సాక్షి, దుండిగల్: పోలియో చుక్కలు వేయించిన కొద్ది నిమిషాలకే 3 నెలల పసిపాప విగత జీవిగా మారింది. ఈ ఘటన దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్‌లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, రమ్యలకు దీక్షిత (3 నెలల) పాప ఉంది. మహేశ్వరంలో తల్లిగారి ఇంటికి వెళ్లిన రమ్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారికి శంభీపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేయించింది. ఇంటికి వెళ్లిన 15 నిమిషాలకే చిన్నారి నుంచి ఎలాంటి ఉలుకూపలుకూ లేదు. చిన్నారిలో చలనం లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు మదీనాగూడలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: అన్యాయం జరుగుతుంటే గాడిదలు కాస్తున్నారా?
వ్యాక్సిన్ వికటించడంతోనే పాప మృతి చెందిందని పేర్కొంటూ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్, దండిగల్ మండల వైద్యాధికారి నిర్మల, సీఐ వెంకటేశం, ఎస్‌ఐ చంద్రశేఖర్ అంగన్‌వాడీ కేంద్రం వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఇదే బూత్‌లో 250 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని, వారందరూ క్షేమంగానే ఉన్నారన్నారు. పుట్టిన సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలుంటేనే ఇలా జరిగే ఆస్కారముందని, పోస్ట్‌మార్టమ్ నివేదికలోనే నిజానిజాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు ఏ విషయం చెప్పలేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment