నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ జిమ్‌లో 400 మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్‌లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్
కండల కోసం తహతహలాడే వారే టార్గెట్...
సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్‌లలోని కోచ్‌లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు.
తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్‌ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్‌ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్‌నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు.
వినియోగం... ప్రాణాంతకం
ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు.
అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్‌మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment