అనంతపురం కలెక్టరేట్ : అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆధ్వర్యంలో అధునాతన ఆస్పత్రి జిల్లాలో ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వంద ఎకరాల స్థలం సేకరించి.. నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఐదు రోజులుగా అధికారులు స్థలం అన్వేషణలో నిమగ్నమయ్యారు. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి అనువైన స్థలం కోసం నివేదికలు కోరినా.. అనంతపురం జిల్లాకే ఆస్పత్రి మంజూరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రధానంగా నగరం లేదా పట్టణానికి దగ్గరలో స్థలం ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది.
అనంతపురానికి సమీపంలోని కూడేరు మండలంలో 100 ఎకరాలకు పైబడి, ధర్మవరం పట్టణానికి సమీపంలో 300 ఎకరాలు, కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం వద్ద 200 ఎకరాల దాకా స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూడేరు మండలం లేదంటే కళ్యాణదుర్గం వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. కూడేరు మండలంలో ఉండే స్థలం అనంతపురానికి సమీపంలో ఉండటంతో రవాణాకు అనుకూలమని, దీనితో పాటు కళ్యాణదుర్గానికి కూడా మెరుగైన రోడ్డు సౌకర్యంతో పాటు రాయదుర్గం-తుమకూరు రైల్వేమార్గం ఏర్పడటంతో ఇక్కడా రవాణాకు అనువుగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయమై రెండు, మూడు రోజుల్లో నివేదిక పంపనున్నారు.