సంగరూర్ (పంజాబ్): దాదాపు 110 గంటల శ్రమ ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. చిన్నారి తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. వందలాది మంది స్థానికుల ప్రార్థనలు ఫలితం లేకుండా పోయాయి. రెండేళ్లు కూడా నిండకుండానే చిన్నారి మృత్యు ఒడికి చేరుకున్నాడు. పంజాబ్‌లోని సంగరూర్ జిల్లా భగవాన్‌పురాకు చెందిన రెండేళ్ల చిన్నారి బోరు బావిలో పడి నాలుగు రోజుల తర్వాత మృతదేహమై బయటకు వచ్చాడు. సోమవారం రెండో పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి తల్లి గుండె తల్లడిల్లింది. బుడిబుడి అడుగులు వేస్తూ కళ్ల ముందు తిరుగుతాడనుకున్న ఆ బంగారు తండ్రి కనుమరుగై పోయాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
ఇంటి సమీపంలోని 150 అడుగుల లోతున్న నిరుపయోగకరంగా ఉన్న బోరు బావిలో గత గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బాలుడు పడిపోయాడు. ఆ చిన్నారిని తల్లి కాపాడేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు చిన్నారిని రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమించాయి. బోరు బావి చుట్టూ సమాంతరంగా తవ్వకాలు చేశాయి. ఎలాగైనా కాపాడాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సంగరూర్ జిల్లాలోని చిన్నారి గ్రామమైన భగవాన్‌పురా గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. మంగళవారం ఉదయం 4.45 గంటలకు ఫతేవీర్‌ను బోరు బావిలో నుంచి తీశారు.
హుటాహుటిన అక్కడి నుంచి చండీగఢ్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బోరు బావిలో పడ్డ మరుసటి రోజే చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆస్పత్రి నుంచి చిన్నారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో స్వగ్రామానికి తరలించారు. అనంతరం చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చిన్నారి మృతి చెందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. సరైన సాంకేతికత పరికరాలు వినియోగించకపోవడం వల్లే తమ బిడ్డ తమకు దక్కలేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ముందే చనిపోయినప్పుడు ఇన్నిరోజుల పాటు రక్షిస్తున్నట్లు ఎందుకు నటించారని, చిన్నారి తల్లిదండ్రులను ఇన్ని రోజులు ఎందుకు మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment