అంతా మా ఇష్టం | Irregularities In Medical Agencies In Guntur | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం

Published Mon, Jul 29 2019 1:09 PM | Last Updated on Mon, Jul 29 2019 1:09 PM

Irregularities In Medical Agencies In Guntur - Sakshi

ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ కార్యాలయం, నకిలీ మందులను పరిశీలిస్తున్నఅధికారులు

సాక్షి, గుంటూరు : రాష్ట్రరాజధాని జిల్లా గుంటూరులో గత మూడేళ్లుగా మందులషాపుల నిర్వహణపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందుల షాపుల్లో కొనే ఔషధాలు నకిలీవా కావా , ఆ మందులు వేసుకుంటే వ్యాధి తగ్గుతుందా లేక కొత్తరోగమేదైనా వస్తుందా అనే భయాందోళనలు జిల్లా ప్రజల్లో నెలకొన్నాయి. ప్రజల భయాలను నిజాలు చేస్తూ పలు మందుల షాపుల్లో జరుగుతున్న అక్రమాల గురించి ఏడాదికి ఒకసారి వెలుగులోకి వస్తున్నాయి. అయినప్పటికీ ఔషధ నియంత్రణశాఖ అధికారులు మాముళ్లమత్తులో ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు.

మందుల ధరలు తగ్గిస్తే.. 
ప్రజలకు తక్కువ ధరలకు మందులు ఇస్తామని హోల్‌సేల్‌ వ్యాపారులు పోటీ వ్యాపారం వల్ల ముందుకొచ్చారు. రిటైల్‌షాపుల వారికి నష్టం వాటిల్లుతుందని వారికి వత్తాసుగా ఔషధ నియంత్రణశాఖ అధికారులు 2018 డిసెంబర్‌ మొదటి వారంలో తమ కార్యాలయంలో సమావేశంపెట్టి మందులపై డిస్కౌంట్‌లు ఎక్కువ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. చేయాల్సిన విధులు నిర్వహించకుండా ఔషధ నియంత్రణ అధికారులు ఎలాంటి పనులు చేస్తున్నారో ఈ మీటింగ్‌ను బట్టి చెప్పకుండానే అర్ధం చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్లో దరఖాస్తు చేస్తే చుక్కలే..
మందుల షాపులకు ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి సవాలక్ష నిబంధనలు చూపించి లైసెన్స్‌ను మంజూరు చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు.   మందులషాపుల యూనియన్‌ కార్యాలయంలో సంప్రదిస్తే తక్షణమే మందులషాపులకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. 

2016లో ఏం జరిగిందంటే..
గుంటూరు అర్భన్‌ పరిధిలోని ఫిరంగిపురంలో 2016లో మందులు వికటించి ఓ మహిళ ముఖం నల్లగా మారిపోవటంతో ఆమె వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళకు మందులు విక్రయించి, వైద్యంచేసింది ఫిరంగిపురంలోని మందులషాపులోనే. అర్హత లేని వ్యక్తి మందులు ఇచ్చి వైద్యం చేయటం వల్లే ముఖం కాలినట్లుగా మారిపోయిందని నివేదిక వచ్చింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కువ మందుల షాపుల్లో ఇదే తంతు కొనసాగుతోంది. 

2017లో నకిలీలు వెలుగులోకి..
పలు ప్రముఖ కంపెనీల ఔషధాలను 2017లో నకిలీవి తయారుచేసి గుంటూరు కేంద్రంగా కోట్లాది రూపాయల నకిలీ మందుల వ్యాపారం నడిచింది. విజయవాడలో ఫార్మా కంపెనీ ప్రతినిధులు తమ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోవటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విజయవాడ పోలీసులు సదరు కంపెనీ ఉత్పత్తులను నకిలీవి తయారు చేసి గుంటూరు కొత్తపేట శివాలయం సమీపంలోని నిల్వచేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నకిలీ మందుల విక్రయాలు గుంటూరు కేంద్రంగానే జరిగాయి. ఇతను గుంటూరులో 2015 నుంచి మందుల వ్యాపారం చేస్తున్నా అధికారులు మాముళ్ల మత్తులో గుర్తించలేదు. 

2018లో విజిలెన్స్‌ తనిఖీల్లో ఇలా..
విజిలెన్స్‌ అధికారులు పలు మందులషాపుల్లో మూడు సార్లు తనిఖీలు చేసి అర్హతలేని వ్యక్తులు మందులు అమ్మటం, కాల పరిమితిదాటిన మందులు అమ్మటం, మందులు అమ్ముతున్నట్లు రికార్డుల్లో చూపకపోవటం, మందులను సరైన విధానంలో నిల్వచేయకపోవటం, రోగులకు కంపెనీవారు ఉచితంగా అందించే శాంపిల్‌ మాత్రలు అమ్మటం, అనుమతులు లేకుండా మందులను అమ్మటం ఇతర లోపాలను గుర్తించారు.  

నిబంధనలకు తిలోదకాలు..
ఫార్మాసిస్టుల షాపుల నిర్వాహకులు, ఔషధనియంత్రణ, పరిపాలనశాఖ అధికారులు ఇరువురు కూడా నిబంధనలకు నీళ్లు వదిలారు. లైసెన్స్‌ల మంజూరుకు రూ.30 వేల వరకు వసూలు చేస్తూ నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోవటం లేదు.  ఫార్మాసిస్టు కోర్సు చేయని వారు, మందుల గురించి తెలియని వారు మందులు విక్రయిస్తున్నారు. కొంత మంది వ్యాపారులు ఫార్మసిస్టుల సర్టిఫికెట్‌ను అద్దెకు తీసుకుని షాపులను నిర్వహిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మందులను వైద్యులే తమ అసిస్టెంట్స్‌తో అమ్మకాలు చేయిస్తున్నారు. షాపు పెట్టకుండా కొద్దిపాటి గదుల్లోనే మందులు అమ్మిస్తున్నారు.

ఆస్పత్రుల తనిఖీ సమయంలో..
గతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రుల్లో తనిఖీలు చేసిన సమయంలో పదోతరగతి కూడా ఉత్తీర్ణత చెందని వ్యక్తి మందులు అమ్ముతూ పట్టుబడ్డాడు. ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఫార్మాశిస్టులే మందులు విక్రయాలు చేసేలా చూడాలని, నకిలీ మందులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనల అమలుకు చర్యలు
ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా తిరుపతి నుంచి గుంటూరుకు బదిలీపై వచ్చా. పరిస్థితులను పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం మందులషాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటాను. 
–అనిల్‌కుమార్, అసిస్టెంట్‌ డైరక్టర్, ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement