- మంచినీటి బోరుమోటార్‌తో వ్యవసాయానికి వాడకం
- గుక్కెడు నీటికోసం తండావాసుల తంటాలు
మెదక్ రూరల్: ఓ గిరిజన తండాలో తాగునీటి అవసరాల కోసం బోరుబావిలో వేసిన మోటార్‌ను అదే తండాకు చెందిన ఓ వ్యక్తి తీసుకవెళ్లి తన వ్యవసాయ బోరుబావికి వేసుకోవడంతో గుక్కెడు నీటికోసం తండావాసులు తల్లడిల్లుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండలం చిట్యాల పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాలో గిరిజనుల తాగునీటికోసం ట్యాంకును నిర్మించారు.
దానికోసం బోరుబావిని తవ్వి నీటిని మళ్లిస్తున్నారు. కాగా బోరు బావిలో కొంత కాలంగా నీటి ఊటలు తగ్గిపోవటంతో తండావాసులకు తాగు నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో అధికారులు కొంత కాలం క్రితం తండాలో మరోబోరు బావి తవ్వారు అందులో పుష్కలంగా నీరు వచ్చింది. దీంతో సింగిల్ ఫేజ్ మోటారును అమర్చారు. దీంతో తండాకు నీటి కష్టాల తప్పాయి. కాగా ఇటీవల తండాకు చెందిన ఓ వ్యక్తి ఆ బోరుబావిలోని మోటార్‌ను తీసుకవెళ్లి తన పొలంలోని బోరుబావిలో దింపి పొలానికి నీటిని పెట్టుకుంటున్నాడని తండాకు చెందిన పలువురు గిరిజనులు వాపోయారు. దీంతో తండాలో నీటికష్టాలు మళ్లీ ప్రారంభం కావటంతో తండావాసులు ఇబ్బందులు పడుతున్నారు.
అసలే వేసవి కాలం కావటంతో తండాలో తాగునీటికోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా బోరుమోటార్‌ను తొలగించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని బోరుబావిలో మోటారు దింపి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని తండా వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
తాగునీటి కోసం తండ్లాట..!
Published Mon, May 4 2015 2:12 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement