
బోరుబావిలో బాలుడు!
- అదే నిర్లక్ష్యం...
- ‘అక్షిత’ సంఘటన మరువక ముందే మరో ఘటన
- బాలుడిని రక్షించేందుకు ముమ్మర యత్నాలు
- సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
- 150 అడుగుల లోతులో బాలుడు
- బాగల్‌కోటే జిల్లా బాదామి తాలూకాలో ఘటన
సాక్షి, బెంగళూరు : రెండు నెలల క్రితం బీజాపూర్ జిల్లాలో బోరు బావిలో పడి మృతి చెందిన అక్షిత సంఘటన మరువక ముందే బాగల్‌కోటె జిల్లా బాదామిలో మరో బాలుడు బోరుబావిలో పడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు....బాగల్‌కోటే జిల్లా బాదామి తాలూకా సూళికెరెకు చెందిన సంగవ్వ, హనుమంతహట్టిలు పదిహేను రోజుల క్రితం తమ పొలంలో మూడు వందల అడుగుల లోతు వరకూ బోరు వేశారు. అయినా నీళ్లు పడలేదు. దీంతో ఆ బోరును అలాగే వదిలివేసి పైన ఎండిపోయిన కొబ్బరి ఆకులను కప్పారు.
ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం హనుమంతహట్టి తన ఆరేళ్ల కుమారుడైన తిమ్మణ్ణను తీసుకుని పొలానికి వెళ్లారు. హనుమంతహట్టి కుమారుడిని ఒంటరిగా వదిలి పొలంలో పనిచేసుకుంటుండగా తిమ్మణ్ణ ఆడుకుంటూ పట్టుజారి బోరుబావిలోకి పడిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్థానిక అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు బోరుబావిలో సుమారు నూట యాభై అడుగుల లోతున ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అదేవిధంగా జేసీబీల సహాయంతో బోరు బావికి సమాంతరంగా పది అడుగుల దూరంలో సొరంగమార్గాన్ని తవ్వి బాలున్ని బయటికి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా అధికారుల కోరిక మేరకు మండ్య జిల్లా కొమ్మనహళ్లికి చెందిన మంజేగౌడ అనే రైతు తానే స్వయంగా తయారు చేసిన ‘జీవరక్షక’ అనే యంత్రం ద్వారా తిమ్మణ్ణను రక్షించడానికి సూళికెరెకు బయలు దేరారు. విషయం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌశిక్‌ముఖర్జీతో సమీక్ష జరిపి అవసరమైతే నిపుణులను ప్రత్యేక విమానం ద్వారా సంఘటనా స్థలానికి సాధ్యమైనంత త్వరగా చేర్చి బాలున్ని రక్షించాలని ఆదేశించారు.