జగ్గయ్యపేట (కృష్ణాజిల్లా) : ఓ జంటకు పెళ్లయిన తొమ్మిదేళ్లకు పుట్టిన చిన్నారిని పోలియో వ్యాక్సిన్ రూపంలో మృత్యువు మింగేసింది. లేకలేక పుట్టిన బిడ్డ మరణించడంతో ఆ తల్లిదండ్రుల వేదన చూపరులను కంటతడి పెట్టించింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు బాధితుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. స్థానిక చెరువుబజారుకు చెందిన ఓర్సు సాంబశివరావు, భూలక్ష్మి దంపతుల ఇంటికి ప్రభుత్వాస్పత్రి నుంచి ఏఎన్‌ఎంలు నాగలక్ష్మి, పద్మ ఉదయం 11 గంటలకు వచ్చి వారి మూడు నెలల కుమారుడు అంకమరావుకు పోలియో వ్యాక్సిన్ వేయాలని, పెద్ద రామాలయం వద్దకు రావాలని సూచించారు. భూలక్ష్మి కుమారుడిని తీసుకెళ్లి వ్యాక్సిన్ (బీపీటీ) వేయించింది.
ఇంటికి వెళ్లాక బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తొలుత ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ్నుంచి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బిడ్డ చనిపోయాడు. దీంతో బాధితులు, బంధువులతో పాటు సీపీఎం, సీఐటీయూ తదితర ప్రజాసంఘాలు ప్రభుత్వాస్పత్రి ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న నర్సులు, వైద్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. పోస్టుమార్టం చేసి చిన్నారి మృతిని నిర్ధారించేందుకు విజయవాడ పంపుతున్నట్లు వైద్యాధికారి తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వచ్చి జరిగిన విషయాన్ని విచారిస్తారని తెలిపారు.
పోలియో వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి
Published Wed, Mar 11 2015 10:25 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement
Advertisement