తొలిరోజు నగరంలో 56 వేల మందికి..
మరో ఐదు రోజులపాటు పోలియో టీకాలు
సాక్షి, హైదరాబాద్: పోలియో టీకాల కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన సోమవారం హైదరాబాద్ జిల్లాలోని 750 బూత్‌ల పరిధిలో సుమారు 56 వేల మంది చిన్నారులకు ఇన్-యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్(ఐపీవీ)వేయగా, రంగారెడ్డి జిల్లాలోని 136 బూత్‌ల పరిధిలో 16 వేల మందికి వేశారు. అంబర్‌పేట్, బార్కాస్, కంటోన్మెంట్, మలక్‌పేట్, కోఠి, లాలాపేట్, డబీర్‌పుర, జంగంమెట్, పానీపుర, సీతాఫల్‌మండి, సూరజ్‌భాను, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, బాలానగర్, ఉప్పల్, నారపల్లి, కీసర, అబ్దుల్లాపూర్, సరూర్‌నగర్, బాలాపూర్‌ల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లకు ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మెప్మా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లతో కూడిన వైద్య బృందం చేరుకుంది.
ఉదయం తొమ్మిది గంటలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఐపీవీ క్యాంప్ నిర్వహించడం ప్రపంచలోనే ఇది తొలిసారి కావడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునిసెఫ్ సహా పలు దేశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల నిపుణులు కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాల్ని పరిశీలించారు. పిల్లలకు టీకాలు వేస్తున్న తీరును స్వయంగా సమీక్షించారు. ఇదిలా ఉంటే అంబర్‌పేట్ ఆరోగ్య కేంద్రం సహా పలు యూపీహెచ్‌సీల్లో కరెంట్ లేక వ్యాక్సినేషన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది.