Drug Control Administration
-
HYD: కోట్ల విలువైన నకిలీ మందుల పట్టివేత
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ శివార్లలో బుధవారం(జనవరి1) భారీగా నకిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.ఏకంగా రూ.2 కోట్ల విలువైన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోంటెక్ ఎల్సీ ట్యాబ్లెట్లతో పాటు పలు మందులను సీజ్ చేశారు. హైదరాబాద్ శివార్లలోని జిన్నారంలో మందుల తయారీ ఫ్యాక్టరీ పెట్టి నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది.ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో నకిలీ మెడిసిన్లతో పాటు కాలం చెల్లిన మందులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మనుషుల పప్రాణాలకు ముప్పుతెచ్చే ఈ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని బాధ్యులపై కేసులు పెడుతున్నారు. -
డీఈఏ చీఫ్ పదవి నాకొద్దు: క్రోనిస్టర్
ఫ్లోరిడా: అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అధిపతి పదవి చేపట్టబోవడం లేదని చాడ్ క్రోనిస్టర్ ప్రకటించారు. ఫ్లోరిడాలోని హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ పదవిలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ‘‘షెరీఫ్గా చేయాల్సింది చాలా ఉంది. అందుకే డీఈఏ పదవి చేపట్టొద్దని నిర్ణయించుకున్నా’’అంటూ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గానీ, ఆయన బృందం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మెక్సికో సరిహద్దు వెంబడి ఫెంటానిల్ అక్రమ ప్రవాహాన్ని నిరోధించేందుకు డీఈఏ చీఫ్‌గా క్రోనిస్టర్ను నామినేట్ చేస్తున్నట్టు ట్రంప్ ఆదివారమే ప్రకటించారు. న్యాయ శాఖలో స్టిస్లో భాగంగా పనిచేసే డీఈఏ డ్రగ్ చట్టాలను అమలు చేస్తుంది. 2020 కోవిడ్ సమయంలో ప్రజారోగ్య ఆదేశాలను విస్మరించారనే అభియోగంపై ఒక పాస్టర్‌ను అక్రమంగా అరెస్టు చేయడం వంటి పలు అభియోగాలు, విమర్శలు క్రోనిస్టర్పై ఉన్నాయి. అటార్నీ జనరల్‌గా ట్రంప్ నామినేట్ చేసిన మాట్ గేట్జ్ కూడా తనకా పదవి వద్దని ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. రక్షణ మంత్రిగా నామినేట్ చేసిన పీట్ హెగ్సెత్ విషయంలో కూడా ట్రంప్ తాజాగా పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. లైంగిక వేధింపులతో పాటు ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. తాజాగా హెగ్సెత్ తల్లి కూడా ఆయనపై పలు ఆరోపణలు చేశారు! ఈ నేపథ్యంలో ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం కష్టమేనని ట్రంప్ బృందం భావిస్తోంది. అందుకే హెగ్సెత్ స్థానంలో రక్షణ మంత్రిగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యరి్థత్వం కోసం ఆయన ట్రంప్‌తో పోటీ పడ్డారు. -
HYD: డ్రగ్ కంట్రోల్ దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: డ్రగ్ కంట్రోల్(డీసీఏ) అధికారులు నగరంలోని మెడికల్ షాపులపై ఆదివారం(నవంబర్17) ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లాల్లోని మెడికల్ షాపులపై ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని గాయత్రి మెడికల్ స్టోర్లలో మందులు సీజ్ చేశారు.1.25 లక్షల విలువగల 45 రకాల మందులు సీజ్ చేశారు. గడువు ముగిసిన మందుల నిల్వలు ఉండడం, అబార్షన్ మెడిసిన్ అనధికారికంగా విక్రయిస్తుండడాన్ని గుర్తించారు. గాయత్రి మెడికల్ షాపు నిర్వహకుడిపై కేసు నమోదు చేశారు.రామంతపూర్‌లోని ఓ మెడికల్ షాపులోనూ నిర్వహించిన తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.కంటి ఇన్ఫెక్షన్ నివారణ కొరకు అమ్ముతున్న నకిలీ మెడిసిన్‌ను సీజ్ చేశారు. -
ప్రాణాలతో చెలగాటమా?
దేశంలోని అత్యున్నత కేంద్రీయ ఔషధ నియంత్రణ అధారిటీ తన తాజా నివేదికలో వెల్లడించిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. మనం తరచూ వాడే మందుల్లో 50కి పైగా ఔషధాల నమూనాలు ‘నిర్ణీత నాణ్యతాప్రమాణాలకు తగినట్టు లేనివి’(ఎన్ఎస్క్యూ) అంటూ నివేదిక వెల్లడించింది. జ్వరం, కడుపులో పూత లాంటి వాటికి వాడే ప్యారాసెటమాల్, పాన్–డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీ బయాటిక్స్ సైతం ఆ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాసిరకం మందులను ఉత్పత్తి చేసినవాటిలో కొన్ని పేరున్న సంస్థల పేర్లూ ఉండేసరికి ఆందోళన రెట్టింపవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యభద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీ యంగా ఔషధాల ఎగుమతిలో అగ్రగామిగా, ‘ప్రపంచానికే మందుల అంగడి’గా భారతదేశానికి గుర్తింపున్న నేపథ్యంలో నాణ్యతపై మనం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదీ 51 ఔషధాలు నాణ్యతా పరీక్షలో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం నిరుడు 1,306 నమూనాలను పరీక్షించినప్పుడు, అది బయటపడింది. నిజానికి, భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం ‘1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం’ కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతుంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు. చట్టప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని ఉత్పత్తుల గురించి ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తారు. కేంద్రీయ ఔషధ నాణ్యతా నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) సర్వసాధారణంగా ఇలా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలనూ – ఆ పరీక్షల్లో తప్పిన మందుల జాబితానూ ఎప్పటి కప్పుడు వెల్లడించడం కచ్చితంగా మంచిదే. అన్ని వర్గాలూ అప్రమత్తమయ్యే వీలు చిక్కుతుంది. అయితే, సామాన్య జనం నిత్యం వాడే యాంటీ బయాటిక్స్, షుగర్, బీపీల మందులు కూడా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల్లో విఫలమవుతున్నట్టు ఇటీవలి నివేదికల్లో వెల్లడవడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రమాణాలు పాటించని జాబితాలోని మందులు ఎక్కువవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సీ విటమిన్, బీ కాంప్లెక్స్ మందులూ నాసి రకమేనని తేలింది. భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు ‘విలీన పరీక్ష’లో, మరికొన్ని ‘నీటి పరీక్ష’లో విఫలమైనట్టు అధికారిక కథనం. నాణ్యత మాట అటుంచితే, కొన్ని బ్యాచ్‌ల ఔషధాలు అచ్చంగా నకిలీవట! ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక, విశ్వ వేదికపై ఔషధ సరఫరాదారుగా భారతదేశ పేరుప్రతిష్ఠలకు భంగకరం కూడా! సహజంగానే పలు మందుల కంపెనీలు తాము తయారు చేస్తున్నవి అన్ని రకాలుగా నాణ్యమైనవేనంటూ ప్రతిస్పందిస్తున్నాయి. నాణ్యత లేకపోవడానికీ – నకిలీ మందులకూ చాలా తేడా ఉందనీ, దాన్ని స్పష్టంగా గుర్తించాలనీ పేర్కొంటున్నాయి. అది నిజమే కానీ, అసలు అనుమానాలే రాని రీతిలో, లోపరహితంగా మందుల తయారీ బాధ్యత ఆ రంగంలో ఉన్న తమదేనని ఆ సంస్థలు మరువరాదు. ఆ మాటకొస్తే, ఈ రంగానికి ఉన్న ప్రతిష్ఠను కాపాడేందుకు ముందుగా అవే చొరవ తీసుకోవాలి. ఔషధ రంగం మన దేశానికి అత్యంత కీలకమైనది. దేశంలో కనీసం 10 వేల దాకా ఔషధ తయారీ యూనిట్లున్నాయి. దాదాపు 200కు పైగా దేశాలకు భారత్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. మన ఔషధ విపణి పరిమాణం దాదాపు 5 వేల కోట్ల డాలర్లు. పైగా సరసమైన ధరలకే మందులు అందిస్తున్న పేరున్న మన మార్కెట్ ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో పురోగమిస్తోంది. కోవిడ్ సమయంలోనే కాక, విడిగానూ అనేక రోగాలకు టీకాలు అందించడంలో భారత్ అగ్రశ్రేణిలో నిలిచిందని పాలకులు పదే పదే చెప్పుకొస్తుంటారు. అలాంటప్పుడు మన దగ్గర తయారయ్యే ఔషధాల నాణ్యతపై మరింత అప్రమత్తత తప్పనిసరి కదా! దురదృష్టవశాత్తూ, అందులోనే మనం వెనుకబడుతున్నాం. గ్యాంబియా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తిన సంగతి విస్మరించలేం. అంటే బయటపడ్డ కొన్ని మందుల విషయంలోనే కాదు... మొత్తంగా ఔషధతయారీ, నాణ్యత, నియంత్రణ వ్యవస్థపై లోతుగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎగుమతి మాట దేవుడెరుగు... ముందుగా ప్రభుత్వాలకైనా, ఔషధ తయారీ సంస్థలకైనా ప్రజారోగ్య భద్రత ముఖ్యం కావాలి. అందులో ఎవరు రాజీపడినా అమాయకుల ప్రాణాలతో చెలగా టమే. అది సహించరానిది, భరించ లేనిది. అందువల్ల నాసిరకమనీ, నకిలీవనీ తెలిసిన మందులను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి రప్పించాలి. అందుకు చట్టం, తగిన విధివిధానాలు లేకపోలేదు. కానీ, వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారన్నది చెప్పలేని పరిస్థితి. అది మారాలి. అలాగే, నాణ్యతా పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడడం కీలకం. పరీక్షల కోసం నమూనాలను ఎప్పుడు తీసుకు న్నదీ, ఎన్ని తీసుకున్నదీ ప్రకటించడం వల్ల మరింత పారదర్శకత నెలకొంటుంది. కొత్త అనుమానా లకు ఆస్కారమివ్వకుండా పోతుంది. విదేశాల్లోనే కాక, ప్రస్తుతం స్వదేశంలోనూ ఔషధాలపై సందే హాలు ముసురుకుంటున్న వేళ ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకొనేలా మన మందుల తయారీ సాగాలి. అవసరమైతే అందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో కలసి అడుగులు వేయాలి. ఇంటా బయటా మన ఔషధాలు ఆరోగ్యభద్రతకు చిరునామా కావాలే తప్ప రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎందుకంటే, మందుల విలువ కన్నా మనుషుల ప్రాణాల విలువ ఎక్కువ! -
HYD: భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో నార్కొటిక్స్ అధికారులు భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. కోఠిలోని స్టెరాయిడ్స్ డిస్ట్రిబ్యూటర్ రాకేష్ షాపులో డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) సోదాలు నిర్వహించారు. బాడీ బిల్డింగ్, జిమ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మియాపూర్‌లోని శ్రీకాంత్ న్యూరో సెంటర్ లోను భారీగా స్టెరాయిడ్స్ పట్టుకున్నారు. రెండు చోట్ల 51 రకాల స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. స్టెరాయిడ్స్ మొత్తం విలువ రూ.3లక్షలుంటుందని నార్కొటిక్ అధికారులు భావిస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల కాలేయ వ్యాధులతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావుకు బిగుస్తున్న ఉచ్చు -
HYD: డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు
సాక్షి, హై దరాబాద్: నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. ప్లేట్లెట్స్, ప్లాస్మా నిల్వ, రక్త సేకరణ పరీక్షల్లో లోపాలున్నట్లు గుర్తించింది. మలక్‌పేట, చైతన్యపురి, లక్డీకపూల్, హిమయాత్ నగర్,సికింద్రాబాద్, కోఠి, మెహదీపట్నం, బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా, సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్ రాఘవేంద్రనాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. -
హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా.. అక్రమంగా బ్లడ్, ప్లాస్మా అమ్మకం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా బ్లడ్ ,ప్లాస్మా సీరం అమ్ముతూ.. మనుషులు ప్రాణాలతో చెలగాటమడుతోంది. తాజాగా మనుషుల రక్తం, ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు జరిపారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్‌లో తనిఖీలు నిర్వహించారు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్‌లోనూ డ్రగ్ అధికారుల దాడులు చేపట్టారు. ముసాపేట బాలాజీనగర్‌లోని హీమో ల్యాబొరేటరీస్‌లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా బ్లడ్, స్లాస్మా, సీరం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా హ్యూమన్ ప్లాస్మాలను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా, సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో రూ, వేలకు అమ్ముతున్నట్లు తేలింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కేటుగాళ్లు ఈదందా సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు -
రక్తం, ప్లాస్మా ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ బ్లడ్ బ్యాంకుపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వచేస్తున్నట్టు గుర్తించారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు కీలక వివరాలు సేకరించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి మానవ రక్తం, ప్లాస్మా, సీరం అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటన, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్లాస్మా, సీరం రీప్యాకింగ్ చేసి.. డీసీఏ అధికారులు శుక్రవారం మూసాపేట్ భవానీనగర్‌లోని ఓ రెసిడెన్షియల్ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ’హేమో సర్విస్ ల్యాబోరేటరీస్’లో సోదాలు చేపట్టారు. భారీగా హ్యూమన్ ప్లాస్మా బ్యాగులను గుర్తించారు. అదే ఆవరణలో ఉన్న ఫ్రీజర్లలో సీసాల్లో నిల్వ చేసిన సీరం, మానవ రక్తం గుర్తించారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ దీనిని నడుపుతున్నట్టు గుర్తించారు. నాయక్ ఎనిమిదేళ్లుగా ప్లాస్మాను సేకరిస్తున్నట్టు కనుగొన్నారు. అనధికారిక పద్ధతుత్లో వివిధ బ్లడ్ బ్యాంక్‌ల నుంచి రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఉన్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారు ఉల్ షిఫాలోని అబిద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్‌లో ఉన్న ఆర్ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్టు డీసీఏ అధికారుల వద్ద రాఘవేంద్ర నాయక్ అంగీకరించారు. రూ.700కు కొని రూ.3,800కు విక్రయం తెలంగాణ, ఏపీలోని పలు బ్లడ్ బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్ రక్తాన్ని రూ.700కు కొని రూ.3,800 వరకు విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. ఇలా రాఘవేంద్ర 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఆక్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పుణేలోని క్లినోవి రీసెర్స్ ప్రై.లిమిటెడ్, బెంగళూరులోని జీ7 సినర్జీస్ ప్రై.లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్విసెస్ ప్రై.లిమిటెడ్, ఐడీఏ మల్లాపూర్‌లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనగూడలోని జెన్‌రైస్ క్లినికల్ ప్రై.లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్‌లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సోదాల్లో భాగంగా హెచ్ఐవీ, ఇతర టెస్టింగ్ కిట్లు, పలు డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎన్.సహజ, ఎం చంద్రశేఖర్, పి.సంతోష్ సీహెచ్ కార్తీక్ శివచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మందులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: నకిలీ మందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విజ్ఞప్తి చేసింది. నకిలీ మందులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయని, ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడంలో భాగంగా పలు సూచనలు చేసింది. ► ప్రజలను మోసం చేయడానికి కొన్ని ప్రముఖ బ్రాండ్లను పోలి ఉండేలా నకిలీ మందులు తయారు చేస్తున్నారు. వీటిలో అవసరమైన పదార్థాలేవీ ఉండవు. సుద్ద, మొక్కజొన్న పిండి లేదా బంగాళాదుంప పిండి మొదలైనవి కలిగి ఉన్నట్టు తమ పరిశీలనలో వెల్లడైనట్టు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ► నకిలీ మందులు రోగి ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. ఇవి వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా, కాలక్రమేణా రోగికి వినాశకరమైన పరిణామాలు సృష్టిస్తాయి. ► కొన్ని నకిలీ మందులు చూడటానికి అసలు ఉత్పత్తికి దాదాపు సమానంగా ఉంటాయి. వాటిని గుర్తించడం కష్టం. అనుమానిత నకిలీ ఔషధం, అసలైన ఔషధం మధ్య తేడాలను గుర్తించడానికి అనుమానాస్పద ఉత్పత్తిని అదే కంపెనీకి ముందు ఉపయోగించిన ఉత్పత్తితో సరిపోల్చండి. మునుపటి ప్యాకేజింగ్‌తో సరిపోల్చడానికి ప్రయత్నించండి. అనుమానం వస్తే భవిష్యత్‌లో పోలిక కోసం మీరు ఉత్పత్తిని తరచుగా ఉపయోగిస్తుంటే దయచేసి దాని ఫొటోగ్రాఫ్ తీసుకోండి. మందులు కచ్చితత్వంతో తయారు చేస్తారు. కాబట్టి పరిమాణం, బరువు, రంగు, నాణ్యతలో ఏదైనా వైవిధ్యం నకి లీని సూచిస్తుంది. స్పెల్లింగ్ తప్పులు లేదా వ్యాకరణ దోషాలు ఉంటాయి. త యారీ తేదీ, గడువు తేదీని తనిఖీ చేయండి. టాబ్లెట్లు బాటిల్లో ఉంటే అన్ని టాబ్లెట్లు ఒకేలా కనిపించాలి. మాత్రలు చిప్ లేదా పగుళ్లు లేదా తప్పు పూత కలిగి ఉంటే, ఆ ఉత్పత్తులను కూడా అనుమానాస్పదంగా పరిగణించాలి. ► పేరున్న కంపెనీలతో ఉత్పత్తి ధరను తనిఖీ చేయండి. ఇది మరింత చౌకగా లేదా భారీ తగ్గింపుతో అందిస్తే అది నకిలీ ఉత్పత్తి కావొచ్చని అనుమానించాలి. కేంద్ర ప్రభుత్వం 300 ప్రముఖ బ్రాండ్ పేర్లను గత ఆగస్టు తర్వాత తయారు చేసింది. దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్‌పై బార్కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంటుంది. ప్యాకేజింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ► మెడికల్ షాపులో కొనుగోలు చేసిన మందుల బిల్లులను పట్టుబట్టి తీసుకోవాలి. వెబ్సైట్లు లేదా ఇతర ఇంటర్నెట్ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మందులు కొనుగోలు చేయవద్దు. లైసెన్సు ఉన్న మెడికల్ షాపుల నుంచి మాత్రమే మందులను కొనుగోలు చేయాలి. నకిలీ మందుల వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 18005996969కు ఫోన్ చేసి చెప్పవచ్చు. నకిలీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చేందుకు.... మార్కెట్లో నకిలీ డ్రగ్స్ తరలింపును గుర్తించేందుకు పలుచోట్ల తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. నకిలీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చడానికి అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్లో బొల్లారంలోని ఒక గోడౌన్లో కేన్సర్ నిరోధక మందులు( నకిలీవి) స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని కాశీపూర్, ఉత్తరాఖండ్, ఘజియాబాద్ నుంచి రాష్ట్రంలోకి నకిలీ డ్రగ్స్ ప్రవేశానికి సంబంధించిన నకిలీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. అధికారులు జరిపిన దాడుల్లో నకిలీ డ్రగ్స్‌ని గుర్తించి, స్వాధీనం చేసుకున్న నకిలీ మందుల్లో సన్ ఫార్మా (అధిక కొలెస్ట్రాల్ చికిత్సలో ఉపయోగించే రోసువాస్ 10 టాబ్లెట్లు) వంటి ప్రముఖ కంపెనీల పేర్లతో తప్పుడు లేబుల్లు ఉన్నాయి. -
హైదరాబాద్‌లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు
-
జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదీ చదవండి: Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్! -
సరైన ‘నియంత్రణ’తోనే దివ్యౌషధం
భారత్‌లో తయారైన మందులు తీసుకోవడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో కొంతమంది మరణించినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దేశ ఫార్మా రంగంలో నాణ్యతా ప్రమాణాలపై సర్వే ప్రారంభించింది. విమర్శకులు చాలాకాలం నుంచి చేస్తున్న ఆరోపణలు కఠిన వాస్తవమని ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికీ స్పష్టంగా తెలిసింది. దీనివల్ల వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వ సంస్థల కళ్లు విచ్చుకున్నాయని చెప్పాలి. లేదా చాలాకాలంగా తెలిసిన విషయాలను వీరు అసలు పట్టించుకోలేదని అయినా అనుకోవాలి. సర్వే చెప్పిన అంశాల్లో ఒకటి – దేశంలో నాణ్యత ప్రమాణాలను పాటించడంపై అస్సలు శ్రద్ధ లేదు అన్నది. నిబద్ధత, తగిన శిక్షణ లేకపోవడం అన్నవి సరేసరి. నాణ్యతా ప్రమాణాల లోపాల ఫలితంగానే నాసిరకం ఔషధాలు భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. మందులు చౌకగా లభిస్తాయన్న ఢంకా బజా యింపునకూ ఇవే కారణాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ఇంకా మొదలు కావాల్సి ఉన్నా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సర్వే జరపడమే కొంత ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు ఇప్పుడు ఒక్కతీరుగా ఆలోచించడం మొదలుపెట్టాయి. చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన చర్యలపై స్పష్టతా ఏర్పడింది. మితిమీరిన జోక్యం... దేశ ఫార్మా రంగాన్ని పట్టిపీడిస్తున్న అంశం ఏదైనా ఉందీ అంటే అది మితిమీరిన ప్రభుత్వ జోక్యమనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన పలు సంస్థలు ఫార్మా రంగంలో జోక్యం చేసుకుంటూంటాయి. ఈ క్రమంలో ఎవరికి వారు తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూంటారు. తద్వారా అసలు ప్రయోజనం దెబ్బతింటూ ఉంటుంది. స్థానికంగా తయారయ్యే మందులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లైసెన్సులు జారీ చేస్తూంటాయి. దీనివల్ల చాలా మందుల నాణ్యత అనేది రాష్ట్రాన్ని బట్టి మారిపోతూంటుంది. ఫార్మా రంగంపై నియంత్రణ సుస్పష్టంగా ఉన్నప్పుడే నాణ్యతను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. నాణ్యమైన మందులు లేకపోతే ఈ ఆధునిక యుగంలో మరింత ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలోనూ ఫార్మా రంగం ప్రాముఖ్యత ఏమిటన్నది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. భారత్‌కు ప్రపంచ ఫార్మా రాజధాని అనే పేరుంది. జెనెరిక్ మందులతో అన్ని దేశాల్లోనూ అవస రార్థులకు మందులు (పేటెంట్ హక్కులు లేనివి) అందుబాటులో ఉండేందుకు కారణమైంది భారత్! ప్రాణాంతక హెచ్ఐవీ నియంత్రణలో ఈ జెనెరిక్ ఔషధాలది చారిత్రాత్మక పాత్ర. భారతీయ ఫార్మా కంపెనీల జెనెరిక్ ఉత్పత్తుల్లేకపోతే ఈ రోజు అమెరికా సహా పలు దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. చరిత్రను తరచి చూస్తే... భారతీయ ఫార్మా రంగం సాధించిన ఘన విజయాలకు ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. 1970లలో ప్రాసెస్ పేటెంట్లకు కట్టుబడుతూనే... ప్రాడక్ట్ పేటెంట్లకు భారత్ ‘నో’ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏర్పాటు వల్ల పశ్చిమ దేశాల్లో పేటెంట్ హక్కులున్న ఖరీదైన మందులను కూడా ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా చౌకగా తయారు చేసే వీలేర్పడింది. ఫలితంగానే భారత్ మోతాదుల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫార్మా పరిశ్రమగా అవతరించగలిగింది. విలువ ఆధారంగా చూస్తే మాత్రం మనది 14వ స్థానం. భారత ఫార్మా రంగం మార్కెట్ విలువ 5,000 కోట్ల డాలర్లు కాగా ఇందులో సగం ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ప్రపంచ టీకా డిమాండ్‌లో 60 శాతాన్ని భారత్ పూరిస్తోందంటే పరిస్థితి ఏమిటన్నది తెలుస్తుంది. అమెరికా జెనెరిక్ మందుల డిమాండ్‌లో 40 శాతం భారత్ ద్వారా తీరుతోంది. యూకే ఔషధా లన్నింటిలో 25 శాతం ఇక్కడి నుంచే వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌లో తయారయ్యే మందుల నాణ్యతపై ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కారాదు. ఈ రకమైన నమ్మకం ఉన్నందునే గాంబియాలో మన మందుల వాడకం వల్ల పిల్లలు కొందరు మరణించారన్న వార్త కలకలం రేపింది. ఆ వెంటనే ఉజ్బెకిస్తాన్,శ్రీలంక... చివరకు అమెరికా నుంచి కూడా ఇదే రకమైన ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత దిగజారేలా చేసింది. మనకు మాత్రం నష్టం లేదా? మందుల కంపెనీల్లో చాలా సందర్భాల్లో కల్తీలను గుర్తించేందుకు అవసరమైన పరికరాలు, తగిన అర్హతలున్న సిబ్బంది కొరత ఉంటుంది. డైఎథిలీన్ గ్లైకాల్ వంటివి అంధత్వానికి కారణమవుతాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎగుమతుల కోసం ఉద్దే శించిన అన్ని దగ్గుముందులను ప్రభుత్వ పరిశోధన శాలల్లో పరీక్షించాలని ఒక ఆదేశం జారీ చేసింది. కానీ ఇదేమంత సత్ఫలితాలు చూపలేదు. ఎందుకంటే ఫార్మా విషయాలను వాణిజ్య శాఖ పర్యవేక్షించే పరిధి లేకపోవడం. అంతేకాకుండా... వాణిజ్య శాఖ ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తింది. అదేమిటంటే, ఇలాంటి కల్తీ దగ్గు మందుల కారణంగా భారతీయ రోగులకు హాని జరగడం లేదా అని! జమ్మూలో అదే జరిగింది. 2019 డిసెంబరు 2020 జనవరి మధ్య కాలంలో కల్తీ దగ్గుమందు వేసుకోవడం వల్ల దాదాపు 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇంకో చిత్రమైన ఘటన జరిగింది. 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ స్థానంలో డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మోటిక్స్ బిల్ 2023ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. ఇప్పు డున్న వివాదాస్పద అంశాలు వేటికీ ఇందులో చోటు లేకుండా పోయింది. ఫార్మా రంగం సంస్కరణలు లక్ష్యంగా తీసుకొచ్చే ఏ కొత్త చట్టమైనా లైసెన్సింగ్ ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఔషధ నియంత్రణ ఏకరీతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం 28 రాష్ట్రాల్లో డ్రగ్ రెగ్యులేటర్స్ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ఒక్క డ్రగ్ రెగ్యులేటింగ్ వ్యవస్థ... ఈ వ్యవస్థకు సలహా సూచనలు అందించేందుకు రెండు స్టాట్యుటరీ వ్యవస్థలు ఉంటే సరిపోతుంది. డ్రగ్ కంట్రోలర్ కార్యాలయం కూడా స్వతంత్ర సంస్థగా ఉండాలి. దీనివల్ల మంత్రుల ఆమోదం లేకుండానే డ్రగ్ కంట్రోలర్ అవసర మైనప్పుడు నిపుణులను నియమించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే వ్యతిరేక పవనాలు... ఫార్మా రంగానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఫార్మా దిగుమతుల విషయంలో అమెరికా కొన్ని కఠిన మైన చర్యలకు సిద్ధమవుతోంది. భారతీయ ఫార్మా కంపెనీలకు నాణ్యత విషయంలో ఇప్పటికే అగ్రరాజ్యం బోలెడన్ని సార్లు హెచ్చ రికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం కీలకం కానుంది. ఆఫ్రికా దేశాలు కొన్ని కూడా అమెరికా మాదిరిగానే ఆలోచిస్తూండటం గమనార్హం. ఇంకో ముఖ్య విషయం... ఫార్మా రంగ పరీక్షలకు సంబంధించి అందరికీ అందుబాటులో ఉండేలా ఒక ఐటీ వేదిక సృష్టి వెంటనే జరగాలి. గత సమాచారం, ప్రస్తుత పరిణామాలన్నింటికీ ఈ వేదిక ఒక రెఫరెన్ ్స పాయింట్లా ఉండాలి. పరిశ్రమ వర్గాలతోపాటు నియంత్రణ సంస్థలు, ఈ అంశంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈ వేదికను ఉపయోగించుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరచు కోవచ్చు. ఆన్ లైన్ ప్రభుత్వ సేవల రంగంలో భారత్‌కు ఉన్న అను భవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత పెద్ద సంగతి కానేకాదు. ఫార్మా రంగ సంస్కరణల విషయంలో వాంఛనీయమైన పరిణామం ఏదైనా ఉందంటే అది ఇటీవలి కాలంలో సంబంధిత మంత్రి చేసిన ఒక ప్రకటన. ‘‘ఫార్మా రంగ నియంత్రణ అనేది సహ కార సమాఖ్య తీరులో సాగాలి’’ అన్న ఆయన మాటలు ఆచరణలోకి వస్తే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడమే కాకుండా... ఒకరికి ఒకరు ఆసరాగా నిలవడం ద్వారా మరింత బలోపేతం కావచ్చు కూడా. పార్టీల మధ్య తీవ్రమైన వైరం నెలకొన్న... త్వరలోనే పార్లమెంటరీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్న నేపథ్యంలో ఈ మాత్రం మార్పు ఆహ్వానించదగ్గదే! సుబీర్ రాయ్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నాణ్యతలేని మందులకు కళ్లెం..
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో నాణ్యమైన మందులే ప్రజలకు అందేలా అనేక చర్యలు చేపట్టింది. ప్రమాణాల మేరకు లేని మందులను లేకుండా చేసేందుకు నాలుగున్నరేళ్లుగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా జాతీయస్థాయితో పోలిస్తే మన రాష్ట్రంలో నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ఎస్క్యూ) మందులు తక్కువగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా సగటున 4% ఎన్ఎస్క్యూ మందులు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ఈ మందుల శాతం 1.55 మాత్రమే. ఇంటెలిజెంట్ శాంపిలింగ్ విధానం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటి వరకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ అభీష్టం మేరకు మందుల షాపులు, తయారీ యూనిట్లను ఎంచుకుని తనిఖీ చేసేవారు. మూసధోరణిలో సాగే ఈ విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వస్తిపలికింది. ఇంటెలిజెంట్ శాంపిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తనిఖీలు, శాంపిళ్ల సేకరణలో అధికారుల జోక్యాన్ని తగ్గించి ర్యాండమ్‌గా తనిఖీల నిర్వహణ, ఇంటెలిజెంట్ శాంపిలింగ్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ యాప్‌ను రూపొందించారు. ఈ విధానంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ పరిధిలోని ఏ షాప్‌లో తనిఖీ చేయాలనే విషయమై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో అలర్ట్ వెళుతుంది. యాప్ సూచించిన షాపు, తయారీ యూనిట్లో తనిఖీలు నిర్వహించి, రిపోర్టులను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు శాంపిళ్ల సేకరణలో 10కి పైగా ప్రమాణాలతో ఎస్వోపీ రూపొందించారు. మార్కెట్లో ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులు, అసాధారణంగా ధరలు ఎక్కువ/తక్కువ ఉండటం.. ఇలా వివిధ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని శాంపిళ్లు సేకరించి విశ్లేషణకు లే»ొరేటరీలకు పంపుతున్నారు. నిరంతర నిఘా రాష్ట్రంలో 353 మందుల తయారీ యూనిట్లు, 213 బ్లడ్ బ్యాంకులు, 132 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు, 44,973 హోల్‌సేల్, రిటెయిల్ మందుల షాపులు ఉన్నాయి. నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తయారీ సంస్థలు, హోల్‌సేల్, రిటెయిల్ మందుల షాపులపై ఔషధ నియంత్రణ విభాగం నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు మందుల షాపుల్లో 12,686, మందుల తయారీ యూనిట్లలో 243 తనిఖీలు చేసింది. వాటిలో 3,015 నమూనాలను సేకరించి విశ్లేషించింది. ఈ విశ్లేషణలో 47 నమూనాలు (1.55%) ఎన్‌ఎస్‌క్యూగా తేలింది. ఎన్‌ఎస్‌క్యూగా తేలిన ఘటనల్లో అధికారులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా ఈ ఏడాదిలో ఇప్పటికి 16 కేసుల్లో దోషులకు కోర్టు శిక్ష విధించింది. -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ జిమ్‌లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్‌లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్‌లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్‌ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్‌ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్‌నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
ఔషధ విక్రయాల్లో అక్రమాలను అరికట్టాలి
సాక్షి, అమరావతి: ఔషధాల క్రయవిక్రయాల్లో అవకతవకలు, నకిలీ, నాణ్యత లేని మందుల చెలామణి, మెడికల్ షాపుల్లో అక్రమాలను అరికట్టడానికి డీజీ స్థాయిలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఔషధ నియంత్రణా విభాగంపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔషధ నియంత్రణా విభాగం మరింత సమర్థంగా పనిచేయాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీకి నివేదిక తయారుచేయాలని చెప్పారు. కేంద్ర ఔషధ నియంత్రణ శాఖకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులకు లేఖ రాయాలన్నారు. సీఆర్‌యూ ఫిర్యాదుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యశాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ డీజీ కొల్లి రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: పలు మెడికల్ షాపుల లైసెన్స్ లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెడికల్ దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్‌షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అధిక ధరలు, నాణ్యత లేని మందుల అమ్మకాలను గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న పలు మెడికల్ దుకాణాల లైసెన్స్‌లను శాశ్వతంగా, మరికొన్నింటికి తాత్కాలికంగా రద్దు చేశారు. ఇందర్‌బాగ్ కోటిలోని గణేష్ ఫార్మాసూటికల్స్, అంబర్‌పేట బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్, నాంపల్లి సర్దార్ మెడికల్ హాల్, అక్షయ మెడికల్ అండ్ జనరల్ స్టోర్, హైదరాబాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్(నాంపల్లి), లంగర్‌హౌజ్‌లోని ఆర్ఎస్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, చార్మినార్ భారత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, హుమాయూన్‌నగర్ అల్-హమ్రా మెడికల్ అండ్ జనరల్ స్టోర్.. ఉప్పల్ శ్రీ అయ్యప్ప మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, గౌలిగూడ గోకుల్ మెడికల్ షాప్, చార్మినార్ మీరా మెడికల్ షాప్, మంగర్బస్తీ లైఫ్ ఫార్మా.. ఇలా పలు మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ చర్యలు తీసుకుంది. వీటిలో కొన్నింటి లైసెన్స్‌లను తాత్కాలికంగా, మరికొన్నింటిని లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసింది. ఇదీ చదవండి: గట్టు కోసం గొడళ్లతో గొడవ -
ఐఐఎల్ మీజిల్స్–రూబెలా టీకాకు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీజిల్స్–రూబెలా టీకా తయారీకి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ల నుంచి అనుమతులు లభించినట్లు ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ (ఐఐఎల్) తెలిపింది. ఇండో–వియత్నాం భాగస్వామ్యంతో దీని తయారీ, మార్కెటింగ్ హక్కులను దక్కించుకోవడం సాధ్యపడినట్లు వివరించింది. ఇందుకోసం వియత్నాంకు చెందిన పాలీవాక్ సంస్థతో జట్టు కట్టినట్లు ఐఐఎల్ ఎండీ కె. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం మీజిల్స్ టీకాకు సంబంధించిన భాగాన్ని పాలీవాక్ అందించనుండగా, రూబెల్లా టీకా భాగాన్ని ఐఐఎల్ స్వంతంగా తయారు చేసి సంయుక్తంగా ఎంఆర్ వేక్సిన్‌ను రూపొందిస్తుంది. -
ఔషధ నియంత్రణపై రెండు నాలుకలు
దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణీలో ఉన్నాయన్న కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యలు బయటికి పొక్కడం కలకలం రేపింది. మళ్లీ ఆయనే అధికారిక సమావేశాల్లో నాణ్యమైన ఔషధాలు తయారవుతున్నాయని నొక్కిచెప్పారు. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమాలున్న మందులూ దొరుకుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. ఉజ్బెకిస్తాన్, గాంబియా... రెండు వేర్వేరు దేశాల్లో సుమారు 70 మంది పిల్లలు కల్తీ దగ్గుమందు కారణంగా మరణించారు. ఇటీవలి కాలంలో సంభవించిన ఈ దుర్ఘటనకు కారణమైన దగ్గు మందు సరఫరా అయ్యింది మన దేశం నుంచే. కొన్ని వారాల క్రితం నోయిడా పోలీసులు ఉజ్బెకిస్తాన్ మరణాలకు సంబంధించి ముగ్గురు ఫార్మా కంపెనీ ఉద్యోగులను అరెస్ట్ చేయగా... కొన్ని నెలల క్రితం గాంబియా ఘటనకు సంబంధించి దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ రెండు కేసుల్లోనూ దగ్గుమందులో విషపూరిత రసాయనాలు కలిసి ఉండటం గమనార్హం. గాంబియా ఘటనలను ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం దృష్టికి తెచ్చింది. భారత్ నుంచి ఎగుమతి అయిన దగ్గు ముందులో గుర్తించిన డైఎథిలీన్ గ్లైకోల్ (డీఈజీ) కారణంగా మూత్ర పిండాలు పనిచేయకుండా పోయి పిల్లలు మరణించినట్లు అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ కూడా ఈ వారమే ధ్రువీకరించింది. ఈ ఘటనలకు కేంద్ర ఆరోగ్య శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, ఫార్మా స్యూటికల్ డిపార్ట్మెంట్ల స్పందన అంతంత మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గాంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో లోపాలపై దృష్టి పెట్టాయి కానీ... ఆయా సంస్థలు గుర్తించిన అంశాల జోలికి ఇవి పోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇవ్వకపోవడాన్ని విమర్శించి ఉరకున్నాయి. ఆరోగ్య శాఖ నెపం మొత్తాన్ని గాంబియాపై నెట్టేసింది. దిగుమతి చేసుకునేటప్పుడు పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని తేల్చేసింది. అంతటితో ఆగకుండా... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్కో కేసులో మరణానికీ, ఔషధానికీ ఉన్న సంబంధాన్ని వివరించలేదని వ్యాఖ్యానించింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే... గాంబియా కొన్ని కేసుల్లో శవపరీక్షలు కూడా నిర్వహించి డీఈజీ అవశేషాలను గుర్తించిందని! అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా ఈ ఘటనలన్నింటినీ భారత ఔషధ పరిశ్రమను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగానే పరిగణించడం! గత నెల 24న వంద భాగస్వామ్య దేశాల భారత దౌత్యవేత్తలు పాల్గొన్న సమావేశంలోనూ మాండవియా దేశంలో నాణ్యమైన మందులు తయారవుతున్నాయని నొక్కి చెప్పడం ఇక్కడ ప్రస్తావించ దగ్గ అంశం. కేంద్ర ఆర్యోగ శాఖ మంత్రి ప్రకటనల్లో ద్వంద్వ ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జరిగిన ఓ రహస్య సమావేశంలో దేశంలో మందుల నియంత్రణ దుఃస్థితిని ఆయన నేరుగా అంగీకరించారు. ‘‘దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణిలో ఉన్నాయి. కల్తీ మందులు ఎగుమతి అవుతున్నాయి కూడా. దీనివల్ల ఫార్మా రంగం విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని ఒప్పు కొన్నారు. ఈ దుఃస్థితికి అధికారులే కారణమని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘ఫార్మా రంగానిదే బాధ్యత. కానీ అంతకంటే ముందు ఇది మన బాధ్యత’’ అని ఆయన అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియంత్రణ వ్యవస్థల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ‘‘ఇది చురుకుగా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వ యమూ కొరవడుతోంది’’ అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అంచనా ప్రకారం, ప్రస్తుత నియంత్రణ వ్యవస్థ కేంద్ర, రాష్ట్రాల సంస్థలు, ఫార్మాస్యూటికల్ విభాగాల పేరుతో ముక్కలు ముక్కలుగా ఉంది. మాండవియా ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది. ఆ తరువాత ఆగిపోవడమే కాకుండా... అప్పటివరకూ రికార్డయిన వీడియోను కూడా ఛానల్ నుంచి తొలగించారు. అయితే వీడియో తొలగించినంత మాత్రాన విషయం బయ టకు పొక్కకుండా ఉంటుందా? నిపుణులు ఎంతో కాలంగా చెబుతున్న విధంగానే నియంత్రణ సంస్థల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లేని, కల్తీ, నకిలీ మందులు భారతీయ మార్కెట్లో చలామణి అవుతున్నట్లు అందరికీ అధికారికంగా తెలిసిపోయింది. ఇలాంటి మందులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నట్లు... దుష్ఫలితాలూ వాటివల్లనే అన్న విషయమూ స్పష్టమైంది. మంత్రి ప్రకటనను బట్టి చూస్తే దేశ ఫార్మా రంగం దుఃస్థితికి కారణాలు ఆయనకూ తెలుసన్నమాట. మరి ఇదే నిజమైతే ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏం చేస్తున్నట్లు? గాంబియా, ఉజ్బె కిస్తాన్ ఘటనలపై వ్యతిరేక నివేదికలు వచ్చినప్పుడు బహిరంగంగా ఫార్మా రంగాన్ని, నియంత్రణ వ్యవస్థలకు మద్దతుగా మాట్లాడటం ఎందుకు? ఈ రెండు నాల్కల ధోరణిని వదిలిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో కూడిన వ్యవహారం. దేశ ఫార్మా రంగ నియంత్రణ సంస్థల్లోని అకృత్యాలు ఇప్పుడు కొత్తగా తెలిసినవి ఏమీ కాదు. 2012లోనే ఒక పార్లమెంటరీ కమిటీ సీడీఎస్సీఓ పనితీరుపై విచారణ జరిపి, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న అక్రమాలను బయటపెట్టింది. దురదృష్టవశాత్తూ అప్పటినుంచి ఇప్పటివరకూ జరిగిన మార్పు స్వల్పమే. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులు కాగితానికే పరిమితమైపోయాయి. ప్రభుత్వాలు కూడా ఈ రంగాన్ని సంస్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేయలేకపోయాయి. ఇంకోవైపు ఫార్మా పరిశ్రమ ఎదుగుదలకు నియంత్రణ వ్యవస్థలు ప్రతిబంధకంగా మారుతున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దేశ ఫార్మా మార్కెట్ సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ మొత్తం పది లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చునని కూడా ఆయన అంచనా కట్టారు. ఇది కచ్చితంగా మంచి లక్ష్యం. కానీ భద్రత, సామర్థ్యం, మందుల ప్రమాణాలతో రాజీపడి సాధించడం ఎంతమాత్రమూ సరికాదు. స్థానిక మార్కెట్ అయినా, విదేశీ మార్కెట్ అయినా వీటిని పాటించడం అవసరం. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వా లన్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమా లున్న మందులూ దొరుకుతున్నాయి. వేర్వేరు బ్రాండ్లు ఉండటంతో వైద్యులను ఆకర్షించేందుకు కంపెనీలు అనైతిక మార్కెటింగ్ కార్య కలాపాలకూ దిగుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచి నంతమాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. నిజానికి జన ఔషధి కేంద్రాల స్థాపన ఆలోచన మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ది. 2005లోనే ఆయన యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కేంద్రాల ఏర్పాటును ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఔషధ కంపెనీల నుంచి జెనెరిక్ మందులను ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన సంకల్పించారు. ఈ ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీల్లో అత్యధికం ఇప్పుడు పనిచేయడం లేదు. లేదా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి, సమస్య పరిష్కా రానికి బహుముఖ వ్యూహం అవసరం. దేశంలోని నియంత్రణ వ్యవస్థ లను గాడిలో పెట్టడంతో మొదలుపెడితే సరైన దిశలో ముందడుగు వేసినట్లు అవుతుంది! వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘యాంటిబయోటిక్స్’కు బ్రేకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యాంటిబయోటిక్ మందుల అతి వినియోగాన్ని నియంత్రించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా మందుల దుకాణాల్లో ఈ మందుల విక్రయానికి కళ్లెం వేయాలని నిర్ణయించింది. యాంటీబయోటిక్స్ అతి వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం.. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. వైద్యులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల దుకాణాలకు వెళ్లి సమస్య చెప్పగానే ఈ మందులు ఇచ్చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం వీటి వినియోగం మరింత పెరిగింది. అధికశాతం మందుల దుకాణాల్లో వీటి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ తరహాలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాపుల్లో జరిగే యాంటిబయోటిక్స్ విక్రయాలపై ఔషధ నియంత్రణ విభాగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే హెచ్చరికలు జారీ డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ హెచ్, హెచ్ 1లో ఉండే మందులను దుకాణాల్లో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. వీటిలో యాంటిబయోటిక్స్ కూడా ఉంటాయి. అందువల్ల షెడ్యూల్ హెచ్, హెచ్ 1 మందుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే ఔషధ నియంత్రణ విభాగం అధికారులు మందుల దుకాణాల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను విక్రయిస్తూ తనిఖీల్లో పట్టుబడినా, ఆధారాలతో ఫిర్యాదులు వచ్చినా నెల రోజుల పాటు లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, శాశ్వతంగా అనుమతులు రద్దు కూడా చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి షెడ్యూల్ హెచ్, హెచ్1 మందుల విక్రయాలపై నిఘా ఉంచుతున్నారు. రాష్ట్రంలో 42వేల హోల్‌సేల్, రిటైల్ మందుల దుకాణాలు ఉన్నాయి. మందులపై ఉన్న బ్యాచ్ నంబర్ల ఆధారంగా హోల్‌సేలర్ నుంచి ఏ మందులు ఏ రిటైల్ దుకాణానికి వెళ్లాయి, అక్కడ వాటి విక్రయాలు, రికార్డులు ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు మందుల దుకాణాల్లో ఫార్మాసిస్ట్‌ల అందుబాటు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు హెచ్, హెచ్1 మందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మందుల వినియోగంపై ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. వైద్యుడి సూచన లేకుండా మందుల దుకాణాల్లో యాంటిబయోటిక్ ఇస్తే ప్రశ్నించాలి. – ఎస్. రవిశంకర్ నారాయణ్, డీజీ ఔషధ నియంత్రణ విభాగం -
ఔషధ నియంత్రణ కార్యాలయాలు ప్రారంభం
గుంటూరు (మెడికల్): ఇప్పటివరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖకు సొంత భవనాలు సమకూరాయి. గుంటూరులో రూ.1.30 కోట్లతో నిర్మించిన ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ ఉపసంచాలకుల కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నిర్మించిన 12 ఔషధ నియంత్రణ కార్యాలయాలను అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖకు రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి 27 నూతన భవనాలు నిర్మిస్తున్నామని, తొలివిడతగా రూ.6.50 కోట్లతో నిర్మాణం పూర్తయిన 12 భవనాలను ప్రారంభించామని తెలిపారు. నకిలీ మందులు, కాలం చెల్లిన మందులు మార్కెట్లో లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, జెడ్పీ చైర్మన్ కత్తెర హెని క్రిస్టినా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ ఎస్.రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి. లక్ష్మణ్ పాల్గొన్నారు. -
మందులా... మృత్యు గుళికలా!
ఒకే రోజు రెండు విషాద వార్తలు! రెండూ పసిపిల్లలకు సంబంధించినవే. థాయ్‌లాండ్‌లోని శిశు సంరక్షణాలయంపై ఉన్మాది బుల్లెట్లు కురిపించి 37 మంది ప్రాణాలు తీశాడు. మన దేశానికి చెందిన మేడెన్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఉత్పత్తి చేసిన మందుల కారణంగా ఆఫ్రికా ఖండ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు గత నెలలో ప్రాణాలు కోల్పోయారు. మారణాయుధంతో పసికూనలపై విరుచుకుపడిన రాక్షసుడికీ... కేవలం లాభార్జన కాంక్షతో కలుషిత ఉత్పత్తులకు ఔషధమన్న ముద్రేసి అంటగట్టిన సంస్థ యజమానులకూ తేడా ఏమీ లేదు. కొన్ని ఔషధ సంస్థల టక్కుటమార విద్యలపైనా, వాటి ఉత్పత్తులపైనా ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న దినేష్ ఎస్. ఠాకూర్ వంటి నిపుణులు తరచు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ సరైన పర్యవేక్షణ కొరవడిన చోట అలాంటివారిది అరణ్యరోదనే అవుతోంది. ఇప్పుడు గాంబియా పసిపిల్లల ఉసురు తీసిన మందులకు భారత్‌లో విక్రయించడానికి అనుమతుల్లేవని అంటున్నారు. మన దేశంలో విక్రయానికి పనికిరాని ఉత్పత్తులు గాంబియాకు ఎలా పోయాయి? అంతర్జాతీయంగా మన పరువు తీసిన ఈ ఉదంతం తర్వాతనైనా పాలకులు మేల్కొనవలసి ఉంది. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రాంత దేశాల్లో మన ఫార్మా రంగ సంస్థలదే పైచేయి. ఆఖరికి రష్యా, పోలాండ్, బెలారస్ వంటి దేశాల్లోనూ మన ఔషధాలే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు ఫార్మా ఉత్పత్తులు మన దగ్గర నుంచే ఎగుమతి అవుతున్నాయి. అయినా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని పాలకులు గుర్తించలేదు! పౌష్టికాహారలోపం, వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన నీరు, విషాహారం తదితరాలు ప్రజలను రోగాలబారిన పడేస్తాయి. రోగగ్రస్తులకు అందుబాటులో ఉంటున్న ఔషధాలు జబ్బు తగ్గించటం మాట అటుంచి ప్రాణాలు తీయడమంటే అంతకన్నా ఘోరమైన నేరం ఉంటుందా? కానీ చట్టంలో ఉండే లొసుగుల కారణంగా ఈ నేరం నిత్యం జరుగుతూనే ఉంది. ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా గాంబియాలో సరైన ఔషధ నియంత్రణ వ్యవస్థ లేదనీ, జవాబుదారీతనం అసలే లేదనీ కొందరంటున్నారు. కానీ మనదగ్గరమటుకు ఏం ఉన్నట్టు? హరియాణాలోని కుండ్లీలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిందని గాంబియా విషాదం వెల్లడి కాకముందు మేడెన్ ఔషధ సంస్థ వెబ్సైట్ ఘనంగా చెప్పుకొంది. ప్రస్తుతం దాన్ని తొలగించి హరియాణాలోనే ఉన్న మరో ఫ్యాక్టరీకి, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కిందని ఆ సంస్థ గొప్పలు పోతోంది. అంతేకాదు... తమకు ఐఎస్ఓ గుర్తింపు కూడా వచ్చిందంటున్నది. మేడెన్ సంస్థ ఫ్యాక్టరీలనుగానీ, దాని ఉత్పత్తులనుగానీ తనిఖీలు చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అటు ఐఎస్ఓ గుర్తింపు పొందిన ఔషధ సంస్థల జాబితాలో మేడెన్ లేనేలేదు. ప్రాణప్రదమైన ఔషధ సంస్థలు ఇలా ఇష్టానుసారం ప్రకటించుకుని జనం ప్రాణాలతో చెలగాటమాడుతుంటే అన్ని వ్యవస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఈ సంస్థపై గత దశాబ్దకాలంలో బిహార్, గుజరాత్, కేరళ, జమ్మూ, కశ్మీర్లు ఫిర్యాదులు చేశాయి. కానీ అవన్నీ నాసిరకమైన మందులకు సంబంధించిన ఫిర్యాదులు. ఇప్పుడు గాంబియా పిల్లల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందుల్లో అత్యంత ప్రమాదకరమైన డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు మోతాదుమించి ఉన్నాయని తేల్చారు. ఇవి కిడ్నీలనూ, ఇతర అంగాలనూ తీవ్రంగా దెబ్బతీయటంతో పిల్లలు మరణించారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. గ్లిసరిన్ను సాంద్రత బాగా తగ్గించి దగ్గు మందుల్లో వినియోగిస్తారు. గ్లిసరిన్‌తో పోలిస్తే ఈ రెండు రసాయనాలూ చవగ్గా లభిస్తాయని చాలామంది వాటివైపు మొగ్గుతున్నారు. అయితే పెయింట్లు, ఇంకులూ తయారీలో వినియోగించే ఈ రసాయనాలు ఏమాత్రం మోతాదు మించినా ప్రాణాంతకమవుతాయి. ఇప్పుడు గాంబియాలో జరిగింది అదే. మనకు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) ఉంది. దేశంలో అనేకచోట్ల కేంద్ర ఔషధ పరీక్ష కేంద్రాలు (సీడీఎల్) ఉన్నాయి. రాష్ట్రాల స్థాయిలో ఔషధ తనిఖీ అధికారులున్నారు. దేశం వెలుపలికిపోయే ఔషధాల ప్రమాణాల నిర్ధారణకు సంబంధించి ఎన్నో నిబంధనలున్నాయి. కానీ మేడెన్ సంస్థ ఈ వ్యవస్థల కళ్లు కప్పగలిగింది. 2020లో జమ్మూ, కశ్మీర్లో ఈ దగ్గుమందు 14 మంది ప్రాణాలు తీసినప్పుడు ప్రజారోగ్య రంగ కార్యకర్త దినేష్ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు సవివరమైన ఫిర్యాదు పంపితే దర్యాప్తు చేయటం మాట అటుంచి, కనీసం అది అందుకున్నట్టు చెప్పే దిక్కు కూడా లేకపోయిందంటే ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఔషధ ప్రమాణాల నిర్ధారణకూ, నియంత్రణకూ 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టమే ఆధారం. 2004లో రాన్‌బాక్సీ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తి, ఆ తర్వాత అమెరికా, యూరోప్ దేశాల నియంత్రణ సంస్థలు గగ్గోలు పెట్టినప్పుడు ఆనాటి పాలకులు ఇదంతా కుట్రగా తేల్చిపారేశారు తప్ప ఫార్మా రంగ సంస్కరణలకు పూనుకోలేదు. వర్తమాన అవసరాలకు తగ్గట్టు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. వర్ధమాన దేశాలకు చవగ్గా ఔషధాలందిస్తుందన్న ఖ్యాతిని నిలుపుకోవాలన్నా, ప్రపంచ ఫార్మా రంగంలో పెరుగుతున్న మన వాటా రక్షించుకోవా లన్నా ఔషధ నియంత్రణ వ్యవస్థ ప్రక్షాళనకు తక్షణం పూనుకోవాలి. లేదంటే మన ప్రతిష్ఠ అడుగంటడం ఖాయం. -
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలి
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: ప్రజల శ్రేయస్సే ఉమ్మడి లక్ష్యంగా ఔషధ నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది పని చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మంత్రి.. ఔషధ నియంత్రణ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఔషధ నియంత్రణ విభాగానిది ముఖ్య పాత్ర అని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడా నకిలీ మందుల ఊసే ఉండకూడదని, ఈ విషయంలో ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మందుల దుకాణాలకు లైసెన్స్‌ల జారీ, రెన్యువల్ విషయంలో అప్రమత్తతతో ఉండాలన్నారు. ఔషధ తయారీ కంపెనీలు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్(జీఎంపీ) ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తున్నారో, లేదో పర్యవేక్షించాలన్నారు. ఔషధ నియంత్రణ విభాగానికి గతంలో జిల్లాల్లో ఎక్కడా కనీసం కార్యాలయాలు కూడా ఉండేవి కావని, సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాకు ఒక కార్యాలయం ఉండేలా కృషి చేశారని పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీలోని ఎన్సీడీసీ(నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ప్రధాన కార్యాలయం ద్వారా దేశ వ్యాప్తంగా ఆరు ఎన్సీడీసీ సెంటర్ల నిర్మాణానికి మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. ఏపీ నుంచి మంత్రి రజిని పాల్గొని మాట్లాడుతూ మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో రీజినల్ ఎన్సీడీసీ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా, హెచ్ ఐవీ.. ఇలా అన్ని రోగాలకు ఈ సెంటర్లో ఉచితంగా నిర్ధారణ పరీక్షలు చేస్తారని వివరించారు. -
Corona Third Wave: బ్లాక్ మార్కెట్‌కు చెక్
సాక్షి, అమరావతి : కరోనా తొలి, మలి విడతల్లో విటమిన్ టాబ్లెట్లతోపాటు కొన్ని రకాల మందులకు తీవ్ర డిమాండ్ ఏర్పడడంతో మెడికల్ మాఫియా అప్పట్లో బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీసింది. ప్రస్తుతం మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో ఔషధ నియంత్రణ శాఖ నాటి పరిస్థితులకు చెక్ చెబుతూ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. కరోనాకు సంబంధించిన 30 రకాల అత్యవసర మందుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆ శాఖ ఉన్నతాధికారులు వారంలో రెండుసార్లు 13 జిల్లాల ఔషధ నియంత్రణ అధికారులతో సమీక్షలు నిర్వహించి మార్కెట్లో మందుల నిల్వల సమాచారం సేకరిస్తున్నారు. ఏవైన మందుల నిల్వలు తక్కువగా ఉన్నట్లైతే డిమాండ్‌కు సరిపడా వాటిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇండెంట్ పెట్టిన వెంటనే మందులు సరఫరా చేసేలా పంపిణీదారులను ఆదేశిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తికి అనుమతులు ఇక కరోనా రోగుల చికిత్సలో వినియోగించేందుకు అవకాశమున్న మోల్నుపిరవిర్ మాత్రలను రాష్ట్రంలోనే తయారుచేసేందుకు ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చింది. దీంతో కరోనా మూడో దశ మందుల ప్రోటోకాల్ జాబితాలో ఈ మాత్రలకు అనుమతిస్తే వీటికి కొరత ఏర్పడే అవకాశం ఉండదు. నాట్కో, లారస్, దివీస్ ఫార్మా కంపెనీలు ఈ మందును తయారుచేయనున్నాయి. చిన్న పిల్లలు, గర్భిణులు, మరికొందరికి ఈ మందును వినియోగించకూడదని ఐసీఎంఆర్ వెల్లడించింది. అదే విధంగా కరోనా రెండో దశ చికిత్సలో కీలకంగా మారిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ప్రస్తుతం రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. పుష్కలంగా మందుల నిల్వలు రాష్ట్రంలో మందుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పుష్కలంగా వాటి నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం పీఎస్ఏ (ఆక్సిజన్) ప్లాంట్లను భారీగా ఏర్పాటుచేసింది. దీంతో ఆక్సిజన్‌కు కొరత లేదు. ఎక్కడైనా ఎమ్మార్పీని మించి మందులు విక్రయిస్తే వినియోగదారులు ఔషధ నియంత్రణ శాఖకు ఫిర్యాదు చేయాలి. ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులపై ప్రత్యేక నిఘా ఉంచాం. నకిలీ మందులు చెలామణి కాకుండా చూస్తున్నాం. – రవిశంకర్ నారాయణ్, ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ -
‘డ్రగ్స్’ అణచివేతలో దేశంలో ఏపీది అగ్రస్థానం
సాక్షి, అమరావతి: డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దశాబ్దాలుగా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వాల తీరుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరిని కేంద్ర హోంశాఖ ప్రశంసించింది. ఇటీవల అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా 2021లో డ్రగ్స్ అక్రమ వ్యాపారంపై దేశంలో వివిధ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను సమీక్షించింది. గల్ఫ్ దేశాల నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ అత్యధికంగా ఉన్న గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ తదితర పశ్చిమ రాష్ట్రాలు, ఆగ్నేయాసియా దేశాల నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాకు ముఖద్వారంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కఠిన చర్యలు చేపట్టడంలేదని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది. కానీ, వాటికంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ విధానాలను అవలంబిస్తోందని పేర్కొంది. గంజాయి, ఇతర డ్రగ్స్ దందాపై ఉదాశీనంగా ఉండడంవల్లే ఇతర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ, ఏపీలో మాత్రం పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తూ భారీగా కేసులు నమోదు చేస్తూ దీర్ఘకాలిక వ్యూహంతో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ సత్ఫలితాలిస్తోందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేసుల నమోదు,అరెస్టుల్లోనూ అగ్రస్థానమే ఇక 2021లో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న వారిపై దేశంలో వివిధ రాష్ట్రాలు నమోదు చేసిన కేసులు, నిందితుల అరెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది ఏకంగా 4,144 మందిపై కేసులు నమోదు చేసింది. వారిలో 2,565 మందిని అరెస్టుచేసింది. డ్రగ్స్ దందాకు పాల్పడే వారిని వివిధ రాష్ట్రాలు చేసిన అరెస్టుల వివరాలిలా.. సెబ్ దూకుడు.. గంజాయి, ఇతర డ్రగ్స్ మాఫియాపైగత దశాబ్దంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. పరోక్షంగా గంజాయి, డ్రగ్స్ దందాకు కొమ్ముకాశాయి. అందుకే అప్పట్లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లిప్తంగా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ, అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఎలాంటి ఒత్తిళ్లకు అవకాశమివ్వకుండా స్మగ్లర్లపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తూ ఎడాపెడా కేసులు నమోదు చేసి డ్రగ్స్ మాఫియాను బెంబేలెత్తిస్తోంది. ఏకంగా 7,405 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసి రూ.9వేల కోట్ల విలువైన 3.70కోట్ల గంజాయి మొక్కలను పెకలించి దహనం చేసింది. 2021లో గంజాయి, డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న 2,164 కేసులు నమోదు చేసింది. 4,144మందిపై కేసులు నమోదు చేసి వారిలో ఇప్పటికే 2,565 మందిని అరెస్టు చేసింది. 2010 నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో అణచివేయడం ఇదే తొలిసారి. -
విజయవాడలో అక్రమ ఔషధాల కలకలం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ నుంచి చెన్నైకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న మందులను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. మత్తు కలిగించే రూ.4 లక్షల విలువైన టైడాల్ (టెపడడాల్) మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొరియర్ ద్వారా చెన్నైలో 10 మందికి పంపారు. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నై పోలీసులు అవి విజయవాడ నుంచి వస్తున్నట్లు నిర్ధారించుకుని ఇక్కడకు వచ్చారు. స్థానిక పోలీసులు, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించారు. నక్కల రోడ్డులోని సత్య డ్రగ్ హౌస్, పుష్పా హోటల్ సెంటర్లోని శ్రీ వెంకటాద్రి ఫార్మాలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చెన్నైకి మందులు సరఫరా చేసినట్లు బిల్లులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు షాపుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నొప్పి నివారణకు వాడే టెపడడాల్ మందులను బిల్లులు లేకుండా చెన్నై తరలించడంతో అక్కడి పోలీసులు పట్టుకున్నారని డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీరామమూర్తి తెలిపారు.