సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ కలుషిత పోలియో మందు కలవరం సృష్టిస్తోంది. కేంద్రం ప్రకటించిన బ్యాచ్ నంబర్–బీ10048 కలుషిత వ్యాక్సిన్లను రాష్ట్రంలోని అనేకమంది చిన్నారులకు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు నిర్ధారించాయి. ఎంతమంది చిన్నారులకు వేశారో లెక్క తేలడం లేదు. ఆయా వ్యాక్సిన్ల వల్ల చిన్నారులకు ఎలాంటి ప్రమాదం తలెత్తదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశా రు. అవి ఏమాత్రం కలుషితమైనవి కావని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఓఎస్డీ, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ తాడూరి గంగాధర్ అన్నారు. కలుషిత వ్యాక్సిన్లు వాడారన్న ప్రచారంతో పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పిల్లల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వాడకం
తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లోని చిన్నారులకు ఈ వ్యాక్సిన్లు వేయించారని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఘజియాబాద్ బయోమెడ్ సంస్థ వీటిని తయారు చేసింది. 3 బ్యాచ్‌ల్లో 1.5 లక్షల యూనిట్ల కలుషిత వ్యాక్సిన్లను పంపిణీ చేయగా 2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వీటిని వేశారు. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాక్సిన్లను చాలాకాలం క్రితమే వెనక్కి తీసుకున్నారు. టైప్–2 పోలియో వైరస్‌తో కలుషితమైన ఈ పోలియో చుక్కల ద్వారా ఇప్పటికే నాశనమైన ఓ వైరస్ చిన్నారుల్లోకి తిరిగి ప్రవేశించే అవకాశముంది. కలుషితమైనట్లు చెబుతున్న వ్యాక్సిన్లు రాష్ట్రంలో 15 లక్షల డోసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. వాటిని వెనక్కి తెప్పిస్తున్నామని, కొన్నింటిని తెప్పించామంటున్నారు.
పోలియో రహితంగా ప్రకటించినా...
2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని ‘పోలియో ఫ్రీ’ దేశంగా ప్రకటించింది. 2016లో టైప్–2 స్ట్రెయిన్ ఉండే వ్యాక్సిన్లను మొత్తం వెనక్కు తీసుకుంది. మన దేశం అప్పటికే ఉన్న టైప్–2 వ్యాక్సిన్ నిల్వలను ధ్వంసం చేసింది. ఏప్రిల్ 2016 తర్వాత టైప్–1 లేదా టైప్–3 వ్యాక్సిన్లు బైవాలెంట్ వ్యాక్సిన్లనే అమ్మాలి. కానీ, ఘజియాబాద్ కంపెనీ నిషేధిత టైప్–2 వ్యాక్సిన్ ఎలా సరఫరా చేసింద నేది ప్రశ్నార్థకంగా మారింది. నెల క్రితం రాష్ట్రంలో పెంటావాలెంట్ టీకాతో ఓ చిన్నారి మృతి చెందిం ది. కొందరికి ప్రభుత్వమే హైదరాబాద్‌లో చికిత్స చేయించింది. దీనిపై సర్కారు నివేదిక తయారు చేసినా దాన్ని బయటకు పొక్కనీయలేదు.
‘కలుషిత పోలియో’ కలవరం
Published Wed, Oct 3 2018 2:21 AM | Last Updated on Wed, Oct 3 2018 4:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment