కొండాపూర్‌లో రోడ్డు వెంట పార్క్ చేసి ఉన్న ట్యాంకర్లు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ శివార్లలోని పలు ప్రాంతాల్లో బోరుబావులు చుక్కనీరు లేక బావురుమంటుండటంతో జలమండలి నల్లా నీళ్లు ఏమూలకూ సరిపోవడంలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్నీటి కష్టాలు నగరవాసికి పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. అపార్ట్‌మెంట్ వాసులు ఇంటి అద్దెలకు దాదాపు సమానమైన మొత్తాన్ని ట్యాంకర్ నీళ్ల కొనుగోలుకు వెచ్చించి జేబులు గుల్లచేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 460.88 మిలియన్‌గ్యాలన్ల కృష్ణా, గోదావరి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాలను సరఫరా చేసినా నీటి డిమాండ్ 560 మిలియన్ గ్యాలన్ల మేర ఉంది. సుమారు వంద ఎంజీడీల నీటికి కొరత ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో కన్నీటి కష్టాలు దర్శనమిస్తున్నాయి.
జలమండలి ప్రస్తుతం సరఫరా చేస్తున్న 460.88 మిలియన్ గ్యాలన్ల నీటిలోనూ 40 శాతం మేర సరఫరా, చౌర్యం తదితర నష్టాల కారణంగా వాస్తవ సరఫరా 276 మిలియన్‌గ్యాలన్లు మించడంలేదు. అంటే కోటికి పైగా జనాభాతో అలరారుతోన్న సిటీలో ప్రతీవ్యక్తికి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా. ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఇదే దుస్థితి. ప్రైవేటు ట్యాంకర్ నీళ్లు (ఐదు వేల లీటర్ల నీరు)కు ప్రాంతం, డిమాండ్‌ను బట్టి రూ.2–5 వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. పలు గేటెడ్‌కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల సముదాయాలున్న అపార్ట్‌మెంట్లలో ట్యాంకర్ నీళ్ల కొనుగోలుకు నెలకు లక్షల్లో వ్యయం చేస్తుండడం గమనార్హం.
శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో
ఏడాదిగా తీవ్ర వర్షాబావ పరిస్థితులు, జలమండలి అరకొరగా నీటిని సరఫరా చేస్తుండడంతో జనం బాధలు వర్ణనాతీతంగా మారాయి. వేలు చేల్లించినా ప్రైవేట్ నీటి ట్యాంకర్లు దొరకని దుస్థితి నెలకొంది. ఐటీ కారిడార్‌లో బస్తీలకు రెండు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లకు, వాణిజ్య నల్లా కనెక్షన్‌లకు భారీగా నీటి కోత విధిస్తున్నారు. దీంతో అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండే వారు ట్యాంకర్ నీళ్లకు వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాలలో 1500 అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు కనిపించడం లేదు. కొండాపూర్‌లోని గౌతమీ ఎన్‌క్లేవ్ ఇంకుడు గుంతలు ఎన్నో ఏర్పాటు చేశారు.
గత సంవత్సరం వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. గౌతమీ ఎన్‌క్లేవ్‌లో దాదాపు 60 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. రోజు 5000 లీటర్ల ట్యాంకర్లు 100కు పైగానే కొనుగోలుచేస్తున్నట్లు గౌతమీ ఎన్‌క్లేవ్ వెల్‌ఫేర్ అసిసియేషన్ అధ్యక్షులు యలమంచలి శ్రీధర్ తెలిపారు. 5000 లీటర్ల ట్యాంకర్‌కు 2 వేలపైనా, 10 వేల ట్యాంకర్‌కు 4వేలకు పైన వసూలు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో 5000 లీటర్ల ట్యాంకర్‌కు 3 వేలు, 10 వేల ట్యాంకర్‌కు 6 వేలు వసూలు చేస్తున్నారు. సీజన్‌లో రూ.600 ఉండే 500 లీటర్ల ట్యాంకర్ ఖరీదు రెండు వేలకు పైనే ఉందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
అరకొర నీటి సరఫరా
గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు వెయ్యి కుంటుంబాలు నివాసం ఉంటాయి. ప్రతి రోజు జలమండలి 1400 కేఎల్ నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఈ నెల 13న 407.59 కెఎల్, 14న 281.17 కెఎల్, 15న 140.23 కెఎల్, 16న 208.17 కెఎల్, 17న 80.26 కెఎల్, 18న 408.93 కెఎల్, 19న కేవలం 8.33కెఎల్ నీటిని సరఫరా చేసింది. అవసరం మేరకు నీటి సరఫరా సరగకపోవడంతో స్థానికులు జలమండలి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్‌లో అక్రమ నీటి వ్యాపారం నిర్వహిస్తున్న బోర్లను రెవెన్యూ అధికారులు సీజ్‌చేశారు. దీంతో పటాన్ చెరువు శివారు గ్రామాలు, శంకర్‌పల్లి మండలంలోని గ్రామాలు, తెల్లాపూర్ నుంచి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దూరం నుంచి రావడంతో ఖర్చు పెరుగుతోందని ట్యాంకర్ నిర్వాహకులు చెబుతున్నారు.
కూకట్‌పల్లి ప్రాంతంలో..
కూకట్‌పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో రెండు ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీలలో ఇదే దుస్థితి నెలకొంది. కేపీహెచ్‌బీకాలనీలోని మలేషియాటౌన్‌షిప్‌లో తీవ్ర నీటి ఎద్దడి. ఈ ఏడాది మార్చి–జూన్ వరకు జలమండలికి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించినప్పటికీ సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్చినెలలోనే జలమండలికి తాగునీటి కోసం 6.7లక్షలు బిల్లు రూపంలో చెల్లించగా, బయటి నుంచి సుమారు 285 ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసినందుకు రూ.5.8లక్షలు చెల్లించినట్లు స్థానికులు తెలిపారు.
నీటి సరఫరాలో విఫలం
15 రోజులకోసారి నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. 40 ఫ్లాట్లు ఉన్న మా అపార్ట్‌మెంట్‌కు నెలకు 436కెఎల్ సరఫరా చేయాల్సి ఉండగా 100 కెఎల్ కూడా సరఫరా చేయడం లేదు. బోర్లన్నీ ఎండిపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అత్యవసర సమయంలో ట్యాంకర్ యజమానులు డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారు.
– కిరణ్, ప్రీస్టైన్ అపార్ట్‌మెంట్ గౌతమి ఎన్‌క్లేవ్
జలమండలి నీరు 60శాతం తగ్గకుండా సరఫరా చేయాలి
జలమండలితో తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోయినా కనీసం 60శాతానికి తగ్గకుండా సరఫరా చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా కేవలం 30 నుంచి 40శాతం నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో మేము లక్షలు వెచ్చించి బయటి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలుచేయాల్సిన దుస్తితి తలెత్తింది.
– శ్రీకాంత్‌రెడ్డి, ఇందూ ఫార్చ్యూన్‌ఫీల్డ్స్ గార్డెనీయా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment