నాంపల్లి: నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్‌లో అపశృతి చోటుచేసుకుంది. రోగి సహాయకుడు మీద పడటంతో మూడు రోజుల మగ శిశువు మృతిచెందాడు. ఈ సంఘటన నిలోఫర్ ఆసుపత్రి అత్యవసర సేవల విభాగంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా శిశువు మృతదేహాన్ని హుటాహుటిన ఆసుపత్రి గేట్లు దాటించేశారు. దీంతో శిశువు బంధువులు ఆసుపత్రి ఎదుటే ఆందోళనకు దిగారు.
ఆసుపత్రి సిబ్బంది పండంటి మగ శిశువును పొట్టనపెట్టుకున్నారని బోరున విలపించారు. న్యాయం చేయాలని బాధితులు పట్టుబట్టడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శిశువు మృతికి కారణమైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పరిగి ప్రాంతానికి చెందిన పుష్పమ్మ అనే మహిళ మూడు రోజుల క్రితం పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు ఒకటిన్నర కేజీల బరువు ఉన్న శిశువు జన్మించడంతో పరిగి ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిలోఫర్ ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవల నిమిత్తం తీసుకెళ్లాలని సూచించారు.
వైద్యుల సూచనల మేరకు బంధువులు మగ శిశువును రెండు రోజుల క్రితం రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఎన్‌ఐసీయూ ఇంక్యుబేటర్‌లో చికిత్స పొందుతుండగా వార్డులోని రోగి సహాయకుడు ఒకరు ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు కాలుజారి శిశువు మీద పడ్డాడు. దీంతో ఆ శిశువు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో శిశువు మీద పడ్డ రోగి సహాయకులు ఎవరనే విషయం తెలుస్తుందని, సీసీ కెమెరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment