చిన్నారి ఊయలలో పడుకొని ఉండగా విరిగి పడిన బండరాయి
మృత్యువాత పడిన చిన్నారి
తొండలదిన్నె గ్రామంలో విషాదం
ప్రొద్దుటూరు క్రైం/ రాజుపాళెం : ఊయలలో పడుకొని ఉండగా బండరాయి విరిగి పడి హనీఫా (5) అనే చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు టంగుటూరు గ్రామానికి చెందిన బాబాపీర్ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. అతను గత రెండేళ్ల నుంచి తొండలదిన్నె గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య చాను, మహబూబ్‌చాన్, హనీఫా అనే కుమార్తెలతో పాటు మహబూబ్‌బాషా అనే కుమారుడు ఉన్నాడు. బాబాపీర్ ప్రతి రోజూ ఉదయాన్నే ప్రొద్దుటూరుకు వస్తాడు. సాయంత్రం వరకూ ఆటో తోలుకొని తిరిగి రాత్రికి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో శనివారం ఉదయాన్నే అతను ఆటో తీసుకొని ప్రొద్దుటూరుకు వెళ్లాడు. భార్య కూలి పనికి వెళ్లింది.
ఊయలలో పడుకొని ఉండగా విషాదం..
బాబాపీర్ పెద్ద కుమార్తె మాబుచాన్, కుమారుడు షఫీ పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. చిన్న కుమార్తె హనీఫా అంగన్‌వాడి కేంద్రానికి వెళ్తుంటుంది. వేసవి సెలవులు కావడంతో పిల్లలందరూ ఇంటి వద్దనే ఆడుకుంటున్నారు. వారి ఇంటి ముందు పాత ఇంటికి సంబంధించిన రెండు నిలువు బండరాళ్లు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని చీరతో ఊయల కట్టారు. ఈ ఊయలలోనే పడుకొని పిల్లలందరూ ఆడుకుంటుంటారు.
ఈ క్రమంలో శనివారం హనీఫాను ఊయలలో పడుకోబెట్టి చిన్నారి సోదరుడు షఫీ, పెదనాన్న కుమారుడు మహబూబ్‌బాషాలు ఊపుతున్నారు. కొద్ది సేపటి తర్వాత ఒక వైపు ఉన్న బండ రాయి విరిగి ఊయలలో ఉన్న హనీఫాపై పడింది. ఊయల పక్కనే ఉన్న షఫీ, మహబూబ్‌బాషాలకు కూడా ఈ సంఘటలో గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బంధువులు 108 వాహనంలో ముగ్గురు పిల్లలను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి హనీఫాను పరిశీలించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.
కూతురు చనిపోయిన విషయం తండ్రికి తెలియక..
ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న బాబాపీర్ వద్ద సెల్‌ఫోన్ లేదు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అతను రాత్రి ఇంటికి వస్తాడు. ఈ క్రమంలో శనివారం హనీఫా చనిపోయిన విషయం తండ్రికి చెప్పేందుకు ప్రొద్దుటూరు పట్టణంలో బాబాపీర్ కోసం తిరగాల్సి వచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం సమయంలో కుమార్తె చనిపోయిన విషయం అతనికి తెలిసింది.
బాయ్ మా.. అంటూ టాటా చెప్పావే తల్లీ..
హనీఫా మృతదేహాన్ని వారి స్వగ్రామమైన టంగుటూరుకు తరలించారు. తల్లి చాను కుమార్తె మృతదేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయింది. ఉదయం తల్లి పనికి వెళ్లేటప్పుడు హనీఫా బాయ్ మా.. అంటూ టాటా చెప్పింది. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ తల్లి రోదించసాగింది. చిన్నారి మృతి చెందిన సంఘటనతో తొండలదిన్నె, టంగుటూరు గ్రామాల్లో విషాదం నెలకొంది.
టాటా.. అమ్మీ..
Published Sun, May 31 2015 5:51 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM
Advertisement