Polio vaccine
-
పోలియో చుక్కలు వేయించిన కొద్దిసేపటికే
సాక్షి, దుండిగల్: పోలియో చుక్కలు వేయించిన కొద్ది నిమిషాలకే 3 నెలల పసిపాప విగత జీవిగా మారింది. ఈ ఘటన దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, రమ్యలకు దీక్షిత (3 నెలల) పాప ఉంది. మహేశ్వరంలో తల్లిగారి ఇంటికి వెళ్లిన రమ్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారికి శంభీపూర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేయించింది. ఇంటికి వెళ్లిన 15 నిమిషాలకే చిన్నారి నుంచి ఎలాంటి ఉలుకూపలుకూ లేదు. చిన్నారిలో చలనం లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు మదీనాగూడలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: అన్యాయం జరుగుతుంటే గాడిదలు కాస్తున్నారా? వ్యాక్సిన్ వికటించడంతోనే పాప మృతి చెందిందని పేర్కొంటూ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్, దండిగల్ మండల వైద్యాధికారి నిర్మల, సీఐ వెంకటేశం, ఎస్ఐ చంద్రశేఖర్ అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఇదే బూత్‌లో 250 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని, వారందరూ క్షేమంగానే ఉన్నారన్నారు. పుట్టిన సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలుంటేనే ఇలా జరిగే ఆస్కారముందని, పోస్ట్‌మార్టమ్ నివేదికలోనే నిజానిజాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు ఏ విషయం చెప్పలేమన్నారు. -
బీసీజీ, పోలియో టీకాలతో కరోనాకు చెక్!
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో క్షయ, పోలియో వ్యాక్సిన్లను ఉపయోగించే అవకాశాన్ని అమెరికా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంతో ట్యుబర్కులోసిస్ టీకా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు అమెరికాలో పరీక్షలు జరుగుతున్నాయని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. ‘కోవిడ్–19పై పోరాడేందుకు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఏకైక టీకా బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్టే గ్యురిన్)నే’అని టెక్సాస్ ఏ అండ్ ఎం హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ డి సిరిల్లో అన్నారు. (గూగుల్ @కరోనా సెంటర్) అమెరికా ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గతంలో ఈ టీకాను సురక్షితంగా ప్రయోగించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కోవిడ్–19 నిలువరించేందుకు పోలియో వ్యాక్సిన్‌ను కూడా వాడొచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. పాక్ సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ అజ్రా రజా మాట్లాడుతూ.. బీసీజీ టీకా అనేక రకాల వైరస్‌లతోపాటు బ్లాడర్ క్యాన్సర్‌ను కూడా అడ్డుకున్నట్లు రుజువైందన్నారు. ‘బీసీజీ, పోలియోలపై పోరాడేందుకు గతంలో కోట్ల మందికి ఈ టీకాలను ఇచ్చాం. వీటితో బాధితులకు రిస్క్ చాలా తక్కువ. ఇవి శరీరంలో సహజ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కరోనా సహా పలు వైరస్‌లను నియంత్రించే శక్తి వీటికి ఉంది’అని వీరు తెలిపారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. (కోవిడ్ పేదలు వంద కోట్లు) -
నేటి నుంచి టీకాలు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతకొన్ని రోజులుగా గర్భిణులకు, చిన్నారులకు ఇచ్చే వ్యాధినిరోధక టీకాలు ఆగిపోయాయి. శనివారం నుంచి ఆ టీకాలు యథావిధిగా వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశించారు. ప్రతి బుధవారం, శనివారం రోటావైరస్, డీపీటీ, తట్టు, పోలియో తదితర వ్యాక్సిన్లు ఇస్తారు. నేటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయాలన్నారు. టీకాలు ఇలా వేయాలి.. ► టీకాలు వేయాల్సిన వాళ్లందరినీ గుర్తించాలి ► వారిలో అరగంటకు నలుగురుకి చొప్పున స్లాట్లు ఇవ్వాలి ► ఆశా కార్యకర్తల ద్వారా ముందురోజే ఈ స్లాట్ సమయం స్లిప్పులు ఇవ్వాలి ► గ్రామ, వార్డు పరిధిలోని లబ్ధిదారులందరికీ టీకాలు వేసే వరకూ స్లాట్లను కొనసాగించాలి ► ఏఎన్ఎంలు గానీ, ఆశాలు గానీ, అంగన్వాడీ వర్కర్‌గానీ కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే టీకాల్లో పాల్గొనకూడదు ► రెడ్‌జోన్ (కంటైన్మెంట్ జోన్) ప్రాంతాల్లో టీకాల కార్యక్రమం నిర్వహించకూడదు ► టీకాలకు వచ్చే వారి మధ్య కనీసం 7 అడుగుల భౌతిక దూరం ఉండేలా చూడాలి ► టీకాలు వేసే ఏఎన్ఎం సర్జికల్ మాస్కు ధరించడంతో పాటు టీకా వేసేముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి -
దేశంలో అట్టడుగు స్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : పిల్లలకు టీకాలు వేయడంలో తెలంగాణ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 35వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. 2019–20లో ఇప్పటివరకు దేశంలో టీకాలు వేయడంలో తమిళనాడు 148 శాతంతో మొదటిస్థానంలో నిలవగా, అట్టడుగు స్థానంలో సిక్కిం 53.60 శాతం, ఆ తర్వాత తెలంగాణ 54.30 శాతంతో వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా, టీకాలు సరఫరా చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది. 2018–19లో మాత్రం తెలంగాణ 95.98 శాతం టీకాలు వేసింది. 2017–18లో 88.96 శాతం కవర్ చేసింది. కానీ ఈ ఏడాది వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది.(6 నుంచి బడ్జెట్ సమావేశాలు) విటమిన్ ఏ టీకాలే తక్కువగా... యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద గిరిజనులు, ఇతర మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు వేస్తారు. మిషన్ ఇంద్రధనుష్, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్, గ్రామ్ స్వరాజ్ అభియాన్ (జీఎస్ఏ) పథకాల కింద ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. బీసీజీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్ బీ వ్యాక్సిన్, పెంటావాలెంట్ వ్యాక్సిన్, క్రియారహిత పోలియో వైరస్ వ్యాక్సిన్ (ఐపీవీ), మీజిల్స్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్, డిఫ్తీరియా, పెర్టుసిస్–టెటానస్ (టీపీటీ), రోటావైరస్ వ్యాక్సిన్ (ఆర్వీవీ) తదితరమైనవి వేయాల్సి ఉంటుంది. ఆ టీకాలు వేయడం వల్ల సంబంధిత రోగాల నియంత్రణే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాలను చేపట్టింది. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం వ్యాక్సిన్లపై పెద్దగా శ్రద్ధ చూపించడం లేదని కేంద్ర నివేదిక చెబుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 80.3 శాతమే పోలియో వ్యాక్సిన్లు వేసినట్లు తేల్చింది. అలాగే తట్టు (మీజిల్స్) టీకాలు 81.9 శాతమే వేశారు. బీసీజీ టీకాలు 83.6 శాతం మందికి వేశారు. ఇవిగాక విటమిన్ ఏ టీకాలు మూడు దశలకు సంబంధించి కేవలం 15 నుంచి 36 శాతం మధ్యే వేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పోలియో వంటి టీకాలను ఇంటింటికీ తిరిగి వేస్తున్నామని, బస్టాండ్లు, స్కూళ్లు, ఆరుబయట ఎక్కడ కనిపిస్తే అక్కడ చిన్న పిల్లలకు వేస్తున్నామని చెబుతున్నా, ఆచరణలో మాత్రం తేడా కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో టీకాలు అందుబాటులో ఉంచకపోవడం కూడా ఇంత వెనుకబాటుకు ఒక కారణంగా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిన్న పిల్లలకు బీసీజీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్ బీ వ్యాక్సిన్, పెంటావాలెంట్ వ్యాక్సిన్, క్రియారహిత పోలియో వైరస్ వ్యాక్సిన్ (ఐపీవీ), మీజిల్స్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్, డిఫ్తీరియా, పెర్టుసిస్–టెటానస్ (టీపీటీ), రోటావైరస్ వ్యాక్సిన్ (ఆర్వీవీ) తదితర టీకాలు వేయాల్సి ఉంటుంది. -
‘కలుషిత పోలియో’ కలవరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ కలుషిత పోలియో మందు కలవరం సృష్టిస్తోంది. కేంద్రం ప్రకటించిన బ్యాచ్ నంబర్–బీ10048 కలుషిత వ్యాక్సిన్లను రాష్ట్రంలోని అనేకమంది చిన్నారులకు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు నిర్ధారించాయి. ఎంతమంది చిన్నారులకు వేశారో లెక్క తేలడం లేదు. ఆయా వ్యాక్సిన్ల వల్ల చిన్నారులకు ఎలాంటి ప్రమాదం తలెత్తదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశా రు. అవి ఏమాత్రం కలుషితమైనవి కావని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఓఎస్డీ, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ తాడూరి గంగాధర్ అన్నారు. కలుషిత వ్యాక్సిన్లు వాడారన్న ప్రచారంతో పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పిల్లల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వాడకం తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లోని చిన్నారులకు ఈ వ్యాక్సిన్లు వేయించారని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఘజియాబాద్ బయోమెడ్ సంస్థ వీటిని తయారు చేసింది. 3 బ్యాచ్‌ల్లో 1.5 లక్షల యూనిట్ల కలుషిత వ్యాక్సిన్లను పంపిణీ చేయగా 2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వీటిని వేశారు. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాక్సిన్లను చాలాకాలం క్రితమే వెనక్కి తీసుకున్నారు. టైప్–2 పోలియో వైరస్‌తో కలుషితమైన ఈ పోలియో చుక్కల ద్వారా ఇప్పటికే నాశనమైన ఓ వైరస్ చిన్నారుల్లోకి తిరిగి ప్రవేశించే అవకాశముంది. కలుషితమైనట్లు చెబుతున్న వ్యాక్సిన్లు రాష్ట్రంలో 15 లక్షల డోసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. వాటిని వెనక్కి తెప్పిస్తున్నామని, కొన్నింటిని తెప్పించామంటున్నారు. పోలియో రహితంగా ప్రకటించినా... 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని ‘పోలియో ఫ్రీ’ దేశంగా ప్రకటించింది. 2016లో టైప్–2 స్ట్రెయిన్ ఉండే వ్యాక్సిన్లను మొత్తం వెనక్కు తీసుకుంది. మన దేశం అప్పటికే ఉన్న టైప్–2 వ్యాక్సిన్ నిల్వలను ధ్వంసం చేసింది. ఏప్రిల్ 2016 తర్వాత టైప్–1 లేదా టైప్–3 వ్యాక్సిన్లు బైవాలెంట్ వ్యాక్సిన్లనే అమ్మాలి. కానీ, ఘజియాబాద్ కంపెనీ నిషేధిత టైప్–2 వ్యాక్సిన్ ఎలా సరఫరా చేసింద నేది ప్రశ్నార్థకంగా మారింది. నెల క్రితం రాష్ట్రంలో పెంటావాలెంట్ టీకాతో ఓ చిన్నారి మృతి చెందిం ది. కొందరికి ప్రభుత్వమే హైదరాబాద్‌లో చికిత్స చేయించింది. దీనిపై సర్కారు నివేదిక తయారు చేసినా దాన్ని బయటకు పొక్కనీయలేదు. -
అక్షయ్‌హరిప్రసాద్‌కుమార్
ఉత్తరప్రదేశ్‌లోని ఖైరాహి గ్రామం. ఆ గ్రామానికి పెద్ద హరిప్రసాద్. గ్రామపెద్ద ఆలోచనలు ఊరి గురించే సాగాలి, అలాగే సాగుతుంటాయి కూడా. మామూలుగా అయితే ఊరి చెరువు ఎలా ఉంది, పంటకాలువల పూడిక ఎప్పుడు తీయాలి, రోడ్లెలా ఉన్నాయి, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా, స్కూలు భవనం పెచ్చులు రాలకుండా పటిష్టంగా ఉందా లేదా, టీచర్లు అందరూ వస్తున్నారా, పాఠాలు చక్కగా చెబుతున్నారా, పిల్లలకు పోలియో వ్యాక్సిన్లు వేయిస్తున్నారా లేదా... ఇంత వరకే సాగుతుంటాయి. అయితే హరిప్రసాద్ ఆలోచనలు మరింత ముందుకెళ్లాయి. స్కూలుకి టీచర్లు సక్రమంగా వచ్చేలా చూడటంతోనే సరిపోదు, పిల్లలు కూడా వచ్చేలా చూడాలి. అప్పుడే పిల్లలకు నాలుగు అక్షరాలు వస్తాయి అనుకున్నాడు. పిల్లల హాజరు మీదకు మళ్లింది హరిప్రసాద్ దృష్టి. తొమ్మిది, పది తరగతుల్లో ఆడ పిల్లలు తరచూ స్కూలు ‘ఎగ్గొట్టేస్తున్నారు’. నిజమే, హాజరు పట్టీ చూసిన హరిప్రసాద్‌కు కలిగిన తొలి అభిప్రాయం అదే. ‘ఒక్కొక్కరు అన్నేసి రోజులు బడికి రాకపోతే మీరేమీ పట్టించుకోరా, రోజూ పాఠాలు వినాలని చెప్పాల్సిన మీరే ఏమీ పట్టనట్లు ఊరుకుంటే ఎలా’ అని టీచర్లను అడిగాడు. అప్పుడు తెలిసింది! ఆ ప్రశ్నకు టీచర్ల దగ్గర సమాధానం లేదు. ‘ఇదే ప్రశ్న మేమూ అడుగుతున్నాం. ఆ అమ్మాయిలు మాత్రం నోరు విప్పడం లేదు. ఎంత గట్టిగా అడిగినా, నిలదీసినా కూడా మౌనాన్ని వీడడం లేదు’ అని నిస్సహాయతను వ్యక్తం చేశారు హెడ్మాస్టర్. ‘బహుశా రుతుక్రమం ఇబ్బందులు కావచ్చు, మేమెలా మాట్లాడగలం? ప్రతి నెలలోనూ నాలుగైదు రోజులు సెలవులను చూసీచూడనట్లు వదిలేయక తప్పడం లేదు’ సైన్స్ టీచర్ మెల్లగా చెప్పారు. ఆమె ఊహ నిజమే! తండ్రుల సమావేశం హరిప్రసాద్ వెంటనే స్కూల్లోనే ఒక చిన్న గదికి ఎరుపు రంగు వేసి అందులో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాడు. ‘వీటిని వాడుకోండి, ఈ సమస్య కోసం పాఠాలు మానుకోవద్దు, రోజూ స్కూలుకి రండి’ అని టీచర్లతో చెప్పించాడు. అంతటితో ఊరుకోకుండా ఆ స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయిల తండ్రులతో స్వయంగా మాట్లాడాడు. ‘రుతుక్రమం కళంకం కాదు, దేహధర్మం. ఆ రోజుల్లో ఒక పక్కన ఉండిపోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. బడికి పంపడమూ తప్పు కాదు. పిల్లలకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇంట్లో కంటే మెరుగ్గా ఉంటాయి స్కూల్లో. అమ్మాయిలను అన్ని రోజుల్లోనూ స్కూలుకి పంపించండి’ అని వారు సమాధానపడే వరకు చెప్పారు. హరిప్రసాద్ ఆరోగ్యశాఖలో స్వచ్ఛందంగా పని చేస్తుంటారు. యునిసెఫ్ నిర్వహిస్తున్న ‘ప్రాజెక్ట్ గరిమ’లో కూడా క్రియాశీలకంగా పని చేస్తుంటారు. దాంతో ఆరోగ్యశాఖ ఈ స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయిలకు అవసరమైనన్ని నాప్కిన్స్ని సప్లయ్ చేస్తోంది. ఆ ప్రయత్నంతో టీచర్లలో కూడా ఉత్సాహం వచ్చింది. అప్పటికే బడి మానేసిన 35 మంది అమ్మాయిల తల్లిదండ్రులను ఒప్పించి, ఆ అమ్మాయిలను తిరిగి స్కూల్లో చేర్చుకున్నారు స్కూల్ హెడ్మాస్టర్. లోకల్ ప్యాడ్‌మ్యాన్ హరిప్రసాద్ ఇదంతా ఎటువంటి ఆర్భాటం లేకుండా చాలా మామూలుగా చేసేశారు. కానీ ఆ ఊరి యువకులు మాత్రం అతడికి మారుపేరు పెట్టేశారు. శానిటరీ ప్యాడ్ పట్ల అవగాహన కల్పించడానికి అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాతో పోల్చి ఆ పేరే పెట్టేశారు. హరిప్రసాద్‌ను అదే సంగతి అడిగితే ‘ఆ సినిమా గురించి నాకు తెలియదు. యువకులంతా ఆ సినిమా పేరుతో పిలుస్తున్నారు’ అని నవ్వేస్తారాయన. ఖైరాహీ పాఠశాలలోని ఈ ఎరుపు రంగు గదిలో శానిటరీ నేప్కిన్స్ సిద్ధంగా ఉంటాయి. బాలికల గైర్హాజరీని తగ్గించేందుకు హరిప్రసాద్ ఈ ఏర్పాటు చేశారు. ఆ గదికి ప్రత్యేకంగా ఎరుపు రంగును వేయించింది కూడా ఆయనే! – మంజీర -
పల్స్ పోలియోపై అవగాహన
రెబ్బెన : మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 28న చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సీతారాం ఆరోగ్య సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్సీ, అంగన్వాడీ, ఆశ వర్కర్లకు పల్స్ పోలియోపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ సంతోష్, పావని, హెల్త్ అసిస్టెంట్లు కమలాకర్, ప్రవీన్, ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ, అశ వర్కర్లు పాల్గొన్నారు. జైనూర్ మండలంలో.. జైనూర్ : పల్స్ పోలియో కార్యక్రమం 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం జైనూర్ ఆస్పత్రిలో ఆశావర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. మండలంలో ఐదు సంవత్సరాల లోపు 3543 మంది పిల్లలు ఉన్నారని వైద్యుడు నరేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు. వాంకిడిలో.. వాంకిడి : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం పల్స్‌పోలీయో నిర్వహణపై అంగన్వాడీలు, ఆయాలు, ఏఎన్ఎంలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 మూడు రోజుల పాటు పల్స్ పోలీయో కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సదస్సులో పీహెచ్ఎన్ తెరిసా, సూపర్వైజర్ సంతోష్ తదితరులు ఉన్నారు. తిర్యాణిలో.. తిర్యాణి : పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వైద్యాధికారి శ్యాంకుమార్ అన్నారు. మండలంలోని ఎమ్మార్సి కార్యాలయం సమావేశ మందిరంలో పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమంపై వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఈ శ్రీహరి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు. -
ఈ నెల 29న పల్స్‌పోలియో
హైదరాబాద్: జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో టీకాలు వేయనున్నారు. నగరంలో 3200 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాక్సినేషన్ కోసం 1200 మంది ఏఎన్ఎంలు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులను ఎంపిక చేశారు. తొలి రోజు కేవలం ఎంపిక చేసిన బూతుల్లోనే కాకుండా బస్టాండ్లు, రైల్వే స్టే షన్లు, విమానాశ్రయాలు, దేవాలయాలు, పార్కులు, ఇతర రద్దీ ప్రదేశాల్లోనూ పోలియో వాక్సిన్ వేయనున్నారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు డోర్ టు డోర్ తిరిగి పోలియో వాక్సిన్ వేయించుకోని చిన్నారులను గుర్తించి వారికి చుక్కల మందు వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. -
వారంలో రెండు రోజులు ఐపీవీ పోలియో టీకా
అన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులోకి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు చుక్కల మందుకే పరిమితమైన పోలియో వ్యాక్సిన్... ఇక నుంచి ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్) రూపంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్సీ)లో ఈ వ్యాక్సిన్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ప్రతి బుధ, శనివారాల్లో చుక్కల మందు వేస్తున్నారు. వారంలో ఈ రెండు రోజులూ చుక్కల మందుతో పాటు ఇకపై ఐపీవీ కూడా అందుబాటులో ఉంచుతారు. అలాగే శనివారం అంగన్వాడీ, ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ ఐపీవీ వేస్తారని రాష్ట్ర ఇమ్యునైజేషన్ ప్రత్యేకాధికారి డాక్టర్ జి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. నెలన్నర, మూడున్నర నెలల పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు. ఐపీవీని రాష్ట్రంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఐపీవీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప మరెక్కడా అందుబాటులో ఉండదు. ఐపీవీ సురక్షితం... ప్రస్తుతం చుక్కల మందు రూపంలో పోలియో వ్యాక్సిన్‌ను పిల్లలకు వేస్తున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఐపీవీని కూడా విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నారు. చుక్కల మందు కంటే కూడా ఐపీవీ మరింత సురక్షితమని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చుక్కల మందులో సజీవ వైరస్ ఉంటుందని... అది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయంటోంది. చుక్కల మందు కంటే ఐపీవీ టీకా సురక్షితమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా చెబుతోంది. పోలియో కలిగించే మూడు రకాల వైరస్‌లకు ఇది చెక్ పెడుతుంద ని నిపుణులు చెబుతున్నారు. చుక్కల మందు 1, 3 రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని... ఐపీవీ ఇంజెక్షన్ మాత్రం మూడు రకాల వైరస్‌లనూ నాశనం చేస్తుందంటున్నారు. ఈ క్రమంలో 2018 నుంచి పూర్తిగా ఐపీవీ టీకానే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముగిసిన ప్రత్యేక కార్యక్రమం... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లల కోసం ఈ నెల 20న ప్రారంభించిన ఐపీవీ టీకా ప్రత్యేక కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. మొత్తం రెండున్నర లక్షల మంది పిల్లలకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఏకంగా 3,10,968 మందికి వేసినట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌కు చెందిన 9 మంది ప్రత్యేక ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారన్నారు. మొత్తం కార్యక్రమాన్ని రికార్డు చేయడమే కాకుండా డాక్యుమెంటరీ రూపొందించారు. వివిధ దేశాలకు ఈ డాక్యుమెంటరీ పంపించి అక్కడ ప్రజలను చైతన్యం చేస్తారు. -
తొలిరోజు నగరంలో 56 వేల మందికి..
మరో ఐదు రోజులపాటు పోలియో టీకాలు సాక్షి, హైదరాబాద్: పోలియో టీకాల కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన సోమవారం హైదరాబాద్ జిల్లాలోని 750 బూత్‌ల పరిధిలో సుమారు 56 వేల మంది చిన్నారులకు ఇన్-యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్(ఐపీవీ)వేయగా, రంగారెడ్డి జిల్లాలోని 136 బూత్‌ల పరిధిలో 16 వేల మందికి వేశారు. అంబర్పేట్, బార్కాస్, కంటోన్మెంట్, మలక్‌పేట్, కోఠి, లాలాపేట్, డబీర్‌పుర, జంగంమెట్, పానీపుర, సీతాఫల్మండి, సూరజ్‌భాను, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, బాలానగర్, ఉప్పల్, నారపల్లి, కీసర, అబ్దుల్లాపూర్, సరూర్‌నగర్, బాలాపూర్ల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లకు ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మెప్మా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లతో కూడిన వైద్య బృందం చేరుకుంది. ఉదయం తొమ్మిది గంటలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఐపీవీ క్యాంప్ నిర్వహించడం ప్రపంచలోనే ఇది తొలిసారి కావడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునిసెఫ్ సహా పలు దేశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల నిపుణులు కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాల్ని పరిశీలించారు. పిల్లలకు టీకాలు వేస్తున్న తీరును స్వయంగా సమీక్షించారు. ఇదిలా ఉంటే అంబర్పేట్ ఆరోగ్య కేంద్రం సహా పలు యూపీహెచ్‌సీల్లో కరెంట్ లేక వ్యాక్సినేషన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. -
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం
మంత్రి రావెల చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ప్రారంభం గుంటూరు మెడికల్: పేదలకు కార్పోరేట్‌స్థాయి వైద్యసేవలు అందించటమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. బుధవారం గుంటూరు కేవీపీకాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రొటావైరస్ వ్యాక్సిన్, ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్, చంద్రన్న సంచార చికిత్స వాహనాలను (పాత 104 వాహనం) ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ‘చంద్రన్న సంచార చికిత్స వాహనాలు’ అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ వాహనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చటమే చంద్రబాబు లక్ష్యమని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పిల్లల్లో నీళ్ళ విరోచనాలను రొటావైరస్ వ్యాక్సిన్ అరికడుతుందని, డయేరియా రాకుండా పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలన్నారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ చంద్రన్న సంచార వాహన సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగించినా వాటిపై ప్రభుత్వం అజమాయిషీ, విజిలెన్స్ మానిటరింగ్ ఉండాలని తెలిపారు. వినుకొండ, మాచర్ల, రేపల్లె ఆస్పత్రుల్లో గుండెపోటు బాధితుల కోసం సీసీయూ, ఐసీయూలు ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ రామకృష్ణ , జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, జాయింట్ కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వర రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి, డీఐవో డాక్టర్ మాచర్ల సుహాసిని, డీటీసీవో డాక్టర్ యేపూరు కామేశ్వరప్రసాద్, పీవో డీటీటీ డాక్టర్ వై. రామకోటిరెడ్డి, ఎన్హెచ్ఎమ్ డీపీఎంవో డాక్టర్ మేడా శ్యామలాదేవి, టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాసరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలియో వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి
జగ్గయ్యపేట (కృష్ణాజిల్లా) : ఓ జంటకు పెళ్లయిన తొమ్మిదేళ్లకు పుట్టిన చిన్నారిని పోలియో వ్యాక్సిన్ రూపంలో మృత్యువు మింగేసింది. లేకలేక పుట్టిన బిడ్డ మరణించడంతో ఆ తల్లిదండ్రుల వేదన చూపరులను కంటతడి పెట్టించింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు బాధితుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. స్థానిక చెరువుబజారుకు చెందిన ఓర్సు సాంబశివరావు, భూలక్ష్మి దంపతుల ఇంటికి ప్రభుత్వాస్పత్రి నుంచి ఏఎన్ఎంలు నాగలక్ష్మి, పద్మ ఉదయం 11 గంటలకు వచ్చి వారి మూడు నెలల కుమారుడు అంకమరావుకు పోలియో వ్యాక్సిన్ వేయాలని, పెద్ద రామాలయం వద్దకు రావాలని సూచించారు. భూలక్ష్మి కుమారుడిని తీసుకెళ్లి వ్యాక్సిన్ (బీపీటీ) వేయించింది. ఇంటికి వెళ్లాక బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తొలుత ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ్నుంచి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బిడ్డ చనిపోయాడు. దీంతో బాధితులు, బంధువులతో పాటు సీపీఎం, సీఐటీయూ తదితర ప్రజాసంఘాలు ప్రభుత్వాస్పత్రి ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న నర్సులు, వైద్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. పోస్టుమార్టం చేసి చిన్నారి మృతిని నిర్ధారించేందుకు విజయవాడ పంపుతున్నట్లు వైద్యాధికారి తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వచ్చి జరిగిన విషయాన్ని విచారిస్తారని తెలిపారు. -
పోలియో వ్యాక్సిన్ సృష్టికర్తకు 'డూడుల్' నివాళి
పోలియో వ్యాక్సిన్ సృష్టికర్త డాక్టర్ జొరాస్ శాక్ శత జయంతిని పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ వినూత్న నివాళి అర్పించింది. ఆయనకు నివాళిగా హోంపేజీలో డూడుల్ పెట్టింది. 'థ్యాంక్ యూ, డాక్టర్ శాక్!' అని రాసివున్న ప్లకార్డును ఇద్దరు పిల్లలు పట్టుకున్న డూడుల్ లో చూపించారు. డాక్టర్ శాక్ వ్యాక్సిన్ కనిపెట్టడానికి రెండేళ్ల ముందు అమెరికాలో 45 వేలకు పైగా పోలియో కేసులు నమోదయ్యాయి. 1962లో ఈ సంఖ్య 910కి తగ్గింది. డాక్టర్ శాక్.. 1914, అక్టోబర్ 28న న్యూయార్క్ లో జన్మించారు. 1939లో న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్ లో ఎండీ డిగ్రీ సాధించిన శాక్... మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో ఫిజిషియన్ గా పనిచేశారు. తర్వాత మిచిగాన్ వర్సిటీలో చేరారు. అమెరికా సైన్యం విజ్ఞప్తి మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తయారు చేశారు. తర్వాత కాలంలో ఆయన పోలియో వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. 1955, ఏప్రిల్ 12న పోలియో వ్యాక్సిన్ సురక్షితమని ప్రకటించారు. ఆయన తయారు చేసిన ఈ వ్యాక్సిన్ చిన్నారులను పోలియో మహమ్మారి బారిన పడకుండా కాపాడుతోంది.శాక్ తన 80వ యేట 1995, జూన్ 23న కన్నుమూశారు.