పట్టణాల్లో నీటి సమస్యపై ప్రభుత్వం తర్జన భర్జన
తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్లు, మునిసిపల్ అధికారులకు ఆదేశాలు
పర్యవేక్షణకు జిల్లాల వారీగా ఐఏఎస్‌ల నియామకం
రెండునెలలపాటు అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశాలు
హైదరాబాద్, శివారు ప్రాంతాలకు నీటి సమస్య లేదని అంచనా
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్ , పక్కనుంచే ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలు పోతున్నా ఈ మునిసిపాలిటీకి సరైన నీటి సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా రావడం లేదు.
‘జగిత్యాల జిల్లా రాయికల్ మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీరు ఉన్నప్పటికీ మూడు వార్డులకు సరిపడా నీళ్లను మునిసిపాలిటీ వాళ్లు అందించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వార్డులోనే ఓ బావి తవ్వించి ఆ నీటిని మిషన్‌భగీరథ కోసం కట్టిన ట్యాంకుల్లోకి పంపించి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు’
‘కరీంనగర్ కార్పొరేషన్‌లో గతంలో ప్రతిరోజూ ఇంటింటికీ తాగునీటిని అందించగా, తగ్గుతున్న దిగువ మానేరు నీటిమట్టంతో ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరపడమే కష్టంగా మారిందని మునిసిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగజ్‌నగర్ మునిసిపాలిటీలో కరెంటు సమస్య కారణంగా అధికారులు ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతున్నారు’
మంగళవారం సీడీఎంఏ కార్యాలయంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై జరిగిన అధికారుల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో కొన్ని ఇవి. జలాశయాల్లో సరిపడినంతగా నీటి నిల్వలు లేకపోవడం, పెరిగిన సూర్యతాపానికి జలాశయాల్లోని నీరు కూడా క్రమంగా తగ్గుతుందనే భయంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రాష్ట్రంలో నీటి సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీడీఎంఏ దివ్య 140 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల నియామకం
రాష్ట్రంలో మునిసిపాలిటీలతో పాటు గ్రామాల్లో నీటి నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నీటి అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను విభజించి, పది మంది ఐఏఎస్ అధికారులను ఇన్‌చార్జులుగా నియమించారు. రానున్న రెండు నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే...
ఆదిలాబాద్, నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్ , కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య , కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు – ఆర్ వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి – శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజ్‌గిరి – విజయేంద్ర , మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ – శృతి ఓజా, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట – భారతి కొలిగేరి , ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం– సురేంద్రమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది లేదనే అంచనా
హైదరాబాద్, శివారు ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు జలాశయాలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి కూడా హైదరాబాద్ వాటర్‌బోర్డు తీసుకుంటోంది. జలాశయాల నుంచి ప్రతిరోజూ 2,559 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) నీటిని హైదరాబాద్ నగర వాసుల కోసం వినియోగిస్తున్నారు.
ఇందులో జీహెచ్‌ఎంసీ కోర్‌సిటీకి (హైదరాబాద్ జిల్లా) 1082.62 ఎంఎల్‌డీ, శివారు సర్కిల్స్ (50 డివిజన్లు)కు 1,049. 58 ఎంఎల్‌డీ, ఓఆర్‌ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు 277.21 ఎంఎల్‌డీ, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్‌డీ నీటిని వినియోగిస్తున్నారు. సింగూరు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లలో అవసరమైన మేర నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 2,270 ఎంఎల్‌డీ నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేయగా, ప్రస్తుతం 2,409.53 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే 139.53 ఎల్‌ఎండీ అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది.
ట్యాంకర్ల డిమాండ్ అక్కడే
హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఉన్న మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 644 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, మంగళవారం 6,593 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేశాయి. భూగర్బ జలాలు తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని వాటర్‌బోర్డు చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment