావతి: రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. తమకు వస్తున్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ తనిఖీల్లో పలు విషయాలు బయటపడ్డాయని అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు కిందిస్థాయి సిబ్బందే రెమ్డెసివిర్లు ఎత్తుకెళ్లి.. ప్రైవేటు మెడికల్ షాపులకు అమ్ముతున్నట్టు తేలిందన్నారు. అనంతపురం జిల్లాలో 16 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను పెద్దాసుపత్రిలోని ఇద్దరు సిబ్బంది తీసుకెళ్లి.. రెండు మెడికల్ షాపులకు విక్రయించగా అధికారులు పట్టుకున్నారు. గుంటూరులోనూ ఆస్పత్రి సిబ్బంది బయట అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లోని అన్ని వార్డుల్లో నిఘా పెంచినట్టు ఔషధ నియంత్రణ శాఖ పేర్కొంది. కొందరు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు అధికారుల ద్వారా తెలిసింది. ఖాళీ బాటిళ్లు సేకరించి సెలైన్ నింపి.. మార్కెట్లోకి నకిలీ రెమ్డెసివిర్లు కూడా వచ్చినట్టు ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం అందింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో వాడిన ఒరిజినల్ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల ఖాళీ బాటిళ్లను సేకరించి.. మూతను గమ్‌తో అతికించి తిరిగి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇందులో సెలైన్ లేదా డిస్టిల్డ్ వాటర్ నింపుతున్నట్టు సమాచారం. వీటిని స్టాఫ్ నర్సులు గానీ, డాక్టర్లు గానీ కొద్దిగా పరిశీలిస్తే.. నకిలీవో, ఒరిజినల్‌వో తెలుసుకోవచ్చని ఔషధ నియంత్రణ శాఖ తెలిపింది. ఒరిజినల్ ఇంజెక్షన్‌కు అయితే అల్యూమినియంతో మెషిన్లో చేసిన క్లోజ్డ్ ప్యాకింగ్ ఉంటుందని, నకిలీకైతే గమ్‌తో అతికించినట్టు కనిపిస్తుందని చెప్పారు. ఇంజెక్షన్లు వేసే నర్సులు, వైద్యులు వీటిపై అప్రమత్తంగా ఉండాలని డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు సూచించారు. ప్రతి ఆస్పత్రిపైనా నిఘాపెట్టాం ప్రతి ఆస్పత్రిపైనా, మెడికల్ షాపుపైనా నిఘా పెట్టాం. రెమ్‌డెసివిర్‌లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించినా.. అడ్డదారిలో వాటిని షాపులు కొన్నట్లు వెల్లడైనా తక్షణమే లైసెన్సులు రద్దు చేస్తాం. నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 104కు ఫిర్యాదు చేసినా లేదా డ్రగ్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు చేసినా తక్షణమే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ