Medical Agency
-
13 ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్
ఓర్వకల్లు: ఆటలాడుతూ.. అల్లరి చేసే ఆ బాలుడికి మాయదారి రోగం వచ్చింది. పేద కుటుంబానికి పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఏడేళ్లుగా ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆర్థిక స్థోమత లేక అపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కవిత, పరమేష్ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి అచ్యుత్ కుమార్, హర్షవర్ధన్ కుమారులు. పెద్ద కుమారుడు అచ్యుత్ కుమార్(13)కు ఆరేళ్ల వయస్సు నుంచి తరచుగా జ్వరం రావడం, రక్తకణాలు తగ్గిపోవడం జరుగుతూ ఉండేది. తెలిసిన చోటల్లా అప్పులు చేసి వైద్యం చేయించారు. వైద్యానికి ఇప్పటికే సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది మార్చిలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించగా పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. బెంగళూరులో వైద్య పరీక్షలు చేసి బ్లడ్ కాన్సర్గా వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి నయం కావాలంటే దాదాపు రూ.30 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. అంత డబ్బు లేక తల్లిదండ్రులు దిక్కుతోచక ఇంటికి వెనుతిరిగి వచ్చారు. కుమారుడి అవస్థ చూడలేకఇతరుల వద్ద అప్పులు చేసి కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేయాలని, రూ.20 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పడంతో కొందరి సలహా మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికింద దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం రూ.8 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మిగతా రూ.12 లక్షల కోసం ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
సులభంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందేలా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోట్ల మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఆపద్భాందవి ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడినా, ప్రమాదానికి గురైనా సదరు వ్యక్తులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకం కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఈ పథకానికి సీఎం వైఎస్ జగన్ ఊపిరిలూదారు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్‌ను పథకం పరిధిలోకి తెచ్చారు. 1,059 నుంచి 3,257కు ప్రొసీజర్స్‌ను పెంచి ప్రజలకు ఆరోగ్య భరోసానిస్తున్నారు. ఇలాంటి పథకం గురించి తెలియక, సేవలు ఎలా వినియోగించుకోవాలో అవగాహన లేక పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం చేతి నుంచి డబ్బు పెట్టకూడదని ప్రభుత్వం భావించింది. దీంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పథకం పట్ల పూర్తి అవగాహన కల్పించడం కోసం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆరోగ్యశ్రీపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమానికి వైద్య శాఖ శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికీ వైద్య సిబ్బంది ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీపై విస్తృత అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ఆరోగ్యశ్రీ సేవలపై సవివరంగా రూపొందించిన బ్రోచర్‌ను ప్రతి ఇంటిలో అందజేస్తారు. ఏదైనా ఆరోగ్య సమస్య, ప్రమాదం సంభవిస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా, సులువుగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరిస్తారు. తాముంటున్న ప్రాంతానికి చేరువలో ఉన్న నెట్వర్క్ ఆస్పత్రులు, ఆయా ఆస్పత్రుల్లో అందే వైద్య సేవల గురించి చెబుతారు. సేవలు వినియోగించుకోవడంలో ఏమైనా సమస్యలు తలెత్తినా, సంతృప్తకర స్థాయిలో సేవలు అందకపోయినా 104కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవడంతో పాటు, ఎలా ఫిర్యాదులు చేయాలో వివరిస్తారు. ఎక్కడైనా లంచాలు డిమాండ్ చేస్తే 14400కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేసేలా చైతన్యం కల్పిస్తారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి భృతి అందిస్తున్న ఆరోగ్య ఆసరా గురించి తెలియపరుస్తారు. అర చేతిలో ఆరోగ్యశ్రీ ప్రజలకు మరింత సులువుగా పథకం సేవలు అందించడానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను వైద్య సిబ్బంది ప్రజల ఇంటి వద్దే తెలియజేసి వారి స్మార్ట్ ఫోన్లో యాప్‌ను ఇన్స్టాల్ చేయించి, ఎలా వినియోగించాలో వివరిస్తారు. యాప్ ద్వారా గతంలో చేయించుకున్న చికిత్సల మెడికల్ రిపోర్ట్‌లను భవిష్యత్‌లో ఎప్పుడైనా అవసరమైతే ఎలా పొందవచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడాన్ని తెలియపరుస్తారు. ఒక్కో కుటుంబానికి కనీసం 15 నిమిషాలు ఆరోగ్యశ్రీ పథకం సేవల గురించి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దానిపై అవగాహన లేని కుటుంబం రాష్ట్రంలో ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పించేలా విస్తృత అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. ఏఎన్ఎం, సీహెచ్‌వో ప్రతి కుటుంబానికి కనీసం 15 నిమిషాలు కేటాయించి పథకం సేవలపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్‌ను ప్రతి ఇంటికి అందజేస్తారు. – డాక్టర్ వెంకటేశ్వర్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
మాటిచ్చారు.. నెరవేర్చారు
నగరి: చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుగు ప్రయాణంలో నగరి డిగ్రీ కళాశాల హెలిపాడ్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.షణ్మోహన్‌కు ఆదేశాలిచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు యంత్రాంగం గంటల వ్యవధిలోనే ఆయా సమస్యలను పరిష్కరించింది. మానవత్వంతో ఆదుకున్నారు నగరి మండలం మిట్టపాలెంకు చెందిన ఎ.నాగరాజు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తన కిడ్నీలు పని చేయడం లేదని.. డయాలసిస్ చేయించుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ముస్లిం మహిళ తన ఆరేళ్ల కుమారుడు రెహమాన్‌తో సీఎం జగన్‌ను కలిసింది. తన కుమారుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని.. వైద్యం కోసం ఖర్చయిన బిల్లులను మంజూరు చేయాలని వేడుకుంది. కార్వేటినగరం గొల్లకండ్రిగకు చెందిన చందు అనే బాలిక తన తండ్రితో వచ్చి సీఎం జగన్‌ను కలిసింది. తాను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని.. వైద్యం కోసం వెచ్చించిన బిల్లులను మంజూరు వేడుకుంది. శ్రీకాళహస్తి మండలం తూకివాకం గ్రామానికి చెందిన ఐశ్వర్య సీఎం వైఎస్ జగన్‌ను కలిసి తన ఇద్దరు బిడ్డల ఆరోగ్య సమస్యను వివరించి ఆదుకోవాలని కోరింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించాలని.. వైద్య ఖర్చుల కోసం వెచ్చించిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తక్షణం స్పందించిన కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఎ.నాగరాజుకు రూ.లక్ష, రెహమాన్‌కు రూ.లక్ష, ఎం.చందుకు రూ.50 వేలు, ఐశ్వర్యకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం విజయపురం మండలం పన్నూరుకు చెందిన కె.షణ్ముగం, నగరి మండలం నెత్తం కండ్రిగకు చెందిన గజేంద్ర, మత్తయ్య అనే దివ్యాంగులతోపాటు ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు హరిజనవాడకు చెందిన ఎన్.సుమిత్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో షణ్ముగంకు రూ.లక్ష, ఎం.గజేంద్ర రూ.50 వేలు, జి.మత్తయ్య రూ.50 వేలు, ఎన్.సుమిత్ర రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు. -
ఔషధ విక్రయాల్లో అక్రమాలను అరికట్టాలి
సాక్షి, అమరావతి: ఔషధాల క్రయవిక్రయాల్లో అవకతవకలు, నకిలీ, నాణ్యత లేని మందుల చెలామణి, మెడికల్ షాపుల్లో అక్రమాలను అరికట్టడానికి డీజీ స్థాయిలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఔషధ నియంత్రణా విభాగంపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔషధ నియంత్రణా విభాగం మరింత సమర్థంగా పనిచేయాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీకి నివేదిక తయారుచేయాలని చెప్పారు. కేంద్ర ఔషధ నియంత్రణ శాఖకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులకు లేఖ రాయాలన్నారు. సీఆర్‌యూ ఫిర్యాదుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యశాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ డీజీ కొల్లి రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న హ్యాకర్స్.. ‘ఐసీఎంఆర్’పై 6వేల సార్లు సైబర్ దాడి!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఎయిమ్స్‌పై సైబర్ దాడి జరిగి సర్వర్లు డౌన్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో సర్వర్లు పని చేయటం లేదు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యున్నత వైద్య వ్యవస్థలే లక్ష్యంగా దుండగులు సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎయిమ్స్ తర్వాత భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు హ్యాకర్స్. ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌పై సుమారు 6వేల సార్లు దాడి చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐపీ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో ట్రేస్ చేయగా.. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న హాంకాంగ్‌కు చెందిన ఐపీగా తేలిందన్నారు అధికారులు. అయితే, అప్డేటెడ్ ఫైర్‌వాల్, పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా ఐసీఎంఆర్ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికాలేదని స్పష్టం చేశారు అధికారులు. హ్యాకర్స్ 6వేల సార్లు ప్రయత్నించినా వారి దుశ్చర్య ఫలించలేదన్నారు. మరోవైపు.. ఢిల్లీ ఎయిమ్స్ ముందు ఉన్న సఫ్దార్‌గంజ్ ఆసుపత్రిపై డిసెంబర్ 4న సైబర్ దాడి జరిగింది. అయితే, ఎయిమ్స్‌తో పోలిస్తే నష్టం తక్కువేనని అధికారులు తెలిపారు. ఒక రోజంతా తమ సర్వర్ పని చేయలేదని ఆసుపత్రి వైద్యులు బీఎల్ శెర్వాల్ తెలిపారు. ఎన్ఐసీ కొన్ని గంటల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: తమిళనాడు ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం! -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫేస్ మాస్క్..
world's largest face mask: కరోనా మహమ్మారీ సమయంలో ఫేస్‌మాస్క్‌ల ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం ప్రజలు కూడా తమదైనందిన జీవితంలో ఈ మాస్క్‌లకు అలవాటుపడిపోయారు. ఇది అందరీకి ఒక నిత్యకృత్యంగా మారిపోయింది కూడా. అంతేగాక రకరకాల మాస్క్‌లు కూడా మార్కెట్లలలో దర్శనమిస్తున్నాయి. ఇటీవలే అత్యంత ఖరీదైన మాస్కలు అంటూ బంగారంతో తయారు చేసిన వాటి గురించి విన్నాం. అయితే ఇప్పుడూ వీటన్నింటిని తలదన్నేలా ప్రపంచంలో అతిపెద్ద మాస్క్ ఒకటి తైవాన్‌లో ఉంది. అసలు ఎందుకు తయారు చేశారంటే!.. వివరాల్లోకెళ్తే...ప్రపంచంలోనే అతి పెద్ద సర్జికల్ మాస్క్‌ని తైవాన్‌కి చెందిన ఓ వైద్య సంస్థ రూపొందించింది. ఇది 27 అడుగుల ఎత్తు 3 అంగుళాల 15 అడుగుల వెడల్పు, 9 అంగుళాలు పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పోరేషన్ అనే వైద్య సంస్థ మాస్క్ క్రియేటివ్ హౌస్‌లో ఈ మాస్క్‌ని ఆవిష్కరించింది. ఇది ప్రామాణిక ఫేస్ మాస్ కంటే కూడా 50 రెట్లు పెద్దది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేతలు ఈ రికార్డును ధృవీకరించారు. కోవిడ్ -19 మహమ్మారీ సమయంలో అవగాహన పెంచడం కోసం 2020లోనే ఈ మాస్క్‌ని రూపొందించాలనే ఆలోచన వచ్చిందని మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పొరేషన్ తెలిపింది. (చదవండి: ఆమె గోల్ కోసమే టెన్షన్...వేస్తుందా ? లేదా!) -
రోగుల ప్రాణాలతో మందులోళ్ల చెలగాటం..
సాక్షి, హైదరాబాద్: కొన్ని ఔషధ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్ బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మెడికల్ షాపుల్లో గడువు తీరిన, నాసిరకం మందుల అమ్మకంతో రోగులకు ముప్పు పొంచి ఉంటోంది. ఔషధ నియంత్రణశాఖ పరిధిలో జరిగే ఉల్లంఘనల్లో దాదాపు 75% మెడికల్ షాపుల్లో జరిగేవేనని అధికారులు అంటున్నారు. ప్రధానంగా రిఫ్రిజిరేటర్లో ఉంచాల్సిన ఔషధాలను వేడి వాతావరణంలో పెట్టడం, సాధారణ మెడికల్ షాపు ల్లోనూ పశువుల మందులు విక్రయించడం, ఫార్మ సిస్ట్ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మడం, ఒక బ్రాండ్‌కు బదులు మరో బ్రాండ్ మందులు అంటగట్టడం, నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మడం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు సర్కారు గుర్తించింది. అలాగే కొన్ని ఔషధ కంపెనీలు కూడా నాణ్యతలేని ముడి సరుకులతో ఔషధాలు తయారు చేస్తున్నాయని తేలింది. అంతేగాక లేబిలింగ్ సరిగా ఉండకపోవడం, తక్కువధర ఉండాల్సిన వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం తదితర ఉల్లంఘనలు జరిగాయి. మరోవైపు బ్లడ్‌బ్యాంకుల్లోనూ విపరీతంగా ఉల్లంఘనలు జరిగాయి. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో రక్తాన్ని నిల్వ ఉంచకపోవడం, నిర్దేశిత టెస్టుల్లో కొన్ని చేయకపోవడం జరుగుతోంది. తద్వారా సేకరించిన రక్తంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే స్వీకరించే రోగులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ లేకుండానే టెక్నీషియన్లతో బ్లడ్ బ్యాంకును నడిపించడం వంటి ఉల్లంఘనలు జరిగాయి. ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ వంటి వాటికి ప్రత్యేక లైసెన్సు లేకుండా నడపడం తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు చెబుతున్నారు. 21,087 ఉల్లంఘనల్లో 18 వేలు మెడికల్ షాపుల్లోనే.. మందుల దుకాణాలు, ఫార్మసీ కంపెనీలు, బ్లడ్ బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో గత ఐదేళ్లలో ఏకంగా 21,087 ఉల్లంఘనలు జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అసెంబ్లీకి సమర్పించిన నివేదిక వెల్లడించింది. 2016–17 నుంచి 2020–21 జనవరి వరకు ఈ ఐదేళ్లలో ఫార్మసీ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్‌బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో 87,700 తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో 21,087 ఉల్లంఘనలను గుర్తించారు. ఏకంగా 24 శాతం ఉల్లంఘనలు జరగడం విస్మయం కలిగిస్తోంది. గడిచిన ఐదేళ్లలో 12,801 శాంపిళ్లను పరీక్షించగా... 1,348 కేసులు ప్రాసిక్యూషన్ వరకు వెళ్లాయి. ఔషధ నియంత్రణ సంస్థలోని కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే యదేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఉల్లంఘనలు జరిగిన వాటిల్లో దాదాపు 18 వేలు మెడికల్ షాపుల్లోనే జరిగినట్లు ఔషధ నియంత్రణశాఖ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: ‘బల్సిందా నీ.. ఊర్కో బే’ బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం) వైద్య ఆరోగ్యశాఖ నివేదికలోని మరికొన్ని అంశాలు.. గతేడాది కరోనా నేపథ్యంలో అనారోగ్యానికి గురైనా చాలామంది ఆసుపత్రులకు రావడానికి జంకారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య బాగా పడిపోయింది. ప్రసవాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో 2019లో ఔట్పేషెంట్లు 6.03 లక్షల మంది కాగా, 2020లో ఆ సంఖ్య ఏకంగా 2.98 లక్షలకు పడిపోయింది. అలాగే 2019లో 47,359 మంది ఇన్న్ పేషెంట్లుగా చికిత్స తీసుకోగా, 2020లో ఆ సంఖ్య 25,931కు పడిపోయింది. ఇక శస్త్రచికిత్సలు 2019లో 24,638 జరగ్గా, 2020లో సగానికికంటే తక్కువగా 11,073కు పడిపోయాయి. 2019లో మూత్రపిండాల మార్పిడి చికిత్సలు 105 జరగ్గా, 2020లో 30కు పడిపోయాయి. మోకాళ్ల మార్పిడి చికిత్సలు 2019లో 173 కాగా, 2020లో 34కు పడిపోయాయి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 108 ఆసుపత్రులకు సగటున ఏడాదికి 1.08 కోట్ల మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా, 2020–21లో జనవరి వరకు కేవలం 60.52 లక్షల మందే వచ్చారు. ఇన్ పేషెంట్లు 9.55 లక్షలు అంచనా కాగా, ఆ సంఖ్య 6.96 లక్షలకు పడిపోయింది. అయితే కరోనా కాలంలో 108 జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. వాటిల్లో సగటున ఏడాదికి 81,600 ప్రసవాలు జరుగుతుండగా, 2020లో ఏకంగా 1,24,278 ప్రసవాలు జరగడం విశేషం. ఆయా ఆసుపత్రుల్లో ల్యాబ్ టెస్ట్‌లు 36.95 లక్షల నుంచి 40.44 లక్షలకు చేరుకోవడం గమనార్హం. సగటు ఏడాదికి జరిగే ఈసీజీలు 63,175 కాగా.. గత ఏడాది ఏకంగా 79,970 జరిగాయి. ఇక తెలంగాణ డయాగ్నస్టిక్‌లలో 2019లో 9.05 లక్షల పరీక్షలు జరగ్గా, 2020లో 7.61 లక్షలకు పడిపోయాయి. 9 ప్రభుత్వ బోధనాసుపత్రులు, 22 స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 2019లో 76.83 లక్షల మంది ఔట్ పేషెంట్లు వైద్య సేవలు పొందగా, 2020లో ఆ సంఖ్య సగానికి అంటే 38.25 లక్షలకు పడిపోయింది. ఇన్ పేషెంట్ల సంఖ్య 2019లో 5,91,772 కాగా, 2020లో 3.98 లక్షలకు పడిపోయింది. 2019లో ఈ ఆసుపత్రుల్లో 3.22 లక్షల శస్త్రచికిత్సలు జరగ్గా, 2020లో 1.48 లక్షలు జరిగాయి. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2019–20లో 3.50 లక్షల మంది వైద్య సేవలు పొందగా, 2020–21 మార్చి 10వ తేదీ నాటికి 2.26 లక్షల మంది సేవలు పొందారు. (చదవండి: ఉపాధి పనికి ఆలయ అర్చకుడు ) -
నిండు గర్భిణి పురిటి కష్టాలు
కొందుర్గు: కరోనా వైరస్ విజృంభణతో ఓ వైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న పరిస్థితుల్లో బాధ్యతతో ఓ వైపు ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది...మరోవైపు నిండు గర్భిణికి పురిటినొప్పులొస్తే రిపోర్టులు లేవన్న సాకుతో వైద్య సిబ్బంది వైద్యం చేసేందుకు నిరాకరించి ఆమెను రాత్రంతా ఆరుబయటే జాగారం చేయించింది. కొందుర్గు మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్న వడ్డె స్వప్న ఉగాది పండుగ కోసం జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని ఎదిర గ్రామంలోని తన పుట్టింటికి వచ్చింది. నిండు గర్భిణి అయిన ఆమెకు శనివారం రాత్రి 12 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబీకులు తరలించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏఎన్సీ రిపోర్టులు చూపించాలని స్వప్నను అడుగగా తమ వద్ద లేవని చెప్పింది. రిపోర్టులు తన అత్తగారింట్లో ఉన్నాయని చెప్పినా ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు. రిపోర్టులు లేకుంటే వైద్యం చేయమని చెప్పి కనీసం ఆస్పత్రిలోనికి కూడా అనుమతించకపోవటంతో చేసేదేమీలేక స్వప్న తన మూడేళ్ల కుమారుడు, తల్లి యాదమ్మతో కలిసి పీహెచ్సీ వద్ద ఉన్న ఓ దుకాణం ఎదుట రాత్రంతా జాగరణ చేసింది. ఆదివారం ఈ విషయమై స్థానికులు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా..స్వప్న ప్రసవానికి ఇంకా సమయం ఉందని, పీహెచ్సీలో పేషెంట్‌తోపాటు మరొకరు మాత్రమే ఉండాలని సూచించగా గర్భిణితోపాటు కుటుంబీకులు బయటకు వెళ్లారని స్టాఫ్‌నర్స్ సలోమి తెలిపారు. అనంతరం కుటుంబీకులు స్వప్నను షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. -
అంతా మా ఇష్టం
సాక్షి, గుంటూరు : రాష్ట్రరాజధాని జిల్లా గుంటూరులో గత మూడేళ్లుగా మందులషాపుల నిర్వహణపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందుల షాపుల్లో కొనే ఔషధాలు నకిలీవా కావా , ఆ మందులు వేసుకుంటే వ్యాధి తగ్గుతుందా లేక కొత్తరోగమేదైనా వస్తుందా అనే భయాందోళనలు జిల్లా ప్రజల్లో నెలకొన్నాయి. ప్రజల భయాలను నిజాలు చేస్తూ పలు మందుల షాపుల్లో జరుగుతున్న అక్రమాల గురించి ఏడాదికి ఒకసారి వెలుగులోకి వస్తున్నాయి. అయినప్పటికీ ఔషధ నియంత్రణశాఖ అధికారులు మాముళ్లమత్తులో ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు. మందుల ధరలు తగ్గిస్తే.. ప్రజలకు తక్కువ ధరలకు మందులు ఇస్తామని హోల్‌సేల్ వ్యాపారులు పోటీ వ్యాపారం వల్ల ముందుకొచ్చారు. రిటైల్‌షాపుల వారికి నష్టం వాటిల్లుతుందని వారికి వత్తాసుగా ఔషధ నియంత్రణశాఖ అధికారులు 2018 డిసెంబర్ మొదటి వారంలో తమ కార్యాలయంలో సమావేశంపెట్టి మందులపై డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. చేయాల్సిన విధులు నిర్వహించకుండా ఔషధ నియంత్రణ అధికారులు ఎలాంటి పనులు చేస్తున్నారో ఈ మీటింగ్‌ను బట్టి చెప్పకుండానే అర్ధం చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చుక్కలే.. మందుల షాపులకు ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి సవాలక్ష నిబంధనలు చూపించి లైసెన్స్‌ను మంజూరు చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. మందులషాపుల యూనియన్ కార్యాలయంలో సంప్రదిస్తే తక్షణమే మందులషాపులకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. 2016లో ఏం జరిగిందంటే.. గుంటూరు అర్భన్ పరిధిలోని ఫిరంగిపురంలో 2016లో మందులు వికటించి ఓ మహిళ ముఖం నల్లగా మారిపోవటంతో ఆమె వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళకు మందులు విక్రయించి, వైద్యంచేసింది ఫిరంగిపురంలోని మందులషాపులోనే. అర్హత లేని వ్యక్తి మందులు ఇచ్చి వైద్యం చేయటం వల్లే ముఖం కాలినట్లుగా మారిపోయిందని నివేదిక వచ్చింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కువ మందుల షాపుల్లో ఇదే తంతు కొనసాగుతోంది. 2017లో నకిలీలు వెలుగులోకి.. పలు ప్రముఖ కంపెనీల ఔషధాలను 2017లో నకిలీవి తయారుచేసి గుంటూరు కేంద్రంగా కోట్లాది రూపాయల నకిలీ మందుల వ్యాపారం నడిచింది. విజయవాడలో ఫార్మా కంపెనీ ప్రతినిధులు తమ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోవటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విజయవాడ పోలీసులు సదరు కంపెనీ ఉత్పత్తులను నకిలీవి తయారు చేసి గుంటూరు కొత్తపేట శివాలయం సమీపంలోని నిల్వచేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నకిలీ మందుల విక్రయాలు గుంటూరు కేంద్రంగానే జరిగాయి. ఇతను గుంటూరులో 2015 నుంచి మందుల వ్యాపారం చేస్తున్నా అధికారులు మాముళ్ల మత్తులో గుర్తించలేదు. 2018లో విజిలెన్స్ తనిఖీల్లో ఇలా.. విజిలెన్స్ అధికారులు పలు మందులషాపుల్లో మూడు సార్లు తనిఖీలు చేసి అర్హతలేని వ్యక్తులు మందులు అమ్మటం, కాల పరిమితిదాటిన మందులు అమ్మటం, మందులు అమ్ముతున్నట్లు రికార్డుల్లో చూపకపోవటం, మందులను సరైన విధానంలో నిల్వచేయకపోవటం, రోగులకు కంపెనీవారు ఉచితంగా అందించే శాంపిల్ మాత్రలు అమ్మటం, అనుమతులు లేకుండా మందులను అమ్మటం ఇతర లోపాలను గుర్తించారు. నిబంధనలకు తిలోదకాలు.. ఫార్మాసిస్టుల షాపుల నిర్వాహకులు, ఔషధనియంత్రణ, పరిపాలనశాఖ అధికారులు ఇరువురు కూడా నిబంధనలకు నీళ్లు వదిలారు. లైసెన్స్‌ల మంజూరుకు రూ.30 వేల వరకు వసూలు చేస్తూ నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోవటం లేదు. ఫార్మాసిస్టు కోర్సు చేయని వారు, మందుల గురించి తెలియని వారు మందులు విక్రయిస్తున్నారు. కొంత మంది వ్యాపారులు ఫార్మసిస్టుల సర్టిఫికెట్‌ను అద్దెకు తీసుకుని షాపులను నిర్వహిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మందులను వైద్యులే తమ అసిస్టెంట్స్‌తో అమ్మకాలు చేయిస్తున్నారు. షాపు పెట్టకుండా కొద్దిపాటి గదుల్లోనే మందులు అమ్మిస్తున్నారు. ఆస్పత్రుల తనిఖీ సమయంలో.. గతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రుల్లో తనిఖీలు చేసిన సమయంలో పదోతరగతి కూడా ఉత్తీర్ణత చెందని వ్యక్తి మందులు అమ్ముతూ పట్టుబడ్డాడు. ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఫార్మాశిస్టులే మందులు విక్రయాలు చేసేలా చూడాలని, నకిలీ మందులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనల అమలుకు చర్యలు ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా తిరుపతి నుంచి గుంటూరుకు బదిలీపై వచ్చా. పరిస్థితులను పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం మందులషాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటాను. –అనిల్‌కుమార్, అసిస్టెంట్ డైరక్టర్, ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ -
పాతబస్తీలో కత్తులతో యువకుల హల్చల్
-
పథకాలు అందేలా చూడాలి
నవాబుపేట : ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలకు వచ్చే మహిళలకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని ఆల్ఇండియా హెల్త్ కన్సల్టెంట్ మనోరమదీక్షిత్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను అందరికీ అందేలా చూడాలన్నారు. శుక్రవారం నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ), కొల్లూరు సబ్‌సెంటర్‌ను ఢిల్లీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు చెల్లించే వెయ్యి, సహాయకులకు అందించే రవాణా చార్జీలపై ఆరా తీశారు. మహిళా, శిశువుల కోసం ప్రత్యేకంగా ఉన్న వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. 24 గంటల ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా? లేదా? ఖాళీగా ఉన్న పోస్టులు, ఫార్మసీ విభాగంలో మందులు తదితర వాటిపై విచారణ జరిపారు. ఇక్కడి ఆపరేషన్ థియేటర్ త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. జావీద్, వైద్య సిబ్బంది రాఘవేందర్, సుధాకర్, శ్రీను పాల్గొన్నారు. -
‘అనంత’లో ఎయిమ్స్!
అనంతపురం కలెక్టరేట్ : అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆధ్వర్యంలో అధునాతన ఆస్పత్రి జిల్లాలో ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వంద ఎకరాల స్థలం సేకరించి.. నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఐదు రోజులుగా అధికారులు స్థలం అన్వేషణలో నిమగ్నమయ్యారు. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి అనువైన స్థలం కోసం నివేదికలు కోరినా.. అనంతపురం జిల్లాకే ఆస్పత్రి మంజూరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రధానంగా నగరం లేదా పట్టణానికి దగ్గరలో స్థలం ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. అనంతపురానికి సమీపంలోని కూడేరు మండలంలో 100 ఎకరాలకు పైబడి, ధర్మవరం పట్టణానికి సమీపంలో 300 ఎకరాలు, కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం వద్ద 200 ఎకరాల దాకా స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూడేరు మండలం లేదంటే కళ్యాణదుర్గం వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. కూడేరు మండలంలో ఉండే స్థలం అనంతపురానికి సమీపంలో ఉండటంతో రవాణాకు అనుకూలమని, దీనితో పాటు కళ్యాణదుర్గానికి కూడా మెరుగైన రోడ్డు సౌకర్యంతో పాటు రాయదుర్గం-తుమకూరు రైల్వేమార్గం ఏర్పడటంతో ఇక్కడా రవాణాకు అనువుగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయమై రెండు, మూడు రోజుల్లో నివేదిక పంపనున్నారు.