district hospital
-
ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు అద్భుతం
-
షాకింగ్ వీడియో: రక్తపు మడుగులో పేషెంట్.. చుట్టూ తిరుగుతున్న కుక్క
లఖ్‌నవూ: ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో తీవ్ర రక్తస్రావంతో ఓ వ్యక్తి కింద పడిపోయి ఉన్నాడు. అతని చుట్టూ ఓ వీధి కుక్క తిరుగుతున్న హృదయవిదారక సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమానవీయ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరిగింది. వీడియో ప్రకారం.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో కింద పడిపోయి ఉన్నాడు. చుట్టూ రక్తం పడి ఉంది. ఆ వ్యక్తి ముఖం, తలపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్పృహ తప్పి పడిపోయిన ఆ వ్యక్తి చుట్టూ ఓ వీధి కుక్క సైతం తిరుగుతోంది. 28 సెకన్ల పాటు చూపించిన ఈ వీడియోలో ఎమర్జెన్సీ వార్డుల్లో ఖాళీ పడకల సహా ఏ ఒక్క డాక్టర్, నర్సు సైతం లేరు. మరోవైపు.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆసుపత్రి ఇన్‌ఛార్జి డాక్టర్ ఎస్కే వర్మ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, చికిత్స అందిస్తున్న సమయంలోనే పలుమార్లు బెడ్ పైనుంచి కిందపడిపోయినట్లు చెప్పారు. ఆ వీడియో తీసిన సమయంలో డాక్టర్, వార్డు బాయ్ మరో వార్డులోని ఎమర్జెన్సీ కేసును చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వ్యక్తిని గోరఖ్‌పుర్‌లోని ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు. The video is from #Kushinagar, #UttarPradesh In the government hospital, the injured youth lying in a pool of blood is lying on the ground instead of the bed, dogs are licking his blood. The fate of every hospital is not like Morbi, which is brightened overnight. pic.twitter.com/5PM5di0Lxv — Today Hind (@today__hind) November 3, 2022 ఇదీ చదవండి: ‘ఒక్క ఉదాహరణ చూపితే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్ -
స్మార్ట్‌ఫోన్ కోసం రక్తం అమ్ముకునేందుకు ప్రయత్నించిన అమ్మాయి
కోల్‌కతా: స్మార్ట్ కొనుక్కునే స్తోమత లేక 16 ఏళ్ల అమ్మాయి చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. జిల్లా ఆస్పత్రికి వెళ్లి ఆమె రక్తాన్ని అమ్ముకునేందుకు ప్రయత్నించింది. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్ఘాట్ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన సోమవారం జరిగింది. సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం ఈ అమ్మాయి సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లింది. అయితే ఎవరి కోసమే రక్తాన్ని తీసుకెళ్లేందుకు ఆమె వచ్చి ఉంటుందని వారు అనుకున్నారు. కానీ రక్తం అమ్ముకోవడానికి అక్కడికి వచ్చినట్లు బాలిక చెప్పగానే వారు షాక్‌కు గురయ్యారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ్గా.. సోదరుడి చికిత్సకు డబ్బులు లేవని, అందుకే రక్తం విక్రయించాలనుకున్నట్లు బాలిక చెప్పింది. అయితే సిబ్బంది మాత్రం అందుకు నిరాకరించారు. వెంటనే చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. బాలికకు కౌన్సిలింగ్ ఇప్పించగా.. అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. స్మార్ట్‌పోన్ కొనుక్కునేందుకు తన దగ్గర డబ్బులు లేవని, అందుకే రక్తం అమ్ముకోవాలనుకున్నట్లు ఒప్పుకుంది. కౌన్సిలింగ్ అనంతరం అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది. అయితే ఈ బాలిక ఆదివారం రోజే బంధువు మొబైల్ పోన్ ద్వారా ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ పెట్టింది. దాని ఖరీదు రూ.9,000. గురువారం అది ఆమె చేతికి రానుంది. అయితే అందుకు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో రక్తం అమ్ముకోవాలనుకుంది. అంతేకాదు ఇంట్లో ట్యూషన్‌కు వెళ్లొస్తానని చెప్పి తాపన్ ప్రాంతం నుంచి బస్సులో 30కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. సైకిల్‌ను కూడా బస్టాండ్‌లోనే వదిలిపెట్టింది. కూతురు ఇంటి నుంచి వెళ్లినప్పుడు తాను ఇంట్లో లేనని తండ్రి కుమార్ దాస్ తెలిపారు. ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదని వాపోయాడు. తనకు నాలుగో తరగతి చదివే కుమారుడు కూడా ఉన్నాడని చెప్పాడు. కుమార్ దాస్ కూరగాయల వ్యాపారి కాగా.. ఆమె భార్య గృహిణి. చదవండి: కెమెరా కంటికి చిక్కిన అరుదైన చిరుత.. ఫోటో వైరల్.. -
కరోనా మానసిక సమస్యలకు ఓపీ
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితుల మానసిక ఆరోగ్యంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారిలో తలెత్తే మానసిక సమస్యలను పరిష్కరించేందుకు అన్ని బోధనా, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక ఓపీని నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయాన్ని నోడల్ కేంద్రంగా ప్రకటించింది. మానసిక బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్, వైద్య సేవలందించడానికి వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ ఫిజీషియన్లు కూడా వీటిపై దృష్టిసారించారు. మెరుగైన సేవలందించాలని భావిస్తే మానసిక వైద్యులున్న ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తొమ్మిది ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 21 మంది సైకియాట్రిస్టులు, 42 మంది సీనియర్ రెసిడెంట్లు బాధితులకు సేవలందించడంలో కృషిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆస్పత్రుల్లోనూ 21 మంది మానసిక వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితుడి అనారోగ్యం, మానసిక స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా తెలియజేస్తున్న ట్లు అధికారులు తెలిపారు. కోలుకున్న తర్వాత ఇం టి వద్ద కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రోగులకు, వారి కుటుంబ సభ్యులకు వివరిస్తున్నా రు. మద్యం అలవాటు ఉన్నవారిలో విపరీతమైన ఆందోళన, మళ్లీ మద్యం తీసుకోవాలనే బలమైన కోరికలున్నప్పుడు వాడాల్సిన మందులు, జాగ్రత్తల ను వివరిస్తున్నారు. లక్షణాలు తీవ్రమైతే సమీపం లోని మానసిక వైద్యుడిని కలవాల్సిన పరిస్థితులపై ముందే రోగికి, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మానసిక సమస్యలకు చికిత్స అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. -
అడ్డంగా దొరికిన ఆస్పత్రి అటెండర్
-
అడ్డంగా దొరికిన ఆస్పత్రి అటెండర్
సాక్షి, విజయవాడ: కృష్ణజిల్లా మచిలీపట్నంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మృతదేహాన్ని అప్పగించాడానికి డబ్బులు ఇవ్వాల్సిందేనని మార్చురీ అటెండర్ డిమాండ్ చేశాడు. అసలే కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు లంచం ఇవ్వక తప్పలేదు. అయితే, ఆ అటెంటర్ లంచావతారం మొత్తం వీడియోలో రికార్డవడంతో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ నెల 21 సుమలలిత అనే వివాహితను ఆమె భర్త హత్య చేశాడు. పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కూతురి మృతదేహం కోసం మార్చురీకి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. శవాన్ని ఇచ్చేందుకు మార్చురీ అటెండర్ రూ.6 వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వనిదే మృతదేహాన్ని అప్పగించేది లేదని స్పష్టం చేశాడు. చివరకు ఆ తల్లిదండ్రులు రూరూ.1500 ముట్టజెప్పారు. ఈక్రమంలో వారి బంధువులు అటెండర్ బాగోతాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. మార్చురీ అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రామ్మోహన్ రావు
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో తీరు మారలేదు. ఆస్పత్రిని కలెక్టర్ రామ్మోహన్ రావు గతంలో ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో పలువురు వైద్యులు అనధికారికంగా విధులకు హాజరుకాని విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు గైర్హాజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. శనివారం కలెక్టర్ మరోసారి ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేయగా అదే పరిస్థితి ఎదురైంది. పలువురు వైద్యులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఆస్పత్రిలోని వివిధ వార్డులను సందర్శించగా, అత్యవసర విభాగంలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వర్తిస్తూ కనిపించారు. దీంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి లేకుండానే మరొకరికి బదులు గా అత్యవసర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ యుగేంధర్, అదేవిధంగా మెటర్నిటీ వార్డులో విధులకు గైర్హాజరైన వైద్యులు కృష్ణ కూమారి, నస్రీన్ ఫాతిమా, భీంసింగ్, స్టాఫ్ నర్సు ప్రేమలతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంఐసీ, ఐసీయూ, ఆర్థోపెడి క్ విభాగాలతో పాటు వంటగది, బ్లడ్‌బ్యాంకు, సదరం క్యాంపును కలెక్టర్ పరిశీలించారు. వివిధ విభాగాల వార్డుల్లో ఆస్పత్రి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. రోగులను పరామర్శించారు. రోగులకు ఎదురయ్యే సమ స్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నా రు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమ స్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రి సిబ్బంది, అధికారులు సమస్వయంతో కలిసి పని చేయాలన్నారు. రోగులకు అసాకర్యం కలుగకుండా సేవలు అందించాలన్నారు. ప్రతిరోజు ఆస్పత్రి ని శుభ్రంగా ఉంచాలని, ఆస్పత్రి ఆవరణలో ఎక్కడకూడా చెత్త, ఇతర వస్తువులు కనిపించ కూడదన్నారు. వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నా రు. వార్డుల్లో స్పేస్ విభజన సక్రమంగా లేదని క లెక్టర్ పేర్కొన్నారు. ఒక్కో వార్డులో ఒక్కో విధం గా ఉందన్నారు. పరిశీలించి తగు విధంగా ఏ ర్పాటు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఆస్పత్రి సూ పరింటెండెంట్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ఆర్ఎంఓ ఉంటారన్నారు. ఈ కమిటీ పదిహే ను రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో పది లిఫ్ట్‌లు ఉండగా, రెండు మాత్రమే పని చే స్తున్నాయి. మిగతా లిఫ్ట్‌లకు వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాల ని కలెక్టర్ సూచించారు. వైద్య విద్యార్థులకు మె నూ ప్రకారం భోజనం, టిఫిన్ అందించాలన్నారు. సదరం క్యాంపులో దివ్యాంగులకు వేగంగ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి ఆస్పత్రి అ భివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. -
పెద్దాస్పత్రిలో మరో వివాదం
ఖమ్మంవైద్యవిభాగం: పెద్దాసుపత్రిలో తరచు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరికలు చేస్తున్నా వివాదాలు మాత్రం ఆగడంలేదు. ఇటీవల కాలంలో ప్రసవ దృశ్యాలు చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడం, సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ పెట్టిన ఘటనలు వివాదాస్పదమైన విషయం విదితమే. తాజాగా ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణికి డెలివరీ చేయకుండా తిప్పి పంపటంతో మరో వివాదానికి తెరలేపారు ఇక్కడి వైద్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఇనపనూరి అశ్విని(20)కి పురుటి నొప్పులు రావడంతో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స ప్రారంభించిన డాక్టర్లు 5 గంటల సమయంలో ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో కొద్దిసేపటి తర్వాత గర్భిణికి రక్తస్రావమైంది. ఎంత ప్రయత్నించినా రక్తస్రావం ఆగకపోవటంతో డాక్టర్లు ఆమెను వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. ఆందోళనకు గురైన అశ్విని తండ్రి పగడాల లక్ష్మయ్య(మున్సిపల్ వర్కర్) సీఐటీయూ నాయకులను సంప్రదించాడు. సీఐటీయు నాయకులు విష్ణు తదితరులు వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను డెలివరీ చేయాలని విజ్జప్తి చేశారు. చికిత్స అందించకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక చేసేది లేక కుటుంబ సభ్యులు గర్భిణిని 108 వాహనం ద్వారా వైరారోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయించగా మగబిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఆస్పత్రిలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో డెలివరీ చేయిస్తే రూ.30 వేలు ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు , ఆర్ఎంఓ కృపాఉషశ్రీ సముదాయించి ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూస్తామని చెప్పడంతో సీఐటీయు నాయకులు శాంతించారు. ఎంసీహెచ్ భవనం ఎదుట డాక్టర్ల ధర్నా సీఐటీయూ నాయకుడు విష్ణు డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆస్పత్రి వైద్యులు ఓపీ సేవలు నిలిపివేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గైనిక్ సేవలందించే డాక్టర్లు ప్రస్తుతం ముగ్గురే ఉన్నారని, పెరుగుతున్న ఓపీ సేవలకు అనుగుణంగా గైనిక్ వైద్యులు నియమించాలని కోరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. డాక్టర్ల ఆందోళనతో ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు వైద్య సేవలు లేక వెనుతిరిగారు. కాగా ఇరు వర్గాలు పరస్సరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. డాక్టర్లను ఇబ్బంది పెడితే వైద్య సేవలు ఎలా అందిస్తారు..? డాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తే వారు వైద్య సేవలు ఎలా అందిస్తారని ఆస్పత్రి సూపరిండెంటెండ్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు అన్నారు. ఓపీ సేవలు నిలిపివేసి సూపరింటెండెంట్ చాంబర్లో సమావేశమైన డాక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించటం సరికాదన్నారు. డాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తానని, కలెక్టర్‌కు కూడా లేఖ అందజేస్తామని తెలిపారు. - వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్. -
అంధకారంలో ప్రాంతీయ ఆస్పత్రి
పాడేరు రూరల్: పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిని 200 పడకల వరకు పెంచి, జిల్లా స్థాయి ఆస్పత్రిగా మార్చినప్పటి నుంచి రోగులకు కష్టాలు అధికమయ్యాయి. పేరుకు జిల్లా స్థాయి ఆస్పత్రి అయినా కనీస స్థాయిలో కూడా సదుపాయాలు కల్పించలేదు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా జనరేటర్ సదుపాయం అందుబాటులో లేదు. బుధవారం రాత్రి 6.30 గంటల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 9గంటలైన విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. దీంతో రోగులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. చీకట్లోనే గడపవలసి వచ్చింది. సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన కొవ్వత్తుల వెలుతురు, సెల్ఫోన్ల లైటింగ్‌లోనే రాత్రి భోజనాలు చేశారు. ఈ వెలుతురులోనే సిబ్బంది వైద్యసేవలందించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం, జనరటర్ అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్లు తిరిగక రోగులు, బంధువులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రతి సారి ఇదే పరిస్థితి నెలకొంటోంది. కానీ వైద్య విధాన పరిషత్ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి జనరేటర్‌ను అందుబాటులోకి తేవాలని రోగులు, బంధువులు కోరుతున్నారు. -
ఆపరేషన్ థియేటర్లో నర్సుకు ముద్దుపెట్టాడు..
ఉజ్జయిని: ఆపరేషన్ థియేటర్లో విధులను మరిచి ప్రవర్తించిన ఓ ప్రభుత్వ వైద్యుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ నర్సును ఆపరేషన్ థియేటర్లో ముద్దుపెట్టుకున్నాడు. అయితే ఆపరేషన్ థియేటర్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఈ వీడియో తొలుత ఆస్పత్రికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం కలెక్టర్ శశాంక్ మిశ్రా దాకా వెళ్లడంతో.. ఆయన వెంటనే స్పందించారు. ఆ వైద్యుని విధుల నుంచి తొలగించడంతోపాటు, ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి మోహన్ మల్వియా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఆ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, స్థానిక పోలీసులకు ఈ కేసులో అధికారింగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
బైక్‌పై తల్లిశవంతో 35 కిలోమీటర్లు..
టికామ్‌గఢ్ : మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం కోసం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని నిరాకరించడంతో తన తల్లి శవాన్ని బైక్‌పై తరలించాడు ఓ వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మస్తాపూర్ గ్రామానికి చెందిన కున్వర్ భాయ్ అనే మహిళ గత ఆదివారం పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించాల్సిందిగా సూచించారు. పోస్టుమార్టం కోసం వాహన సదుపాయాన్ని కల్పించాల్సిందిగా కున్వర్ భాయ్ కుమారుడు రాజేశ్ ఆస్పత్రి సిబ్బందిని కోరాడు. దీనికి సిబ్బంది నిరాకరించింది. దీంతో గత్యంతరం లేక తన బైక్‌పై తల్లి శవాన్ని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టుమార్టం సెంటర్‌కు తరలించాడు. ఈ ఘటనను స్థానిక ప్రజలు వీడియో తీసు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పడా వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే బతికేదన్నారు. ‘పాముకాటుకు గురైన మహిళను మొదటగా స్థానికంగా ఉన్న దేవాలయంకు తరలించారని, అనంతరం ఆస్పత్రికి తరలించారు. సమయం మించిపోవడంతో ఆమె చనిపోయినట్లు విచారణలో తేలింది’ అని కలెక్టర్ తెలిపారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఉంటే వాహన సదుపాయం కల్పించేవాళ్లని పేర్కొన్నారు . -
మందుల కొరత
నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం కంటికి సంబంధించిన మందుల కొరత ఏర్పడింది. దీంతో రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. బయట కొనుక్కోవాల్సిందిగా సూచిస్తూ వైద్యులు రోగులకు మందులను రాసిస్తున్నారు. అయితే పేదలైన రోగులు మందులను బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు. కంటి ఆపరేషన్ల అనంతరం రోగులకు ఇచ్చే యాంటీ బయాటిక్ మందులు దాదాపు 20 రోజులుగా అందుబాటులో లేవు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సంప్రదించగా, తన దృష్టికి రాలేదన్నారు. కంటి చుక్కలమందు కరువు.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు 10 నుంచి 15 వరకు కంటి ఆపరేషన్లు జరుగుతాయి. కంటి ఆపరేషన్ అనంతరం రోగులకు కంటిలో ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు యాంటీబయాటిక్ మందులు అయిన గేటిక్విన్, గేట్–పిలను 30 రోజుల పాటు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఈ మందులు అందుబాటులో లేవు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నవారు మందులను బయటనే మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. కాగా ఆపరేషన్ చేయించుకున్న నాయికీబాయికి, మరికొందరికి సంబంధిత కంటి వైద్యుడు రెండు యాంటిబయాటిక్ చుక్కల మందులను రాసి ఇచ్చాడు. వీటిని బయట మెడికల్ షాపుల్లో మందులు కొనలేని పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఆస్పత్రికి మందుల సరఫరా లేదని వైద్య సిబ్బంది ద్వారా తెలిసింది. నా దృష్టికి రాలేదు కంటి ఆపరేషన్ చేయించుకున్నవారికి అందించే మందులు కొరతగా ఉందని నా దృష్టికి రాలేదు. సమస్య ఉంటే తక్షణమే మందులను అందుబాటులో ఉంచుతాం. బయట కొనుక్కోవాల్సిందిగా రాయడం సరైంది కాదు. అవసరమైన మందులను మేమే కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. – రాములు, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ఎన్నిసార్లు చెప్పినా డాక్టర్లు మారరా..
ఆకస్మిక తనిఖీల సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం రూ.1.67కోట్లతో వైద్య పరికరాలు నెల్లూరు(అర్బన్): బయోమెట్రిక్ సక్రమంగా వినియోగించడం లేదు..సకాలంలో ఓపీకి డాక్టర్లు రావడం లేదు..ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా.. అంటూ కలెక్టర్ ముత్యాలరాజు డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక దర్గామిట్టలోని సర్వజన ఆస్పత్రి(పెద్దాస్పత్రి)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వార్డును, రోగుల ఆహారాన్ని, బయోమెట్రిక్, సీసీ కెమెరాల పనితీరు, డాక్టర్ల హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోమెట్రిక్ సక్రమంగా పాటించని డాక్టర్ల జీతాల్లో కోత విధించాలని ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలను ఆదేశించారు. కుట్లు వేసే గదిని పరీశీలించగా అక్కడ డాక్టర్ లేకపోవడాన్ని గుర్తించి ఆరా తీశారు. సెక్యూరిటీ గార్డు వేస్తున్నారని తెలుసుకుని డాక్టర్లపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దాస్పత్రిని ఈ–ఆస్పత్రిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. పింఛన్ల కోసం సదరమ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని, వారం లోపు సదరమ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయాన్ని పరిశీలించి రోగులకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. బ్లడ్‌బ్యాంకు వివరాలు, ఏ రోగికి ఎక్కించారో పూర్తి వివరాలు రికార్డుల్లో ఉండాలన్నారు. తేడాలొస్తే ఇంటికి పంపుతామని హెచ్చరించారు. మరమ్మతులకు గురైన పరికరాలను ఎప్పటికప్పుడే బాగు చేయించి వైద్య సేవలందించాలని కోరారు. పరికరాలకు రూ.1.67 కోట్లు సీఎస్ఆర్ కింద ఆస్పత్రిలో వివిధ రకాల వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు రూ.1.67 కోట్లను కేటాయించామని తెలిపారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి సూపరింటెండెంట్ డా.నిర్మల, డా.కళారాణి తదితరులు ఉన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో మోడల్ లేబర్ రూం
ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో మోడల్ లేబర్ రూం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించడానికి బుధవారం యూనిసెఫ్ ప్రతినిధులు ప్రొద్దుటూరుకు వచ్చారు. యూనిసెఫ్ ప్రతినిధులు అభిషేక్, నితీష్‌లు ఆస్పత్రికి విచ్చేసి వసతులను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మాతా శిశుమరణాలను తగ్గించేందుకు మోడల్ లేబర్ రూంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ఆస్పత్రుల్లో ఉన్న వసతులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. జిల్లాలో ప్రొద్దుటూరుతోపాటు రాజంపేట, రిమ్స్ ఆస్పత్రులను పరిశీలించామని చెప్పారు. మోడల్ లేబర్ రూంలలో సుమారు రూ. 2 లక్షలు విలువ చేసే బెడ్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. ప్రసవం అనంతరం సుమారు 8 గంటల పాటు తల్లి, బిడ్డ ఇందులోనే విశ్రాంతి తీసుకుంటారని పేర్కొన్నారు. అంతేగాక ఇందులో భాగంగానే కంగారు మదర్ కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడి నుంచి కొన్ని కేసులను కడపకు తీసుకొని వెళ్లాల్సి వస్తోందని, దారిలో ఏదైనా జరిగి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వారు అభిప్రాయ పడ్డారు. అందువల్ల ఇక్కడ మోడల్ లేబర్ రూం అవసరమని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రాష్ట్రంలో మొదట కడప జిల్లాలోనే సర్వే చేస్తున్నామని తెలిపారు. సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో మోడల్ లేబర్ రూం చాలా అవసరమన్నారు. ప్రభుత్వం దీన్ని మంజూరు చేస్తే గర్భిణులకు ఇంకా మంచి వైద్యం అందుతుందని తెలిపారు. -
కరీంనగర్ జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యం వల్లే రాజనర్సయ్య మృతిచెందాడని ఆయన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాయి. ఇంజక్షన్ వికటించడంతోనే ఇలా జరిగిందని.. ఆయన మృతికి వైద్యులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. క రీంనగర్ పట్టణానికి చెందిన రాజనర్సయ్య(55) గత కొన్ని రోజులుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. దీంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి వైద్య సిబ్బంది ఆయనకు ఇంజక్షన్ చేశారు. బుధవారం ఉదయానికి ఆయన మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు వైద్యం వికటించడంతోనే ఆయన మృతిచెందాడని ఆస్పత్రి వర్గాలతో వాగ్వాదానికి దిగి తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ధర్నా చేస్తామని నిరిసనకు దిగాయి. -
టాటా.. అమ్మీ..
చిన్నారి ఊయలలో పడుకొని ఉండగా విరిగి పడిన బండరాయి మృత్యువాత పడిన చిన్నారి తొండలదిన్నె గ్రామంలో విషాదం ప్రొద్దుటూరు క్రైం/ రాజుపాళెం : ఊయలలో పడుకొని ఉండగా బండరాయి విరిగి పడి హనీఫా (5) అనే చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు టంగుటూరు గ్రామానికి చెందిన బాబాపీర్ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. అతను గత రెండేళ్ల నుంచి తొండలదిన్నె గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య చాను, మహబూబ్‌చాన్, హనీఫా అనే కుమార్తెలతో పాటు మహబూబ్‌బాషా అనే కుమారుడు ఉన్నాడు. బాబాపీర్ ప్రతి రోజూ ఉదయాన్నే ప్రొద్దుటూరుకు వస్తాడు. సాయంత్రం వరకూ ఆటో తోలుకొని తిరిగి రాత్రికి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో శనివారం ఉదయాన్నే అతను ఆటో తీసుకొని ప్రొద్దుటూరుకు వెళ్లాడు. భార్య కూలి పనికి వెళ్లింది. ఊయలలో పడుకొని ఉండగా విషాదం.. బాబాపీర్ పెద్ద కుమార్తె మాబుచాన్, కుమారుడు షఫీ పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. చిన్న కుమార్తె హనీఫా అంగన్వాడి కేంద్రానికి వెళ్తుంటుంది. వేసవి సెలవులు కావడంతో పిల్లలందరూ ఇంటి వద్దనే ఆడుకుంటున్నారు. వారి ఇంటి ముందు పాత ఇంటికి సంబంధించిన రెండు నిలువు బండరాళ్లు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని చీరతో ఊయల కట్టారు. ఈ ఊయలలోనే పడుకొని పిల్లలందరూ ఆడుకుంటుంటారు. ఈ క్రమంలో శనివారం హనీఫాను ఊయలలో పడుకోబెట్టి చిన్నారి సోదరుడు షఫీ, పెదనాన్న కుమారుడు మహబూబ్‌బాషాలు ఊపుతున్నారు. కొద్ది సేపటి తర్వాత ఒక వైపు ఉన్న బండ రాయి విరిగి ఊయలలో ఉన్న హనీఫాపై పడింది. ఊయల పక్కనే ఉన్న షఫీ, మహబూబ్బాషాలకు కూడా ఈ సంఘటలో గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బంధువులు 108 వాహనంలో ముగ్గురు పిల్లలను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి హనీఫాను పరిశీలించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. కూతురు చనిపోయిన విషయం తండ్రికి తెలియక.. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న బాబాపీర్ వద్ద సెల్‌ఫోన్ లేదు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అతను రాత్రి ఇంటికి వస్తాడు. ఈ క్రమంలో శనివారం హనీఫా చనిపోయిన విషయం తండ్రికి చెప్పేందుకు ప్రొద్దుటూరు పట్టణంలో బాబాపీర్ కోసం తిరగాల్సి వచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం సమయంలో కుమార్తె చనిపోయిన విషయం అతనికి తెలిసింది. బాయ్ మా.. అంటూ టాటా చెప్పావే తల్లీ.. హనీఫా మృతదేహాన్ని వారి స్వగ్రామమైన టంగుటూరుకు తరలించారు. తల్లి చాను కుమార్తె మృతదేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయింది. ఉదయం తల్లి పనికి వెళ్లేటప్పుడు హనీఫా బాయ్ మా.. అంటూ టాటా చెప్పింది. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ తల్లి రోదించసాగింది. చిన్నారి మృతి చెందిన సంఘటనతో తొండలదిన్నె, టంగుటూరు గ్రామాల్లో విషాదం నెలకొంది. -
డబ్బిస్తేనే బిడ్డను చూపించారు
కాన్పు చేస్తే డబ్బు అడుగుతున్నారు రెండు రోజుల నుంచి డాక్టర్ రాలేదని ఓ వృద్ధుడి ఆవేదన ఆస్పత్రిలో రోగుల సమస్యలు ఆలకించిన ఎమ్మెల్యే ► నా పేరు నాగ తులసి సార్. మాది జమ్మలమడుగు. రెండు రోజుల క్రితం కాన్పు కోసం ఆస్పత్రిలో చేరాను. మగబిడ్డ పుట్టాడు. రూ. వెయ్యి ఇస్తే గానీ లేబర్ వార్డులో సిబ్బంది బిడ్డను చూపించలేదు. ► నాపేరు శ్వేత. మాది శ్రీనివాసనగర్ మూడు రోజుల క్రితం ప్రసవ కోసం ఆస్పత్రిలో చేరాను. రక్తం తక్కువగా ఉందని, బయట ఎక్కించుకుని రమ్మని ఆస్పత్రి సిబ్బంది బయటికి పంపించారు. దాతను తీసుకొని వచ్చిన తరువాత ఆస్పత్రిలో చేర్పించుకున్నారు. ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో ఎదురవుతున్న ఇక్కట్ల ను పలువురు రోగులు ఇదే తరహాలో మొరపెట్టుకున్నారు. ఆస్పత్రి పరిశీలనకు వచ్చిన ప్రొ ద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వద్ద శుక్రవారం తమ గోడు వెళ్లబోసుకున్నారు. ► కొన్నేళ్ల నుంచి పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నా. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల రెండు నెలల నుంచి పనికి రాలేదు. తర్వాత వచ్చినా, తనను పనిలో చేర్పించుకోలేదని మరియమ్మ వాపోయింది. ► మోడంపల్లెకు చెందిన గౌసియా షుగర్ వ్యాధితో ఆస్పత్రిలో చేరింది. క్యాజువాలిటీలో ఉన్న ఆమెను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆమెకు పూర్తిగా నయం చేయాలని, అవసరమైతే ప్రయివేటు ఆస్పత్రికైనా తీసుకెళ్లి చికిత్స చేయించాలని వ్యక్తిగత కార్యదర్శి పెంచలయ్యను ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశించారు. ► జమ్మలమడుగుకు చెందిన రామన్న షుగర్ వ్యాధితో ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలోని మందులు సరిపోకపోవడంతో అతను బయ ట డబ్బులు పెట్టి కొనాల్సి వస్తోంది. ఈ విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే షుగర్ వ్యాధికి కూడా మందులు లేకుంటే ఎలా అని ఆస్పత్రి అధికారులతో అన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి కనీస అవసరాలకు ఉపయోగపడే మందులు తెప్పించాలని చెప్పారు. ► మూడిండ్లపల్లెకు చెందిన ఐదో తరగతి వి ద్యార్థి రాజుకుమార్‌ను ఎమ్మెల్యే పరామర్శిం చారు. వైద్యం బాగా అందుతుందాని బాలుడి ని అడిగి తెలుసుకున్నారు. ఎర్రన్నకొట్టాలుకు చెందిన సుబ్బలక్షుమ్మ ఆయాసంతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. సరైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని సూపరింటెండెంట్ బుసిరెడ్డితో అన్నారు. ► ప్రొద్దుటూరుకు చెందిన రాజన్న వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చావాలనుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు. బతికి ఉండి ఏమైనా సాధించవచ్చని అతనితో అన్నారు. ► ఆస్పత్రి ప్రాంగణంలో మదనపల్లెకు చెందిన మునెమ్మ అనే వృద్ధురాలు తీవ్ర నీరసంతో పడిపోయింది. ఆమెను చూసిన ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చేర్పించి వైద్య సహాయం చేయాలని సూపరింటెండెంట్ బుసిరెడ్డి, ఆర్ఎంవో డేవిడ్ు సూచించారు. -
రక్త నిధి.. ఏదీ?
- జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుకు రెండేళ్ల క్రితం శంకుస్థాపన - సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి లెసైన్స్ జారీలో జాప్యం - సత్వర ఏర్పాటుకు చర్యలు తీసుకోని ప్రజాప్రతినిధులు - నెలకు 30 నుంచి 40 కేసులు హైదరాబాద్‌కు రెఫర్ తాండూరు: తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కోసం 2012 డిసెంబర్లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎయిర్ కండీషన్లతోపాటు బ్లడ్ బ్యాంక్ కు అవసరమైన సుమారు రూ.40లక్షల విలువైన మెటీరియల్‌ను ఎంఎస్ఐడీసీ (మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్) తాండూరుకు పంపించింది. ఈ మెటీరియల్ అప్పటి నుంచి స్టోర్‌రూంలోనే మగ్గుతోంది. దాదాపు రెండేళ్లు దాటినా రక్తనిధి కేంద్రం అందుబాటులోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి వైద్యశాఖ అధికారులు ఆస్పత్రిని సందర్శించి సాధ్యమైనంత తొందరలో బ్లడ్ బ్యాంకును అందుబాటులోకి తెస్తామని మాటిచ్చారు. అయితే సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు లెసైన్స్ జారీ కావాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణం వల్లే బ్లడ్ బ్యాంకు ఏర్పాటులో జాప్యం జరుగుతోందని అంటున్నారు. అయితే లెసైన్స్ వచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ప్రతినెలా 300పైగా కాన్పులు, 107 సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇక ఆర్థోపెడిక్ కేసులు కూడా అధికంగానే వస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే మహిళల్లో చాలామందికి రక్తహీనత సమస్య ఉంటోంది. అటువంటి వారి బంధువులు వికారాబాద్ లేదా హైదరాబాద్‌కు వెళ్లి రక్తాన్ని తీసుకువస్తున్నారు. లేదంటే దాతల నుంచి సేకరిస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లి రావడానికి సమయం పడుతోందని, ఒక్కోసారి అక్కడ కూడా సరైన వ్యవధిలో లభ్యంకాక ఇబ్బందులు పడుతున్నామని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని పరిస్థితుల్లో వైద్యులు రోగులును హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. నెలకు సుమారు 30 నుంచి 40 కేసులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. జిల్లాలోని పెద్ద ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇంకా లెసైన్స్ రాలేదు: డా.వెంకటరమణప్ప, ఆస్పత్రి సూపరింటెండెంట్ జిల్లా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు అంతా సిద్ధం చేశాం. మెటీరియల్‌తోపాటు ప్రత్యేక గది కూడా ఉంది. సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి లెసైన్స్ రావాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే మెటీరియల్ వచ్చింది. -
డీఎంఈ పరిధిలోకి జిల్లా ఆస్పత్రి
నిజామాబాద్‌అర్బన్ : ఎట్టకేలకు జిల్లా ఆస్పత్రి వైద్యవిధాన పరిషత్ నుంచి డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వెళ్లింది. గురువారం ప్రభుత్వం జీవో నం.14ను విడుదల చేసింది. దీని ప్రకారం మెడికల్ కళాశాలకు డిప్యుటేషన్‌పై వచ్చిన వారు, జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న వారు మెడికల్ కళాశాల పరిధిలోనే ఉన్నట్లు పరిగణించాలని డీఎంఈ పుట్ట శ్రీనివాస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొంత కాలంగా ఆస్పత్రి అనుసంధానం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు సంవత్సరాల తరువాత ఈ అనుసంధానం పూర్తయింది. జిల్లాలో 2008 సంవత్సరంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ షష్టిపుర్తి వేడుకలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు వచ్చారు. నాడు ఖలీల్‌వాడి గ్రౌండ్లో జరిగిన సభలో జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే ఏడాదిలో నగరంలోని ఖిల్లా రామాయలం వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం పరిస్థితులు మారడంతో కళాశాలను ఖలీల్‌వాడీ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. 2009 డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కళాశాలకు మళ్లీ శంకుస్థాపన చేశారు. 2010 నాటికి పనులు పూర్తి చేసి 2011 లో తరగతి బోధన చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వం రూ. 100 కోట్లను విడుదల చేసింది. జాప్యం ఏర్పడి పనులు 2013 వరకు కొనసాగాయి. 2013 ఆగస్టులో తొలిసారిగా 100 మంది విద్యార్థులతో తరగతుల బోధన ప్రారంభమైంది. వాస్తవానికి ఎంసీఐ కళాశాల అనుమతి కోసం సంవత్సరానికి మూడు సార్లు చొప్పున తనిఖీలు చేసింది. ఈ క్రమంలోనే జిల్లా ఆస్పత్రిని డీఎంఈ ఆధీనంలోకి మార్చవల్సి ఉంది. అరుుతే కొన్ని కారణాల వల్ల ఆస్పత్రిని మార్చడంలో ఆలస్యం ఎదురైంది. అంతేకాకుండా మెడికల్ కళాశాలకు 882 పోస్టుల భర్తీకి సంబంధించి 150 జీవోను నాటి ప్రభుత్వం విడుదల చేసింది. మరో వైపు మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీ లేక, డిప్యూటేషన్‌పై ఉద్యోగులు లేక సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో జిల్లా ఆస్పత్రి ఉండడంతో ఉద్యోగుల బదలాయింపు కుదరలేదు. 120 మంది ప్రొఫెసర్లు ఆస్పత్రి మెడికల్ కాళాశాలకు అనుసంధానమైనందున మెరుగైన వైద్యసేవలు అందుతాయని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉండడంతో మెడికల్ కళాశాలకు కేటాయించబడిన ప్రొఫెసర్లు, వైద్యులు పనిచేసేందుకు ఇష్టపడలేదు. సుమారు 120 మంది ప్రొఫెసర్లను ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నియమించింది. వీరు ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు వైద్యవిధాన పరిషత్‌కు చెందిన వారు ఉండడంతో వారి ఆధీనంలో తాము ఎందుకు పనిచేయాలంటూ మొండికేశారు. ఆస్పత్రి సూపరిండెంట్ భీంసింగ్ విధులకు రానివారికి గైర్హాజరేయడంతో ప్రొఫెసర్లు కోపోద్రిక్తులయ్యారు. రాష్ట్ర వైద్యుల సంఘాన్ని పిలిపించి వైద్య విధాన పరిషత్ అధికారులపై మందలింపజేశారు. ప్రస్తుతం కూడా ప్రొఫెసర్లు 60 నుండి 70 వరకు గైర్హాజరవుతున్నారు. విధి నిర్వహణలో బాధ్యతలు తమవి కావన్నట్టు, జిల్లా ఆస్పత్రి, కళాశాల అధికారులు తప్పించుకున్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాలకు మూడవ సంవత్సరం అనుమతికి ఆటంకాలు లేకుండా పోయాయి. ఆస్పత్రి మెడికల్ కళాశాలకు అనుసంధానం కావడంతో ఎంసీఐ కూడా ప్రశ్నించే అవకాశం ఉండదు. డీఎన్బీ కోర్సుల ఏర్పాటుకు కూడా అనుమతి సులవుగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆస్పత్రికి డీఎంఈ నుంచినిధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్పత్రిలో పోస్టుల భర్తీ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది కిందట ప్రభుత్వం 882 పోస్టులకు సంబంధించి 150 జీవోను విడుదల చేసింది. ఆస్పత్రి అనుసంధానం లేకపోవడం, ఇతరాత్ర కారణాల వల్ల పోస్టుల భర్తీ జరుగలేదు. -
ఎవరా నలుగురు..?
ఆపరేషన్ విజయవంతమైంది కానీ, రోగి మరణించాడు అన్నట్టుంది జిల్లాకేంద్రాస్పత్రిపై అధికారుల తీరు. లంచం ఇవ్వలేక తండ్రీ కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నానా హంగామా చేసి విచారణ అధికారిని నియమించారు. ఘటనకు నలుగురు బాధ్యులంటూ ఆ అధికారి తేల్చారు. వారిపై చర్య తీసుకున్నట్టు కలెక్టర్ కూడా ప్రకటించారు. కానీ, ఆ నలుగురు ఎవరనేది ఎవరికీ తెలియదు. కనీసం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉన్న జెడ్పీ చైర్మన్, ఆస్పత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్‌లకు కూడా తెలియకపోవడం గమనార్హం. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా ఆస్పత్రిలో లంచావతారుల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలైన సంఘటనపై నలుగురిపై చర్య తీసుకున్నామని చెబుతున్నా వారి పేర్లు మాత్రం బయట పెట్టడం లేదు. సంఘటన జరిగిన రోజు ఆగమేఘాల మీద ప్రభుత్వ యంత్రాంగం రెండు రోజుల పాటు హడావిడి చేసింది. ప్రజాప్రతి నిధులు ఆస్పత్రి చుట్టూ క్యూ కట్టారు. ఈ దుర్ఘటనపై జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేక విచారణ జరిపించారు. నివేదిక అంది పక్షంరోజులు గడుస్తున్నా ఘటనకు సంబంధించిన వ్యక్తులపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. దీనిపై కలెక్టర్ నాలుగు రోజుల క్రితం విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రికి ఘటనకు సంబంధించి నలుగురిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ నలుగురు ఎవరనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌లను సంప్రదించినా తమకు తెలియదంటున్నారు. జిల్లా ఆస్పత్రిలోని సిబ్బంది అంతా యధావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సస్పెన్స్‌గా మారింది. అసలేం జరిగిందంటే..! జిల్లా కేంద్రంలోని కురిహినిశెట్టి కాలనీకి చెందిన కొండపురం చెన్నకేశవులు (30) తాపీమేస్త్రీ. రెండో కా న్పు కోసం భార్య నాగలక్ష్మిని జనవరి 19న జిల్లా ఆ స్పత్రికి తీసుకెళ్లాడు. అదే నెల 20న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆ డబిడ్డ పుడితే రూ.500, మగబిడ్డ పుడితే.. రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా చెన్నకేశవులును కూడా లంచం కోసం పీడించారు. అయితే, ఆ డబ్బులు ఇవ్వలేక ఆందోళనకు గురైన చెన్నకేశవులు విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలోజరుగుతున్న దారుణాన్ని సూసైడ్ నోట్ రాసి తన మూడేళ్ల కూతురుతో కలిసి జనవరి 22న రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనపై ప్రత్యేక విచారణ.. లంచావతారుల ఆగడాలకు తండ్రీ కూతురు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల మీద కదలివచ్చింది. దీని పై జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేక దృష్టి సారించి... ఏజేసీ రాజారాం నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. ఆయన కూడా దీనిపై వాస్తవ పరిస్థితులను వివరిస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆస్పత్రిలో లంచాల వసూలు భారీగానే ఉన్నట్లు ఏజేసీ ఇచ్చిన రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బంది పేర్లను పేర్కొంటూ కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఈ విషయమై చెన్నకేశవులు భార్య భాగ్యలక్ష్మి స్వయంగా కలెక్టర్ శ్రీదేవిని కలిసి తన భర్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నలుగురిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయితే ఆ నలుగురు ఎవరనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ శామ్యూల్‌ను, డీసీహెచ్ పద్మజలను సంప్రదిస్తే తమకు తెలియదంటున్నారు. ఎవరిపైన చర్యలు తీసుకున్నారో తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలూ అందలేదని వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఆస్పత్రిలోని సిబ్బంది మాత్రం అందరూ యధావిధిగా విధులకు హాజరవుతున్నారు. కలెక్టర్ ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది అంతా సస్పెన్స్‌గా మారింది. -
మళ్లీ అడుగంటిన రక్త నిల్వలు
జిల్లాకు పెద్ద దిక్కు రిమ్స్ ఆసుపత్రి. రోగం ముదిరినా ... రోడ్డు ప్రమాదం జరిగినా ప్రాణం కాపాడుకోవడానికి ఎంతో ఆశతో వస్తారు ... కానీ ఇక్కడే రిక్తహస్తం ఎదురైతే... అదే జరుగుతోంది... నిధులు లేక ఆధునిక వైద్య పరికరాలు లేకపోతే సర్లే అనుకోవచ్చు ... వైద్య నిపుణుల నియామకం లేకపోతే ఉన్నవాళ్లతో ఏదోలా వైద్యం చేయించుకోవచ్చు ... కానీ ఉండాల్సిన రక్త నిల్వలే కొరవడితే ఎవరిదీ పాపం? సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే పరిస్థితి తలెత్తితే తొలుత సమస్య తీవ్రతను ‘సాక్షి’ గుర్తించింది. ఈ సమస్యను వార్తగా కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకుంది. వరుస కథనాలతో ఇటు అధికార యంత్రాంగాన్ని, అటు స్వచ్ఛంద సంస్థలను, కళాశాల ప్రతినిధులను కదిలించింది. సమస్య తీవ్రతను తెలుసుకున్నవాళ్లంతా తలో చేయి వేశారు. రక్తదాన శిబిరాలతో తమ దాతృత్వాన్ని చూపించారు. జిల్లా కలెక్టర్ విజయకుమార్, అప్పటి డీఎంహెచ్ఓ, ఇతర అధికారులు నడుం బిగించి ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆగిపోతున్న శ్వాసకు బాసటగా నిలిచారు. ఆ సంతోషం పట్టుమని ఆరునెలలు కూడా మిగలలేదు. సజావుగా సాగుతుందనుకున్న బ్లడ్ బ్యాంకులకు మళ్లీ రక్త హీనత ఏర్పడింది. మిణుకు, మిణుకుమంటూ కొట్టుమిట్టాడుతున్న పెద్దప్రాణానికి చేతులొడ్డాల్సిన తరుణం ఆసన్నమయింది. ఒంగోలు సెంట్రల్ : రిమ్స్ రక్త నిధిలో ప్రతి రోజూ 50 యూనిట్లకు తక్కువకాకుండా రక్తం నిల్వ ఉండాలి. కానీ 30 యూనిట్ల రక్తం ఉండడడం గనమవుతోంది. అధికారుల నిర్లక్ష్య ఫలితమే దీనికి కారణం. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌కు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఉండటంతోపాటు జెడ్పీ సీఈఓ ఇన్చార్జిగా ఉన్నారు. స్టెప్ అధికారులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు రెడ్ క్రాస్కే వచ్చిన రక్తం తరలిస్తుండడంతో అక్కడి బ్లడ్‌బ్యాంక్‌లో నిల్వలు మాత్రం ప్రజల అవసరాలకు సరిపోతున్నాయి. అంటే 35 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటోంది. కానీ రిమ్స్ రక్తనిధి మాత్రం నిండుకుంది. ఇలా తగ్గుతున్న సమయంలోనే సంబంధిత రిమ్స్ అధికారులు గుర్తించి పరిస్థితి తీవ్రతను కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను చక్కదిద్దాలి. నిర్లక్ష్యం ఆవహించడంతో చేతులు కాలుతున్నా చర్యలు మాత్రం లేకపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడుతోంది. గత నెలలో రెండు క్యాంపులు నిర్వహించినా కేవలం 44 యూనిట్ల రక్తం మాత్రమే సమకూరింది. అన్ని పరీక్షలు చేసి 40 యూనిట్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి రోజూ 50కిపైగా శస్త్రచికిత్సలు రిమ్స్‌లో ప్రతి రోజూ 50కిపైగా శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ఇన్ పేషంట్లుగా ఉన్న కొన్ని రకాల వ్యాధులతో బాధ పడుతున్న వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. వీటికితోడు రెండు సిజేరియన్ కాన్పులు, మరో నాలుగు సహజ కాన్పులు జరుగుతుంటాయి. జిల్లాలో జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు, ఇతరత్రా రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలతో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో నిలవాల్సిన ప్రాణం కూడా గాలిలో కలిసిపోతోంది. ‘ప్రయివేటు’వైపు వైపు పరుగులు ప్రభుత్వ ఆసుపత్రుల బలహీనతలను ఆసరా చేసుకొని ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు దోపిడీకి తెరదీస్తున్నాయి. రోగి అవసరాన్ని బట్టి వారి బంధువుల వద్ద నగరంలోని ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు నిర్ణీత ధరకంటే అధికంగా వసూలు చేస్తున్నారు. యూనిట్‌కు రూ.3 వేలు, అవసరమైన గ్రూపు రక్తం కావాలంటే ఇంకా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఎవరైనా రక్తం ప్యాకెట్ కోసం వస్తే అదే పరిణామంలో రక్తం ఇస్తే డబ్బులు చెల్లించనవసరం లేదు. దీన్నే రిప్లేస్మెంట్ అంటారు. కానీ కొన్ని ప్రయివేటు బ్లడ్‌బ్యాంకులు మాత్రం రీ ప్లేస్‌మెంట్‌కు ససేమిరా అంటున్నాయి. డబ్బులు చేతిలో పడితేనే బ్యాగ్ ఇస్తామనడంతో పేదల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించి చైతన్యం రగిలించాల్సిన రక్త నిధి కేంద్రాల్లో పని చేస్తున్న మోటివేటర్స్ ఆ బాధ్యతనే విస్మరిస్తున్నారు. కొరత వాస్తవమే, అందరూ స్పందించాలి. డాక్టర్ అదిలక్ష్మి ఎం.డి రిమ్స్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి రక్తం తక్కువ ఉన్న మాట నిజమే. రీ ప్లేస్ మెంట్ విధానం ద్వారానే రక్తాన్ని సేకరిస్తున్నాం. ఉద్యోగులు, విధ్యార్దులు స్పందించి రక్తదానం చేస్తే ఆపదలో ఉన్నవారికి సహాయం చేసినవారవుతారు. రక్తదానంతో మరింత ఆరోగ్యం రక్తదానం చేస్తే బలహీనమైపోతామనే భయం చాలా మందిలో ఉంది. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ పురుషులు 18-60 సంవత్సరాల వయస్సులోపుండీ 45 కేజీలకుపైగా బరవున్న వారరందరూ రక్తం ఇవ్వవచ్చు. సంవత్సరానికి మూడుసార్లు ఇస్తే ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు వైద్య నిపుణులు. -
నేటినుంచి ‘సదరమ్’
⇒ తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో నిర్వహణ ⇒ మండలాల వారీగా తేదీలు ఖరారు తాండూరు రూరల్: మళ్లీ సదరమ్ క్యాంపు నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం నుంచి ఫిబ్రవరి 21 వరకు తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో శిబిరం నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల సదరమ్ క్యాంపులు ఎత్తివేయడంతో జిల్లాలోని పలుచోట్ల వికలాంగులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నెల 18న వివిధ మండలాల నుంచి భారీగా తాండూరులోని జిల్లా ఆస్పత్రికి వచ్చిన వికలాంగులు సదరమ్ క్యాంపు ఎత్తివేశారని తెలుసుకుని ధర్నాకు దిగారు. ఆగ్రహంతో ర్యాలీగా వెళ్లి మంత్రి మహేందర్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అధికారులు సదరమ్ క్యాంపును తిరిగి నిర్వహించాలని మండలాల వారీగా తేదీలను ఖరారు చేశారు. శారీరక వైకల్యం, అంధులు, చెవుడు, మూగ వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సదరమ్ ఇన్చార్జి బాలకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన మరికొన్ని విషయాలు.. ⇒ ఈ నెల 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 21 వరకు క్యాంపు కొనసాగుతుంది. ⇒ సదరం క్యాంపునకు వచ్చే వికలాంగులు ఆయా మండలాల్లోని ఐకేపీ సిబ్బంది వద్ద టోకెన్ తీసుకుని రావాలి. ⇒ టోకెన్‌పై ఎంవీఎస్ ముద్రతోపాటు సీసీ సంతకం తప్పనిసరి. ⇒ గతంలో వికలాంగత్వ సర్టిఫికెట్లు ఉన్నవారు క్యాంపునకు రావొద్దు. ⇒ కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆయా మండలాలకు చెందిన వారు క్యాంపునకు హాజరుకావాలి. -
మారండి.. మార్చండి
జిల్లా ఆస్పత్రి సిబ్బంది పనితీరులో మార్పు రావాలని, హాస్పిట ల్లో సరైన సేవలు అందడం లేదంటూ ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని చెరిపేయాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా సూచించారు. వైద్యులు, స్టాఫ్‌లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు. డాక్టర్లను దేవుళ్లుగా భావించి వైద్యం కోసం దవాఖానకు వచ్చే నిరుపేదలకు మెరుగైన చికిత్సలు చేయాలని జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి కోరారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా అన్నారు. ఆయన అధ్యక్షతన మంగళవారం పట్టణంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ ప్రథమ పౌరురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సమాచారం అందించారా..? అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్‌ను ప్రశ్నించారు. దీనిపై తడబడ్డ ఆయన సమాధానం దాటవేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్సలు అందించడానికి అవసరమైన మందులు, పరికరాలు, సిబ్బంది వివరాలను వివరాలను ఈ నెల 16 లోపు తనకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయని, ఈ అపవాదును తొలగించడానికి ప్రతిఒక్క రూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని, కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసినందున సబ్ కాంట్రాక్ట్‌ను తొలగించి టెండర్లు పిలవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మరుగుదొడ్ల మరమ్మతులు, సీసీ కెమెరాల మంజూరు, 250 పడకల ఆస్పత్రిని 500 పడకల స్థాయికి పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు అవసరమైన వివరాాలపై నివేదికలు తెప్పించుకుని ఇవ్వాలని డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, ఎన్ఆర్హెచ్ఎం డీపీఓలకు సూచించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రిలో బయోమెట్రిక్ సిస్టమ్, హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీ, రూఫ్ లీకేజీ మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈఈ రఘును ఆదేశించారు. ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో వెంటీలెటర్లను అమర్చుకోవాలని, ఎంతమంది సిబ్బంది అవసరమో తెలియజేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన కోసం రూ.5 లక్షలను ఎన్హెచ్ఎం నిధులను ఖర్చు చేసేందుకు కమిటీ ఆమోదించింది. జడ్పీ చైర్ పర్సన్ రాజమణి మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులతో ప్రేమతో మాట్లాడి వారికి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యే అసహనం... డిప్యూటీ సీఎం పర్యటించి ఆస్పత్రి సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజునే సమయపాలన పాటించకపోవడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్లో మార్పు రాకుంటే శాఖ పరమైన చర్యలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల కో-ఆర్డినేటర్ నరేంద్రబాబు, ఆర్ఎంఓ మురహరి, డీఎమ్‌అండ్‌హెచ్‌ఓ బాలాజీ పవార్, ఎన్హెచ్ఎం డీపీఓ జగన్నాథరెడ్డి, టీఎస్ ఎస్ఎమ్ఐడీసీ రఘు, జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ గయాసొద్దీన్, వివిధ విభాగాల డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్డుల సందర్శన... జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని వివిధ విభాగాలను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మంగళవారం ఉదయం సందర్శించారు. ఓపీ యూనిట్‌ను, ఇన్ బర్న్, ఔట్ బర్న్, వార్డులను గైనిక్, శిశుసంజీవని, ఎన్ఆర్సీ యూనిట్లు, ఐసీయూ యూనిట్లను పరిశీలించారు. -
అసలిది ఆస్పత్రేనా?
పారిశుద్ధ్యంపై ఇంత నిర్లక్ష్యమా.. * జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్ర హం * తీరు మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరిక * జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని వెల్లడి సంగారెడ్డి అర్బన్: ‘అసలిది ఆస్పత్రేనా.. పారిశుద్ధ్య నిర్వహణ ఇలా ఉంటే రోగాలు నయమవడం కాదు...కొత్త వ్యాధులొస్తాయి...ప్రైవేటు ఆస్పత్రులు ఇలాగే ఉంటాయా...అసలు మీరు పనిచేస్తున్నారా.. మీరే సరిగా పనిచేస్తే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటుందా...ప్రధానమంత్రే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నారు.. మీరు అంత కంటే ఎక్కువా..సిబ్బంది పనిచెప్పేముందు మనమూ చేసి చూపాలి’ అంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మండిపడ్డారు. సోమవారం ఆయన సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులన్నీ తిరిగి పరిశీలించారు. గైనిక్ ఓపి, నవజాత శిశు సంరక్షణ వార్డు తదితర విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని పిల్లల వార్డులో పారిశుద్ధ్యం కొరవడటం, గోడలు బూజు పట్టి ఉండటంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడైనా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించారా అని ప్రశ్నించారు. అలసత్వం వీడి రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతకుముందు ఆస్పత్రి సిబ్బంది ఆయనకు స్వాగతం పలకగా ఏజేసీ మూర్తి పుష్పగుచ్ఛం అందజేశారు. మెడికల్ కళాశాల మంజూరుకు చర్యలు సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం రాజయ్య వెల్లడించారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డిలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇది వరకే కోరారన్నారు. వైద్యకళాశాల ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని 250 నుంచి 500 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు అందాయని, త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మెరుగైన వైద్యం అందించాలి సర్కార్ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఉందన్నారు. సిబ్బందిలో చిత్తశుద్ధి లోపిస్తే, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదన్నారు. ఆస్పత్రిలో పనిచేసే నాల్గవ తరగతి ఉద్యోగుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందన్నారు. వారు పనితీరు మెరుగుపర్చుకోకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. పారిశుద్ధ్య పనులు కాంట్రాక్టర్ చేస్తున్నట్లయితేఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే వైద్యులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించాలన్నారు. డ్యూటీ డాక్టర్ 24 గంటలూ వైద్యసేవలందించాలన్నారు. కాల్ డ్యూటీ డాక్టర్ పనిచేసే చోట అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వైద్యులైనా సరే ఇంటికి సాగనంపుతామన్నారు. జిల్లాలో వైద్యుల కొరత కారణంగా 80 శాతం రోగులు హైదరాబాద్‌లోనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 22 వైద్యాధికారుల పోస్టులను త్వరలో భ ర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రివాల్వింగ్ ఫండ్ రూ.28 లక్షలు ఉన్నాయని ప్రతిపాదనలు పంపిస్తే ఆ నిధులు మంజూరు చేయిస్తామన్నారు. హెచ్‌డీఎస్‌లో ఉన్న రూ.5 లక్షలు కనీస అవసరాలు తీర్చేందుకు కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు విరివిగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. డిప్యూటీ సీఎం వెంట జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ నాయకులు పిట్టెల రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు మనోహర్ గౌడ్, అదనపు జే సీ మూర్తి, డీఎంహెచ్ఓ డా.బాలాజీ పవార్, ఆర్ఎంఓ డా.మురహరి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధుకర్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌కుమార్, ఆస్పత్రి వైద్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఏవీఎస్.. పక్కదారి?
ప్రమాదాలను కూడా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. వర్షాకాలంలో పాముకాటుకు గురైన వారు ఎక్కువగా ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది వైద్య సిబ్బంది దానికి విరుగుడుగా వాడే ఏవీఎస్ ఇంజక్షన్లను బయటకు అమ్ముకుంటున్నారు. పాముకాటుకు గురైన వారి సంఖ్య... వాడిన ఇంజక్షన్ల సంఖ్యకు మధ్య తేడా ఉండడమే దీనికి నిదర్శనం. సాక్షి, మహబూబ్‌నగర్: అది చాలా అరుదుగా వినియోగించే మందు.. ఓ మాటలో చెప్పాలంటే పాముకాటు బాధితులకు ప్రాణం పోసే దివ్య ఔషధం. ఇంతటి విలువైన యాంటీ స్నేక్ వీనమ్(ఏవీఎస్) వాయల్స్ జిల్లా ఆస్పత్రిలో పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాటుకాటు బాధితుల సంఖ్య, వినియోగించిన ఏవీఎస్ వాయల్స్‌ను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పాటుకాటు బారినపడే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తుంటాయి. దీనినుంచి బాధితులను రక్షించేందుకు విరుగుడుగా ఉపయోగించే యాంటీ స్నేక్ వీనమ్ మందును ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతుంది. కానీ మహబూబ్‌నగర్‌లోని ప్రధాన ఆస్పత్రి నుంచి బహిరంగమార్కెట్‌కు అవి తరలుతున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.. జిల్లా ఆస్పత్రిలోని రిజిస్టర్లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది అన్ని పీహెచ్సీలలో కలిపి 41కేసులు నమోదైనట్లు డీఎంహెచ్ఓ కార్యాలయం పేర్కొంది. కానీ జిల్లా ఆస్పత్రిలో మాత్రం ఇప్పటివరకు 247 పాముకాటు కేసులను నమోదు చేశారు. అయితే ఇక్కడ విషయమేమంటే పాముకాటుకు గురవుతున్న వారి ఎక్కువగా గ్రామీణులే ఉంటున్నారు. వారు మొదట పీహెచ్‌సీలను ఆశ్రయిస్తారు. అక్కడ సరైన సదుపాయాలు కల్పించలేని పక్షంలో ఏరియా ఆస్పత్రికి.. లేదంటే జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. కానీ పీహెచ్‌సీల్లో నమోదైన కేసుల కంటే జిల్లా ఆస్పత్రిలో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే వెయ్యి ఏవీఎస్ వాయల్స్ ఉపయోగించినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. గతేడాది అంతే : 2013లో జిల్లాలో పీహెచ్‌సీల్లో 196 కేసులు నమోదైతే, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో 474మంది బాధితులకు చికిత్స అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఈ ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 2,809 ఏవీఎస్‌లను ఉపయోగించినట్లు లెక్కలు వేశారు. అయితే ఈ విషయమై అప్పుడే అనుమానాలు తలెత్తడంతో వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ విచారణ కూడా చేపట్టింది. సంస్థ ఎండీ స్వయంగా స్థానిక ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. అప్పట్లో అవకతవకలు జరిగాయా? లేదా అన్నది మాత్రం బయటకు వెలువడలేదు. తాజాగా ఇదే ఆస్పత్రిలో నమోదైన పాముకాటు కేసులకు మించి ఏవీఎస్‌లను వినియోగించడాన్ని చూస్తే మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా కొందరి చేతివాటం వల్ల ఈ విలువైన మందు పక్కదారి పడుతుందనే విషయం తేటతెల్లమవుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. ఆస్పత్రి నుంచి మందులు బయట కు వెళ్లే ప్రసక్తేలేదు. యాంటీ స్నేక్ వీనమ్ మెడిసిన్ పక్కదారి పడుతున్నదన్నది అవాస్తవం. మా దగ్గరికొచ్చే పేషెంట్ల వివరాలు, వారికిచ్చిన వాయల్స్ లెక్క కచ్చితంగా పాటిస్తున్నాం. ప్రభుత్వ లేబల్ ఉన్న ఏవీఎస్ బయట ఎక్కడైనా ప్రైవేట్ఆస్పత్రుల్లో కానీ నర్సింగ్‌హోముల్లో ఉన్నట్లు బయటపడలేదు. ఒకవేళ జిల్లా ఆస్పత్రి నుంచి మందులు బయటకు వెళ్లినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. - శ్యాముల్స్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్