
బోరు నుంచి తన్నుకొస్తున్న గ్యాస్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం
పశ్చిమగోదావరి, పెనుగొండ: ఆచంట మండలం ఆచంట వేమవరంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా బోరు నుంచి గ్యాస్ ఉబికి వచ్చి కలకలం రేపింది. భూ పొరల్లో నిక్షిప్తమైన గ్యాస్ జోరుగా ఉబికి రావడంతో ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైను పగిలిపోయిందంటూ ప్రజలు హడలిపోయారు. ఆచంట వేమవరానికి చెందిన బొక్క నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు గ్రామ శివారున 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలో నాగేశ్వరరావు కుమారుడు సత్యనారాయణ అయిదేళ్లు క్రితం సబ్‌మెర్సిబుల్ బోరు మంచినీటి కోసం ఏర్పాటు చేసుకున్నారు.
మరమ్మతులకు గురవడంతో వినియోగించడం నిలిపివేసారు. బుధవారం బోరుకు మరమ్మతులు చేయడానికి ప్రయత్నిస్తూ సబ్‌మెర్సిబుల్ మోటారు బయటకు తీస్తుండగా గ్యాస్ ఒక్కసారిగా తన్నుకొచ్చింది. సమీపంలోని నాలుగిళ్లువారు బయటకు పరుగులు తీసారు. సమాచారం తెలుసుకున్న పాలకొల్లు సీఐ డి వెంకటేశ్వరరావు, ఆచంట ఎస్సై రాజశేఖర్, తహసీల్దారు ఆర్‌వీ కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు,అగ్నిమాపక యంత్రాన్ని తీసుకువచ్చారు. సమీపంలోని ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి గ్యాస్ పైపు లైను ఏమీ లేదని, భూపొరల్లోని గ్యాస్ తన్నుకొస్తోందని నిర్ధారించారు. వీరితో పాటు నర్సాపురం, అమలాపురానికి చెందిన ఓఎన్‌జీసీ అధికారులు వచ్చి ప్రమాదం లేదని చెప్పడంతో పరిసర ప్రాంతాల వారు ఊపిరి పీల్చుకున్నారు. బోరు నుంచి విపరీతమైన శబ్ధాలు వెలువడుతుండడంతో స్థానికులు భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment