baby died
-
మృత శిశువుకు జన్మనిచ్చి తల్లి మృతి
భైంసాటౌన్: కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణి మృత శిశువుకు జన్మనిచ్చి తర్వాత కాసేపటికి తానూ కన్నుమూసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ తండాకు చెందిన రాథోడ్ మనోజ్ తన భార్య శీతల్ (25)కు నెలలు నిండడంతో కాన్పు కోసం కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు కోసం వైద్యులు ప్రయతి్నంచారు. అయితే నొప్పులు ఎక్కువ కావడం, కాన్పు కాకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందింది. కుటుంబసభ్యులు శిశువుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా.. ఆ కాసేపటికే శీతల్ కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
నిలోఫర్‌లో దారుణం
నాంపల్లి: నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్‌లో అపశృతి చోటుచేసుకుంది. రోగి సహాయకుడు మీద పడటంతో మూడు రోజుల మగ శిశువు మృతిచెందాడు. ఈ సంఘటన నిలోఫర్ ఆసుపత్రి అత్యవసర సేవల విభాగంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా శిశువు మృతదేహాన్ని హుటాహుటిన ఆసుపత్రి గేట్లు దాటించేశారు. దీంతో శిశువు బంధువులు ఆసుపత్రి ఎదుటే ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది పండంటి మగ శిశువును పొట్టనపెట్టుకున్నారని బోరున విలపించారు. న్యాయం చేయాలని బాధితులు పట్టుబట్టడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శిశువు మృతికి కారణమైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పరిగి ప్రాంతానికి చెందిన పుష్పమ్మ అనే మహిళ మూడు రోజుల క్రితం పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు ఒకటిన్నర కేజీల బరువు ఉన్న శిశువు జన్మించడంతో పరిగి ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిలోఫర్ ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవల నిమిత్తం తీసుకెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు బంధువులు మగ శిశువును రెండు రోజుల క్రితం రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఎన్ఐసీయూ ఇంక్యుబేటర్‌లో చికిత్స పొందుతుండగా వార్డులోని రోగి సహాయకుడు ఒకరు ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు కాలుజారి శిశువు మీద పడ్డాడు. దీంతో ఆ శిశువు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో శిశువు మీద పడ్డ రోగి సహాయకులు ఎవరనే విషయం తెలుస్తుందని, సీసీ కెమెరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
చనిపోయిన బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడిన తల్లి..చివరికి..
ఓ తల్లి ఏడాది వయసున్న బిడ్డను కోల్పోయింది. అసలు బిడ్డను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న తల్లికి కనీసం ఆ బిడ్డ కడచూపు దక్కక అల్లాడిపోయింది. అందు కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షించిన ఆమె ఓపికకు చేతులెత్తి నమస్కరించాలి. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన తన బిడ్డ మృతదేహాన్ని తనివితీరా చూసుకుని మరీ ఖననం చేసింది. అసలేం జరిగిందంటే..స్కాట్లాండ్లోని ఎడిన్‌బర్గ్‌కు చెందిన 74 ఏళ్ల లిడియా రీడ్ 1975లో ఏడాది వయసు ఉన్న బిడ్డను కోల్పోయింది. ఆ చిన్నారి రీసస్ అనే వ్యాధి కారణంగా మరణించాడు. గర్భిణీ స్త్రీ రక్తంలోని ప్రతిరక్షకాలు ఆమె శిశువు రక్తకణాలను నాశనం చేసి చనిపోయేలా చేయడమే ఆ వ్యాధి లక్షణం. ఆమె కొన్ని రోజుల తర్వాత తన బిడ్డను చూడాలని ఆస్పత్రి వర్గాలను కోరినప్పుడూ ఆమెకు వేరే బిడ్డను చనిపోయారు. దీంతో రీడ్కి తన కొడుకు అవయవాలు పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారా లేక తొలగించారా? అన్న అనుమానంతో కోర్టు మెట్లు ఎక్కింది. తన బిడ్డకు చనిపోయిన అనంతరం వైద్యులు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించారని రీడ్ చెబుతుంది. అక్కడ ఆస్పత్రి రూల్స్ ప్రకారం..అంత చిన్న వయసులో చనిపోయిన చిన్నారులను వారే ఖననం చేస్తారు. అందువల్ల ఆమె బిడ్డ చనిపోయాడని తెలియడంతో దుఃఖంలో మునిగిపోయింది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్ని ఆస్పత్రి వర్గాలే నిర్వర్తించాయి. ఆమె ఆ బాధ నుంచి బయటపడ్డాక ఒక్కసారి తన బిడ్డను చూడాలని శవపేటికను తెరిచి చూపించాలని ఎంతగానో ప్రాధేయపడింది అయితే అందుకు ఆస్పత్రి యజమాన్యం అంగీకరించి, చూపించింది కానీ అది తన బిడ్డ కాదనేది రీడ్ వాదన. అందుకోసం చాలా ఏళ్లు కోర్టులో పోరాడింది. చివరికి సెప్టెంబర్ 2017లో కోర్టు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆ బిడ్డను ఆమెకు చూపించమని ఆదేశించగా.. ఖననం చేసిన ప్రదేశంలో బిడ్డ లేదని తేలింది. ఆమె పోరాటం కారణంగా సదరు ఆస్పత్రి ఆల్డర్ హే బాగోతం బయటపడింది. చనిపోయిన పిల్లల శరీర భాగాలను ఆస్పత్రులు ఎలా చట్టవిరుద్ధంగా పరిశోధనలకు ఉపయోగిస్తున్నాయో బహిర్గతం అయ్యింది. ఈ మేరకు స్కాట్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ చేసిన దర్యాప్తులో 1970 నుంచి 2000 మధ్య కాలంలో చిన్నపిల్లలకు సంబంధించి దాదాపు 6 వేల అవయవాలు, కణజాలం ఉంచినట్లు తేలింది. ఎట్టకేలకు ఆమె పోరాటం ఫలించి చనిపోయిన తన బిడ్డ మృతదేహాన్ని తిరిగి పొందగలిగింది. ఎలాగైతే చనిపోయేలోగా నా బిడ్డను చూడగలిగానని ఆనందంతో ఉప్పోంగిపోయింది. శనివారమే తన కొడుకు అంత్యక్రియలు జరిపిస్తానని తానే దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఆనందబాష్పాలతో చెబుతోంది. (చదవండి: బద్ధ శత్రువులైన ఇరాన్, సౌదీల మధ్య సయోధ్య కుదిర్చిన చైనా!) -
తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్
US Boy Playing With His Father Gun: ఎనిమిదేళ్ల బాలుడు తండ్రి తుపాకితో ఆడుకుంటూ...అనుకోకుండా జరిపిన కాల్పుల్లో పసికందు మృతి చెందింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం....45 ఏళ్ల రోడెరిక్ రాండాల్ తుపాకిని కలిగి ఉండకుండా నిషేధింపబడిన నేరచరిత్ర కలిగిన వ్యక్తి. ఒక రోజు అతను తన కొడుకుతో కలిసి తన స్నేహితురాలిని కలిసేందుకు మోటెల్ ప్రాంతానికి వెళ్లాడు. అతడి స్నేహితురాలు తన ఇద్దరు కలలు, ఒక ఏడాది కుమార్తెతో అక్కడకి వచ్చింది. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్లంతా కలుసుకుని కాసేపు ఆనందంగా గడిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏదో పని పై రాండల్ బయటకి వెళ్లాడు. ఇంతలో కొడుకు అలమరాలో దాచిన తుపాకీని తీసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బాలికల తల్లి నిద్రిస్తుంది. అంతే ఆ పిల్లాడు ఆ గన్‌తో ఆడుకుంటూ..ఆడుకుంటూ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అంతే అక్కడే ఉన్న పసికందు శరీరంలోకి తూట దూసుకుపోయింది. అక్కడికక్కడే ఆ పసికందు మృతి చెందింది. ఐతే ఇలాంటి దారుణ ఘటనలు యూఎస్‌లో ఏటా కోకొల్లలు. పెద్దలు దాచిన గన్ని పిల్లలు తెలుసుకుని ఆడుకుంటూ తమను కాల్చుకోవడం లేదా తమ తోటివారిని కాల్చడం జరుగుతోంది. ఇలా ఏటా మైనర్లు హత్యలు చేయడం...తెలిసి తెలియని వయసులో జైలు పాలుకావడం జరుగుతోందని, ప్రతి ఏడాది సగటున ఇలాంటి ఘటనలల్లో 350 మందికి పైగా మృతి చెందుతున్నారని యూఎస్ పోలీసులు చెబుతున్నారు. సదరు వ్యక్తి పై నిర్లక్ష్యం, చట్ట విరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండటం తదితర ఆరోపణలతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇటీవలే యూఎస్ అత్యున్నత న్యాయస్థానం న్యూయార్క్ పౌరులు తమ వెంట గన్లు తీసుకువెళ్లొచ్చు అంటూ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు దేశ అధ్యక్షుడు జోబైడెన్ సైతం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పైగా ఇది రాజ్యాంగానికి, ఇంగిత జ్ఞాననికి విరుద్ధంగా ఉందంటూ ఆవేదన చెందారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పులు ఇవ్వడం అత్యంత బాధకరం. (చదవండి: శిథిలాల నడుమ అయిన వాళ్ల కోసం.. గుండెల్ని పిండేస్తున్న ఫొటో) -
అమ్మా ఆకలేస్తోంది.. సెకన్లలో పాప మృతి, మరో ఇద్దరు చిన్నారులు..
నిజామాబాద్ అర్బన్ : అమ్మా ఆకలేస్తోంది.. పాలు కావాలంటూ చిన్నారులు మారం చేశారు. పిల్లలకు పాలు తాగించేందుకు తల్లి సిలిండర్ వెలిగించింది.. మంటలు చెలరేగి ఐదేళ్ల పాప మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులు, భార్యభర్తలు గాయాల పాలయ్యారు. వివరాల ప్రకారం.. పాల వ్యాపారం చేసే రాజస్థాన్‌కు చెందిన సునీల్‌యాదవ్, ధన్వంతరిబాయి దంపతులు నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులోని సారంగాపూర్ డెయిరీ ఫారం వద్ద ఓ గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు బబ్లూ, జగ్గు, నమ్కిబాయి (5) ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి బబ్లూ, జగ్గు పాలుతాగుతామని తల్లిని అడిగారు. తల్లి మినీ సిలిండర్ పై పాలను వేడి చేస్తోంది. సిలిండర్‌కు చెందిన గ్యాస్ పైపులైన్ స్టౌవ్ వద్ద మంటలు అంటుకొని తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ముగ్గురు పిల్లలకు అంటుకున్నాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న భార్యభర్తలు పిల్లలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో నమ్కిబాయి చికిత్స పొందుతూ మరణించింది. మిగితా ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని 6వ టౌన్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..
హయత్‌నగర్(హైదరాబాద్): ఇంటి ముందు తెరిచి ఉన్న నీటి సంపు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన అభం శుభం తెలియని ఏడాదిన్నర పాప నీటి సంపులో పడి మృతి చెందిన విషాధ ఘటన శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ సమీపంలోని కడీలబాయి తండాకు చెందిన వాకుడోతు రా జు, సంతోషి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. హయత్‌నగర్‌లోని రంగనాయకుల గుట్ట సమీపంలో ఉంటున్నారు. ► రాజు లారీపై లేబర్ పని చేస్తుండగా ఆయన భార్య సంతోషి హోటల్లో పని చేస్తోంది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు నిత్య(ఏడాదిన్నర) శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలో ఉన్న మరో ఇంటివైపు వెళ్లింది. ఆ ఇంటి ముందు ఉన్న సంపు మూత తెరిచి ఉండటంతో నిత్య సంపులో పడిపోయింది. చాలా సేపు ఎవరూ గమనించలేదు. గంట తర్వాత నిత్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం మొదలు పెట్టారు. చివరకు సంపులో తెలియాడటంతో నిత్యను బయటికి తీశారు. అప్పటికే పాప మృతి చెందింది. మురుగు వచ్చిందని.. సంపు మూత తెరిచి ఇటీవల కురుస్తున్న వర్షాలకు సమీపంలోని ఇంటి వద్ద ఉన్న సంపులో మురుగు చేరింది. దీంతో మురుగును బయటి పంపించేందుకు సంపు మూతను తెరి ఉంచినట్లు ఇంటి యజమాని తెలిపింది. సంపు మూతనుపెట్టకుండానే తాను పనికి వెళ్లింది. చుట్టూ ఎటువంటి రక్షణ లేకపోవడంతో అభం శుభం తెలియని చిన్నారి సంపులో పడి మునిగిపోయిందని స్థానికులు తెలిపారు. ► ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: పెంచి పెద్ద చేస్తే.. ప్రాణం తీసింది -
పోలియో చుక్కలు వేయించిన కొద్దిసేపటికే
సాక్షి, దుండిగల్: పోలియో చుక్కలు వేయించిన కొద్ది నిమిషాలకే 3 నెలల పసిపాప విగత జీవిగా మారింది. ఈ ఘటన దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, రమ్యలకు దీక్షిత (3 నెలల) పాప ఉంది. మహేశ్వరంలో తల్లిగారి ఇంటికి వెళ్లిన రమ్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారికి శంభీపూర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేయించింది. ఇంటికి వెళ్లిన 15 నిమిషాలకే చిన్నారి నుంచి ఎలాంటి ఉలుకూపలుకూ లేదు. చిన్నారిలో చలనం లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు మదీనాగూడలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: అన్యాయం జరుగుతుంటే గాడిదలు కాస్తున్నారా? వ్యాక్సిన్ వికటించడంతోనే పాప మృతి చెందిందని పేర్కొంటూ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్, దండిగల్ మండల వైద్యాధికారి నిర్మల, సీఐ వెంకటేశం, ఎస్ఐ చంద్రశేఖర్ అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఇదే బూత్‌లో 250 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని, వారందరూ క్షేమంగానే ఉన్నారన్నారు. పుట్టిన సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలుంటేనే ఇలా జరిగే ఆస్కారముందని, పోస్ట్‌మార్టమ్ నివేదికలోనే నిజానిజాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు ఏ విషయం చెప్పలేమన్నారు. -
సోనూసూద్ స్పందించినా.. దక్కని పసివాడి ప్రాణం
సాక్షి, బోయినపల్లి (చొప్పదండి): సినీనటుడు సోనూసూద్‌తోపాటు పలువురు దాతలు చికిత్సకు సాయం చేసినప్పటికీ ఆ నాలుగు నెలల పసివాడి ప్రాణం దక్కలేదు. శస్త్రచికిత్స తర్వాత శ్వాస అందకపోవడంతో పసివాడు ఆదివారం కన్నుమూశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు నాలుగు నెలల అద్విత్‌శౌర్య గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. చదవండి: (ఆంగ్లంలో అనర్గళంగా..) పేదవాడైన అద్విత్ తండ్రి బాబు, తన కుమారుడి ఆరోగ్యం బాగు చేయడానికి ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులో అధికభాగం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అద్విత్‌కు శుక్రవారం ఆపరేషన్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున అద్విత్‌కు శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ పెట్టారు. అయితే పరిస్థితి విషమించడంతో చిన్నారి అద్విత్ కన్నుమూశాడు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: (ఏసీ బస్సా... మేమెక్కం!) -
మెడికల్ షాప్ వైద్యం, చిన్నారి మృతి
సాక్షి, న్యూఢిల్లీ: సొంతవైద్యం, మెడికల్ షాపులో ఏవో తెలిసిన మందులు కొనుక్కొని వాడటం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించిన ఘటన ఇది. మందుల దుకాణంలో ఇచ్చిన తప్పుడు మందుతో రెండేళ్ల పాప ప్రాణాలు కోల్పోయిన వైనం ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం షాహదారాలోని జీటీబీ ఎన్క్లేవ్ ప్రాంతంలో నివసించే బాలిక (2) జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లి దగ్గరలోని ఉన్న షాపుకెళ్లి ఏవో మందులు తెచ్చి వాడింది. అయినా ఉపశమనం లభించకపోవడంతో మరోసారి అదే షాపునకు వెళ్లింది. వైద్యుడిని సంప్రదించమని చెప్పడానికి బదులు ఆ షాపు యజమాని పాపకు ఇంజెక్షన్ ఇచ్చాడు. అంతే ఇంటికి వచ్చీ రావడంతోనే రక్తపు వాంతులు మొదలయ్యాయి. కంగారు పడినబంధువులు బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు.అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. -
అయ్యో.. పాపం పసిపాప..
సాక్షి, బొబ్బిలి: పట్టణంలోని పోలవానివలస సమీపంలోని ఓ కాలువలో గురువారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఓ ఆడపిల్ల మృతదేహం తేలియాడుతుండడం కలకలం సృష్టించింది. ఎవరో ఇక్కడకు సంచిలో తీసుకువచ్చి బిడ్డను కాలువలో విసిరేసి సంచి పక్కన పడేసి తేలిగ్గా వెళ్లిపోయింది. దీంతో ఆ పసికందు నీటిలో కొట్టుకుంటూ ఊపిరాడక మృతి చెందింది. దీంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. ఎవరికి ఏ కష్టం వచ్చిందో చిన్నారిని ఇలా కాలువలో పడేశారని వాపోయారు. ఒకటి,రెండు రోజుల్లోనే..! కాలువలో తేలియాడుతున్న ఆడబిడ్డను చూసిన వారు ఒకటి, రెండు రోజుల్లోపే జన్మించి ఉంటుందని చెబుతున్నారు. మృతదేహం ఉబ్బకపోవడాన్ని బట్టి పుట్టిన వెంటనే కాలువలో పడేసి వెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్లిప్పు ఆధారమవుతుందా..? శిశువు బొడ్డును కత్తిరించినపుడు ఆస్పత్రుల్లో క్లిప్ పెడతారు. సెప్టిక్ కాకుండా, గాలి వెళ్లకుండా భద్రత కోసం పెట్టిన క్లిప్పుతోనే బిడ్డను నీటిలో పడేసి వెళ్లిపోయిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడా క్లిప్పు ఆధారంగా కేసు దర్యాప్తు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీని ఆధారంగా ఆస్పత్రులను పరిశీలించి ఆ కర్కశ తల్లిదండ్రులను పట్టుకుని శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించిన పోలీస్, ఐసీడీఎస్ సిబ్బంది.. బొబ్బిలి ఐసీడీఎస్ కార్యాలయాల ఎదురుగానే ఆడ శిశువును కాలువలో పడేశారని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మా పరిధిలో బాలింతలు లేరని ఐసీడీఎస్ సిబ్బంది అంటుండగా.. కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. వదిలిపెట్టం.. ఇది హేయమయిన సంఘటన.. చిన్నారిని కాలువలో విసిరేసిన ఎవ్వరైనా వదిలి పెట్టేదిలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచారిస్తాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – వి. ప్రసాదరావు, ఎస్సై, బొబ్బిలి -
మురుగు కాల్వలో పసికందు మృతదేహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు రోడ్డు మురుగు కాల్వలో పసికందు మృతదేహం లభ్యమైన ఘటన మరువక ముందే ఆ ప్రాంతానికి సమీపంలో మరో పసికందు మృతదేహం మురుగు కాల్వలో కనిపించటం కలకలం రేపింది. పల్నాడు రోడ్డు పాత చెక్‌పోస్టు వీధిలోని ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు సమాచారాన్ని వన్‌టౌన్ పోలీసులకు అందించారు. దీంతో ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సైడుకాల్వలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. నెలలు నిండని శిశువుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 20 రోజుల క్రితం పల్నాడు బస్టాండ్ ఎస్‌కేఆర్‌బీఆర్ కళాశాల ఎదుట ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సమీపంలోని ప్రైవేటు వైద్యశాలల్లో అబార్షన్ చేసి శిశువును కాల్వలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన మరువక ముందే మురుగు కాల్వలో మరో పసికందు ప్రత్యక్షమవ్వటం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
చంపేశారయ్యా...
సాక్షి, అనంతపురం : అనంతపురం సర్వజనాస్పత్రిలో పసికందు మృతి ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ చనిపోయిందని, బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలంటూ మూడుగంటలపాటు ఆందోళనకు దిగారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురానికి చెందిన నాగసులోచన రెండో కాన్పు కోసం ఈ నెల 17న సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఓ వైద్యురాలు పరీక్షించగా వారాల ప్రకారం డెలివరీ డేట్ 17 అని తేలింది. దీంతో మరోసారి స్కానింగ్ రిపోర్టు తీసుకురావాలని సూచించారు. ఈ నెల 18న స్కానింగ్ చేయగా డెలివరీ డేట్ 27న అని వచ్చింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సులోచన నొప్పులు వస్తున్నాయని అని చెప్పడంతో వైద్యులు మరోసారి పరీక్షించారు. ఉదయం జెల్ అందించారు. సాయంత్రంలోపు ప్రసవం అవుతుందని చెప్పారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో లేబర్‌వార్డులోకి ఆమెను తీసుకెళ్లారు. బిడ్డ బయటకు వస్తూ, లోపలికి వెళ్తూ ఉండటంతో వైద్యులు ఎఫిషియాటమీ (రంధ్రం కట్ చేయడం) చేశారు. 7 గంటలకు డెలివరీ కాగా.. పుట్టిన ఆడబిడ్డలో ఎటువంటి స్పందనలు కనిపించలేదు. దీంతో బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పారు. వాగ్వాదం పసికందు(ఆడ) చనిపోవడంతో తండ్రి వెంకటగోపాల్, అవ్వ మల్లమ్మ, కుటుంబ సభ్యులు మల్లికార్జున, ఓబులేసు ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్, ఆర్ఎంఓ, గైనిక్ వైద్యులతో వాగ్వాదానికి దిగారు. మీ నిర్లక్ష్యం కారణంగానే పసికందు చనిపోయిందని ఆరోపించారు. పురిటిశాల ముందు పసికందుతో బైఠాయించారు. పసికందు తలకు గాయమైందని, అలా ఎందుకయ్యిందంటూ వారు వైద్యులతో వాదనకు దిగారు. బిడ్డ పుట్టినప్పుడు రక్తపు మరకలు అవుతాయని వైద్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు. గంట క్రితం బాగుందని చెప్పి చనిపోయిన బిడ్డను చేతికిచ్చారంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. -
చిన్నారిని చిదిమేసిన ట్రాక్టర్
సాక్షి, తెనాలిరూరల్: అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారుల్లో ఒకరిని మృత్యువు రూపంలో పొంచి ఉన్న ట్రాక్టర్ కబళించింది. ఇంజిన్ స్టార్ట్ అయి, ట్రాక్టర్ ముందుకు కదులుతుండడంతో ఆందోళనకు గురైన బాలుడు కేకలు వేస్తుండగా, ఆ బాలుడిని రక్షించేందుకు వచ్చిన వారిలో ఓ తల్లి, తన బిడ్డ ట్రాక్టర్ చక్రాల కింద నలిగిపోయి ఉండడం చూసి నిర్ఘాంతపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఏకైక కుమారుడి పార్థివదేహాన్ని తన పొత్తిళ్లల్లోకి తీసుకుని బోరుమని విలపించింది. మూడేళ్ల బాలుడు ఇంజిన్ స్టార్ట్ చేయగా, 18 నెలల బాలుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. తెనాలి పట్టణం చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన కందుకూరి సులోచన తన భర్త రోశయ్యతో మనస్పర్థల కారణంగా విడిపోయి, 18 నెలల కుమారురు పవన్‌తో సహా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తన స్నేహితురాలయిన అమరావతి ప్లాట్స్‌కు చెందిన తిరుపతమ్మ క్యాటరింగ్ పనులకు వెళుతుండడంతో, జీవనోపాధి కోసం సులోచనా కూడా వెళుతోంది. వారం రోజులుగా అమరావతి ప్లాట్స్‌లో స్నేహితురాలి వద్దే కుమారుడితో కలసి ఉంటోంది. పవన్, స్థానికంగా ఉన్న కొంత మంది చిన్నారులు అక్కడికి సమీపంలోని ఖాళీ స్థలంలో రోజూ ఆడుకుంటుండేవారు. ఈ క్రమంలోనే సోమవారం అందరూ కలసి ఖాళీ స్థలంలోని ఇసుక గుట్టల వద్ద ఆడుకుంటున్నారు. పవన్‌తో పాటు లోకేష్ అన్న పేరు గల ఇద్దరు చిన్నారులూ అక్కడ నిలిపి ఉన్న ట్రాక్టర్ వద్ద ఆడుకుంటున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ఓ బాలుడు(పేరు లోకేష్) ట్రాక్టర్‌పైకి ఎక్కి డ్రైవరు సీటులో కూర్చున్నాడు. తాళాలు వాహనానికే ఉండడంతో తెలిసీ తెలియక తిప్పాడు. వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయి, ట్రాక్టర్ ముందుకు కదులుతుండగా, ఆందోళనకు గురైన లోకేష్ కేకలు వేస్తుండడంతో అక్కడికి సమీపంలోని ఇళ్లలో ఉన్న వారు పరుగు పరుగున ట్రాక్టర్ వద్దకు చేరుకున్నారు. సులోచనా అక్కడకు వెళ్లి, కదులుతున్న ట్రాక్టరుపై ఉన్న లోకేష్‌ను దించేందుకు ప్రయత్నించింది. వాహనం ముందుకు వెళ్లాక చూడగా, దాని కిందే తన ఏకైక కుమారుడు నలిగిపోయి ఉండడంతో షాక్‌కు గురైంది. బిడ్డ మృతదేహాన్ని పొత్తిళ్లలోకి తీసుకుని గుండలవిసేలా కన్నీరు పెట్టింది. భర్తతో విభేదాల వల్ల విడిగా ఉంటున్నా, బిడ్డే తనకు సర్వస్వం అనుకుని, వాడి ఆలనా పాలనాకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పనులకూ వెళుతోంది. అలాంటిది ఆ కుమారుడే మృత్యు ఒడిలోకి వెళ్లడంతో తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తోంది. సమాచారమందుకున్న త్రీ టౌన్ సీఐ బి.హరికృష్ణ ఘనాస్థలాన్ని పరిశీలించారు. విరాలు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ట్రాక్టరును నిర్లక్ష్యంగా ఉంచిన యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఫలించని 110 గంటల శ్రమ
సంగరూర్ (పంజాబ్): దాదాపు 110 గంటల శ్రమ ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. చిన్నారి తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. వందలాది మంది స్థానికుల ప్రార్థనలు ఫలితం లేకుండా పోయాయి. రెండేళ్లు కూడా నిండకుండానే చిన్నారి మృత్యు ఒడికి చేరుకున్నాడు. పంజాబ్‌లోని సంగరూర్ జిల్లా భగవాన్‌పురాకు చెందిన రెండేళ్ల చిన్నారి బోరు బావిలో పడి నాలుగు రోజుల తర్వాత మృతదేహమై బయటకు వచ్చాడు. సోమవారం రెండో పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి తల్లి గుండె తల్లడిల్లింది. బుడిబుడి అడుగులు వేస్తూ కళ్ల ముందు తిరుగుతాడనుకున్న ఆ బంగారు తండ్రి కనుమరుగై పోయాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇంటి సమీపంలోని 150 అడుగుల లోతున్న నిరుపయోగకరంగా ఉన్న బోరు బావిలో గత గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బాలుడు పడిపోయాడు. ఆ చిన్నారిని తల్లి కాపాడేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు చిన్నారిని రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమించాయి. బోరు బావి చుట్టూ సమాంతరంగా తవ్వకాలు చేశాయి. ఎలాగైనా కాపాడాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సంగరూర్ జిల్లాలోని చిన్నారి గ్రామమైన భగవాన్పురా గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. మంగళవారం ఉదయం 4.45 గంటలకు ఫతేవీర్ను బోరు బావిలో నుంచి తీశారు. హుటాహుటిన అక్కడి నుంచి చండీగఢ్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బోరు బావిలో పడ్డ మరుసటి రోజే చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆస్పత్రి నుంచి చిన్నారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో స్వగ్రామానికి తరలించారు. అనంతరం చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చిన్నారి మృతి చెందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. సరైన సాంకేతికత పరికరాలు వినియోగించకపోవడం వల్లే తమ బిడ్డ తమకు దక్కలేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ముందే చనిపోయినప్పుడు ఇన్నిరోజుల పాటు రక్షిస్తున్నట్లు ఎందుకు నటించారని, చిన్నారి తల్లిదండ్రులను ఇన్ని రోజులు ఎందుకు మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రెండు తలలతో శిశువు
హైదరాబాద్: మెడికల్ రంగంలో ఓ అరుదైన ఘటన హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో చోటు చేసుకుంది. ఎంతో అనుభవం గల డాక్టర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల గర్భం నుంచి ఒక శరీరం.. రెండు తలల శిశువును డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఇలా ఒకే శరీరం రెండు తలలతో ఉండటాన్ని వైద్య పరిభాషలో బైసెఫాలిక్ హైడ్రో సెఫాలస్ అని పిలుస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం సూరారం గ్రామానికి చెందిన మహేశ్, సుజాతలకు 2018 జూన్ 17న వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని పార్శిగుట్టలో ఉంటున్నారు. మహేశ్ డ్రైవర్ కాగా, సుజాత గృహిణి. సుజాత గర్భం దాల్చడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని డంగోరియా ఆస్పత్రిలో డాక్టర్ సాయిలీలా దగ్గర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మూడో నెలలో స్కానింగ్ చేసుకోవాలని సూచించినా కుదరకపోవడంతో చేయించుకోలేదు. ప్రస్తుతం ఐదో నెల కావడంతో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు గురువారం డాక్టర్ దగ్గరికి వెళ్లారు. అక్కడి నుంచి శివాని స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయించుకునేందుకు వెళ్లారు. శిశువు పరిస్థితి చూసి అవాక్కయిన స్కానింగ్ సెంటర్ వారు.. డంగోరియా ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందించారు. దీంతో రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు.. వెంటనే ఆపరేషన్ చేసి తల్లి గర్భం నుంచి శిశువును బయటకు తీయాలని, లేకుంటే తల్లి ప్రాణానికే ముప్పు ఉందని చెప్పడంతో శనివారం ఆపరేషన్ చేసి ఆ శిశువును బయటకు తీశారు. కాగా, రెండు తలలతో ఉన్న ఈ శిశువు రెండు చేతులు, రెండు కాళ్లతో మిగతా శరీరం మొత్తం మాములుగానే ఉంది. మెడ మీదనే రెండు తలలు ఉన్నాయి. మగ శిశువుగా గుర్తించారు. గుండె సమస్యతో పాటు రెండు తలలో వాటర్ ఫాం అయ్యింది. గర్భంలోనే శిశువు మరణించి ఉంది. శిశువు వయసు 22 వారాలు ఉంటుంది. 38 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్నా ఇలాంటి కేసు తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని డాక్టర్ సాయిలీలా, డంగోరియా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దేవయాని ‘సాక్షి’కి తెలిపారు. -
ఏడుస్తున్నాడని వెళితే.. ప్రాణం తీశాడు!
నంద్యాల(కర్నూలు): ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఆరు నెలల చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ ఎస్ఐ నవీన్‌బాబు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని హరిజనపేటకు చెందిన పరమేశ్వరి, ఓబులయ్య కుమారుడు జగన్‌కు ఆరు నెలల వయసు. మంగళవారం రాత్రి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ పర్ల దస్తగిరి వద్దకు తీసుకెళ్లారు. కడుపునొప్పితో బాధపడుతున్నాడేమోనని, మందులు వాడితే తగ్గిపోతుందని భావించారు. చిన్నారిని పరీక్షించిన ఆర్ఎంపీ సిరప్లు, మందులు రాసిచ్చాడు. అతను ఇచ్చిన సైక్లోఫాం డ్రాప్స్ చిన్నారి జగన్‌కు వేసిన ఐదు నిమిషాలకే శరీరం మొత్తం చల్లబడిపోయింది. భయపడి పోయిన తల్లిదండ్రులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆర్ఎంపీ ఇచ్చిన మందులను పరిశీలిస్తే సైక్లోఫాం డ్రాప్స్ గడువు తేదీ (ఎక్స్పైర్ డేట్) 2016 నుంచి జూన్ 2018 వరకే ఉంది. చిన్నారికి తప్పుడు వైద్యం చేసి.. మరణానికి కారణమైన ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు నంద్యాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లి పరమేశ్వరి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఏ తల్లి కన్నబిడ్డో... పాపం !
హుజూరాబాద్‌రూరల్ : ‘ఇంకా కళ్లు తెరవని ఆ పసికందు లోకా న్ని చూడకుండా నే పరలోకాలకు వెళ్లాడు. ఏ తల్లి కన్నబిడ్డో కెనా ల్కాలువలో విగతజీవిగా పడిఉన్నాడు. ఇంకా నెలలు కూడా నిండని ఆ పసికందు మృతదేహం కెనాల్కాలువలో కనబడిన తీరు స్థానికులను కలచివేసింది. మండలంలోని బోర్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో ఆదివారం అప్పుడే పుట్టిన ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు కాలువలో చేపలు పట్టడానికి వెళ్లేసరికి వారికి మగశిశువు మృతదేహం కనిపించింది. వెంటనే వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని శిశువు మృతదేహం గురించి ఆరా తీస్తున్నారు. -
మమ్మీ టాటా..
వారికున్నది ఒక్కగానొక్క కూతురు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రోజులాగే బడికెళ్లింది. మధ్యాహ్నం అన్నం తినిపించేందుకు నాన్న టీవీఎస్ మోపెడ్‌లో స్కూలు వద్దకు వెళ్లి పాపను ఇంటికి తీసుకొచ్చాడు. భోజనం చేశాక టాటా మమ్మీ అంటూ అమ్మకు వీడ్కోలు పలికి నాన్న వెంట టీవీఎస్‌లో స్కూలుకు బయలు దేరింది. మార్గమధ్యంలో ట్యాంకర్ మృత్యుశకటంలా దూసుకొచ్చి వీరు వెళ్తున్న మోపెడ్‌ను ఢీకొంది. క్షణాల్లో ఆ చిన్నారి మృత్యు కౌగిట్లోకి వెళ్లిపోయింది. కన్నవారికి కడుపుకోత మిగిలింది. ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో న్యూకాలనీలో నివాసముంటున్న ఎన్. చంద్రశేఖర్, ఉమల ఏకైక కుమార్తె సాయికీర్తన(10). చంద్రశేఖర్ ఐసీఎల్ కర్మాగారంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సాయికీర్తన(10) మహాత్మానగర్ కాలనీలోని శ్రీ విజయవాణి హైస్కూల్లో ఐదవ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం కోసం తండ్రి చంద్రశేఖర్ పాపను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. పాపతో కలిసి అమ్మా..నాన్నలు భోంచేశారు. పాఠశాలకు సమయం కావడంతో అమ్మకు టాటా టాటా చెప్పి తండ్రితో కలిసి టీవీఎస్ మోపెడ్‌లో స్కూలుకు బయలు దేరింది. ముద్దనూరురోడ్డులో మహాత్మానగర్ కాలనీకి వెళుతుండగా వెనుక నుంచి ట్యాంకర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి ఎగిరి కింద పడ్డాడు. వెనుక కూర్చున్న సాయికీర్తన తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. విషయం తెలుసుకున్న సీఐ పీటీ కేశవరెడ్డి, ఎస్ఐ లక్ష్మినారాయణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ముసలయ్య సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.త ండ్రి చంద్రశేఖర్, తల్లి ఉమలు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసునమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టర్ కోరకు చిన్నారి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
టాటా.. అమ్మీ..
చిన్నారి ఊయలలో పడుకొని ఉండగా విరిగి పడిన బండరాయి మృత్యువాత పడిన చిన్నారి తొండలదిన్నె గ్రామంలో విషాదం ప్రొద్దుటూరు క్రైం/ రాజుపాళెం : ఊయలలో పడుకొని ఉండగా బండరాయి విరిగి పడి హనీఫా (5) అనే చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు టంగుటూరు గ్రామానికి చెందిన బాబాపీర్ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. అతను గత రెండేళ్ల నుంచి తొండలదిన్నె గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య చాను, మహబూబ్‌చాన్, హనీఫా అనే కుమార్తెలతో పాటు మహబూబ్‌బాషా అనే కుమారుడు ఉన్నాడు. బాబాపీర్ ప్రతి రోజూ ఉదయాన్నే ప్రొద్దుటూరుకు వస్తాడు. సాయంత్రం వరకూ ఆటో తోలుకొని తిరిగి రాత్రికి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో శనివారం ఉదయాన్నే అతను ఆటో తీసుకొని ప్రొద్దుటూరుకు వెళ్లాడు. భార్య కూలి పనికి వెళ్లింది. ఊయలలో పడుకొని ఉండగా విషాదం.. బాబాపీర్ పెద్ద కుమార్తె మాబుచాన్, కుమారుడు షఫీ పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. చిన్న కుమార్తె హనీఫా అంగన్వాడి కేంద్రానికి వెళ్తుంటుంది. వేసవి సెలవులు కావడంతో పిల్లలందరూ ఇంటి వద్దనే ఆడుకుంటున్నారు. వారి ఇంటి ముందు పాత ఇంటికి సంబంధించిన రెండు నిలువు బండరాళ్లు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని చీరతో ఊయల కట్టారు. ఈ ఊయలలోనే పడుకొని పిల్లలందరూ ఆడుకుంటుంటారు. ఈ క్రమంలో శనివారం హనీఫాను ఊయలలో పడుకోబెట్టి చిన్నారి సోదరుడు షఫీ, పెదనాన్న కుమారుడు మహబూబ్‌బాషాలు ఊపుతున్నారు. కొద్ది సేపటి తర్వాత ఒక వైపు ఉన్న బండ రాయి విరిగి ఊయలలో ఉన్న హనీఫాపై పడింది. ఊయల పక్కనే ఉన్న షఫీ, మహబూబ్బాషాలకు కూడా ఈ సంఘటలో గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బంధువులు 108 వాహనంలో ముగ్గురు పిల్లలను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి హనీఫాను పరిశీలించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. కూతురు చనిపోయిన విషయం తండ్రికి తెలియక.. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న బాబాపీర్ వద్ద సెల్‌ఫోన్ లేదు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అతను రాత్రి ఇంటికి వస్తాడు. ఈ క్రమంలో శనివారం హనీఫా చనిపోయిన విషయం తండ్రికి చెప్పేందుకు ప్రొద్దుటూరు పట్టణంలో బాబాపీర్ కోసం తిరగాల్సి వచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం సమయంలో కుమార్తె చనిపోయిన విషయం అతనికి తెలిసింది. బాయ్ మా.. అంటూ టాటా చెప్పావే తల్లీ.. హనీఫా మృతదేహాన్ని వారి స్వగ్రామమైన టంగుటూరుకు తరలించారు. తల్లి చాను కుమార్తె మృతదేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయింది. ఉదయం తల్లి పనికి వెళ్లేటప్పుడు హనీఫా బాయ్ మా.. అంటూ టాటా చెప్పింది. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ తల్లి రోదించసాగింది. చిన్నారి మృతి చెందిన సంఘటనతో తొండలదిన్నె, టంగుటూరు గ్రామాల్లో విషాదం నెలకొంది. -
ఆ మురిపాలు ఇకలేవు..
► 14 నెలల చిన్నారిని బలిగొన్న ట్రాక్టర్ ► టైరు కిందపడి దుర్మరణం ► మేడ్చల్ మండలం లింగాపూర్‌లో విషాదం మేడ్చల్ : అప్పటివరకు తన అల్లరితో తల్లిదండ్రులను మురిపించిన ఆ చిన్నారి అంతలోనే మృత్యుఒడికి చేరుకుంది. ట్రాక్టర్ చక్రం కిందపడి దుర్మరణం పాలై కన్నవారికి పుట్టెడు దుఃఖం మిగిల్చింది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మండల పరిధిలో లింగాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సంజీవకు ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్‌ను మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన మహేష్ నడిపిస్తున్నాడు. మహేష్ తన భార్య లక్ష్మి, కూతురు(14నెలలు)తో కలిసి సంజీవ ఇంట్లోనే ఉంటున్నారు. మహేష్ ఆదివారం ఉదయం తన కూతురిని కొద్దిసేపు ఆడించి పనినిమిత్తం ట్రాక్టర్‌తో బయటకు వెళ్లేందుకు పాపను ఇంట్లో తన భార్యకు ఇచ్చాడు. ట్రాక్టర్‌ను స్టార్ట్ చేస్తుండగా పాప బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తండ్రిని చూస్తూ ట్రాక్టర్ వైపునకు వచ్చింది. ఈ విషయం గమనించని మహేష్ ట్రాక్టర్‌ను వెనుకకు పోనిచ్చాడు. టైర్ కొద్దిగా కదిలి ఆగిపోయింది. వాహనం ఎందుకు జరగడం లేదని మహేష్ ట్రాక్టర్ కిందికి దిగి చూడగా చక్రం కింద తన కూతురు పడిఉంది. వెంటనే ట్రాక్టర్‌ను ముందుకు తీసి చిన్నారిని ఓ కారులో నగర శివారులోని బాలాజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి అప్పటికే పాప చనిపోయిందని నిర్ధారించారు. అప్పటి వరకు అల్లరి చేసిన చిన్నారి అంతలోనే ప్రమాదం జరిగి కానరాని లోకాలకు వెళ్లడంతో మహేష్, లక్ష్మి దంపతులు గుండెలుబాదుకుంటూ రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా తల్లి.. అంటూ లక్ష్మి రోదించిన తీరు హృద య విదారకం. అనంతరం చిన్నారి మృతదేహాన్ని మహేష్ దంపతులు తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. -
సంపులో పడి చిన్నారి మృతి
హైదరాబాద్: తుకారంగేటు సమీపంలోని వడ్డెర బస్తీలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. ఈ ప్రమాదం మంగళవారం జరిగింది. వివరాలు... వడ్డెర బస్తీకి చెందిన రవి, లక్ష్మీల కుమార్తె ఇందూ(4) అంగన్ వాడీ సెంటర్ నుంచి మంగళవారం సాయంత్రం ఇంటికి వెళుతుండగా దారి పక్కన ఉన్న సంపులో పడింది. దీంతో ఊపిరాడక మృతి చెందింది.