పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం
మంత్రి రావెల చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ప్రారంభం
గుంటూరు మెడికల్: పేదలకు కార్పోరేట్‌స్థాయి వైద్యసేవలు అందించటమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. బుధవారం గుంటూరు కేవీపీకాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రొటావైరస్ వ్యాక్సిన్, ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్, చంద్రన్న సంచార చికిత్స వాహనాలను (పాత 104 వాహనం) ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ‘చంద్రన్న సంచార చికిత్స వాహనాలు’ అందుబాటులోకి తెచ్చారని చెప్పారు.
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ వాహనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చటమే చంద్రబాబు లక్ష్యమని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పిల్లల్లో నీళ్ళ విరోచనాలను రొటావైరస్ వ్యాక్సిన్ అరికడుతుందని, డయేరియా రాకుండా పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలన్నారు.
ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ చంద్రన్న సంచార వాహన సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగించినా వాటిపై ప్రభుత్వం అజమాయిషీ, విజిలెన్స్ మానిటరింగ్ ఉండాలని తెలిపారు. వినుకొండ, మాచర్ల, రేపల్లె ఆస్పత్రుల్లో గుండెపోటు బాధితుల కోసం సీసీయూ, ఐసీయూలు ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ రామకృష్ణ , జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, జాయింట్ కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వర రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి, డీఐవో డాక్టర్ మాచర్ల సుహాసిని, డీటీసీవో డాక్టర్ యేపూరు కామేశ్వరప్రసాద్, పీవో డీటీటీ డాక్టర్ వై. రామకోటిరెడ్డి, ఎన్‌హెచ్‌ఎమ్ డీపీఎంవో డాక్టర్ మేడా శ్యామలాదేవి, టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాసరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.