పోలియో వ్యాక్సిన్ సృష్టికర్తకు 'డూడుల్' నివాళి
పోలియో వ్యాక్సిన్ సృష్టికర్త డాక్టర్ జొరాస్ శాక్ శత జయంతిని పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ వినూత్న నివాళి అర్పించింది. ఆయనకు నివాళిగా హోంపేజీలో డూడుల్ పెట్టింది. 'థ్యాంక్ యూ, డాక్టర్ శాక్!' అని రాసివున్న ప్లకార్డును ఇద్దరు పిల్లలు పట్టుకున్న డూడుల్ లో చూపించారు. డాక్టర్ శాక్ వ్యాక్సిన్ కనిపెట్టడానికి రెండేళ్ల ముందు అమెరికాలో 45 వేలకు పైగా పోలియో కేసులు నమోదయ్యాయి. 1962లో ఈ సంఖ్య 910కి తగ్గింది.
డాక్టర్ శాక్.. 1914, అక్టోబర్ 28న న్యూయార్క్ లో జన్మించారు. 1939లో న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్ లో ఎండీ డిగ్రీ సాధించిన శాక్... మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో ఫిజిషియన్ గా పనిచేశారు. తర్వాత మిచిగాన్ వర్సిటీలో చేరారు. అమెరికా సైన్యం విజ్ఞప్తి మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తయారు చేశారు.
తర్వాత కాలంలో ఆయన పోలియో వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. 1955, ఏప్రిల్ 12న పోలియో వ్యాక్సిన్ సురక్షితమని ప్రకటించారు. ఆయన తయారు చేసిన ఈ వ్యాక్సిన్ చిన్నారులను పోలియో మహమ్మారి బారిన పడకుండా కాపాడుతోంది.శాక్ తన 80వ యేట 1995, జూన్ 23న కన్నుమూశారు.