నిత్య (ఫైల్)
హయత్‌నగర్(హైదరాబాద్): ఇంటి ముందు తెరిచి ఉన్న నీటి సంపు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన అభం శుభం తెలియని ఏడాదిన్నర పాప నీటి సంపులో పడి మృతి చెందిన విషాధ ఘటన శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ సమీపంలోని కడీలబాయి తండాకు చెందిన వాకుడోతు రా జు, సంతోషి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. హయత్‌నగర్‌లోని రంగనాయకుల గుట్ట సమీపంలో ఉంటున్నారు.
► రాజు లారీపై లేబర్ పని చేస్తుండగా ఆయన భార్య సంతోషి హోటల్‌లో పని చేస్తోంది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు నిత్య(ఏడాదిన్నర) శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలో ఉన్న మరో ఇంటివైపు వెళ్లింది. ఆ ఇంటి ముందు ఉన్న సంపు మూత తెరిచి ఉండటంతో నిత్య సంపులో పడిపోయింది. చాలా సేపు ఎవరూ గమనించలేదు. గంట తర్వాత నిత్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం మొదలు పెట్టారు. చివరకు సంపులో తెలియాడటంతో నిత్యను బయటికి తీశారు. అప్పటికే పాప మృతి చెందింది.
మురుగు వచ్చిందని.. సంపు మూత తెరిచి
ఇటీవల కురుస్తున్న వర్షాలకు సమీపంలోని ఇంటి వద్ద ఉన్న సంపులో మురుగు చేరింది. దీంతో మురుగును బయటి పంపించేందుకు సంపు మూతను తెరి ఉంచినట్లు ఇంటి యజమాని తెలిపింది. సంపు మూతనుపెట్టకుండానే తాను పనికి వెళ్లింది. చుట్టూ ఎటువంటి రక్షణ లేకపోవడంతో అభం శుభం తెలియని చిన్నారి సంపులో పడి మునిగిపోయిందని స్థానికులు తెలిపారు.
► ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment