శిశువుకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో ఆరు నెలల గర్భిణీ అయిన భార్య కడుపులోని శిశువు హత్యకు కారణమైన భర్త, అత్తలను కంచన్‌బాగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. హఫీజ్‌బాబానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహమూద్, తబస్సుమ్ బేగంలు దంపతులు. వీరికి 18 నెలల పాప సంతానం ఉంది. ప్రస్తుతం తబస్సుమ్ ఆరు నెలల గర్భిణీ. అయితే భర్త మహమూద్ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో ఈ నెల 14వ తేదీన రాత్రి తబస్సుమ్‌కు బలవంతంగా అబార్షన్ మందులు అందించాడు.
దీంతో ఈ నెల 15వ తేదీన తబస్సుమ్ తీవ్ర రక్తస్రానికి గురై ఇంట్లోనే చనిపోయిన శిశువుకు జన్మనిచ్చింది. దీంతో మహమూద్ కుటుంబ సభ్యులు మృత శిశువుని హఫీజ్‌బాబానగర్‌లోనే పాతిపెట్టారు. అనంతరం తబస్సుమ్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో చాంద్రాయణగుట్టలోని లిమ్రా ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలను అందించాడు. ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం తబస్సుమ్‌ను భర్త మహమూద్, కుటుంబ సభ్యులు తలాబ్‌కట్టాలో నివాసముండే తల్లిగారింటికి పంపించారు. దీంతో తబస్సుమ్ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది.
తబస్సుమ్ కుటుంబ సభ్యులు ఈ నెల 17వ తేదీన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో భర్త మహమూద్, అత్త షమీమ్ బేగం, ఆడ పడుచు షహనాజ్‌లపై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా బండ్లగూడ మండల తహసీల్దార్ నవీన్, ఫొరెన్సిక్ వైద్య సిబ్బంది సమక్షంలో హఫీజ్‌బాబానగర్‌లో పాతిపెట్టిన శిశువుని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శిశువు మృతికి కారణమైన మహమూద్, షమీమ్ బేగంలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ కేసులో మరో నిందితులు ఆడపడుచు షహనాజ్ పరారీలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment