కదిలిస్తే క‘న్నీరే’
జోగిపేట : అందోలు మండలం కొడెకల్ గ్రామస్తులను కదిలిస్తే కన్నీటి కథే.. గ్రామంలో మంచినీటి ఇబ్బందు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళితుల కాలనీలో కాలనీవారే చందాలు వేసుకొని బోరు వేసుకోగా, గ్రామానికి నీరందించేందుకు వ్యవసాయ బోరును రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన బోరు నుంచి ట్యాంకు ద్వారా మినీ ట్యాంకును నింపి నీటిని పంపిణీ చేస్తున్నారు. గ్రామంలోని రెండు వీధుల్లోని కుటుంబాలు విరాళాలు వేసుకొని సొంతగా నీటి సమస్యను పరిష్కరించుకుంటున్నాయి.
నీటి కోసం పుట్టెడు కష్టాల్లో ఉన్న గ్రామాన్ని ఆదుకోవాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అటువైపు కన్నెత్తయినా చూడడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరిని కదిలించిన బుక్కెడు అన్నం లేకున్నా సరే.. నీరు వచ్చేటట్లు చూడండంటూ ప్రాధేయపడుతున్నారు.
వ్యవసాయబోరు కొనుగోలు
గ్రామస్తులు నీటి ఎద్దడిని నివారించాలని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తామే రూ.1.50 లక్షలతో వ్యవసాయ బోరును కొనుగోలు చేశారు. గ్రామ పంచాయతీకి వివిధ పద్దుల కింద వచ్చిన నిధులతో గ్రామానికి 2.కి.మీ దూరంలో ఉన్న నారాయణకు చెందిన వ్యవసాయ బోరును కొనుగోలు చేశారు. అయితే పంచాయతీలో కేవలం రూ.70వేలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలోనే ట్రాక్టర్‌పై ట్యాంకర్ ద్వారా గ్రామంలోని మినీ ట్యాంకుల్లోకి చేరవేస్తున్నారు. అక్కడి నుంచి గ్రామస్తులు బిందెలతో పట్టుకెళుతున్నారు.
కన్నెత్తి చూడని అధికారులు
అందోలు మండలంలో కొడెకల్‌లో ఉన్న మంచినీటి ఎద్దడి ఏ గ్రామంలో లేదు. ఇన్ని ఇబ్బందులు ఏ గ్రామంలోనూ లేవు. కనీసం దగ్గరలోని వ్యవసాయ బోరుబావిలో నుంచి తెచ్చుకుందామనుకున్నా ఆ పరిస్థితిలేదు. గత్యంతరం లేక సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలంతా చర్చించుకొని సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావిని కొనుగోలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
పశువులకు ట్యాంకరు నీరే...
గ్రామంలో ఉన్న పశువులకు నీటి కోరత తీవ్రంగా ఏర్పడింది. ఎక్కడా వాటికి నీటి వసతిలేకపోవడంతో ప్రజలకు పంపిణీ చేసే ట్యాంకర్ ద్వారా తీసుకువచ్చిన మంచి నీటిని నీటి తొటెల్లో పోస్తున్నారు. పశువులను అక్కడికి తీసుకువచ్చి నీటిని తాగిస్తున్నారు.
ఇంత కరువు ఎన్నడూ చూడలే..
నేను పుట్టినప్పటి నుంచి నీటి కరువును ఇంతగా చూడలేదు. తినడానికి తిండి లేకున్నా మంచినీళ్లు మాత్రం తప్పనిసరిగా కావాలి. ప్రభుత్వం వాగులో బోర్లు వేసి పైపులైన్ ద్వారా గ్రామానికి నీటిని అందించాలి.
- సామెల్, కొడెకల్ వాసి
చందాలువేసి బోరు వేయించుకున్నాం
గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎస్సీ వాడకు చెందిన 20 కుటుంబాలకు చెందిన మేము ఇంటికి రెండు వేలు వేసుకొని బోరు వేయించుకున్నాం. అయినా బోరు నుంచి సరిగా నీరు రావడంలేదు. గ్యాప్ ఇచ్చుకుంటూ నీళ్లు వస్తున్నాయి.
- సాయమ్మ, కొడెకల్ గ్రామ మహిళ
రూ.150 లక్షలతో బోరు కొనుగోలు చేశాం
గ్రామంలో మంచినీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని రెండు బోర్లు వేయించగా ఫెయిలయ్యాయి. తప్పనిసరి పరిస్థితిలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయబోరును రూ.1.50 లక్షలకు పాలకవర్గ సభ్యుల అనుమతితో కొనుగోలు చేశాం. బోరు వద్ద నుంచి ట్యాంకర్ ద్వారా నీటిని గ్రామంలోని మినీ ట్యాంకులకు చేరవేస్తున్నాం.
- రజిత శ్రీనివాస్‌రెడ్డి, గ్రామసర్పంచ్, కొడెకల్