bore well
-
బోర్ వెల్ నుంచి వస్తున్నయ్ మంటలు
-
కర్ణాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితం
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో బోరుబావిలో పడ్డ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు 20 గంటలపాటు సంయుక్త రెస్క్యూ ఆపరేషన్‌తో శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. గురువారం మధ్యాహ్నాం ఆ బాలుడ్ని బయటకు తీసుకొచ్చాయి. ముందుజాగ్రత్తగా చిన్నారిని ఆస్పత్రికి తరలించాయి. విజయపుర జిల్లా లచయానా గ్రామంలో.. సతీష్ ముజగొండ అనే వ్యక్తి తన పొలంలో బోరు బావిని తవ్వించాడు. బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు అతని ఏడాదిన్నర వయసున్న కొడుకు సాత్విక్. దాదాపుగా 16 అడుగుల లోతున ఆ చిన్నారి పడినట్లు గుర్తించి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు అధికారులు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు గంటల తరబడి శ్రమించాయి. బాలుడు మరింత లోపలికి జారిపోకుండా చూసుకుంటూనే.. పైపుల ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తూ వచ్చాయి. అదే సమయంలో గ్రామస్తులంతా సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు స్థానికులు చేశారు. చివరకు.. అందరి ప్రార్థనలు ఫలించి బాలుడు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మరో రెండు గంటలు అదనం.. బుధవారం సాయంత్రం 6గం.30 ని. ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. తొలుత అధికారులు ఒక కెమెరాను చిన్నారి ఇరుక్కుపోయిన స్పాట్‌కు పంపించి చిన్నారి కదలికల్ని పరిశీలించారు. వాస్తవానికి 18 గంట్లోలపే సహాయక బృందాలు చిన్నారిని చేరుకున్నాయి. కానీ, రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో తవ్వి బయటకు తీయడానికి మరో రెండు గంటల టైం పట్టింది. #WATCH | Karnataka: After 20 hours of rescue operation, NDRF and SDRF teams have succeeded in rescuing a 1.5-year-old child who fell into an open borewell in the Lachyan village of Indi taluk of the Vijayapura district. (Source: SDRF) https://t.co/0zWcT99XI5 pic.twitter.com/pZ8IJP8i8s — ANI (@ANI) April 4, 2024 -
బోరు బావి నుంచి బంగారం.. భారీగా ఎగబడుతున్న జనం
సాధారణంగా బోరు వేస్తే నీరు వస్తుంది, అదృష్టం బాగాలేకపోతే అది కూడా లేదు. అయితే ఇటీవల ఒక రైతు భూమిలో బోరు వేస్తే ఏకంగా బంగారం పొడి బయటకు వచ్చిందని తెలిసింది. ఇంతకీ వచ్చింది బంగారమేనా? ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఒడిశాలోని బొలంగీర్ జిల్లా చంచన బహాలి గ్రామానికి చెందిన మహమ్మద్ జావెద్ అనే రైతు తన భూమిలో బోరు వేస్తే బురదతో పాటు బంగారం పడిందంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున జనం ఎగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు బోరు నుంచి వెలువడిన మట్టి శాంపిల్ తీసి టెస్ట్ చేయడానికి పంపించారు. (ఇదీ చదవండి: ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు! వందల కోట్ల జీతాలు తీసుకుంటున్న మనోళ్లు) స్థానిక ఖప్రఖోల్ తహసీల్దార్ ఆదిత్య ప్రసాద్ మిశ్రా బోరును పరిశీలించి తరువాత సీజ్ చేశారు. పసుపు రంగులో మట్టితో కలిసి బయటపడిన నమూనాలలో తప్పకుండా బంగారు కణికలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ల్యాబ్ టెస్ట్ తరువాత అతి అసలైన బంగారమా? కాదా? అని తెలుస్తుంది. (ఇదీ చదవండి: Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలా? ఇది మీకోసమే!) డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం, ఒడిశాలోని డియోగర్, కియోంజర్, మయూర్‌భంజ్‌తో సహా మూడు జిల్లాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ జాబితాలో బొలంగీర్ లేదు. అయితే ఆ ప్రాంతంలో గ్రాఫైట్, మాంగనీస్, విలువైన రాళ్లు ఉన్నాయని జిఎస్ఐ గతంలోనే తెలిపింది. -
నాలుగు వందల ఏళ్ల బావితో పెనవేసుకున్న బంధం ఇది!
సందుకో వాటర్ ప్లాంట్.. కూల్‌డ్రింక్ దుకాణాల్లోనూ వాటర్ ప్యాకెట్లు.. బ్రాండెడ్ కంపెనీ బాటిల్ కొని నీళ్లు తాగనిదే కొందరికి గొంతు తడారదు. ఎక్కడికెళ్లినా వాటర్ క్యాన్లను వెంట పెట్టుకుని వెళ్తున్న జనం కోకొల్లలు. ‘స్వచ్ఛత’ ముసుగులో నీటి వ్యాపారం ‘కోట్లు’ దాటుతోంది. ఇలాంటి ఈ రోజుల్లోనూ ఆ ఊరి జనానికి ఓ బావి నీరు అమృతంతో సమానం. ఊళ్లో వాటర్ ప్లాంట్లు ఉన్నా, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించినా.. ఆ నీటితోనే గొంతు తడుపుకోవడం చూస్తే ఆ గ్రామానికి బావితో ఉన్న అనుబంధం ఇట్టే అర్థమవుతుంది. ఆలూరు రూరల్(కర్నూలు జిల్లా): పట్టణాల సంగతి పక్కనపెడితే.. వాటర్‌ప్లాంట్ కనిపించని గ్రామం ఉండదంటే అతిశయోక్తి కాదు. పక్కనే వాగులు, వంకలు పారుతున్నా.. సెలయేళ్లు ఉరుకుతున్నా.. బావులు అందుబాటులో ఉన్నా.. ఇప్పుడు అందరి అడుగులు వాటర్‌ప్లాంట్ వద్దే ఆగుతున్నాయి. ఐఎస్ఐ మార్కు లేకపోయినా, మినరల్స్ ఏస్థాయిలో ఉంటున్నాయో తెలియకపోయినా.. ప్లాంట్ ముందు ఏర్పాటు చేసిన కుళాయి ముందు బిందెలు బారులు తీరుతున్నాయి. ఐదు, పది రూపాయలు.. మరికొన్ని చోట్ల 20 రూపాయలు వెచ్చించి కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి సహజసిద్ధంగా లభ్యమవుతున్న నీటిని కాదని.. కోరి మరీ రోగాలను కొంటున్నారు. అయితే మండలంలోని మొలగవల్లి గ్రామం ఇప్పటికీ బావి నీటితోనే దాహం తీర్చుకుంటోంది. మినరల్ వాటర్ ప్లాంట్లు ఈ గ్రామంలోకి అడుగుపెట్టినా.. తాగునీరు మాత్రం ప్రతి ఇంటికీ ఈ బావి నీరు ఉండాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు శతాబ్దాలుగా ఈ బావి ప్రతి ఇంటికి అమృతం అందిస్తోంది. ఆ బావి నీళ్లే మినరల్ వాటర్ గ్రామంలో రెండు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా ఉంది. నాలుగు ఓహెచ్‌ఆర్ ట్యాంకులు నిర్మించారు. 7వేల వరకు ఇంటింటి కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామస్తులు తాగునీటికి మాత్రం ఆ బావి నీళ్లనే వినియోగిస్తున్నారు. రోజు ఈ నీటిని తాగుతున్న స్థానికులు ఏదైనా పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నీరు తాగితే ఒళ్లు నొప్పులు, అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. ఇక ప్రధానంగా అన్నం, పప్పు వండటానికి ఈ నీళ్లు అయితే బాగా ఉడుకుతాయని, ఇతర ఏ నీళ్లు అయినా సరిగా ఉడకవని, తిన్నట్లుగా కూడా ఉండదంటారు. పెద్దబావిలోనే.. చేదుడు బావి.. నాలుగు వందల ఏళ్ల క్రితం మొలగవల్లి గ్రామంలోని చెరువు పక్కన గ్రామస్తుల తాగునీటి అవసరాలకు ఓ పెద్ద బావి నిర్మించారు. దాదాపు రెండు వందల ఏళ్ల తర్వాత బావిలో నీరు ఇంకిపోవడంతో అప్పట్లో గ్రామస్తులు చిప్పలతో నీళ్లను తోడుకునే వారని వయసు మళ్లిన వాళ్లు చెబుతుంటారు. తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా వందేళ్ల క్రితం పెద్ద బావిలోనే స్థానికులు మరో చేదుడు బావిని తవ్వుకున్నారు. చిన్న బావి నిర్మించుకున్న తర్వాత ఎనిమిదేళ్ల క్రితం నీటిని బయటికి తోడి పెద్దబావిలో పూడిక తొలగించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వారానికి ఒకసారి తాగునీటి బావిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుతుంటారు. శుభకార్యాల వేళ గ్రామస్తులు పెద్దబావి వద్దకు వెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దబాయి నీళ్లు అమృతంతో సమానం నా వయసు 76ఏళ్లు. మా అవ్వతాతల కాలం నుంచి మాకు ఈ బాయి నీళ్లు అమృతంతో సమానం. బయటి నీళ్లు తాగితే కాళ్ల నొప్పులు, దగ్గు, పడిశం వస్తుంది. ఇంక వంట చేయనీక ఈ నీళ్లు అయితేనే బ్యాళ్లు, బియ్యం బాగా ఉడుకుతాయి. మా ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా గంగమ్మకు పూజలు చేయాల్సిందే. – గౌరమ్మ, వృద్ధురాలు, మొలగవల్లి బయటి నీళ్లు తాగితే అనారోగ్యం గ్రామంలో వాటర్ప్లాంట్లు పెట్టినా, కుళాయిలు ఉన్నా మాకు ఈ బావి నీళ్లు తాగితేనే గొంతు తడారుతుంది. మినరల్ వాటర్ కన్నా ఈ నీళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి నీళ్లు తాగితే ఒంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. గ్రామానికి సరఫరా అవుతున్న నీటిని ఇంటి అవసరాలకు వినియోగిస్తాం. – శ్రీరాములు, మొలగవల్లి బావితో మాకు ఎంతో అనుబంధం మా తాతల కాలం నుంచి ఈ బావితో మాకు అనుబంధం ఉంది. బయటి ప్రాంతాల్లో చిన్న వయస్సుకే మోకాళ్ల నొప్పులు, ఆ రోగం, ఈ రోగం అంటుంటారు. మాకు మాత్రం ఈ నీళ్లు తాగితే ఏ నొప్పులు ఉండవు. వ్యాపారం కోసం మినరల్ వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేసినా మేము మాత్రం బావి దగ్గరకు పోయి నీళ్లు తెచ్చుకునేందుకే ఇష్టపడతాం. – రామాంజినేయులు, మొలగవల్లి -
ఉత్తరప్రదేశ్ లో బోరుబావిలో పడిన బాలుడి కథ సుఖాంతం
-
యువకుడి సాహసం.. నిలిచిన బాలుడి ప్రాణం
ద్వారకాతిరుమల: ఒక యువకుడి సాహసం.. బోరుబావిలో పడ్డ బాలుడి ప్రాణాలను కాపాడింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ప్రాణాలకు తెగించి మరీ రక్షించాడు ఆ యువకుడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని గుండుగొలనుకుంటలో బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మనెల్లి పూర్ణజశ్వంత్ (9) బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటి సమీపంలోని కమ్యూనిటీ హాలు వద్ద ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, శ్యామల కంగారుపడుతూ వెదుకులాడటం మొదలుపెట్టారు. రాత్రి 10 గంటల సమయంలో కమ్యూనిటీ హాలు వద్ద వెదుకుతున్న వెంకటేశ్వరరావుకు బాలుడి అరుపులు వినిపించాయి. దీంతో బోరుబావి వద్దకు వెళ్లి టార్చ్‌లైట్ వేసి చూడగా బాలుడు కనిపించాడు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్తులు, సమాచారాన్ని అందుకున్న భీమడోలు అగ్నిమాపక అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ బాలుడు పూర్ణ జశ్వంత్‌తో తల్లిదండ్రులు బాలుడిని ఎలా బయటకు తీయాలని అంతా తర్జనభర్జనలు పడుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన, బాలుడికి దగ్గరి బంధువైన కోడెల్లి సురేష్ రాత్రి 11 గంటల సమయంలో తన నడుముకు తాడు కట్టుకుని ధైర్యంగా బోరుబావిలోకి దిగాడు. 400 అడుగుల లోతుగల బోరుబావిలో 30 అడుగుల లోతున ఒక రాయి వద్ద చిక్కుకుని ఉన్న బాలుడిని పైకి తీసుకొచ్చాడు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన బాలుడిని చూసి అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సురేష్ సాహసాన్ని బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు మెచ్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన బోరుబావిని గ్రామస్తులు గురువారం ఉదయం పూడ్చేశారు. ద్వారకాతిరుమల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ బొండాడ మోహిని, వైఎస్సార్సీపీ నేత బొండాడ వెంకన్నబాబు, ఎస్ఐ టి.సుధీర్, గుండుగొలనుకుంట గ్రామ సర్పంచ్ బండారు ధనలక్ష్మి తదితరులు సురేష్‌ను ఘనంగా సత్కరించారు. -
ఆ బాలుడు మృత్యుంజయుడు.. అయిదు రోజులు బోరుబావిలో ఉండి..
జనిగిరి: చుట్టూ చిమ్మ చీకటి, 68 అడుగుల లోతైన బోరుబావిలో పాము, తేళ్లు, కప్పలు తిరుగుతూ ఉంటే మానసిక వికలాంగుడైన 11 ఏళ్ల బాలుడు దాదాపు 5 రోజులు గడిపాడు. బావిలో ఆడుకుంటూ పడిపోయిన రాహుల్ సాహు అనే బాలుడు బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఎట్టకేలకు 104 గంటల సేపు శ్రమించిన 500 మంది సహాయ సిబ్బంది రోబో సాంకేతికతో బయటకు తీసుకువచ్చారు. బావిలో ఉన్న పాము ఆ బాలుడిని ఏమీ చేయలేదని సహాయ సిబ్బంది వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జహ్నగిరి–చంపా జిల్లాలోని పిర్హిడ్ గ్రామంలో రాహుల్ సాహు బోరు బావిలో పడిపోయిన ఘటన ఈ నెల 10న జరిగింది. రామ్‌కుమార్, గీతాసాహుల కుమారుడైన రాహుల్ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేశాక ఆడుకోవడానికి పొలాల్లోకి వెళ్లాడు. బోరు తవ్వి నీళ్లు పడకపోవడంతో దానిపై ఒక షీట్ కప్పి ఉంచారు. రాహుల్ సాహు మానసికంగా పూర్తిగా ఎదగకపోవడంతో ఆ షీట్ చూసుకోలేదేమో ఏమో బావిలోకి జారిపోయాడు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది సమాంతరంగా మరో బోరు తవ్వినా మొదట్లో ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత అయిదు రోజులు శ్రమించి రోబో టెక్నాలజీ సాయంతో ఆ బాలుడిని మంగళవారం అర్ధరాత్రి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్‌కి ప్రథమ చికిత్స చేసిన అనంతరం బిలాస్‌పూర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మానసిక వికలాంగుడైనప్పటికీ రాహుల్ సాహు మొదట్నుంచి పోరాటపటిమ ప్రదర్శించేవాడు. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి చేసేవాడు. తబలా కూడా బాగా వాయిస్తాడని తల్లిదండ్రులు చెప్పారు. -
ఈ సమస్యకు పరిష్కారం చూపలేమా - ఆనంద్ మహీంద్రా
సామాజిక అంశాలపై తప్పకుండా స్పందించే ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ అయ్యారు. నిత్యం దేశంలో ఏదో ఒక మూల చోటు చేసుకునే బోర్వెల్ ప్రమాదాలను చూసి చలించిపోయారు. ఈ సమస్యకు మనందరం పరిష్కారం ఎందుకు చూపలేకపోతున్నాం? రైతులకు అండగా ఎందుకు ఉండలేకపోతున్నాం? భావి భారత పౌరుల ప్రాణాలను కాపాడేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదంటూ సూటిగా ప్రశ్నించాడు. మీదగ్గర సొల్యూషన్ ఉందా? ఇటీవల రాజస్థాన్‌లో మూసివేయని బోరుబావిలో పన్నెండేళ్ల బాలుడు పడి మరణించాడు. దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కొత్త ఆవిష్కరణకు దిశా నిర్దేశం చేశారు. నిత్యం ఎక్కడో ఒక చోట బోరుబావిలో పడి చిన్నారులు మరణిస్తున్నారు. ఈ బోరుబావులు మూసేందుకు అవసరమైన కవర్‌ను మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం. మన రైతులు కొనుగోలు చేసేంత తక్కువ ధరలో...వారు తప్పకుండా బోరుబావులను మూసేయాలని నిబంధనలు ఎందుకు తేలేకపోతున్నాం అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశ్నించారు. ఎవరైనా ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరా అంటూ ప్రశ్నించారు. This had a happy ending but we lose so many children every year due to open borewells. Can we not design a simple & inexpensive cover for borewells that farmers can use? And then mandate their use? Anyone out there with a solution? https://t.co/gV2b1zwEQM — anand mahindra (@anandmahindra) May 31, 2022 సార్ ఇటు చూడండి ఆనంద్ మహీంంద్రా వంటి ఇండస్ట్రియలిస్టు నుంచి ఆఫర్ రావడంతో దేశీ ఇంజనీర్లు సవాల్‌గా తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే తమ దగ్గరున్న బోరు బావుల కవర్లను ఆనంద్ మహీంద్రా దృష్టికి తీసుకువస్తున్నారు. మరి వీటిలో ఆయన ఏవి ఎంపిక చేస్తారు? నిజంగానే గ్రామీణ భారతంలో పెనవేసుకుపోయిన ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి. -
బోరు వేయని బోరిగాం.. అదెలా సాధ్యమంటారు?
ఐదొందల నుంచి వెయ్యి ఫీట్ల లోతు వరకు బోరు వేసినా చాలా చోట్ల చుక్కనీరు పడని పరిస్థితి. దీంతో రైతన్నలు అప్పులపాలై ఆగమైన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం ఒక్క బోరు లేకుండా ఊరంతా పచ్చని పంటలతో కళకళలాడుతోంది. యాసంగిలోనూ కనుచూపు మేర పసుపు, పత్తి, మొక్కజొన్న, గోధుమ పంటలతో కనువిందు చేస్తోంది. అదెలా సాధ్యమంటారా..? ఎప్పుడో ఏళ్ల క్రితం ఆ గ్రామస్తులు పెట్టుకున్న ఓ ‘కట్టుబాటే’నేటికీ నీటి కష్టాన్ని తెలియనివ్వడం లేదు. ఊర్లో ఎవరూ బోర్లు వేయకూడదని నిర్ణయించారు. ఇప్పటికీ దాన్ని పాటిస్తూ ఊట బావులపైనే వారు ఆధారపడుతున్నారు. సాక్షి, నిర్మల్ : అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బోరిగాం గ్రామం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో ఉంటుంది. సాధారణంగా ఏ ఊరు.. ఏ పంట చేలకు వెళ్లినా.. బోరుబావుల ద్వారానే సాగు చేయడం చూస్తుంటాం. బోరిగాంలో మాత్రం ఎక్కడ చూసినా ఊటబావులే దర్శనమిస్తాయి. 40 అడుగుల లోతు ఉన్న ఆ బావుల్లో ఎప్పుడూ సగానికి పైగా నీరు ఉంటుంది. మూడు కాలాలు ఆ బావుల్లో నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఎప్పుడు చూసినా పంట పొలాలు పచ్చగా కళకళలాడుతాయి. కట్టుబాటే ఊటైంది ‘మన ఊళ్లో ఎప్పటికీ నీటి కష్టం రావొద్దంటే.. ఎవరు కూడా బోర్లు వేయొద్దు. ఎన్నాళ్లయినా బావులను తవ్వుకునే సాగు చేసుకోవాలె..’అంటూ ఎప్పుడో బోరిగాం గ్రామస్తులు ముందు చూపుతో పెట్టుకున్న ఆ కట్టుబాటు ఇప్పటికీ జలసిరులకు ఢోకా లేకుండా చేస్తోంది. 30–40 ఏళ్ల క్రితం తవ్విన బావులూ ఉన్నాయి. కుటుంబాలు విడిపోయి, వేరుపడిన అన్నదమ్ములు సైతం పంపకాల్లో తమకు వచ్చిన భూముల్లో మళ్లీ బావులనే తవ్వుకున్నారు తప్ప బోర్లు వేయలేదు. ఇలా తమ పెద్దలు పెట్టిన కట్టుబాటునే కొనసాగిస్తూ ఊట నీటితో పోటాపోటీగా పంటలు పండిస్తున్నారు. చెరువులే అండ.. ఓరుగల్లు కాకతీయుల ఏలుబడి ప్రభావం నిర్మల్ ప్రాంతం పైనా ఉంది. నిర్మల్ కేంద్రంగా పాలించిన రాజులు సైతం చెరువుల తవ్వకాలను ప్రోత్సహించారు. బోరిగాం గ్రామంలోనూ మూడు చెరువులు ఉన్నాయి. ఈ చెరువులే గ్రామంలో ఊటబావులకు అండగా ఉంటున్నాయి. గ్రామానికి ఓ వైపు కొండ ప్రాంతం ఉండటంతో వానాకాలంలో వాటిపై నుంచి వచ్చే నీరు చెరువులలో చేరుతుంది. అలాగే.. సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ కూడా ఉండటంతో భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటున్నాయి. ఊటలకు ఇవి కూడా ఒక కారణమై ఉండొచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండి, చెరువులు నిండని రోజుల్లోనే బావుల్లో కొంత నీటిమట్టం తగ్గుతుందని రైతులు పేర్కొంటున్నారు. అయితే.. ఏనాడూ నీటి సమస్య ఉత్పన్నం కాలేదని చెబుతున్నారు. బావుల్లో చేపలు సైతం.. బోరిగాం గ్రామంలో ఊట బావులను రైతులు సాగుతో పాటు చేపల పెంపకానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. తమ చేలల్లో పండిన మొక్కజొన్న తదితర పంట దాణాలనే వేస్తుండటంతో ఖర్చు లేకుండా కొద్దికాలంలోనే చేపలు పెరిగి అదనపు ఆదాయాన్ని ఇస్తున్నాయి. కాగా, బోరిగాంలో మొత్తం వ్యవసాయ సాగు విస్తీర్ణం 594 ఎకరాలు. ఇందులో పత్తి 325 ఎకరాలు, వరి 231 ఎకరాలు, పసుపు 60 ఎకరాలు, సోయా ఐదెకరాలు, కందులు 32 ఎకరాలలో సాగు చేస్తున్నారు. రెండో పంటగా మొక్కజొన్న, గోధుమ, నువ్వులు సాగు చేస్తున్నారు. చాలామంది అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తున్నారు. కలసికట్టుగా ఉండటం వల్లే.. మా గ్రామంలోని రైతులందరం గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పటి వరకు వ్యవసాయ చేనుల్లో ఒక్క బోరును వేయించలేదు. దీంతోనే ఊట బావులలో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి. – అమరేశ్వర్, రైతు, బోరిగాం ్ఞఊట బావుల ద్వారానే.. ఏళ్లుగా మా గ్రామంలో ఊటబావుల ద్వారానే సాగు కొనసాగుతోంది. ఇప్పటితరం రైతులమైనా వాటి ద్వారానే సాగు చేస్తున్నాం. మేము కూడా బోర్లు గురించి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. – అనిల్, యువ రైతు, బోరిగాం చేపల పెంపకం చేపట్టా.. నాకున్న ఎకరంన్నర భూమిలో పసుపు సాగు చేస్తున్నా. బావిలో నీళ్లు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం చేపట్టా. చేనులో పండిన మక్కలనే దాణాగా వేస్తున్నా. గత ఏడాది 10 క్వింటాళ్ల వరకు చేపల దిగుబడి వచ్చింది. –శంకర్, రైతు, బోరిగాం -
పాతాల గంగా పైపైకి..
జిల్లాలో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ఆగస్టులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ముసురు పెట్టడంతో నీరు భూమిలోకి ఇంకి పోయింది. జూలై మాసానికి పోల్చుకుంటే సగటున 3.31 మీటర్లు నీట మట్టం పెరిగింది. సాక్షి, నిజామాబాద్ : పాతాల గంగ పైపైకి వచ్చింది. ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జల మట్టం భారీగా పెరిగింది. జూలై మాసంతో పోల్చితే జిల్లాలో సగటున 3.31 మీటర్లు పైకి వచ్చింది. జూలైలో సగటున 12.28 మీటర్ల లోతులో ఉంటే., ఇప్పుడు 8.97 మీటర్లు పైకి వచ్చాయి. గత ఏడాది 2019 ఆగస్టు మాసంలో 11.64 మీటర్ల లోతులో ఉండగా, ఇప్పుడు 8.97 మీటర్ల వరకు పెరగడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెలలో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ప్రధానంగా రోజుల తరబడి ముసురు పెట్టడంతో వర్షం నీరు క్రమంగా భూమిలోకి ఇంకి పోయింది. ముప్కాల్, బాల్కొండ మండలాలు మినహా, మిగిలిన 23 మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. వేల్పూర్, నవీపేట్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ నీటి మట్టం పైకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 49 చోట్ల ఏర్పాటు చేసిన ఫీజో మీటర్లలో తాజా నీటి మట్టాలను భూగర్భ జలశాఖ వారం రోజుల క్రితం లెక్కించింది. సిరికొండలో అత్యధికంగా.. జిల్లాలో సిరికొండ మండలంలో భూగర్భ నీటి మట్టం లోతులో ఉంటుంది. ఇలాంటి మండలాల్లో కూడా ఈసారి భూగర్భ జలాలు భారీగా పెరగడం గమనార్హం. చీమన్‌పల్లిలో ఏకంగా 12.9 మీటర్లు పైకి వచ్చాయి. ఇక్కడ జూలైలో 23.70 మీటర్ల లోతులో నీటి మట్టం ఉండేది. ఆగస్టు మాసానికి వచ్చేసరికి 10.80 మీటర్లపైకి నిళ్లు వచ్చాయి. అలాగే పాకాలలో కూడా 5.7 మీటర్లు పెరిగాయి. ఇక్కడ 20.55 మీటర్ల లోతులో ఉన్న నీరు.. నెల రోజుల్లో 14.85 మీటర్ల పైకి వచ్చాయి. ఎండా కాలంతో పోల్చితే.. ఎండా కాలంతో పోల్చితే జిల్లాలో స్వల్పంగానే పెరిగినట్లు భూగర్భ జలశాఖ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం కాకముందు మే మాసంలో జిల్లాలో సగటున 11.95 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ఇప్పుడు 8.97 మీటర్లకు పెరిగింది. అంటే సగటున 2.98 మీటర్లు పెరిగింది. నివేదికల్లో గందరగోళం... భూగర్భ జల శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వర్షాలు కురిస్తే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. కానీ కొన్ని ఫీజో మీటర్ల పరిధిలో తగ్గినట్లు నివేదికలో పేర్కొనడం గమనార్హం. ⇔ భీంగల్ మండలం గోన్గొప్పులలో మే మాసంలో 29.55 మీటర్ల లోతులో నీటి మట్టం ఉందని పేర్కొనగా, ఆగస్టుకు వచ్చే సరికి మూడు నెలలు భారీ వర్షాలు కురిసినా.. ఇక్కడ 32.47 మీటర్లకు పడిపోయినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఇక్కడ నీటి మట్టం పెరగాల్సి ఉండగా, అధికారులు మాత్రం 2.92 మీటర్లు ఇంకా లోతుకు పడిపోయినట్లు చూపారు. తాళ్లపల్లిలో కూడా ఇలాగే ఎండా కాలం కంటే వర్షా కాలంలో నీటి మట్టం పడిపోయినట్లు చూపారు. ⇔ డిచ్పల్లి మండలం యానంపల్లిలో కూడా వర్షాలు కురిసాక భూగర్భ జల మట్టం తగ్గినట్లు పేర్కొన్నారు. అలాగే కోటగిరి మండలం కల్లూరులో కూడా ఎండాకాలం కంటే వర్షాకాలంలో నీటి మట్టం పడిపోయినట్లు తెలిపారు. అయితే కొన్ని ఫీజో మీటర్ల పరిధిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, ప్రత్యేక పరిశీలన చేస్తామని భూగర్భ జలశాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
బోరు నుంచి గ్యాస్.. వేమవరంలో కలకలం
పశ్చిమగోదావరి, పెనుగొండ: ఆచంట మండలం ఆచంట వేమవరంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా బోరు నుంచి గ్యాస్ ఉబికి వచ్చి కలకలం రేపింది. భూ పొరల్లో నిక్షిప్తమైన గ్యాస్ జోరుగా ఉబికి రావడంతో ఓఎన్జీసీ గ్యాస్ పైప్‌లైను పగిలిపోయిందంటూ ప్రజలు హడలిపోయారు. ఆచంట వేమవరానికి చెందిన బొక్క నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు గ్రామ శివారున 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలో నాగేశ్వరరావు కుమారుడు సత్యనారాయణ అయిదేళ్లు క్రితం సబ్మెర్సిబుల్ బోరు మంచినీటి కోసం ఏర్పాటు చేసుకున్నారు. మరమ్మతులకు గురవడంతో వినియోగించడం నిలిపివేసారు. బుధవారం బోరుకు మరమ్మతులు చేయడానికి ప్రయత్నిస్తూ సబ్మెర్సిబుల్ మోటారు బయటకు తీస్తుండగా గ్యాస్ ఒక్కసారిగా తన్నుకొచ్చింది. సమీపంలోని నాలుగిళ్లువారు బయటకు పరుగులు తీసారు. సమాచారం తెలుసుకున్న పాలకొల్లు సీఐ డి వెంకటేశ్వరరావు, ఆచంట ఎస్సై రాజశేఖర్, తహసీల్దారు ఆర్వీ కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు,అగ్నిమాపక యంత్రాన్ని తీసుకువచ్చారు. సమీపంలోని ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి గ్యాస్ పైపు లైను ఏమీ లేదని, భూపొరల్లోని గ్యాస్ తన్నుకొస్తోందని నిర్ధారించారు. వీరితో పాటు నర్సాపురం, అమలాపురానికి చెందిన ఓఎన్జీసీ అధికారులు వచ్చి ప్రమాదం లేదని చెప్పడంతో పరిసర ప్రాంతాల వారు ఊపిరి పీల్చుకున్నారు. బోరు నుంచి విపరీతమైన శబ్ధాలు వెలువడుతుండడంతో స్థానికులు భయపడుతున్నారు. -
బోరు బావిలో చిన్నారి
-
బోరు బావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు!
-
చైనాలో ‘బాహు’ బాలుడు
బీజింగ్: భారత్‌లో బోరు బావుల్లో పడిపోయిన పిల్లలను రక్షించడం ఎంత కష్టమో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో చాలా తక్కువ సార్లు మాత్రమే పిల్లలు ప్రాణాలతో బయటకు వస్తుంటారు. చైనాలో కూడా ఇటీవల ఇలాంటి సంఘటనే జరగడంతో ఓ స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల మైనర్ బాలుడు సాహసించి మూడేళ్ల పాపను రక్షించారు. చైనా, హెనన్ రాష్ట్రంలోని జెన్ కౌంటీలో మిస్టర్ జావో అనే ఓ వ్యక్తి తన మూడేళ్ల పాపను ఓ ఫుడ్ కోర్టు పక్కనుంచి నడిపించుకుంటూ పోతుంటే తెరచి ఉన్న బోరు బావిలోకి పడిపోయింది. కళ్ల ముందు జరిగిన ప్రమాదాన్ని చూసిన ఆ తండ్రి, తన కూతురిని కాపాడమని కేకలు వేశారు. ఈ వార్త తెల్సిన అనతికాలంలోనే చైనా పోలీసులు ప్రమాద స్థలికి వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్లను, అనుసంధాన పైపులను తీసుకొచ్చి ముందుగా ఆ బోరు బావిలోకి ఆక్సిజన్‌ను పంపించడం మొదలు పెట్టారు. వంద అడుగుల లోతుగల ఆ బావి మధ్యలో ఇరుక్కుపోయిన ఆ బాలికను ఎలా వెలికి తీయాలో పోలీసులకు తెలియలేదు. ఎవరైనా బక్క పలుచగా ఉన్న వ్యక్తిని తల కిందులుగా పంపిస్తే తప్పా, ఆ పాపను రక్షించలేమని వారు చెప్పారు. తనను అలా పంపించమంటూ ఆ పాప తండ్రి జావో ముందుకొచ్చారు. అయితే ఆ బోరు బావి వెడల్పు కేవలం ఎనిమిది అంగుళాలు మాత్రమే ఉందని, ఆయన్ని పంపించడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు. అంతలో ప్రమాద స్థలికి వచ్చిన వాంగ్ క్వింగ్జున్ అనే వ్యక్తి తన 14 ఏళ్ల కుమారుడైన వాంగ్‌మిన్ రన్ అందుకు సమర్థుడంటూ అతన్ని పిలిపించారు. మైనర్ బాలుడి ప్రాణాలను రిస్క్‌లో పెట్టలేమని, అది నేరం అవుతుందని పోలీసులు వద్దన్నారు. తన కుమారుడు సమర్థుడు, సాహసవంతుడని, ఏ ప్రమాదం జరిగినా అందుకు తానే బాధ్యత వహిస్తానని ఆ తండ్రి హామీ ఇవ్వడం, అదే సమయంలో బోరు బావిలో పడిపోయిన పాప అరుపులు ఆగిపోవడంతో బాలుడి సహాయం తీసుకోవడానికి పోలీసులు ముందుకు వచ్చారు. మినరన్కు కొన్ని ముందు జాగ్రత్తలు చెప్పి తల కిందులుగా లోపలికి పంపించారు. లోపలికి వెలుతున్నప్పుడు దారి మరీ సన్నగా ఉండడంతో బాలుడిని బయటకు తీయాల్సి వచ్చింది. బాలుడు చెప్పిన సమాచారం ఆధారంగా బోరు బావిని పైనుంచి లోపల వెడల్పు చేశారు. నాలుగోసారి బాలుడిని పంపించినప్పుడు పాప చేయి బాలుడి చేతికందింది. ‘అన్నా నన్ను కాపాడు అంటూ ఆ పాప నా చేయి పట్టుకుంది. కాపాడడానికే వచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి, గుండెల నిండా ఆక్సిజన్ పీల్చుకోవడానికి మరోసారి బయటకు వచ్చాను. ఆరో ప్రయత్నంలో ఆ పాపను బయటకు తీసుకురాగలిగాను’ తన అనుభవాన్ని ఆ బాలుడు మీడియాతో పంచుకున్నాడు. పాప ప్రాణాలను కాపాడినందుకు ఎంతో అనందంగా ఉందన్నాడు. అక్కడున్న వారంతా ఆ బాలుడిని, ఆ బాలుడి తండ్రిని అభినందించారు. -
'సుజిత్.. నీ చివరి చూపుకు నోచుకోలేకపోయాం'
చెన్నై : బుడి బుడి అడుగులు వేస్తున్న ప్రాయం సుజిత్ విల్సన్‌ది. అమ్మా, నాన్న తప్ప మరో ప్రపంచం వాడికి తెలియదు. తండ్రి చెంతన ఆడుకుంటున్న బాలుడు అనుకోకుండా గత శుక్రవారం 25న బోరుబావిలో పడ్డాడు. అదే అతని పాలిట మృత్యువు అవుతుందని ఊహించలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సుజిత్‌ను ఎలాగైనా సురక్షితంగా బయటకు తీసుకురావాలని సహాయక చర్యలు చేపట్టింది. తమిళనాడు మాత్రమే కాదు యావద్దేశం సుజిత్ ప్రాణాలతో బయటికి రావాలని దేవుడిని ప్రార్థించారు. ప్రధాని మోదీ కూడా సుజిత్ ఏ ఆటంకం లేకుండా సురక్షితంగా బయటకు రావాలని దేవుడిని కోరినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇంతమంది దీవేనలు ఉండగా తన బిడ్డకు ఏం కాదని సుజిత్ తల్లి కళామేరీ భావించింది. కానీ వారి ప్రార్థనలను దేవుడు కరుణించలేదు. మూడు రోజులపాటు ఆహారం లేక, ఆక్సిజన్ అందక అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుజిత్ మంగళవారం మరణించినట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి : రెండేళ్ల సుజిత్ కథ విషాదాంతం) ఇదే విషయమై కుటుంబసభ్యులను సంప్రదించగా.. తాము సుజిత్‌ను ఆఖరి చూపుకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా సుజిత్ బోరుబావిలో ఉండడంతో అతని మృతదేహం కుళ్లిపోయింది. దీంతో అతని శరీరాన్ని పూర్తిగా ప్లాస్టిక్ కవర్‌తో కప్పివేశారని సుజిత్ ఆంటీ జూలియా తెలిపారు. ఈ భాద నుంచి మేము అంత తొందరగా బయటికి రాలేమని, వాడి జ్ఞాపకాలు మమ్మల్ని కొంతకాలం వెంటాడుతాయని పేర్కొన్నారు. సుజిత్ మృతి వార్త విన్న అతని తల్లి కళామేరీ జీవశ్చవంలా తయారైందని జూలియా చెప్పుకొచ్చారు. 'నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం మనవి చేస్తున్నా. సుజిత్ లాంటి పరిస్థితి ఇక మీదట ఎవరికి రాకుండా రాష్ట్రంలోని బోరు బావిలను వెంటనే మూసేయాలి. మాలాంటి కడుపుకోత ఎవరికి రావద్దని' కోరుకుంటున్నట్లు సుజిత్ అంకుల్ సునారిముత్తు అభిప్రాయపడ్డారు. -
బోరుబావిలో బాలుడు; కొనసాగుతున్నసహాయక చర్యలు
తిరుచురాపల్లి : తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో శుక్రవారం సాయంత్రం రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ బోరుబావిలో పడ్డాడు. స్థానికులు సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఆరు రెస్య్కూ బలగాలతో పాటు, ఐఐటీ మద్రాస్ తయారు చేసిన రోబోటిక్ పరికరాన్ని తెప్పించారు. బాలుడిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బాలుడు 75 అడుగుల లోతులో ఉన్నట్లు తెలిసింది. అయితే బాలుడు ఉన్న బావికి సమాంతరంగా గొయ్యిని తవ్వినా ఫలితం లేకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి పైపు ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరుచురాపల్లికి చెందిన రెక్టో అరోకియరాజ్, కళామేరీ దంపతులకు సుజిత్ విల్సన్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం తల్లి కళామేరీ ఇంట్లో పనిచేసుకుంటుంది. తండ్రి వేరే పనిలో నిమగ్నమవగా అదే సమయంలో సుజిత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. బావిలో పడిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వ్యవసాయానికి నీళ్లు అవసరమవడంతో ఈ మద్యనే అరోకియాజ్ బోరు బావిని తవ్వించాడు. నీళ్లు సరిగా పడకపోడంతో దానిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు బోరు బావులను పూడ్చేయాలంటూ 2010లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం. -
మింగేసిన బోరుబావి
-
చిన్నారిని మింగిన బోరుబావి
విడవలూరు/ నెల్లూరు (పొగతోట)/ కోవూరు: ముక్కుపచ్చలారని చిన్నారిని బోరుబావి మింగేసింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకుంటున్న బిడ్డను చూసి మురిసిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. బోరుబావిలో ఇద్దరు పిల్లలు పడిపోగా.. 3 గంటల పాటు స్థానికులు, అధికారులు కృషి చేసి ఒక్కరిని మాత్రమే ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. ఈ విషాద సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీలోని పెదపాళెంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎల్లంగారి ఈశ్వరయ్య, నాగమ్మల కుమార్తె మోక్షిత (3), పామంచి తాతయ్య, పోలమ్మల కుమారుడు పామంచి గోపిరాజు (3) ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆడుకుంటూ పక్కనే ఉన్న పాఠశాల వద్దకు వెళ్లారు. అయితే పాఠశాలలో తాగునీటి అవసరాల కోసం దగ్గరలోని ఖాళీ స్థలంలో 16 అడుగులమేర బోరుబావిని తవ్వారు. దీన్ని గమనించని చిన్నారి మోక్షిత మొదట ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. ఆ వెంటనే గోపిరాజు కూడా బోరుబావిలో పడ్డాడు. దీనిని గమనించిన మోక్షిత తండ్రి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. అక్కడే పనులు చేస్తున్న యువకులు వెంటనే జేసీబీ సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో గుంతను తవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసు, ఫైర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్లేలా చర్యలు చేపట్టారు. పక్క ఊరిలోనే పర్యటిస్తున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తొలుత బాలుడు గోపిరాజును సురక్షితంగా బయటకు తీశారు. మోక్షిత లోపల ఉండడంతో బయటకు తీసుకురావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. కొన ఊపిరితో ఉన్న బాలికను వెంటనే 108 వాహనంలో రామతీర్థంలోని ప్రాథమిక వైద్యశాలకు.. అక్కడి నుంచి కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ గ్రామం శోకసంద్రంగా మారింది. బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం ఈ సంఘటనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి వెంటనే సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. అలాగే తన సొంత నిధుల నుంచి మోక్షిత కుటుంబానికి రూ. 50 వేలు, బాలుడికి రూ. 50 వేలు, చిన్నారులను కాపాడేందుకు సాహసం చేసిన స్థానిక యువకులు చిరంజీవి, ప్రసాద్‌లకు మరో రూ. 50 వేలు అందజేస్తున్నట్టు చెప్పారు. అలాగే కలెక్టర్ శేషగిరిబాబు తక్షణ సహాయం కింద ఆర్డీవో చిన్నికృష్ణ ద్వారా రూ. 25 వేలు మోక్షిత కుటుంబసభ్యులకు అందచేశారు. కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే చిన్నారులను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించే వరకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రతి క్షణం సహాయక చర్యలను పర్యవేక్షించారు. మోక్షిత మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే బోరుబావులను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. -
గ్రేటర్ గొంతెండుతోంది..!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ శివార్లలోని పలు ప్రాంతాల్లో బోరుబావులు చుక్కనీరు లేక బావురుమంటుండటంతో జలమండలి నల్లా నీళ్లు ఏమూలకూ సరిపోవడంలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్నీటి కష్టాలు నగరవాసికి పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. అపార్ట్మెంట్ వాసులు ఇంటి అద్దెలకు దాదాపు సమానమైన మొత్తాన్ని ట్యాంకర్ నీళ్ల కొనుగోలుకు వెచ్చించి జేబులు గుల్లచేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 460.88 మిలియన్‌గ్యాలన్ల కృష్ణా, గోదావరి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాలను సరఫరా చేసినా నీటి డిమాండ్ 560 మిలియన్ గ్యాలన్ల మేర ఉంది. సుమారు వంద ఎంజీడీల నీటికి కొరత ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో కన్నీటి కష్టాలు దర్శనమిస్తున్నాయి. జలమండలి ప్రస్తుతం సరఫరా చేస్తున్న 460.88 మిలియన్ గ్యాలన్ల నీటిలోనూ 40 శాతం మేర సరఫరా, చౌర్యం తదితర నష్టాల కారణంగా వాస్తవ సరఫరా 276 మిలియన్గ్యాలన్లు మించడంలేదు. అంటే కోటికి పైగా జనాభాతో అలరారుతోన్న సిటీలో ప్రతీవ్యక్తికి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా. ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఇదే దుస్థితి. ప్రైవేటు ట్యాంకర్ నీళ్లు (ఐదు వేల లీటర్ల నీరు)కు ప్రాంతం, డిమాండ్‌ను బట్టి రూ.2–5 వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. పలు గేటెడ్‌కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల సముదాయాలున్న అపార్ట్మెంట్లలో ట్యాంకర్ నీళ్ల కొనుగోలుకు నెలకు లక్షల్లో వ్యయం చేస్తుండడం గమనార్హం. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏడాదిగా తీవ్ర వర్షాబావ పరిస్థితులు, జలమండలి అరకొరగా నీటిని సరఫరా చేస్తుండడంతో జనం బాధలు వర్ణనాతీతంగా మారాయి. వేలు చేల్లించినా ప్రైవేట్ నీటి ట్యాంకర్లు దొరకని దుస్థితి నెలకొంది. ఐటీ కారిడార్‌లో బస్తీలకు రెండు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. అపార్ట్మెంట్లకు, వాణిజ్య నల్లా కనెక్షన్లకు భారీగా నీటి కోత విధిస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో నివాసం ఉండే వారు ట్యాంకర్ నీళ్లకు వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాలలో 1500 అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు కనిపించడం లేదు. కొండాపూర్‌లోని గౌతమీ ఎన్క్లేవ్ ఇంకుడు గుంతలు ఎన్నో ఏర్పాటు చేశారు. గత సంవత్సరం వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. గౌతమీ ఎన్‌క్లేవ్‌లో దాదాపు 60 అపార్ట్మెంట్లు ఉన్నాయి. రోజు 5000 లీటర్ల ట్యాంకర్లు 100కు పైగానే కొనుగోలుచేస్తున్నట్లు గౌతమీ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసిసియేషన్ అధ్యక్షులు యలమంచలి శ్రీధర్ తెలిపారు. 5000 లీటర్ల ట్యాంకర్‌కు 2 వేలపైనా, 10 వేల ట్యాంకర్‌కు 4వేలకు పైన వసూలు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో 5000 లీటర్ల ట్యాంకర్‌కు 3 వేలు, 10 వేల ట్యాంకర్‌కు 6 వేలు వసూలు చేస్తున్నారు. సీజన్లో రూ.600 ఉండే 500 లీటర్ల ట్యాంకర్ ఖరీదు రెండు వేలకు పైనే ఉందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అరకొర నీటి సరఫరా గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు వెయ్యి కుంటుంబాలు నివాసం ఉంటాయి. ప్రతి రోజు జలమండలి 1400 కేఎల్ నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఈ నెల 13న 407.59 కెఎల్, 14న 281.17 కెఎల్, 15న 140.23 కెఎల్, 16న 208.17 కెఎల్, 17న 80.26 కెఎల్, 18న 408.93 కెఎల్, 19న కేవలం 8.33కెఎల్ నీటిని సరఫరా చేసింది. అవసరం మేరకు నీటి సరఫరా సరగకపోవడంతో స్థానికులు జలమండలి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్లో అక్రమ నీటి వ్యాపారం నిర్వహిస్తున్న బోర్లను రెవెన్యూ అధికారులు సీజ్‌చేశారు. దీంతో పటాన్ చెరువు శివారు గ్రామాలు, శంకర్పల్లి మండలంలోని గ్రామాలు, తెల్లాపూర్ నుంచి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దూరం నుంచి రావడంతో ఖర్చు పెరుగుతోందని ట్యాంకర్ నిర్వాహకులు చెబుతున్నారు. కూకట్పల్లి ప్రాంతంలో.. కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో రెండు ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీలలో ఇదే దుస్థితి నెలకొంది. కేపీహెచ్‌బీకాలనీలోని మలేషియాటౌన్షిప్లో తీవ్ర నీటి ఎద్దడి. ఈ ఏడాది మార్చి–జూన్ వరకు జలమండలికి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించినప్పటికీ సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్చినెలలోనే జలమండలికి తాగునీటి కోసం 6.7లక్షలు బిల్లు రూపంలో చెల్లించగా, బయటి నుంచి సుమారు 285 ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసినందుకు రూ.5.8లక్షలు చెల్లించినట్లు స్థానికులు తెలిపారు. నీటి సరఫరాలో విఫలం 15 రోజులకోసారి నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. 40 ఫ్లాట్లు ఉన్న మా అపార్ట్‌మెంట్‌కు నెలకు 436కెఎల్ సరఫరా చేయాల్సి ఉండగా 100 కెఎల్ కూడా సరఫరా చేయడం లేదు. బోర్లన్నీ ఎండిపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అత్యవసర సమయంలో ట్యాంకర్ యజమానులు డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారు. – కిరణ్, ప్రీస్టైన్ అపార్ట్మెంట్ గౌతమి ఎన్క్లేవ్ జలమండలి నీరు 60శాతం తగ్గకుండా సరఫరా చేయాలి జలమండలితో తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోయినా కనీసం 60శాతానికి తగ్గకుండా సరఫరా చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా కేవలం 30 నుంచి 40శాతం నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో మేము లక్షలు వెచ్చించి బయటి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలుచేయాల్సిన దుస్తితి తలెత్తింది. – శ్రీకాంత్‌రెడ్డి, ఇందూ ఫార్చ్యూన్ఫీల్డ్స్ గార్డెనీయా అధ్యక్షుడు -
ఫలించని 110 గంటల శ్రమ
సంగరూర్ (పంజాబ్): దాదాపు 110 గంటల శ్రమ ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. చిన్నారి తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. వందలాది మంది స్థానికుల ప్రార్థనలు ఫలితం లేకుండా పోయాయి. రెండేళ్లు కూడా నిండకుండానే చిన్నారి మృత్యు ఒడికి చేరుకున్నాడు. పంజాబ్‌లోని సంగరూర్ జిల్లా భగవాన్‌పురాకు చెందిన రెండేళ్ల చిన్నారి బోరు బావిలో పడి నాలుగు రోజుల తర్వాత మృతదేహమై బయటకు వచ్చాడు. సోమవారం రెండో పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి తల్లి గుండె తల్లడిల్లింది. బుడిబుడి అడుగులు వేస్తూ కళ్ల ముందు తిరుగుతాడనుకున్న ఆ బంగారు తండ్రి కనుమరుగై పోయాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇంటి సమీపంలోని 150 అడుగుల లోతున్న నిరుపయోగకరంగా ఉన్న బోరు బావిలో గత గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బాలుడు పడిపోయాడు. ఆ చిన్నారిని తల్లి కాపాడేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు చిన్నారిని రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమించాయి. బోరు బావి చుట్టూ సమాంతరంగా తవ్వకాలు చేశాయి. ఎలాగైనా కాపాడాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సంగరూర్ జిల్లాలోని చిన్నారి గ్రామమైన భగవాన్పురా గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. మంగళవారం ఉదయం 4.45 గంటలకు ఫతేవీర్ను బోరు బావిలో నుంచి తీశారు. హుటాహుటిన అక్కడి నుంచి చండీగఢ్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బోరు బావిలో పడ్డ మరుసటి రోజే చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆస్పత్రి నుంచి చిన్నారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో స్వగ్రామానికి తరలించారు. అనంతరం చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చిన్నారి మృతి చెందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. సరైన సాంకేతికత పరికరాలు వినియోగించకపోవడం వల్లే తమ బిడ్డ తమకు దక్కలేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ముందే చనిపోయినప్పుడు ఇన్నిరోజుల పాటు రక్షిస్తున్నట్లు ఎందుకు నటించారని, చిన్నారి తల్లిదండ్రులను ఇన్ని రోజులు ఎందుకు మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఐదుగురు చిన్నారులను మింగిన బావిగుంత
మల్దకల్ (గద్వాల): ఒకటి నుంచి మూడో తరగతి వరకు చదువుతున్న ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు ఓ బావి గుంతలో పడి మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నాగర్‌దొడ్డిలో సోమవారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లప్ప, మాణిక్యమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో యమున(12), చిన్నారి (11), వెంకటేశ్వరి (10) మృత్యువాతపడ్డారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో 8 ఏళ్ల పాప ఈ ప్రమాదంలో మృతి చెందింది. అలాగే చిన్న కుర్వ వెంకటేశ్, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కవిత (11) మృత్యువాతపడింది. సంఘటన జరిగిందిలా.. సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లలు సమీపంలో ఉన్న రిజర్వాయర్ వద్ద నీటిలో ఆడుకోవడానికి వెళ్లారు. నీటిలో కొంత లోపలికి వెళ్లగా ప్రమాదవశాత్తు ఐదుగురు చిన్నారులు బావి కోసం తీసిన పెద్ద గుంతలో పడిపోయారు. చిన్నారులు పెద్ద ఎత్తున కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగిపోయారు. సుమారు గంట తర్వాత అటువైపు వెళుతున్న రైతులు బావి గుంతలో పడిన చిన్నారులను చూశారు. రాత్రి 7.30 ప్రాంతంలో చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. ఐదుగురు బాలికలు ఒకేసారి మృత్యువాతపడడంతో నాగర్‌దొడ్డి గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ఎండిన పంట ఆగిన గుండె
సాక్షి,వర్ధన్నపేట: పండిన పంట ఎండిపోవడంతో రైతు గుండె ఆగిపోయింది. నీటి కోసం బోర్లు వేస్తే కన్నీరే మిగిలింది. చేసిన అప్పుల భారం పెరగడంతో ఆయువు తీసుకున్న ఘటన వర్ధన్నపేటలో శనివారం జరిగింది. వర్ధన్నపేట మునిసిపాలిటీ పరిధిలోని డీసీ తండా శివారు గుబ్బెటి తండాకు చెందిన ఆంగోతు మొగిళి(50) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో గతంలో ఉన్న బోరుబావి ఎండిపోయింది. నీటి వసతి లేక పోవడంతో మూడు బోరు బావులు తవ్వినా నీరు రాలేదు. దీంతో పాటు రాయపర్తి మండలం తిర్మాలాయపెల్లికి చెందిన వశపాక నర్స ఎల్లయ్యకు చెందిన 30 గుంటల భూమి కౌలుకు తీసుకుని వ్యసాయం చేస్తున్నాడు. ఈ రబీలో బోరులో నీరు ఎక్కువగా రాదని గ్రహించి తన భూమిలోని 30 గుంటల్లో వరి నాటు వేశాడు. వేసవి రాక ముందే నీరు పోసే బోరు ఎండి పోవడంతో వరి పంట ఎండి పోతుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొగిళికి భార్య కౌసల్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రాకాసి బావి
చెన్నై , అన్నానగర్: విల్లుపురం సమీపంలో ఆదివారం బావిలో మునిగి పాఠశాల విద్యార్థులు ముగ్గురు మృతి చెందారు. విల్లుపురం సమీపం కక్కనూర్ మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన షణ్ముగం కుమార్తె భవధారణి (11), ఏలుమలై కుమార్తె కౌసల్య (12), మణి కుమార్తె మణిమోలీ (14). వీరు ముగ్గురి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. అదే ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాల్లో భవధారణి 6వ తరగతి, కౌసల్యా 7వ తరగతి, మణిమోలీ 9వ తరగతి చదువుతున్నారు. ఈ స్థితిలో ఆదివారం సెలవు కావడంతో స్నేహితులైన ముగ్గురు విద్యార్థినులు మధ్యాహ్నం 11 గంటలకు అదే ప్రాంతంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. వీరితో పాటు మణిమోలీ చెల్లి 6వ తరగతి చదువుతున్న నిత్య (11) వెళ్లింది. మణిమోలి, కౌసల్య, భవధారణి బావిలో దిగి మెట్ల మీద కూర్చొని దుస్తులను ఉతుకుతున్నారు. నిత్య మాత్రం గట్టున నిలబడి ఉంది. ఆ సమయంలో భవధారణి హఠాత్తుగా కాలుజారి నీటిలో పడింది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన మణిమోలి, కౌసల్య ఆమెను రక్షించడానికి నీటిలో దూకారు. దీంతో ముగ్గురు నీట మునిగిపోయారు. గట్టున ఉన్న నిత్య కేకలు వేసినప్పటికీ ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పరుగున వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు ఇరుగుపొరుగు వారితో కలిసి హుటాహుటిన బావి వద్దకు చేరుకుని నీట మునిగిన ముగ్గురిని బయటకి తీశారు. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ముగ్గురు విద్యార్థులను ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన డాక్టర్లు ముగ్గురు విద్యార్థినులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థినులు నీటమునిగి మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
బాలుడిని మింగేసిన బావి
మగబిడ్డ పుట్టాడని ఆ దంపతులు పొంగిపోయారు.. అయితే ఆ బిడ్డ పుట్టు మూగ, చెవుడుతోపాటు మానసిక వికలాంగుడని తెలిసి కుంగిపోయారు.. ఆపై బిడ్డే లోకంగా జీవిస్తున్నారు.. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.. బిడ్డను ఆడించేందుకు ఇంటి సమీపంలోని చెట్టువద్దకు చేరిన తండ్రి ఒక్క నిమిషం ఆదమరిచాడు.. పొంచి ఉన్న మృత్యువు పిలిచిందో ఏమో.. ఆ బిడ్డ సమీపంలోని బావి వద్దకు చేరుకున్నాడు. తండ్రి గుర్తించి పిలిచినా వినిపించక బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.. గుంటూరు, గురజాల: అమ్మానాన్నల ఒడిలో ఆనందంగా గడపాల్సిన బాలుడు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడి మృతిచెందిన ఘటన గురజాల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణంలోని శ్రీదేవి రైసు మిల్లు సమీపంలో నివసించే బత్తుల దుర్గారావు, వెంకటేశ్వరమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు సాయి కృష్ణ(4). అతను పుట్టుకతోనే మూగ, చెవుడుతోపాటు మానసిక వికలాంగుడు కావడంతో కూలిపనులు చేసుకుంటూనే ఆ దంపతులు అనుక్షణం బిడ్డను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ముఠాపనులకు వెళ్లే దుర్గారావు మధ్యాహ్నం వేళ బిడ్డను ఆడించేందుకు ఇంటి సమీపంలో ఉన్న చెట్టు వద్దకు వెళ్లాడు. పక్కనే ఉన్న మట్టికుప్ప వద్ద సాయికృష్ణ కూర్చుని ఆడుకుంటుండగా దుర్గారావు చూసి మురిసిపోయాడు. ఒక్క నిమిషం ఆదమరిచాడు. ఆ తరువాత చూడగా మట్టికుప్ప వద్ద బిడ్డ కనిపించకపోవడంతో కంగారుపడ్డాడు. ఆ సమీప ప్రాంతాల్లో వెతికాడు. ఆ వైపుగా వెళ్తున్న వ్యక్తి సమీపంలో ఉన్న బావి వద్ద చిన్నపిల్లాడు ఉన్నాడని చెప్పడంతో దుర్గారావు ఒక్క పారుగున అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే బావి గట్టుపైకి చేరుకున్న కుమారుడిని చూసి పెద్దగా కేకలు వేసినా ఆ చెవిటి బిడ్డకు వినిపించలేదు. అడుగు ముందుకేస్తే ప్రాణం పోతుందని తెలియక సాయికృష్ణ బావిలోకి పడిపోయాడు. దుర్గారావు కేకలు విన్న చుట్టు పక్కల వారంతా బావి వద్దకు చేరుకున్నారు. ఒక వ్యక్తి బాలుడిని రక్షించేందుకు బావిలోకి దూకాడు. బావి ఎక్కువ లోతు ఉండటం, చెత్తాచెదారం పేరుకుపోవడంతో బాలుడిని వెతికేందుకు సాధ్యంకాక పైకి వచ్చేశాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ వై.రామారావు, ఎస్ఐ ఎం.వాసు ఘటన స్థలానికి చేరుకుని, మోటార్లు ద్వారా బావిలోని నీటిని బయటకు తోడించారు. అనంతరం పట్టణానికి చెందిన దిలీప్, ఆర్మీ ఉద్యోగి జి.రవీంద్ర బావిలోకి దిగి మూడు గంటలకుపైగా వెతకగా సాయికృష్ణ దొరి కాడు. హుటాహుటిన బాలుడిని గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలుడు మృతిచెం దాడని నిర్దారించారు. ఆస్పత్రికి వచ్చిన సాయికృష్ణతల్లి వెంకటేశ్వరమ్మ బిడ్డ మృతిచెందాడని తెలుసుకుని కుప్పకూలిపోయింది. ఆమెకు డాక్టర్ లక్ష్మి వైద్యసేవలు అందించారు. -
మృత్యుంజయురాలు
బోరు బావిలో పడ్డ చిన్నారిని వీరోచిత శ్రమతో అగ్నిమాపక సిబ్బంది, సహాయ బృందాలు రక్షించాయి. రెండున్నర గంటలు పోరాడి రెండేళ్ల చిన్నారిని మృత్యుంజయురాల్ని చేశారు. ఆదివారం నాగపట్నం జిల్లా పుదుపల్లం గ్రామంలో ఈ ఘటనచోటుచేసుకుంది. సాక్షి, చెన్నై : నీళ్లు లేని బోరు బావుల్ని మూసివేయాలని, కొత్తగా బోరు బావులు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా అధికారుల అనుమతి పొందాలనే ఆదేశాలు ఉన్నా, వాటిని అమలుపరిచే వారు గతంలో కరువయ్యారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రతిఏటా రాష్ట్రంలో ఇద్దరు లేదా, ముగ్గురు పిల్ల ల్ని బోరు బావులు మింగేశాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు ఆడుకుంటూ బోరు బావుల్లో పడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగుల్చుతుండడం క్రమంగా పెరిగింది. ఒకరిద్దరు మినహా తక్కిన వాళ్లందరూ బోరు బావిలోనే తుది శ్వాస విడిచారు. రెండేళ్ల క్రితం హైకోర్టు కొరడా ఝుళిపించడంతో బోరు బావుల వైపు అధికార వర్గాలు పరుగులు తీశాయి. నిరుపయోగంగా ఉన్న వాటిని శాశ్వతంగా మూసివేసే పనిలో పడ్డాయి. అలాగే, ఎక్కడ బడితే అక్కడ, ఎవరు బడితే వాళ్లు బోరు బావుల్ని తవ్వేయకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బోరు బావి తవ్వాల్సి ఉంటే, ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అనుమతుల పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఏడాదిన్నర కాలంగా బోరు బావుల్లో చిన్నారులు పడ్డ ఘటనలు చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం నాగపట్నంలోని బోరు బావిలో చిన్నారి పడ్డ సమాచారం మళ్లీ బోరు బావుల వైపు దృష్టిని మరల్చింది. వీరోచితంగా శ్రమించిన బృందం నాగపట్నం జిల్లా పుదుపల్లం గ్రామానికి చెందిన కార్తికేయన్ కుమార్తె శివదర్శిని ఉదయం పదిన్నర గంటలకు ఇంటికి సమీపంలోని బోరు బావిలోపడింది. పొలంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న కార్తికేయన్ హఠాత్తుగా తన కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. ఇటీవల తవ్వి వదలి పెట్టిన బోరు బావి వైపు పరుగులు తీశాడు. అందులో నుంచి శివదర్శిని ఏడుపులు వినిపించడంతో ఆందోళన చెందాడు. ఆ గ్రామస్తులు అక్కడికి చేరుకుని తమ వంతు ప్రయత్నాలు చేపట్టారు. సమాచారం అందుకున్న నాగపట్నం, వేలాంగనిలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, వైద్య అధికారులతో కూడిన బృందం పరుగులు తీసింది. రెండు గంటల్లో అధికారులు అక్కడికి చేరుకున్నారు. రెండేళ్ల ఆ చిన్నారి పదిహేను అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారికి ఆక్సిజన్ అందించారు. మరోవైపు ఆ బోరు బావికి సమాంతరంగా గోతిని తవ్వారు. ఆ చిన్నారి కిందకు జారి పడకుండా పైన నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓ వైపు ఆక్సిజన్ అందిస్తూనే మరో వైపు కిందకు జారిపోని రీతిలో లోనికి అడ్డుగా ఉండే వస్తువుల్ని పంపించారు. రెండున్నర గంటల పాటు వీరోచితంగా శ్రమించారు. సమాంతరంగా తవ్విన గోతి ద్వారా, బోరు బావికి వేసిన పైప్ లైన్‌ను కత్తిరించారు.చిన్న పొరబాటు కూడా జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆ చిన్నారిని తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. తక్షణం అక్కడున్న అంబులెన్స్‌లో ఎక్కించి వైద్య పరీక్షలు అందించారు. హుటాహుటిన మెరుగైన చికిత్స నిమిత్తం నాగపట్నం ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివదర్శినికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సకాలంలో స్పందించడమే కాకుండా, చాకచక్యంగా వ్యవహరించి చిన్నారిని రక్షించిన సహాయ బృందాల్ని ఆ పరిసర గ్రామస్తులు కరతాళ ధ్వనులతో అభినందించారు. -
బోరు తవ్వడానికి ముందే కందకాలు!
పండ్ల తోట వేయాలనుకున్న భూమిలో బోరు వేయడానికి ముందే కందకాలు తవ్వించుకొని.. వాన నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాన్ని పెంపొందించుకున్న ఓ రైతు గాథ ఇది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మేరెడ్డి ప్రవీణ్‌కుమార్ రెడ్డి తన 5 ఎకరాల ఎర్ర భూమిలో పండ్ల తోట నాటాలనుకున్నారు. అయితే, వర్షపాతం తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో బోర్లు వేసినా పెద్దగా నీరు రావటం లేదు. తన పొరుగు పొలంలో ఒక రైతు 2, 3 బోర్లు వేసినా వ్యవసాయానికి సరిపోయేంత నీరు రావడం లేదు. ఇది గమనించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తొలుత తన భూమిలో కందకాలు తవ్వించుకోవడం విశేషం. తన సోదరుడు, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009)లను రెండేళ్ల క్రితం వెంటబెట్టుకెళ్లి వాలుకు అడ్డంగా, ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో, మీటరు లోతు మీటరు వెడల్పున కందకాలు తీయించారు. కందకం 25 మీటర్ల పొడవున తవ్విన తర్వాత 5 మీటర్ల ఖాళీ వదిలి ఆ తర్వాత.. అదే వరుసలో మరో కందకం తవ్వించారు. తర్వాత ఏడాది వర్షాలు పడినప్పుడు భూమిలో కురిసిన ప్రతి నీటి బొట్టూ కందకాల ద్వారా భూమిలోకి ఇంకి భూగర్భ నీటి మట్టం పెరిగింది. గత ఏడాది బోరు వేయడంతో రెండించుల నీరు పడింది. తదనంతరం 5 ఎకరాలకు ఫెన్సింగ్ వేయించారు. ప్రస్తుతం పండ్ల తోట నాటడానికి సిద్ధమవుతున్నారు. పండ్ల మొక్కల మధ్యలో అంతరపంటగా చిరుధాన్యాలను సాగు చేయాలని భావిస్తున్నానని ప్రవీణ్‌కుమార్ రెడ్డి(99636 41978) తెలిపారు. కందకాల వల్లనే తన భూమిలోని బోరులో నీరు పుష్కలంగా వస్తున్న విషయం తెలిసి కూడా ఇతర రైతుల్లో ఆలోచన రావటం లేదని, కందకాలు తవ్వితే భూమి వృథా అవుతుందని ఆలోచిస్తున్నారని అన్నారు. కందకాల ద్వారా వాన నీటి సంరక్షణ ప్రయోజనాలను రైతులకు వివరించి వారిలో చైతన్యం తెచ్చేందుకు తమ గ్రామంలో సదస్సు నిర్వహించాలని కూడా ఆయన భావిస్తుండటం ప్రశంసనీయం. -
బోరుబావి ఘటనకు ఏడాది
కృష్ణా, వినుకొండ: ఆడుకుంటున్న బాలుడు బోరుబావిలో పడి మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన సంఘటన జరిగి అప్పుడే ఏడాది పూర్తయింది. పది గంటలపాటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం టీవీల ముందు కూర్చుని బాలుడు ప్రాణాలతో క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో జరిగిన ఈ ఘటనలో బాలుడిని రక్షించేందుకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ వెంకట అప్పలనాయుడు సంఘటనాస్థలికి చేరుకుని శ్రమించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, స్థానిక పోలీసులు, ప్రజల సాయం తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ వేగంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా బోరుబావిలో పడ్డ బాలుడు (అప్పట్లో బాలుడి వయసు ఏడాదిన్నర) ప్రాణాలతో బయటపడ్డాడు. జిల్లా అధికార యంత్రాంగం దాదాపు పది గంటలపాటు కష్టపడి 15 అడుగుల మేరకు బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వి బాలుడిని సజీవంగా బయటికి తీసుకొచ్చారు. అనుములమూడి మల్లికార్జునరావు, అనూష దంపతుల కుమారుడు చంద్రశేఖర్ (చందు) ఇప్పుడు అంగన్వాడీ పాఠశాలకు వెళుతున్నాడు. తమ బిడ్డ తమ ముందు తిరుగాడుతున్నాడంటే అధికారులు పడ్డ కష్టమేనని ఆ బాలుడి తల్లిదండ్రులు నిత్యం గుర్తుచేసుకుంటున్నారు. అమలుకాని ముఖ్యమంత్రి హామీ రెండు తెలుగురాష్ట్రాల్లో బోరుబావి నుంచి బయటపడ్డ మొట్టమొదటి బాలుడు చందు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చందుకి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం చంద్రబాబు సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా పిలిపించుకుని చందుతో ఫొటోలు దిగి బాలుడి భవిష్యత్ కోసం రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఏడాది పూర్తయినా ఆ హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. -
35 గంటల నరకం తర్వాత సురక్షితంగా...
భోపాల్ : అధికారుల సమన్వయం ఆ చిన్నారి ప్రాణాలు కాపాడింది. సుమారు 35 గంటల నరకం తర్వాత బోరు బావి నుంచి బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. దేవాస్ జిల్లాలోని ఉమరియా గ్రామంలో శనివారం ఉదయం నాలుగేళ్ల బాలుడు బోర్ బావిలో పడిపోయిన విషయం తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా.. శనివారం ఉదయం 11 గంటలకు రోషన్ బోరు బావిలో పడిపోయాడు. అది గమనించిన తల్లి గ్రామస్థులను అప్రమత్తం చేసింది. వారు విషయాన్ని అధికారులకు తెలియజేయగా.. గంటలో ఎస్సీ సహా సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ముందుగా బాలుడు 40 లోతుల బోరులో చిక్కుకున్నట్లు అధికారులు భావించారు. అయితే తర్వాత ఆ బోర్ బావి యాజమాని అది 150 అడుగుల లోతు ఉందని చెప్పటంతో ఆందోళన మొదలైంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సరే బాలుడు మరింత లోతుకు వెళ్లిపోయి ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని కంగారు పడ్డారు. అధికారుల సమన్వయం... కల్నల్ అజయ్ కుమార్ నేతృత్వంలోని 60 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ కోసం శ్రమించారు. ఈ క్రమంలో బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి.. బయటకు తీయాలని భావించారు. సుమారు 12 గంటల తర్వాత సహాయక చర్యలకు రాళ్లు అడ్డు తగిలాయి. దీంతో డైనమెట్‌ను ఉపయోగించి వాటిని పేల్చేయాలని భావించారు. అయితే ఏమాత్రం తేడా జరిగినా బాలుడి ప్రాణాలకే ప్రమాదం. అందుకే అధికారులు ఆ యత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు బాలుడికి ఆక్సిజన్, ఫ్లూయిడ్స్ అందిస్తూనే.. తల్లిదండ్రులతో మాట్లాడిస్తూ వచ్చారు. ప్రత్యామ్నాయ చర్యలతో ఆదివారం రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగగా.. చివరకు ఓ తాడును ముడిగా వేసి బావి లోపలికి పంపారు. దానిని చెయ్యికి వేసుకోవాల్సిందిగా బాలుడికి తల్లి సూచించింది. ఆపై తాడును బయటకు లాగటంతో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఆదివారం రాత్రి 10.30కి ఆపరేషన్ ముగిసినట్లు.. బాలుడు క్షేమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులపై, సిబ్బందిపై ప్రశంసలు గుప్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రోషన్ తాను బాగానే ఉన్నట్లు మీడియాకు తెలిపాడు. मैं देवास के जिला प्रशासन को बधाई देता हूँ कि उनके अथक प्रयासों की बदौलत बोरिंग में गिरे बेटे रोशन को सकुशल वापस निकाला गया। मैं आर्मी और गाँव के लोगों का रेस्क्यू ऑपरेशन में किए गए सहयोग के लिए आभार व्यक्त करता हूँ। — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) 11 March 2018 -
బోరు బావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి
-
బోరు బావిలో చిన్నారి
భోపాల్ : మరో పసి ప్రాణం కోసం తల్లిదండ్రుల గుండెలవిసేలా విలపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల ఓ చిన్నారి బోరు బావిలో పడిపోయాడు. దేవాస్ జిల్లా ఉమరియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో పోలానికి వెళ్లిన ఆ చిన్నారి.. ఆడుకుంటూ అటుగా వెళ్లి బావిలో పడిపోయాడు. అది గమనించిన తల్లి గ్రామస్థులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ బాబును బయటికి తీసేందుకు యత్నిస్తున్నారు. సుమారు 40 అడుగుల లోతున బోర్ బావిలో రోషన్ ఇరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించేందుకు యత్నాలు సాగుతున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్‌లోనే సత్యం అనే 5 ఏళ్ల బాలుడు 100 అడుగుల బోర్ బావిలో పడిపోగా.. అతని కాపాడేందుకు 48 గంటలకు పైగా అధికారులు శ్రమించి విఫలమయ్యారు. -
మెదక్: బోరుబావిలో చెలరేగిన మంటలు
-
ఇట్టే లాగేసి.. అట్లే దించేసి!
రాప్తాడు: జిల్లాలో నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చాలా మంది రైతులు బోరుబావులపై ఆధారపడి పంటల సాగు చేపట్టారు. కొన్నేళ్లుగా వర్షాభావం నెలకొనడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులను 500 నుంచి వెయ్యిఅడుగుల లోతు వరకూ తవ్వుతున్నారు. అయినా అరకొర నీరే లభ్యమయ్యేది. కొన్ని రోజులకు ఆ బోర్లు కాస్త వట్టిపోయాయి. ఇలాంటి తరుణంలో బోరుబావి నుంచి విద్యుత్ మోటార్ వెలికి తీస్తే బోరు పనికి రాకుండా పోతుందని చాలా మంది రైతులు వాటిని అలాగే వదిలేశారు. వర్షాలతో ఊరట ప్రస్తుతం ఆశించిన మేర వర్షాలు కురవడంతో బోరుబావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో వారం రోజులుగా రైతులు కొత్త బోర్లు వేయించుకోవడంతో పాటు పాత బోర్లలోని విద్యుత్ మోటార్ల మరమ్మతులకు పూనుకున్నారు. ఇలాంటి తరుణంలోనే బోరుబావిలోని విద్యుత్ మోటార్‌ను వెలికి తీయడం రైతులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. కూలీలు అందుబాటులో లేకపోవడంతో పాటు నాలుగైదు రోజుల పాటు వేచి ఉండాల్సి రావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొసాగారు. ఫలించిన ఐడియా రైతుల ఇబ్బందులు గమనించిన లింగనపల్లికి చెందిన బోరు మెకానిక్ వెంకట్రామిరెడ్డి... గతంలో తాను చూసిన సబ్ మెర్సిబుల్ జీపు లిఫ్ట్‌ను కర్ణాటక నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. దీని ద్వారా బోరుబావిలో వందల అడుగుల లోతున ఉన్న విద్యుత్ మోటార్లను తీయడం, దించడం సులువైపోయింది. కేవలం గంటల వ్యవధిలోనే పని చక్కబెడుతుండడంతో చాలా మంది రైతులు ఈ పని పట్ల ఆకర్షితులవుతున్నారు. శ్రమ తక్కువతో పాటు సమయమూ ఆదా అవుతుండడంతో యాంత్రిక విధానంలో బోర్ల మరమ్మతుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. కేవలం ముగ్గురితో.. గతంలో బోరు నుంచి విద్యుత్ మోటార్‌ను తీసి దించాలంటే మెకానిక్‌తో పాటు కనీసం ఐదారుగురు చెమటోడ్చాల్సి వచ్చేది. అది కూడా అనుకున్న సమయంలో పని చేయడానికి వీలయ్యేది కాదు. కూలీల కొరత తదితర కారణాలతో రైతులు ఒక్కొ సందర్భంలో మూడు, నాలుగు రోజులు నిరీక్షించాల్సి వచ్చేది. ఒకవేళ కూలీలు దొరికినా తీయడానికి నాలుగు గంటలు, తిరిగి దింపడానికి మరో నాలుగు గంటలు సమయం పట్టేది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సబ్మెర్సిబుల్ జీపు లిఫ్ట్ ద్వారా కేవలం ముగ్గురితో ఒక గంట లోపు మోటార్‌ను తీసి, దించేస్తున్నారు. ఇది రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంది. సమయం ఆదా కావడంతో పాటు పని కూడా వెనువెంటనే ముగిసిపోతోంది. రోజూ రెండు మోటార్లు రిపేరీ బెంగళూరు నుంచి రూ.4లక్షలకు ప్రత్యేకంగా సబ్మెర్సిబుల్ జీపు లిఫ్ట్‌ను కొనుగోలు చేశాను. ఇప్పుడు నాతో పాటు మరో ఇద్దరికి చేతినిండా పని దొరికింది. బోరులోపల కాలిపోయిన మోటార్‌ను వెలికి తీసి, మరమ్మతు చేసిన తర్వాత తిరిగి బోరులో దింపేందుకు రైతుల నుంచి రూ. వెయ్యి చొప్పున తీసుకుంటున్నాం. రోజూ రెండు నుంచి మూడు మోటార్లు వెలికి తీసి మరమ్మతులు చేసి ఇస్తుంటాం.– వెంకట్రామిరెడ్డి, బోర్ మోటార్ మెకానిక్, లింగనపల్లి ఇబ్బంది తొలగింది బోరులో మోటారు కాలిపోతే దాన్ని పైకి తీయాలన్నా దింపాలన్నా చాలా కష్టంగా ఉండేది. డబ్బు ఖర్చు కూడా ఎక్కువే. ఇప్పుడు రైతుల చేతికి మట్టి అంటకుండా జీపుతో వాళ్లే వచ్చి అన్ని పనులూ చక్కపెట్టిపోతున్నారు. చాలా బాగుంది. రైతులకు ఇబ్బంది లేదు. – అమిదాల విశ్వనాథ్, రైతు, రాప్తాడు -
నీళ్లు పడని బోర్లను 10లోగా పూడ్చివేయాలి
చెడిన బోర్లుంటే రూ. 50 వేల జరిమానా అనుమతి లేకుండా బోరు వేస్తే రూ.లక్ష జరిమానా: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: పనికిరాని బోరుబావులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నీళ్లు పడని బోర్లను జూలై 10 లోగా పూడ్చివేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జూలై 10 తర్వాత గ్రామాల్లో చెడిన బోర్లుంటే సదరు భూ యజమాని మీద రూ. 50 వేల జరిమానా విధించడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు మీనా, వికాస్‌రాజు కమిషనర్ నీతూ ప్రసాద్‌లతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనుమతి లేకుండా బోరు వేస్తే రిగ్గు యజమానులకు రూ. లక్ష జరిమానా విధిస్తామన్నారు. చెడిపోయిన బోర్లపై గురువారం నుంచి సమగ్ర సర్వే నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాల్లో జరిమానా విధించే బాధ్యతను వీఆర్వో, కార్యదర్శి, సర్పంచులకే ఇస్తామన్నారు. -
బోర్ బావులు మూసేయండి
-
బోరు మింగేసింది..
బోరుబావిలో పడిన చిన్నారి మృతి ► మూడు రోజుల శ్రమకు దక్కని ఫలితం.. బయటపడని మృతదేహం ► ఎయిర్ ఫ్లషింగ్ ప్రక్రియతో దుస్తులు, పలు అవయవ అవశేషాలు బయటకు ► చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి..తల్లిదండ్రులకు అప్పగింత ► వికారాబాద్ జిల్లాలోని గోరేపల్లి గ్రామంలో ముగిసిన అంత్యక్రియలు చేవెళ్ల/మొయినాబాద్/యాలాల: జరగరానిదే జరిగిపోయింది. నోరు తెరిచిన బోరుబావికి మరో చిన్ని ప్రాణం బలైపోయింది. తల్లిదం డ్రులకు అంతులేని ఆవేదన మిగులుస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెల్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరుబా విలో పడిపోయిన చిన్నారి (18 నెలలు) మృతి చెందింది. పాపను కాపాడేందుకు అధికార యంత్రాంగం దాదాపు 60 గంటలపాటు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు ఎయిర్ ఫ్లషింగ్ చేయడంతో ఆదివారం ఉదయం చిన్నారి దుస్తులు, కొన్ని అవయవాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఫ్లషింగ్ సమయంలో దుర్వాసన సైతం వచ్చింది. దీంతో చిన్నారి మృతి చెందినట్లు సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం చిన్నారి అవశేషాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి స్వగ్రామమైన వికారాబాద్ జిల్లాలోని గోరేపల్లిలో అంత్యక్రియలు జరిగాయి. ఆశలు వదులుకొని... బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ కను గొనేందుకు ముంబై నుంచి తెప్పించిన అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్ ప్రూఫ్ కెమె రాను బోరుబావిలోకి వదిలి అన్వేషించారు. 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించే ఈ కెమెరాతో 210 అడుగుల లోతు వరకు చూసినా పాప ఆనవాళ్లు కనిపించలేదు. దీం తో శనివారం అర్ధరాత్రి అధికార యంత్రాం గం పాపపై ఆశలు వదులుకొని చివరి ప్రయ త్నం చేయాలని నిర్ణయించింది. పాప బోరు బావిలో పడినప్పుడు 40 అడుగుల లోతులోనే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం బోరు మోటర్‌ను బలంగా బయటకు తీయడంతో అక్కడే అంచులకు పాప అతుక్కుపోయి ఉంటుందని... 40 అడుగుల కిందకు బోర్వెల్ డయా 6 అంగుళాలే ఉంటుందని.. పాప లోపలికి పడిపోయే అవకాశం ఉండదని బోర్‌వెల్స్ యజమాని, మాజీ ఎమ్మెల్యే కిచ్చ న్నగారి లక్ష్మారెడ్డి అధికారులకు చెప్పారు. దీంతో 50 అడుగుల లోతులో బోరును బ్లాక్ చేసి పైనుంచి తవ్వకాలు చేపట్టారు. 40 అడు గుల వరకు బోరుబావిని పూర్తిగా పెకిలించి పాపను బయటకు తీయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజాము వరకు 32 అడుగుల వరకు తవ్వకాలు జరిపారు. సీసీ కెమెరాలతో మరోసారి అన్వేషించి... బోరుబావిని 32 అడుగుల లోతు వరకు పూర్తిగా తవ్విన క్రమంలో మెదక్ జిల్లాకు చెందిన బోర్ మెకానిక్ శ్రీనివాస్ తన వద్ద ఉన్న పరికరాలతో అక్కడికి చేరుకున్నారు. అధికారులు తవ్వకాలు నిలిపేసి అతనికి అవకాశం ఇవ్వడంతో 180 అడుగుల లోతు వరకు సీసీ కెమెరాలను పంపి చూశారు. పాప ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బోర్వెల్ పైపును 260 అడుగుల లోతు వరకు దింపి ఎయిర్ ఫ్లషింగ్ చేశారు. ఈ క్రమంలో బోరులోంచి నీళ్లతోపాటు చిన్నారి బట్టలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత పాప అవయవాలకు సంబంధించి కొన్ని అవశేషాలు బయటకు రాగా వాటిని బకెట్లో వేసుకొని బయటకు తీశారు. ప్రయత్నం ఫలించలేదు: మహేందర్‌రెడ్డి బోరుబావిలో పడిన చిన్నారిని బతికించాలని మూడు రోజులపాటు ప్రయత్నించినా సాధ్యంకాలేదని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పాప శరీర అవశేషాలు బోరుబావిలో నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాప మొదట్లో 40 అడుగుల లోతులో మోటర్‌పై ఉందని... మోటర్‌ను బయటకు తీయడంతో మరింత దిగువకు పడిపోయిందన్నారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కాగా, బోరుబావిలో పడిన చిన్నారిలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి కదలికలు లేవని నిర్ధారణకు వచ్చాకే మోటర్‌ను బయటకు లాగామని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. చిన్నారికి కన్నీటి వీడ్కోలు బోరుబావిలో పడి మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారికి వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోరేపల్లి గ్రామంలో ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తు లు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉదయం 9.05 గంటలకు అంబులెన్సులోంచి చిన్నారి అవశేషాలున్న పెట్టెను గ్రామానికి తీసుకురాగా తల్లిదండ్రులు యాదయ్య, రేణుక దంపతులతోపాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దపెట్టున రోదించారు. అనంతరం 10.15 గంటలకు చిన్నారిని ఖననం చేశారు. -
తల్లీ.. వెళ్లిపోయావా..
బోరుబావిలో పడిన చిన్నారి మృతి ►కడసారి చూపునకూ నోచని తల్లిదండ్రులు ►పాప డ్రెస్, శరీర భాగాలే లభ్యం ►ఫలితమివ్వని 60గంటల రెస్క్యూ ఆపరేషన్ ►స్వగ్రామం గోరెపల్లిలో అంత్యక్రియలు ►అన్ని ప్రయత్నాలు చేసినా కాపాడుకోలేక పోయాం : మంత్రి, జిల్లా కలెక్టర్ చిట్టి తల్లీ వెళ్లిపోయావా.. కడసారి చూపుకూ నోచుకోలేక పోయాం తల్లీ.. ఏ దేవుడూ మా ప్రార్థనలు ఆలకించలేదు చిన్నారీ. నిన్ను కాపాడకోలేక పోయాం.. మమ్మల్ని మన్నించు తల్లీ.. నీ ముద్దు ముద్దు మాటలు వినే భాగ్యం మాకు లేకుండా పోయాయి. నిన్ను ఎలా మరిచిపోగలం అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వేలాది మంది చేసిన ప్రార్థనలు.. అధికార యంత్రాంగం ప్రయత్నాలు ఆ చిన్నారిని కాపాడలేక పోయాయి. పాప చనిపోయిందన్న వార్త విన్న ప్రజలు బోరుమన్నారు. – చేవెళ్ల/మొయినాబాద్: చేవెళ్ల/మొయినాబాద్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి ఘటన విషాదాంతంగా ము గిసింది. పాపను రక్షించాలని 60 గంటలపాటు నిర్విరామంగా సాగిన ఆపరేషన్.. సఫలీకృతం కాలేదు. ఏడాదిన్నరకే.. ఆ పాలబుగ్గల పాపకు నూరేళ్లు నిండడం ప్రతిఒక్కరినీ కలచివేసింది. పాప ఇక లేదన్న వార్తతో అందరి హృదయాలు ద్రవించిపోయాయి. బిడ్డ ఎలాగైనా సురక్షితంగా బయటకు రావాలని నిండు మనసుతో దేవుళ్లకు ప్రార్థించినా.. అది నెరవేరలేదు. పాప అందరినీ విడిచి పోయిందని, ఇక లేదని.. ఆదివారం ఉదయం 6.20 గంటల సమయంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రకటించారు. జిల్లా, రాష్ట్ర యంత్రాంగాలు సర్వశుక్తులు ఒడ్డి రెండున్నర రోజులపాటు శ్రమించినా.. ఫలితం లేకపోయింది. కడసారి చూపునకు కన్నతల్లిదండ్రులు నోచుకోలేదు. పాప బోరుబావిలో పడినప్పటి నుంచి పాపను క్షేమంగా మీకు అప్పగిస్తామని యంత్రాంగం ధైర్యం చెబుతూ వచ్చినా.. సాధ్యపడలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ, సింగరేణి తదితర బృందాలు చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. బోర్‌బావుల తవ్వకాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల సహాయమూ నష్టాన్ని నివారించలేకపోయింది. అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను అమలు చేసినా.. కడుపుకోతే మిగిలింది. బోరుబావుల ప్రమాద సంఘటనల్లో కెల్లా అత్యంత కఠినమైన రెస్క్యూ అపరేషన్‌గా దీన్ని భావిస్తున్నారు. ముందు ఫ్లషింగ్‌కు అంగీకరించని తల్లిదండ్రులు.. సాంకేతికను ఉపయోగించినా బోరుబావిలో పాప జాడ కనిపించలేదు. శుక్రవారం మధ్యాహ్నం చిన్నారి మరింత లోతుకు జారినప్పటి నుంచి.. అత్యాధునిక సీసీ కెమెరాలను ఉపయోగించారు. 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరించే కెమెరా సేవల్ని వినియోగించినా ఫలి తం లేకపోయింది. పాప 400 అడుగుల్లోతు ఉండొచ్చని.. అప్పటికే 60 గడవడంతో చనిపోయి ఉండవచ్చన్న ప్రాథమిక నిర్దరణకు అధికారులు వచ్చారు. దీంతో చివరకు ఫ్లషింగ్ ఒక్కటే మార్గమని యంత్రాంగం భావించింది. ఈ విధానాన్ని అవలంబిస్తామని అధికారులు.. మొదట పాప తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. తమ బిడ్డ మృతదేహానైనా కడసారి చూసే భాగ్యం కల్పించాలని కన్నీరుమున్నీరవుతూ అధికారులను వేడుకున్నారు. చివరకు కుటుంబ సభ్యుల సహకారంతో వారిని ఒప్పించగలిగారు. ఆ తర్వాత ఫ్లషింగ్ ప్రక్రియను చేపట్టారు. బోర్ రిగ్ ద్వారా బోరుబావిలోకి అధిక ఒత్తి డిని గొట్టం ద్వారా పంపడంతో.. ఒక్క ఉదుటున లోపల ఉన్న మట్టితోపాటు నీళ్లు బయటికి ఎగిరి పడ్డాయి. ఆతర్వాత పాప ధరించిన ఫ్రాక్ .. ఆ వెంటనే దుర్వాసన వెదజల్లుతూ చిన్నారి శరీర భాగాలు కొన్ని ఎగిరిపడ్డాయి. వెంటనే పాప వస్త్రాన్ని, శరీర అవశేషాలను సేకరించిన సహాయక బృందాలు.. మరో వస్త్రంలో మూటకట్టి శవపరీక్ష నిమిత్తం చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వలస కూలీగా వచ్చి.. బిడ్డను పోగొట్టుకుని వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోరెపల్లికి చెందిన యాదయ్య, రేణుకలు తమ ఇద్దరు పాపలతో కలిసి ఏడాది కిత్రం చనువెళ్లి గ్రామానికి వలస వచ్చారు. స్థానిక రైతు మల్లారెడ్డికి చెందిన పాలీహౌస్లో పనికి కుదిరిన ఆ కుటుంబం.. పొలం వద్దనే ఉన్న చిన్న గదిలో నివాసం ఉంటూ వ్యవసాయ పనులు చేసేవారు. బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని వచ్చినా.. ఇద్దరి బిడ్డలే తమ ప్రాణాలు భావించారు. వారి కళ్ల ముందు ఆడుతూ పాడుతూ చిన్న పాప చిన్నారి గురువారం సాయంత్రం ఇంటికి సమీపంలోని బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. దీన్ని చూసిన పెద్ద పాప హర్షిత.. పక్కనే పాకలో ఆవులకు పాలు పితుకుతున్న తండ్రి యాదయ్యకు విషయాన్ని చెప్పింది. హుటాహుటిన వచ్చిన తండ్రి పాప ఏడుపులను గమనించి క్షణాల్లో అప్రమత్తమై స్థానికలతో కలిసి పాపను కాపాడేందుకు ప్రయత్నించారు. బోరుబావిలో ఉన్న బోరుమోటారును పైకి లాగేందుకు యత్నించారు. కాని పాప పైకి రాకపోగా 10 అడుగుల లోతులో నుంచి 40 అడుగుల లోతుకి వెళ్లింది. అక్కడ మోటర్, బోరుబావి అంచుకు మధ్య చిక్కుకుంది. పై నుంచి మట్టి పడడంతో పైకి లాగినా సాధ్యపడలేదు. అప్పటి నుంచి ఆదివారం ఉదయం వరకు పాపకోసం పలు విధాలుగా చేసిన రెస్క్యూ అపరేషన్లు ఫలించకపోగా.. కడచూపుకూ దూరమైంది. ఘటన రోజు.. గురువారం సాయత్రం 6–45 గంటలకు బోరుబావిలో చిన్నారి పడినట్లు తెలిసిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి చనువెళ్లికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి కలెక్టర్‌కు సమాచా రం అందించారు. అప్పటికే స్థానిక పోలీసులు, 108 అబులెన్స్‌లు వచ్చి సహయక చర్యలల్లో భాగంగా చిన్నారికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేశారు. అప్పటికే స్థాని కుల సహాయంతో అధికారులు బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తీసే పనులు ప్రారంభించారు. రాత్రి 10 గంటలకు కలెక్టర్ రఘునందన్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. షేక్‌పేట నంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒక్కటి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంది. అప్పటికే సమాచారం అం దుకున్న నల్లగొండ జిల్లాకు చెందిన పుట్టం కరుణాకర్ అక్కడికి చేరుకున్నాడు. అతడు సీసీ కెమెరాలను లోపలికి పంపించి.. 40అడుగుల లోతులో పాప ఉందని, ప్రాణా లతో ఉన్నట్లు గుర్తించాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు. రాడ్ల సహయంతో పాప చేతికి తాడు బిగించి బయటకు తీసేందుకు శ్రమించినా.. ఫలితం లేకపోయింది. దీంతో తెల్లవారుజామున మంగళగిరి నుంచి వచ్చిన మరో ఎన్డీఆర్ఎఫ్ బృందం పాపను బయటకు తీసేందుకు అటోమెటిక్, మాన్యువల్ రోబో పరికరాలను ఉపయోగించారు. శుక్రవారం రాత్రి వరకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగినా సఫలం కాలేదు. సాంకేతికతకూ లభించని జాడ శుక్రవారం రాత్రి మొత్తం తవ్వకాలు కొనసాగించారు. పాప పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్సిజన్ను నిరంతరాయంగా అందించారు. పాప ఆరోగ్య పరిస్థితిని సైతం తెలుసుకునేందుకు నిపుణులు డీఆర్డీఓ అధికారి, నిమ్స్ మాజీ డైరెక్టర్ బృందాన్ని రప్పించి పరిస్థితిని సమీక్షించింది. 24 గంటలు దాటిన తర్వాత ఎన్డీఆర్ఎప్ బృందం చర్యలు çఫలించకపోవటంతో బోరుమోటర్‌ను బయటకు తీస్తే పాపకూడా బయటకు వస్తుందని బోరుమోటర్‌ను తీశారు. అయితే పాప బయటకు రాకపోగా 40 అడుగుల నుంచి మరింత లోతులోకి వెళ్లిపోయింది. దీంతో పాపను గుర్తించటం కష్టంగా మారింది. సీసీ కెమెరాలకూ జాడ కనిపించలేదు. దీంతో సింగరేణి, ఓఎన్జీసీ బృందాలను రంగంలోకి దించారు. శనివారం వచ్చిన ఈ ప్రత్యేక బృందాలు సైతం పరిస్థితి చేయి దాటిపోయిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక అత్యాధునిక సీసీ కెమెరాలను సైతం తెప్పించారు. సముద్ర గర్భంలో సైతం ఉన్నవాటిని స్పష్టంగా గుర్తించడం దీని ప్రత్యేకత. ఈ మ్యాట్రిక్స్ కెమెరాతో పరిశీలించినా 110 నుంచి 210 అడుగుల వరకు పాప జాడ కనిపించలేదు. గుంతలను పూడ్చివేసిన అధికారులు చనువెళ్లిలో రైతు రాంరెడ్డి పొలంలో వేసిన బోరుబావిలో పడిన చిన్నారి కోసం ఎకరం విస్తీర్ణంలో దాదాపు 32 అడుగల మేర గొయ్యి తీశారు. చివరకు పాప చనిపోయిందని ఖరారు కావడంతో ఆ గొయ్యిని పూడ్చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి రేయింబవళ్లు జిల్లా, రాష్ట్ర యంత్రాంగం శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయింది. రెస్క్యూ ఆపరేషన్ ముగియడంతో అక్కడే ఉన్న ఇటాచీలతో గుంతలను పూడ్చేశారు. నిరాశే మిగిలింది క్షణక్షణం ఉత్కంఠను తలపించిన చిన్నారి ఆపరేషన్‌కు తెరపడింది. బోరుబావిలో పడిన చిన్నారిని కడసారైనా చూద్దామని తరలివచ్చిన ప్రజలకు చివరకు నిరాశే మిగిలింది. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు మూడు రోజులపాటు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి వరుస కట్టారు. పరిసర ప్రాంత గ్రామాల ప్రజలంతా చేరుకున్నారు. చిన్నారి క్షేమంగా బయటకు వస్తుందని ఉత్కంఠగా ఎదురుచూశారు. శుక్రవారం, శనివారం రోజంతా వేల సంఖ్యలో జనం వచ్చి చిన్నారిని ఎలా బయటకు తీస్తున్నారని ఆసక్తిగా చూశారు. బోరు మోటారును బయటకు లాగడంతో చిన్నారి ప్రాణాలపై ఆధికారుల్లో ఆశలు సన్నిగిల్లాయి. అదే సమయంలో ప్రజల్లో సైతం చిన్నారి ప్రాణాలతో బయటకు వస్తుందనే ఆశ తగ్గింది. అయినా ఎక్కడో చిన్న ఆశ. ఎలాగైనా ప్రాణాలతో బయట పడుతుందన్న నమ్మకంతో.. రేయింబవళ్లు నిద్రాహారాలు మానేసి అక్కడే వేచి చూశారు. చివరకు ఫ్లషింగ్ ద్వారా చిన్నారి బట్టలు, అవశేషాలు మాత్రమే బయటకు రావడంతో.. అందరి కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. 60 గంటలపాటు అక్కడే.. చిన్నారిని రక్షించాలని యంత్రాంగం సవాలుగా తీసుకుంది. ఈ మేరకు శక్తివంచన లేకుండా శ్రమించింది. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు రెస్క్యూ బృందం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధంగా వచ్చిన బోర్‌వెల్స్ యజమానులు ఎంతో కృషి చేశారు. 60 గంటలపాటు సాగిన ఆ ఆపరేషన్.. అత్యంత క్లిష్టమైనదిగా యంత్రాంగం భావించింది. గతంలో బోరుబావిలో పడిన చిన్నారులను ఒక్కటి రోజుల్లో రెస్క్యూ బృందాలు రక్షించాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలు పోయినా.. చివరకు మృతదేహాలనైనా బయటకు తీసేవి. కానీ చిన్నారి విషయంలో ఆ రెండూ సాధ్యపడలేదు. రేయింబవళ్లు పర్యవేక్షణ బోరుబావిలో చిన్నారి పడిన అరగంటకే.. ఘటనా స్థలానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి చేరుకున్నారు. ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉండి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడంతోపాటు సహాయక చర్యలు చురుగ్గా జరిగేలా చూశారు. సైబరాబాద్ సీపీ సందీశాండిల్యా, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లాఆర్, మాజీ మంత్రి సబితారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, డీసీపీ పద్మాజారెడ్డి, ఏసీపీలు గంగిరెడ్డి, శృతకీర్తి, ఫైర్ అధికారి హరినాథ్‌రెడ్డి, ఎన్ఆర్డీఎఫ్ కమాండర్ డీఎన్ సింగ్ తదితరులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎన్నడూ ఊహించలేదు.. బోరుబావి యజమాని రాంరెడ్డి పశ్చాత్తాపం చెందారు. తన బోరు చిన్నారిని బలితీసుకుంటుందని ఎన్నడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం బోరుబావిని మూసే ఉంచానని చెప్పారు. ఇటీవల వర్షాలు కురవడంతో.. నీటి ఊట వచ్చి ఉంటుందని మోటారు బిగించామని పేర్కొన్నారు. చిన్నారి తండ్రి సహకారంతోనే ఈ పనులు పూర్తి చేశామన్నారు. శతవిధాలా ప్రయత్నాలు.. శనివారం సాయంత్రం కెఎల్లార్ ఇండస్ట్రీస్ యజమాని, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వచ్చి పరిశీలించారు. ఆయన బోరుబావులు వేయటంలో నిపుణులు కావటంతో అధికారులతో చర్చించారు. పాప 40 అడుగుల లోతు నుంచి లోపలికి వెళ్లే అవకాశం ఉండదని, బోరుమోటర్‌ను పైకి లాగే ప్రయత్నంలో పాప ఇదే లోతులో ఎక్కడో ఒక చోట పక్కకు చిక్కుకుని ఉండొచ్చని అధికారులకు చెప్పారు. 40 అడుగుల తర్వాత రైతు వేసే బోరుబావిలో పాప పట్టదని స్పష్టం చేశారు. దీంతో కేఎల్లార్ ప్రయత్నాలకు యంత్రాంగం అవకాశమిచ్చింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పాపను గుర్తించే వరకు కేఎల్లార్ అధీనంలో అపరేషన్ కొనసాగింది. అప్పటికే పాప బతికే అవకాశాలు లేవని యంత్రాంగం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. వెంటనే బోరుబావిలోకి ఆక్సిజన్ అందించే పనులను నిలిపివేశారు. కేఎల్లార్ తన కంపెనీ నుంచి ప్రత్యేక వాహనాలను రప్పించారు. ముందుగా సమాంతరంగా బోరు వేసి ఫ్లషింగ్ ద్వారా పాప మృతదేహాన్ని బయటకు తీయాలని భావించారు. కానీ తల్లిదండ్రులు పాప దేహాన్ని ఛిద్రం చేయవద్దని కోరారు. అయితే మొదటగా 40 అడుగుల లోతులో పాప చిక్కుకుని ఉండొచ్చని భావించి¯ గొయ్యి తీయాలని నిశ్చయించారు. అప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.. ఫ్లషింగ్ చేయక తప్పదని నిర్ణయానికి వచ్చారు. దాదాపు 260 అడుగుల లోతు వరకు హై ఫ్లషింగ్ చేయటంతో లోపల నుంచి నీటితోపాటు చిన్నారి డ్రెస్ రెండు ముక్కలుగా బయటకు వచ్చింది. ఆ తర్వాత పాప శరీర అవయవాలు కొన్ని బయటపడ్డాయి. కూతురు మృతి చెందిందన్న వార్త విని రోదిస్తున్న చిన్నారి తల్లిదండ్రులు యాలాల మండలం గోరెపల్లిలో అంత్య్రక్రియలు నిర్వహిస్తున్న బంధువులు -
200 అడుగుల కిందికి జారిన చిన్నారి
రంగారెడ్డి: చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం 40 అడుగుల దగ్గర కనిపించిన చిన్నారి ప్రస్తుతం 200 అడుగుల వద్ద కూడా కెమెరాకు కనిపించడం లేదు. బోరు బావి 490 అడుగులు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కెమెరా ద్వారా కొక్కెం సాయంతో చిన్నారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపను సజీవంగానే బయటకు తీసేందుకు అంతా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మూడో రోజు మంత్రి మహేందర్ రెడ్డి దగ్గరుండి పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓఎన్జీసీ సిబ్బందితో చర్చిస్తూ సహాయక చర్యలను మంత్రి ముమ్మరం చేశారు. ఈ నెల 22న సాయంత్రం 4.45గంటల ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడింది. ఆటోమేటిక్ రోబో, మాన్యువల్ రోబో ద్వారా పాపను బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మోటర్ తో సహా చిన్నారిని తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ విఫలయత్నం చేసింది. అయితే, మోటర్ మాత్రం బయటకు రాగా చిన్నారి మరింత లోతులోకి పడిపోయింది. ప్రస్తుతం నిరంతరాయంగా బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలిని ఓఎన్జీసీ వాళ్లు సందర్శించారు. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యాధునిక కెమెరాలను బోరుబావిలోకి పంపించామని చెప్పారు. 210 అడుగుల వరకు కెమెరాలను పంపిస్తామన్నారు. చిన్నారి ఎలా ఉన్నా బయటకు తీసి కుటుంబానికి అప్పగిస్తాం అని చెప్పారు. -
చిట్టితల్లీ క్షేమమేనా?
► ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఫలితమివ్వని ఆధునిక పద్ధతులు ♦ ఆటోమేటిక్ రోబో, మాన్యువల్ రోబో ద్వారా బయటకు తీసేందుకు యత్నం ♦ ఫలితం లేకపోవడంతో మళ్లీ సమాంతరంగా గొయ్యి తొలుత 40 అడుగుల్లోనే చిక్కుకున్న పాప ♦ మోటార్ తీయడంతో 70 అడుగుల లోతులోకి.. ♦ సీసీ కెమెరాల్లో కనిపించిన పాప కదలికలు ♦ ప్రాణాలతోనే ఉందని మధ్యాహ్నం నిర్ధారించిన నిపుణులు చేవెళ్ల/మొయినాబాద్/షాబాద్: గంటలు గడచిపోతున్నాయి.. రోజూ మారిపోయింది.. అయినా అదే ఉత్కంఠ.. బోరుబావిలో పడిపోయిన పాపను కాపాడేందుకు చేస్తున్న యత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చిన్నారిని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం 18 నెలల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. చిన్నారిని బయటకు తీసేందుకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం నేతృత్వంలో శుక్రవారం సహాయక చర్యలు చేపట్టారు. ఆటోమేటిక్ రెస్క్యూ రోబో, మాన్యువల్ రెస్క్యూ రోబోలను ఉపయోగించి చిన్నారిని బయటకు తీసేందుకు యత్నించారు. నల్లగొండ జిల్లాకు చెందిన బోర్వెల్ యజమాని కరుణాకర్ సైతం తనకు తెలిసిన పరిజ్ఞానంతో పాపను బయటకు తీసేందుకు ప్రయత్నించారు అదీ ఫలించలేదు. ఈ ప్రయత్నాలకు బోరుబావిలో ఉన్న మోటార్ అడ్డు వస్తుందని భావించి దాన్ని పైకి లాగారు. అయితే మోటారు మాత్రం పైకి వచ్చి చిన్నారి అందులోనే ఉండిపోయింది. సమాంతరంగా తవ్వే ప్రయత్నంలో నేల కదలికల వల్ల బోరుబావిలో 40 అడుగుల లోతులో ఉన్న చిన్నారి 70 అడుగులకుపైగా లోతులోకి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అంతకన్నా మరింత లోతులోకి పడిపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు చిన్నారి కదలికలను గుర్తించినా.. మోటార్‌ను తీసిన తర్వాత నుంచి గుర్తించలేకపోతున్నారు. దీంతో మరో రెస్క్యూ టీంను రప్పించేందుకు అధికార యంత్రాం గం కసరత్తు చేస్తోంది. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యతోపాటు తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రాణాలతో రావాలని.. చిన్నారి ప్రాణాలతో బయటకు రావాలని తల్లిదండ్రులతోపాటు ప్రజలు, అధికారులు, నాయకులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో రాడ్లను బోరుబావిలోకి వదిలి బయటకు తీసినప్పుడల్లా వేయి కళ్లతో పాప బయటకు వస్తుందని ఆశతో చూస్తున్నారు. ప్రయత్నం విఫలమైనప్పుడల్లా కళ్లు చెమరుస్తూ ఎదురుచూస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కొంతసేపు వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వర్షం తగ్గిన వెంటనే మళ్లీ చర్యలు మొదలు పెట్టారు. తమ పాప ప్రాణాలతో బయటకు వస్తుందని చిన్నారి తల్లిదండ్రులు రేణుక, యాదయ్య ఆశతో ఎదురుచూస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి పాప మరింత లోపలికి వెళ్లినట్లు తెలియడంతో ఆందోళన చెందారు. చిన్నారిని ఎలాగైనా కాపాడుతామంటూ అధికారులు వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నల్లగొండ నుంచి వచ్చి... నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబాయి గూడెం గ్రామానికి చెందిన మణికంఠ బోర్‌వెల్స్ యజమాని పుట్ట కరుణాకర్ చిన్నారిని కాపాడేందుకు తనకు తెలిసిన పద్ధతిని ఉపయోగించారు. టీవీల్లో వచ్చిన కథనాలను చూసి ఆయన సంఘటనా స్థలానికి వచ్చారు. 2015 డిసెంబర్లో మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మరెడ్డిగూడలో ఇలాగే ఓ బోరుబావిలో బాలుడు పడిపోతే తన పరికరాల సాయంతో ఆయన విజయవంతంగా బయటకు తీయగలిగారు. ఇక్కడ ఇనుప రాడ్ల సాయంతో తాడును, సీసీ కెమెరాలను బోరుబావిలోకి పంపి అందులో పడిపోయిన వారి చిత్రాలను ల్యాప్‌టాప్‌లో గమనిస్తూ కాలు లేదా చేయికి తాడు బిగించి పైకి లాగే పద్ధతిని ఉపయోగించారు. అయితే బోరుబావిలో పడిపోయిన చిన్నారి ఒక చేయి మాత్రమే పైకి ఉండటంతో ఆ చేయికి తాడు బిగించినా అది జారిపోవడంతో బయటకు తీయలేకపోయారు. గురువారం రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చే వరకు తన ప్రయత్నాన్ని కొనసాగించారు. శుక్రవారం కూడా ఎన్డీఆర్ఎఫ్ చర్యలు ఫలించకపోవడంతో మరోసారి ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. 40 అడుగుల నుంచి మరింత లోతుకు.. బోరుబావిలో పడిపోయిన చిన్నారి మొదట్లో 40 అడుగుల లోతులోనే ఇరుక్కుపోయింది. 540 అడుగుల లోతున్న ఈ బోరుబావిలో రైతు రాంరెడ్డి.. 240 అడుగుల వరకు సింగిల్ ఫేజ్ మోటర్‌ను దించారు. గురువారం చిన్నారి పడిపోయిన తర్వాత మోటార్ ను పైకిలాగితే పైకి వస్తుందని భావించి రైతులు పైకి లాగారు. అయితే ఆ మోటార్ 40 అడుగుల లోతులో ఉన్న పావ వద్ద ఆగిపోయింది. పైకి రాకపోవడంతో పాపకు ఏమైనా జరుగుతుందన్న భయంతో అక్కడే వదిలేశారు. శుక్రవారం అధికారులు, రెస్క్యూటీంలు వచ్చి 40 అడుగుల లోతులో ఉన్న చిన్నారిని కాపాడే ప్రయత్నంలో మోటార్‌ను పైకి లాగారు. అయితే సమాంతర గోతి కోసం తవ్వుతున్న చర్యలతో కదలికలకు చిన్నారి 70 అడుగుల లోతులోకి వెళ్లింది. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రాణాలతోనే ఉంది.. బోరుబావిలో ఉన్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డీఆర్డీవో ప్రతినిధి, నిమ్స్ మాజీ డైరెక్టర్ నరేంద్రనా«థ్ చౌదరి బృందం వచ్చింది. బోరుబావిలోకి ఓ యంత్రాన్ని పంపించి పాప ఆరోగ్య పరిస్థితి, ఉష్ణోగ్రతలను పరిశీలించారు. పాప ప్రాణాలతో ఉందని శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ధ్రువీకరించారు. కొనసాగుతున్న తవ్వకాలు పాపను రక్షించేందుకు మొదట్లో అధికారులు బోరుబావికి సమాంతరంగా గొయ్యి తీసే పనులు ప్రారంభించారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆధునిక టెక్నాలజీ పద్ధతులను ఉపయోగించేందుకు ఈ పనులను నిలిపివేశారు. కానీ అవేవీ ఫలించకపోవడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. నాలుగు ఇటాచీలు, రెండు జేసీబీలతో పనుల్ని వేగవంతం చేశారు. రోబోలు రక్షించలేవా..! తరుచుగా చిన్నారులు బోరుబావుల్లో పడుతున్న సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు మార్గాలు కనుక్కోవటంలో శాస్త్రపరిజ్ఞానం ఇంకా వెనుకంజలోనే ఉంది. గడిచిన పదేళ్లలో బోరుబావుల్లో పడిన చిన్నారులు సురక్షితంగా బయటపడ్డ ఘటనలు వేళ్లపై లెక్కించవచ్చు. 2006లో హరియాణాలోని కురుక్షేత్రకు సమీపంలో ప్రిన్స్ అనే ఐదేళ్ల బాలుడితో పాటు.. 2015 అక్టోబర్‌లో రాజస్థాన్‌లోని దౌసాలో జ్యోతి అనే చిన్నారి మృత్యుంజయులుగా బయటపడ్డారు. కురుక్షేత్ర సమీపంలోని ఘటనలో ఏకంగా సైన్యం రంగంలోకి దిగింది. సమీపంలో ఎండిన వ్యవసాయ బావి ఉండటంతో.. బావి అట్టడుగు నుంచి బోరుబావిలో చిన్నారిని గుర్తించిన ప్రాంతానికి సొరంగ మార్గం తవ్వి సురక్షితంగా బయటకు తీశారు. పలు పరిశోధనల్లో బోరుబావుల్లో పడిన చిన్నారులను రక్షించేందుకు ఆటోమోటిక్ రెస్క్యూ రోబోలను తయారు చేశారు. ప్రయోగాత్మకంగా ఇవి విజయం సాధించినట్లు కనబడినా.. నిజంగా ఆపద సంభవించినప్పుడు విఫలమయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని భూగర్భ పరిస్థితులు అనుకూలించకపోతే రెస్క్యూ చేయటం కష్టమని నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో రోబో సాయంతో చిన్నారులను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తే బోరు ఎంత లోతు.. ఎంత వెడల్పు ఉందనే సాంకేతిక అంశాలు కీలకమవుతున్నాయని అంగీకరిస్తున్నారు. మట్టి తడిగా ఉన్నప్పుడు రోబోలు వాడితే మట్టి మరింత కూలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. రెండు పద్ధతుల ద్వారా.. బోరుబావిలో పడిపోయిన వారిని కాపాడేందుకు చాలాకాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్న పద్ధతి ఆ బావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వడం. కానీ చిన్నారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండు కొత్త టెక్నాలజీలను ఉపయోగించి పాపను రక్షించే ప్రయత్నం చేసింది. ఆటోమేటిక్ రెస్క్యూ రోబో.. ఆటోమెటిక్ రెస్క్యూ రోబో పరికరాన్ని మిషన్‌తో నియంత్రిస్తూ బోరుబావిలోకి వదిలారు. ఈ పరికరం బోరుబావిలో పడిపోయిన వారిని బిగించుకుని పైకి లాగుతుంది. ఈ పద్ధతిలో పాపను బయటకు లాగేందుకు పలుమార్లు ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. మాన్యువల్ రెస్క్యూ రోబో ఈ పద్ధతిలో రెండు చేతుల మాదిరిగా ఉన్న రోబో పరికరాలను బోరుబావులోకి పంపి బయటకు తీసే యత్నం చేశారు. ఇది కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బోరుబావిలో పడిపోయిన చిన్నారి ఒక చేయి మాత్రమే పైకి ఉండటంతో ఈ పరికరం పాపను పట్టుకోలేకపోయింది. పలు మార్లు ప్రయత్నించినా జారిపోవడంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు. ఈ రెండు పద్ధతులను మహారాష్ట్రలోని బీజాపూర్‌లో ఇలాంటి రెండు మూడు సంఘటనల్లో ఉపయోగించి మంచి ఫలితాలను సాధించినట్లు ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ డీఎన్ సింగ్ తెలిపారు. 70–80 అడుగుల లోతుల్లో ఉంది పాపను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. రోబోటిక్ టెక్నాలజీ, సంప్రదాయ పద్ధతులతో వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నాం. పాప తొలుత 40 అడుగుల లోతుల్లో చిక్కుకున్నట్లు గుర్తించాం. ఏకకాలంలో మోటారు పంపు, చిన్నారిని పైకి లాగే క్రమంలో మోటారు వచ్చినా.. పాప మరింత లోతుల్లోకి పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 70 నుంచి 80 అడుగుల లోతుల్లో పాప ఉన్నట్లు అంచనా వేశాం. శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత నుంచి చిన్నారి కదలికలు కనిపించడం లేదు. ప్రస్తుతం 40 ఫీట్ల మేర సమాంతరంగా గొయ్యి తవ్వాం. రాతి నేల కావడం, వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. – జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు -
క్షేమంగా రావాలని..
►బోరుబావిలో పడిన బాలిక కోసం ప్రార్థనలు ►పాప ప్రాణాలను రక్షించేందుకు ముమ్మర యత్నాలు ►ఇక్కారెడ్డిగూడెంలో కొనసాగుతున్న సహాయక చర్యలు ► సాంకేతిక పరిజ్ఞానం వినియోగం .. ఫలించని ప్రయత్నాలు ►బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వకం ►సంఘటన స్థలంలోనే మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్ చిట్టి తల్లీ.. క్షేమంగా రామ్మా.. నీవు నిండు నూరేళ్లూ బతకాలి.. మా కళ్లేదుట తిరుగుతూ.. ముద్దు ముద్దు మాటలు వినిపించాలి తల్లీ.. అంటూ అనేకమంది చిన్నారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. బోరుగుంత నీకెన్ని కష్టాలు తెచ్చిందమ్మా. నీవు తప్పకుండా మా మధ్యకు వస్తావు చిన్నారి. ఆ దేవుడు కరుణిస్తాడు అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల/మొయినాబాద్/షాబాద్: చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన 18నెలల ‘చిన్నారి’ని ప్రాణాలతో కాపాడేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఫలించడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం బోరుబావికి సమాంతరంగా గోయి తీస్తుండగా వర్షం కురిసింది. దీంతో కొంత సేపు అంతరాయం ఏర్పడినా పనులను కొనసాగించారు. మరోపక్క బోరుగుంతలో పడిన చిన్నారి క్షేమంగా బయట పడాలని వేలాదిమంది ప్రార్థనలు చేశారు. రెస్క్యూ టీం బృందం విఫలయత్నం.. బోరుబావిలో పడిన చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఆధికార యంత్రాంగం, రెస్క్యుటీం బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. గురువారం రాత్రి 7 గంటల నుంచి నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టింది. బోరుబావి ఉన్న ప్రాంతం రాళ్లతో కూడి ఉండటంతో దానికి సమాంతరంగా గోయి తీసేందుకు జేసీబీలకు, ఇటాచ్లను వినియోగించారు. నేల గట్టిగా ఉండటంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేందుకు గురువారం అర్థరాత్రి నుంచి గోయితీసే పనులు నిలిపి వేశారు. బోరుబావిలో సింగిల్‌ఫేజ్ మోటర్ ఉండడం వల్ల 40 అడుగుల లోతులోనే పాప చిక్కుకుంది. బోరుమోటర్ పైనే పాప ఉండటంతో మోటర్‌ను బయటకు తీస్తే పాపకూడా బయటకు వస్తుందని భావించారు. కానీ ఈ ప్రయత్నంలో బోరుమోటర్ మాత్రమే బయటకు వచ్చింది. పాప అందులోనే ఉండిపోయింది. శుక్రవారం సాయంత్రం వరకు సాంకేతిక పరిజ్ఞాన సేవలను ఉపయోగించినా ఫలితం లేకపోవటంతో మళ్లీ సాయంత్రం నుంచి సమాంతరంగా గోయి తీసే పనులు ప్రారంభించారు. ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. బోరుమోటర్‌ను బయటకు తీసిన తర్వాత ఇటాచీలతో తవ్వకాలు చేస్తున్న క్రమంలో పాప మరింత లోపలికి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వర్షం పడటంతో సహాయక చర్యలకు కొంత అంతరాయం ఏర్పడినా చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ సీపీ సందీప్‌శాండిల్యా, జిల్లా ఫైర్ అధికారి హరినాథ్‌రెడ్డి, డీసీపీ, ఏసీపీలు, ఆర్డీఓలతో పాటు అన్ని శాఖ అధికారులు పరివేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడతెగని ఉత్కంఠ.. పాపను ప్రాణాలతో బయటకు తీయడంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణంలో చిన్నారి బయటకు వస్తుందోనని అధికారులు,చిన్నారి తల్లిదండ్రులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పాప కనిపించకుండా పోయి 24 గంటలు దాటడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. రాత్రి నుంచి సంఘటన స్థలంలోనే మంత్రి గురువారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలు ఉన్నతాధికారులను అదేశించడంతో హుటాహుటిన సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రాత్రినుంచి మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు ఇక్కడే ఉన్నారు. జిల్లా అధికారులు కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం చిన్నారిని కాపాడేందుకు గురువారం రాత్రే ఎన్డీఆర్ఎఫ్ (నేçషనల్ డిజాస్టర్ ర్యాపిడ్ పోర్స్) బృందం రంగంలోకి దిగింది పరిస్థితని పరిశీలించి చేపట్టాల్సిన సహాయక చర్యలు తీసుకుంది. 108అంబులెన్స్‌ల ద్వారా పాపకు ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. బోరుబావిలో పడిన వారిని బయటకు తీసేందుకు ఉపయోగించే రోబోటిక్ యంత్రాలను ఉపయోగించారు. విజయవాడలోని మంగళగిరి నుంచి తెల్లవారుజామున మూడు గంటలకు ఈ యంత్రాలను తెప్పించారు.అప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పాపను బయటకు తీసేందుకు తీవ్రంగా కృషి చేశారు. సీసీ కెమెరాలను లోపలికి పంపించి లోపలి దృశ్యాలను ల్యాప్‌టాప్‌లో ఎప్పటికప్పుడు వీక్షించి చర్యలు చేపట్టారు. కానీ, వారి కృషి ఫలించలేదు. అదేవిధంగా టీవీల్లో వస్తున్న ప్రమాద వార్త చూసిన నల్లగొండ జిల్లాకు చెందిన పుట్ట కరుణాకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంతో రాడ్ల సహాయంతో తాడు కట్టి చిన్నారిని బయటకు తీసేందుకు తీసేందుకు ప్రయత్నించాడు. అతని ఫలితం కూడా ఫలించలేదు. అలాగే చిన్నారిని కాపాడేందుకు సింగరేణి నుంచి నిపుణులను పిలిపించారు. వారు కూడా చిన్నారిని కాపాడేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారు. చిన్నారీ.. భయపడకమ్మా.. తాడు పట్టుకో.. ఏడవకు నల్లగొండ నుంచి వచ్చిన బృందం సభ్యులు ఇనుప రాడ్‌కు తాడుకట్టి బోరుబావిలోకి వదిలి చిన్నారి చేతులకు దానిని కట్టి పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో 40 అడుగుల లోపల ఉన్న చిన్నారిలో కదలికలు కనిపించాయి. ఏడుపు వినిపించింది. దీంతో అధికారులు చిన్నారి తల్లి రేణుకతో పాపకు వినబడేలా ‘‘చిన్నారీ భయపడకు.. తాడు పట్టుకోమ్మా..’’ అంటూ చెప్పించారు. చిన్నారీ.. ఏడవకు అంటూ తల్లి చేస్తున్న సైగలతో లోపల ఉన్న చిన్నారి రోదనలు బయటకు వినిపించాయి. దీంతో పాప బతికే ఉందని సంకేతాలు అందుతున్నాయని.. పాప క్షేమంగా బయటకు వస్తుందని అందరూ ఆశగా ఉన్నారు. అయితే, చిన్నారి తాడును పట్టుకునేందుకు సహకరించకపోవడంతో ఆ ప్రయత్నమూ ఫలించలేదు. -
బోరుబావిలో బాలిక
-
బోరుబావిలో బాలిక
► రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన ► కాపాడేందుకు కొనసాగుతున్న చర్యలు చేవెళ్ల: 19 నెలల చిన్నారి. సరదాగా ఆడుకుంటూ ఉన్నట్టుండి బోరుబావిలో పడిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లి పంచాయతీ పరిధిలో ని ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 6.30కి ఈ సంఘటన జరిగింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోరెపల్లికి చెందిన యాదయ్య, రేణుక దంపతులు బతుకుదెరువు కోసం చేవెళ్ల మండలానికి వలస వచ్చారు. వారు స్థానిక పాలీహౌస్లో పనిచేస్తున్నారు. వీరికి అక్షిత, చిన్నారి ఇద్దరు కూతుళ్లు. గురువారం సాయంత్రం చిన్నారి పాలీహౌస్ పక్కనే ఆడుకుంటూ మల్లారెడ్డి అనే వ్యక్తికి చెందిన పొలంలోని బోరుబావి వద్దకు వెళ్లి అందులో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. బోరు బావికి సమాంతరంగా పొక్లెయిన్‌తో గుంత తవ్వుతున్నారు. బోరులోకి ఆక్సిజన్ పంపుతున్నారు. -
బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారి
కావలి(నెల్లూరు): ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి బోరు బావిలో పడిన సంఘటన నెల్లూరు జిల్లా కావలి మండలం నందమ్మపురంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న మౌనిక(3) అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు గ్రామస్థుల సాయంతో ప్రొక్లెన్లతో తవ్వకాలు జరుపుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
'శెట్టూరు ఘటనపై విచారణ జరిపించాలి'
అనంతపురం: శెట్టూరు ప్రమాద ఘటన పై విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్రకార్యదర్శి ఎల్.ఎం మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. నలుగురి మృతికి కారణమైన బోర్ వెల్ లారీ సిబ్బంది, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ క్షేత్రంలో వేస్తున్న బోరును చూడటానికి వెళ్లిన నలుగురు గ్రామస్థులు, బోర్వెల్ లారీ రివర్స్ తీస్తుండగా దాని కిందపడి మృతిచెందిన విషయం తెలిసిందే. శెట్టూరు మండలం పర్లచేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన సంజీవ(33), మంతేష్(27), తిమ్మప్ప(33), నర్సింహమూర్తి(30) అనే నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు అనూహ్యంగా మృతిచెందడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
నోళ్లు తెరిచిన బోర్లు మూసేయండి
♦ వృథా బోరుబావులపై యంత్రాంగం సమరం ♦ అక్కరకు రానివాటి మూసివేతకు నిర్ణయం ♦ అలాంటివి ఎన్నున్నాయో తేల్చేపనిలో నిమగ్నం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెండేళ్ల క్రితం నాలుగేళ్ల గిరిజ మంచాలలోని వ్యవసాయ క్షేత్రంలో నిరుపయోగ బోరు బావిలో పడి మరణించింది. సరిగ్గా ఏడాది క్రితం కుల్కచర్ల మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నా బాలిక మాత్రం క్షేమంగా బయటికొచ్చింది.’ ఇకపై బోరుబావుల్లో ప్రమాదాల ఘటనలే జరగొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడి మరణించడాన్ని సీరియస్‌గా తీసుకుంది. అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారుల అప్రమత్తమయ్యారు. జిల్లాలో తెరిచిఉండి అక్కరకు రాని బోరుబావుల లెక్క తేల్చేందుకు ఉపక్రమించారు. వీటి గుర్తింపునకు జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేక ప్రణాళిక రూపొందించగా.. వాటికనుగుణంగా వివరాలు సేకరించాల్సిందిగా కలెక్టర్ రఘునందన్‌రావు పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంపీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. భూగర్భ జల శాఖ నుంచి లెక్కలు.. బోరు వేయాలంటే భూగర్భజల శాఖ అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ఆ శాఖ వద్ద ఉన్న గణాంకాల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అయితే చాలా మంది భూగర్భ జల శాఖ అనుమతి లేకుండా విచ్చలవిడిగా బోర్లు వేశారు. ఈక్రమంలో వాటిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తంగా వారంలోపు నిర్ణీత నమూనా ప్రకారం బోరుబావుల లెక్కలు తీస్తే.. వాటికనుగుణంగా తగిన చర్యలు తీసుకోనున్నటు అధికారులు చెబుతున్నారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మాత్రం వెంటనే మూసివేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. అధికారులపై క్రిమినల్ కేసులే... ఇకపై బోరుబావుల్లో ప్రమాధాలు జరిగితే అందుకు సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, రెవెన్యూ అధికారులతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి బోరుబావుల మూసివేతకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. -
బోరుబావిలో మరో బాలుడు
భోపాల్ : దేశంలో బోరుబావి ఉదంతాలు విషాదాన్ని మిగులుస్తున్నా.. నిర్లక్ష్యం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మరో బోరు బావి ప్రమాదం ఆందోళన రేపింది. ముండ్ల గ్రామానికి చెందిన బాలుడు ఆయుష్ (5) బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. బాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. మహేష్ అనే వ్యక్తి తన భార్య, కుమారుడితో పొలంపనులు చేసుకుంటూ స్థానికంగా జీవిస్తున్నాడు.ఈ క్రమంలో పనుల నిమిత్తం వెళ్ళినపుడు అక్కడే ఆడుకుంటున్న బాలుడు సుమారు 200 అడుగుల లోతు బోరు బావిలోపడిపోయాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. 30 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి బాలుడిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారి గోపాల్ పార్మర్ తెలిపారు. మొదట శనివారం సాయంత్రానికి బాలుడు రక్షిస్తామని చెప్పిన అధికారులు ..సహాయ చర్యల్ని మరింత వేగవంతం చేశారు. -
మృత్యు బోరు సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
తాగునీటి కోసం తండ్లాట..!
- మంచినీటి బోరుమోటార్తో వ్యవసాయానికి వాడకం - గుక్కెడు నీటికోసం తండావాసుల తంటాలు మెదక్ రూరల్: ఓ గిరిజన తండాలో తాగునీటి అవసరాల కోసం బోరుబావిలో వేసిన మోటార్‌ను అదే తండాకు చెందిన ఓ వ్యక్తి తీసుకవెళ్లి తన వ్యవసాయ బోరుబావికి వేసుకోవడంతో గుక్కెడు నీటికోసం తండావాసులు తల్లడిల్లుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండలం చిట్యాల పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాలో గిరిజనుల తాగునీటికోసం ట్యాంకును నిర్మించారు. దానికోసం బోరుబావిని తవ్వి నీటిని మళ్లిస్తున్నారు. కాగా బోరు బావిలో కొంత కాలంగా నీటి ఊటలు తగ్గిపోవటంతో తండావాసులకు తాగు నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో అధికారులు కొంత కాలం క్రితం తండాలో మరోబోరు బావి తవ్వారు అందులో పుష్కలంగా నీరు వచ్చింది. దీంతో సింగిల్ ఫేజ్ మోటారును అమర్చారు. దీంతో తండాకు నీటి కష్టాల తప్పాయి. కాగా ఇటీవల తండాకు చెందిన ఓ వ్యక్తి ఆ బోరుబావిలోని మోటార్‌ను తీసుకవెళ్లి తన పొలంలోని బోరుబావిలో దింపి పొలానికి నీటిని పెట్టుకుంటున్నాడని తండాకు చెందిన పలువురు గిరిజనులు వాపోయారు. దీంతో తండాలో నీటికష్టాలు మళ్లీ ప్రారంభం కావటంతో తండావాసులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవి కాలం కావటంతో తండాలో తాగునీటికోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా బోరుమోటార్‌ను తొలగించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని బోరుబావిలో మోటారు దింపి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని తండా వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
మృత్యు కుహరం
రెండేళ్ల బాలుడిని మింగిన బోరుబావి బాలుడిని రక్షించేందుకు కృషి చేసిన యంత్రాంగం వేలూరు జిల్లా ఆర్కాడులో ఘటన వేలూరు: ఆర్కాడు సమీపంలోని సాంబశివపురం గ్రామానికి చెందిన కుట్టి విదేశాల్లో ఉన్నాడు. ఇతని భార్య గీత, కుమారుడు తమిళరసన్(2) ఇక్కడే ఉన్నారు. తమిళరసన్ అమ్మమ్మ, తాతయ్యల ఊరు కూరంబాడి. తమిళరసన్ అమ్మ గీతతోపాటు తాతగారింటికి ఆదివారం ఉదయం వెళ్లాడు. ఉదయం 8.10 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. చిన్నారి కనిపించక పోవడంతో తల్లి గీత, అవ్వ వెతుకుతుండగా, బోరు బావి నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆర్కాడు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా చిన్నారి 40 అడుగుల లోతులో ఉన్న ట్లు గుర్తించారు. వెంటనే సంఘటనా స్థలానికి జేసీబీలు, ప్రొక్లెయిన్లు రప్పించి బోరు బావి చుట్టూ మట్టి తీసే పనిలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 20 అడుగులు తవారు. చిన్నారికి బోరు బావిలో శ్యాస ఆడేందుకు ఆక్సిజన్‌ను వదిలారు. వెంటనే వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి రప్పించారు. మంత్రి వీరమణి, ఎమ్మెల్యేలు శ్రీనివాసన్, మహ్మద్‌జాన్, కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ సెంథిల్‌కుమారి, ఆరోగ్యశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోర్‌వెల్‌లో చిన్నారి పడిన నాలుగు గంటల్లోనే ఎటువంటి శబ్దం రాకపోవడంతో అధికారులతో పాటు గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. గ్రామస్తులు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బండ రావడంతో మట్టి తొలగించడానికి అంతరాయం కలిగింది. వెంటనే డ్రిల్లింగ్ ద్వారా బండను తొలగించి మట్టిని తీశారు. ఆ వెంటనే వర్షం రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నా తవ్వకాలు మాత్రం ఆపలేదు. మధ్యాహ్నం వరకు నుంచి సాయంత్రం వరకు బోరు బావి చుట్టూ తవ్వకాలు సాగించారు. సాయంత్రం 6.10 గంటలకు బాలుడిని వెలుపలికి తీశారు. వెంటనే అంబులెన్స్‌లో ఎక్కించి, ప్రథమ చికిత్స అందిస్తూ వాలాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చేరిన కొంత సేపటికే బాలుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల క్రితం బాలుడి తాత కనగసబ వ్యవసాయ భూమిలో 400 అడుగుల బోరు వేశాడు. బోరులో నీరు రాక పోవడంతో వాటిని రాళ్లతో మూసి వేసినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆ రాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించినట్లు తెలుస్తుంది. ఉదయం 8.00 - చిన్నారి ఇంటి ముందు ఆటలాడుతున్నాడు 8.10 - బోర్‌బావిలో బాలుడు పడ్డాడు 8.30 - పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు 8.35 - బోరుబావిలో దారం వదిలారు 9.00 - అంబులెన్స్ వచ్చింది 9.20 - బోరుబావిలోకి ఆక్సిజన్ వదిలారు 9.30 - తవ్వకాలు కొనసాగించారు సాయంత్రం 6.10 - బాలుడి వెలికి తీత 6.30 - వాలాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు 6.45 - బాలుడు కన్నుమూసినట్లు అధికారుల ప్రకటన -
బోరు బావిలో బాలుడు
వెల్లోర్(తమిళనాడు): రెండున్నరేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అతడిని ప్రాణాలతో రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, సంబంధిత సిబ్బంది కఠోర శ్రమపడుతున్నారు. వెల్లోర్ జిల్లాలోని కూరంపడి అనే గ్రామంలో 250 మీటర్ల లోతుతో బోరు బావి వేసి అది ఎండిపోవడంతో ఎలాంటి మూతవేయకుండా వదిలేశారు. ఆదివారం ఉదయం ఆడుకుంటూ వెళ్లిన రెండున్నారేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. 20 మీటర్ల లోతులో బాలుడు ఇరుక్కు పోయినట్లు గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అతడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
బోరుబావిలో పడిన అరేళ్ల చిన్నారి క్షేమం
-
బోరుబావిలో పడిన ఏడాది చిన్నారి
రంగారెడ్డి జిల్లాలో ఓ బాలిక పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. లోక్యా నాయక్ అనే రైతుకు చెందిన పొలంలో ఈ బాలిక పడిపోయింది. గండేడు మండలం గోవింద్‌పల్లి తండాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలిక సాయంత్రం 6 గంటల సమయంలో ఆడుకుంటూ పడిపోయింది. సొంత పొలానికి పక్కనే ఉన్న మరో పొలంలో ఉన్న బావిలో బాలిక పడిపోయింది. 14 అడుగుల లోతులో బాలిక ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జేసీబీని తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు 108 వాహనాలను రప్పించారు. మండల కేంద్రానికి ఈ తండా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాంతో ఆసల్యం కాకుండా ఉండేందుకు ముందే పిలిపిస్తున్నారు. పాపను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆగిన శ్వాస.. ఆవిరైన ఆశ
చిన్నారి గిరిజ బతికొస్తుందనుకున్నవారికి నిరాశే మిగిలింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. గిరిజ మృత్యువాత పడిందన్న వార్త ఆమె కుటుంబీకులనే కాదు.. మూడు రోజులుగా ఎదురు చూస్తున్న లక్షలాది మందిని తీవ్ర విషాదంలో ముంచింది. ఆదివారం ఉదయం బోరుబావిలో పడి మృతి చెందిన చిన్నారి గిరిజను అధికారులు మంగళవారం రాత్రి 8:15కు బయటకు తీశారు. 56 గంటలపాటు శ్రమించిన యంత్రాం గం.. 45 అడుగుల లోతులో కూరుకుపోయిన గిరిజ మృతదేహాన్ని ఎట్టకేలకు బయటకు తీసుకురాగలిగింది. కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎంవీ రెడ్డిలతోపాటు మంత్రి మహేందర్‌రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. గిరిజ అంత్యక్రియలు మంగళవారం రాత్రి 9.30కు ఆమె స్వగ్రామమైన ఎంపీపటేల్‌గూడలో నిర్వహించారు. ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకున్న ఆమె తల్లి సునీత సమాధి పక్కనే గిరిజ భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఇబ్రహీంపట్నం/ మంచాల: భయపడినంత దారుణం జరిగిపోయింది. నిర్లక్ష్యం చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. నీళ్లు పడకపోవడంతో పూడ్చకుండా వదిలేసిన బోరుబావి ఐదేళ్ల చిన్నారి గిరిజ పాలిట మృత్యుకుహరంగా మారింది.. బోరుబావిలో పడిపోయిన గిరిజను రక్షించేం దుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యా యి. దాదాపు 56 గంటలపాటు కొనసాగిన సుధీర్ఘ శ్రమ అనంతరం గిరిజ బోరుబావిలోనే తుదిశ్వాస విడిచిందన్న సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల తరువాత అధికారికంగా ధృవీకరించారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చివరకు విషాదంగానే ముగిసింది. ఫలించని అధికారుల ప్రయత్నాలు.. చిన్నారి గిరిజను ప్రాణాలతో సురక్షితంగా కాపాడేందుకు జిల్లా అధికార యంత్రాంగం చివరి దాకా చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. చిన్నారి గిరిజ బోరుబావిలో పడిం దన్న సమాచారం తెలిసిన వెంటనే.. అధికార యంత్రాంగం మొత్తం మంచాల గ్రామానికి కదిలింది. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడేం దుకు సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నాలు కొనసాగాయి. విధి వక్రీకరించింది.. మానవ ప్రయత్నాలేవి ఫలించలేదు.. గిరిజను కాపాడే అన్ని ప్రయత్నాలు.. గిరిజ ప్రాణాలపై ఆమె బంధువులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యే విధంగా ఫలితం వచ్చింది. ప్రాణాపాయం నుంచి బయటపడుతుందని భావించిన చిన్నారి గిరిజ.. విగతజీవిగా బోరుబావిలోంచి బయటపడుతుందన్న చేదు నిజం చిన్నారి బంధువులతోపాటు అధికార యంత్రాంగాన్ని కూడా విషాదంలోకి నెట్టింది. గిరిజ బోరుబావిలో పడిపోయిందన్న సమాచారం తెలిసినప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన ఆమె అమ్మమ్మ అయిలమ్మ, తండ్రి అయిలయ్య ఇతర బంధువులు మరింత కుంగిపోయారు. నిద్రాహారాలు మాని.. బోరుబావిలో పడిపోయిన చిన్నారి గిరిజను ప్రాణాలతో కాపాడేందుకు ఉన్నతాధికారులు నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంవీ.రెడ్డి కనబర్చిన శ్రద్ధ ఇతర ఉద్యోగలకు ఆదర్శంగా నిలి చింది. దాదాపు రెండు రోజుల పాటు జేసీ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రెస్క్యూటీంకు అందుబాటులో ఉన్నారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మం చిరెడ్డి కిషన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అడుగడుగునా ఆటంకాలే.. బోరుబావిలో ఉన్న గిరిజ పరిస్థితిని తెలుసుకునేందుకు దాదాపు రెండు రోజుల పాటుగా ఉత్కంఠ తప్పలేదు. బోరుబావిలో ఉన్న గిరిజ ను సురక్షితంగా కాపాడేందుకు చేపట్టిన తవ్వకాల్లో అడుగడునా ఆటంకాలే ఎదురయ్యాయి. దాదాపు 45 అడుగుల లోతులో గిరిజ పడిపోయిందని ధృవీకరించుకుని ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ సోమవారం ఉదయం వరకే కొలిక్కి వస్తుందని అందరూ భావించారు. 35 అడుగుల మేరకు తవ్వకాలు జరిపిన తరువాత బండరాయి అడ్డురావడంతో తవ్వకాలకు అం తరాయం ఏర్పడింది. 50 అడుగులకంటే అధికంగా సమాంతర తవ్వకాలు చేపడితే గిరిజను బయటకు తీయవచ్చని నిర్ధారణకు వచ్చి తవ్వకాలను ప్రారంభించిన రెస్క్యూటీంకు 41 అడుగుల తవ్వకాల అనంతరం మళ్లీ బండరాయి అడ్డుతగలడంతో మరో రెండు గంటల్లో పని పూర్తవుతుందనుకుంటున్న తరుణంలో మరిం త జాప్యం ఏర్పడింది. -
విశ్వ ప్రయత్నం...
చిన్నారి గిరిజ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అభంశుభం తెలియని ఆ చిట్టితల్లి ప్రాణాలతో బయటపడాలని అందరూ కోరుకుంటున్నా.. రెస్య్కూ ఆపరేషన్ ఆలస్యమవుతున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. మంచాల సమీపంలో ఆదివారం ఉదయం గిరిజ అనే చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలిక కోసం బంధువులు రెండు రోజులుగా అన్నపానీయాలు మాని ఘటనా స్థలంలోనే గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాం గం చిన్నారిని వెలికి తీసేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. సింగరేణి నుంచి వచ్చిన టీంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తవ్వకాల్లో పెద్ద బండరాళ్లు బయల్పడుతుండడంతో అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. కలెక్టర్ శ్రీధర్ రెండు రోజులుగా ఘటనా స్థలంలోనే ఉండి పనులను సమీక్షిస్తున్నారు. బాలిక కోసం కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్ * బోరుబావిలోనే చిన్నారి గిరిజ.. * ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు * పర్యవేక్షించిన కలెక్టర్, ఎమ్మెల్యే * వివరాలు సేకరించిన ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం/మంచాల: చిన్నారి గిరిజను బోరుబావిలోంచి వెలికితీసేందుకు యంత్రాంగం సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం ఉద యం 10:30 గంటల సమయంలో మంచాలకు చెందిన చిన్నారి గిరిజ(4) పొలం వద్ద తన అన్న చరణ్‌తో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తెరిచిఉన్న బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకున్న యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆదివా రం రాత్రి జేసీబీ, హిటాచీలతో బోరుబావికి సమాంతరంగా గుంతలు తవ్వినా ఫలితం లేకుండా పోయింది. సహాయక చర్యలకు ఆటంకం... బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్న భూమి గట్టిగా ఉండడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మొదటగా చిన్నారి దాదాపు 35 అడుగుల లోతులో ఉందని గమనించిన అధికారులు ఆదిశగా తవ్వకాలను ప్రారంభించారు. 40 అడుగులు దాటిన తర్వాత రాయి రావడంతో తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. యంత్రాంగం రాయిని డ్రిల్‌చేసి ముందకు కొనసాగారు. అధికారుల దృఢ సంకల్పం.. చిన్నారి గిరిజను ఎలాగైనా కాపాడాలనే కృతనిశ్చయంతో యంత్రాంగం ముందుకు సాగుతోంది. చిన్నారి శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది నిరంతరం గొట్టాల ద్వారా ఆక్సీజన్ అందిస్తూనే ఉంది. బంధువుల జాగారం.. బోరుబావిలో పడిపోయిన తమ చిన్నారి ఎలాగైనా ప్రాణాలతో బయటపడుతుందని బంధువులు, కుటుంబీకులు కొండంత నమ్మకంతో ఉన్నారు. ఆదివారం ఉదయం ఘటన జరిగినప్పటి నుంచి వారు అక్కడే ఉన్నారు. నిద్ర, తిండీతిప్పలు లేకుండా బోరుబావి వద్దే జాగారం చేస్తున్నారు. బాలిక అమ్మమ్మ ఐల మ్మ, తండ్రి ఐలయ్యలు రోదిస్తూనే ఉన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సహాయక చర్యలను పరిశీలించారు. మంచాల గ్రామానికి చెందిన కోట్ల సుధీర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి భోజనవసతి ఏర్పాటు చేసి ఔదార్యం చాటుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఎన్డీ ఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగింది. అదే రాత్రి మైన్స్ రెస్క్యూ టీం కూడా వచ్చింది. సోమవారం సాయంత్రం 4:20 గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్, మైన్స్ రెస్క్యూ టీంలు బోరుబావికి అడ్డంగా ప్లేటు వేయాడానికి తవ్వకాలు ప్రారంభించారు. పలు ఆటంకాలు ఎదురైనా అధికారులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. సోమవారం రాత్రి లైటింగ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక వెళ్లిపోయిన కలెక్టర్ శ్రీధర్ తిరిగి సోమవారం ఉదయం 11:45 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. జేసీ ఎంవీ రెడ్డితో పాటు జిల్లా యంత్రాంగం అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వచ్చారు. పనులు వేగవంతం చేయాలని ఆయన యంత్రాగాన్ని కోరారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్తుండగా ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడుతుండ గా పక్కన ఉన్న వాళ్లు ఆయనను పట్టుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంజర్ల శేఖర్‌రెడ్డి సాయంత్రం బోరుబావి వద్దకు వచ్చారు. వేలాదిమంది ప్రజలు ఘటనా స్థలంలో చిన్నారి రాకకోసం నిరీక్షిస్తున్నారు. వివరాలు సేకరించిన ఎంపీ ఆదివారం రాత్రి 10 గంటలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి గిరిజ కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు. బాలికను సురక్షితంగా వెలికితీసే వరకు యంత్రాంగం, నాయకులు కృషిచేస్తారని ఆయన భరోసా కల్పించారు. క్షణక్షణం ఉత్కంఠ.. ఆదిబట్ల: చిన్నారి ఆచూకీ కోసం క్షణక్షణం ఉత్కంఠ సాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా జనం పోగయ్యారు. జనం కిక్కిరిసిపోవడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచాల మండలంలో ఎవరిని కదిలించినా చిన్నారి బోరుబావిలో పడిన విషయమే మాట్లాడుతున్నారు. -
అనుమతి లేకుండా బోరుబావి తవ్వితే ఏడేళ్ల జైలు
చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బోరుబావులు తవ్వితే ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా అసెంబ్లీలో సోమవారం ముసాయిదా ప్రవేశపెట్టారు. సాగునీటి కోసం విచ్చలవిడిగా బోరుబావులు తవ్వడం ఎక్కవైపోయింది. చిన్నారులు వాటిల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోవడం తరచూ జరుగుతోంది. ఈ ప్రమాదాలను నివారించేలా చట్టంలో మార్పులను తీసుకువస్తున్నారు. అనుమతి తీసుకోకుండా బోరును తవ్విన యజమానికి 3 నుంచి 7 ఏడేళ్ల వరకు కారాగార శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధించేలా ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. -
చిన్నారిని కబళించిన బోరుబావి
డక్కిలి : అప్పటి వరకు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి శశిరేఖ అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. పిల్లలతో కలిసి ఎక్కడోదగ్గర ఆడుకుంటూ ఉంటుందిలే అనుకున్నారు తల్లిదండ్రులు. చీకటిపడిన తర్వాత కూడా రాకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. గ్రామంలోని అన్ని చోట్ల, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికారు. ఎవరిని ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయినా ఎక్కడో చోట క్షేమంగా ఉంటుందనే ఆశతో రెండో రోజూ గాలింపు కొనసాగించారు. ఇంతలో వారి చెవిన పిడుగులాంటి వార్త ఒకటిపడింది. పొలంలోకి తాటిపండు కోసం వెళ్లగా పాప బోరుబావిలో పడిందని ఓ బాలుడు చెప్పడంతో గుండె ఆగినంత పనయిపోయింది. అయినా బిడ్డ బతికుండాలనుకుంటూ దేవుళ్లందరికీ మొక్కు తూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో చిన్నారి మృతదేహమై బయటకు రావడంతో తల్లిదండ్రులతో పాటు డక్కిలి మండలంలోని కుప్పాయిపాళెం వాసులూ విషాదంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన నావూరు పెంచలనరసయ్య, శ్రీలక్ష్మిల కుమార్తె శశిరేఖ(4). ఆదివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఈ చిన్నా రి బోరుబావిలో విగతజీవిగా మారింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు సోమవారం రాత్రి 7 గంటల సమయంలో బయటకు తీశారు. వెలుగులోకి వచ్చిందిలా.. ఆదివారం మధ్యాహ్నం నుంచి శశిరేఖ ఆచూకీ కోసం తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు గాలిస్తున్నారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గ్రామానికే చెందిన తిరుమల అనే మతిస్థిమితం లేని బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శశిరేఖ బోరుబావిలో పడిన విషయాన్ని పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో తిరుమల వెల్లడించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పొలంలోకి వెళ్లి చూడగా బోరుబావికి రాయి అడ్డుగా పెట్టివుండడం గమనించారు. బాలికను ఎవరైనా బోరులో పడేసి ఉంటారనే అనుమానంతో పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. వెంకటగిరి సీఐ నరసింహరావు, డక్కిలి ఎస్సై జిలాని, రెవిన్యూ శాఖ సిబ్బంది మూడు జేసీబీలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోరుబావిలో నుంచి చిన్నారిని వెలికితీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించా రు. అయితే అగ్నిమాపక సిబ్బంది తమ వద్ద ఉ న్న గేలం లాంటి పరికరాన్ని బోరుబావిలోకి వ దలగా 10 అడుగుల లోతులోనే చిక్కుకుని మృతిచెందిన శశిరేఖ ఆచూకీ తెలిసింది. వెంటనే గేలం సాయంతోనే పాప మృతదేహాన్ని వెలికితీశారు. రైతు నిర్లక్ష్యమే కారణం.. రైతు నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్తులు ఆరోపించారు. కుప్పాయిపాళేనికి చెందిన రైతు మందాటి కేశవులు తన పొలంలో బోరు వేశాడు. నీరు పడలేదనే ఉద్దేశంతో బావికి ఏర్పాటు చేసిన కేసింగ్ పైపును అలాగే వదిలేశాడు. బావిని పూడ్చకపోవడంతో పాటు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో నీళ్లు పడకపోతే బోరుబావులను వెంటనే పూడ్చివేస్తారు.అయితే కేశవులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే శశిరేఖ బోరుబావిలో పడి మృతిచెందిందని అధికారులకు గ్రామస్తులు వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని గూడూరు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. బోర్లు వేసుకునే రైతులు తప్పనిసరిగా అధికారుల అనుమతి పొందాల్సిదేనని ఆయన స్పష్టం చేశారు. రైతు కేశవులుపై కేసు నమోదు చేశామని ఎస్సై జిలాని తెలిపారు. -
బోరుబావిలో బాలుడు!
అదే నిర్లక్ష్యం... ‘అక్షిత’ సంఘటన మరువక ముందే మరో ఘటన బాలుడిని రక్షించేందుకు ముమ్మర యత్నాలు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం 150 అడుగుల లోతులో బాలుడు బాగల్‌కోటే జిల్లా బాదామి తాలూకాలో ఘటన సాక్షి, బెంగళూరు : రెండు నెలల క్రితం బీజాపూర్ జిల్లాలో బోరు బావిలో పడి మృతి చెందిన అక్షిత సంఘటన మరువక ముందే బాగల్కోటె జిల్లా బాదామిలో మరో బాలుడు బోరుబావిలో పడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు....బాగల్‌కోటే జిల్లా బాదామి తాలూకా సూళికెరెకు చెందిన సంగవ్వ, హనుమంతహట్టిలు పదిహేను రోజుల క్రితం తమ పొలంలో మూడు వందల అడుగుల లోతు వరకూ బోరు వేశారు. అయినా నీళ్లు పడలేదు. దీంతో ఆ బోరును అలాగే వదిలివేసి పైన ఎండిపోయిన కొబ్బరి ఆకులను కప్పారు. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం హనుమంతహట్టి తన ఆరేళ్ల కుమారుడైన తిమ్మణ్ణను తీసుకుని పొలానికి వెళ్లారు. హనుమంతహట్టి కుమారుడిని ఒంటరిగా వదిలి పొలంలో పనిచేసుకుంటుండగా తిమ్మణ్ణ ఆడుకుంటూ పట్టుజారి బోరుబావిలోకి పడిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్థానిక అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు బోరుబావిలో సుమారు నూట యాభై అడుగుల లోతున ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా జేసీబీల సహాయంతో బోరు బావికి సమాంతరంగా పది అడుగుల దూరంలో సొరంగమార్గాన్ని తవ్వి బాలున్ని బయటికి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా అధికారుల కోరిక మేరకు మండ్య జిల్లా కొమ్మనహళ్లికి చెందిన మంజేగౌడ అనే రైతు తానే స్వయంగా తయారు చేసిన ‘జీవరక్షక’ అనే యంత్రం ద్వారా తిమ్మణ్ణను రక్షించడానికి సూళికెరెకు బయలు దేరారు. విషయం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌశిక్ముఖర్జీతో సమీక్ష జరిపి అవసరమైతే నిపుణులను ప్రత్యేక విమానం ద్వారా సంఘటనా స్థలానికి సాధ్యమైనంత త్వరగా చేర్చి బాలున్ని రక్షించాలని ఆదేశించారు. -
మృత్యుంజయుడు..
-
బోరుబావి నుంచి బాలుడ్ని రక్షించిన రోబో
చెన్నై: బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడ్ని రోబో పరికరం సాయంతో రక్షించారు. తమిళనాడు తిరునల్వేలి జిల్లా శంకరన్ కోరుుల్ సమీపంలోని కుత్తాలంపేరి గ్రామంలో ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. గణే షన్ అనే వ్యక్తి కుమారుడు హర్షన్(3)తో కలసి సోమవారం ఉదయం పొలానికి వెళుతుండగా బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. షాక్ నుంచి తేరుకున్న గణేషన్.. వెంటనే తనయుడికి ధైర్యాన్ని నూరిపోశాడు. ‘‘అక్కడే ఉండు.. ఆడుకుందాం... నేనూ లోపలికి వస్తున్నా..’’ అంటూ బాలుడిలో భయాన్ని తొలగించాడు. వెంటనే అధికారులకు సమాచారమందించడంతో ఘటనాస్థలికి అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. మదురైకు చెందిన మణిగండన్, రాజ్‌కుమార్, తిరునావుక్కరసు, వల్లరసుల నేతృత్వంలోని బృందం బోరుబావుల్లో పడిన పిల్లల్ని రక్షించేందుకు అత్యాధునిక పరికరాలతో కూడిన ప్రత్యేక రోబోను ఇటీవల తయారుచేసింది. ఈ బృందానికి అధికారులు సమాచారమిచ్చారు. మదురై నుంచి గంటన్నర వ్యవధిలో ఘటనాస్థలికి చేరిన బృందం రోబోను బోరుబావిలోకి చాకచక్యంగా పంపించింది. ఆ బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసింది.