rws officials
-
రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో భాగస్వామ్యం పెంచండి
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో స్థానికుల భాగస్వామ్యం పెరిగినప్పుడే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తాగునీటి సరఫరాకు అవకాశం ఉంటుందని గ్రామీణ మంచినీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) ఉన్నతాధికారులు పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్డబ్ల్యూఎస్, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాల అధికారులు, ఎన్జీవో ప్రతినిధులతో రెండు రోజుల వర్క్‌షాప్ విజయవాడలో ప్రారంభమైంది. ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి, జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరేరామ్ నాయక్, సీఈలు గాయత్రిదేవి, సంజీవరెడ్డి, రవికుమార్ అధికారులు, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఎన్జీవో ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు 40 ఎన్జీవో సంస్థలకు చెందిన 600 మంది ప్రతినిధులకు బాధ్యత అప్పగించింది. -
పాతికేళ్ల అనుబంధానికి తెర
పలాస: రెండు దశాబ్దాలుగా పలాస కేంద్రంగా ఉన్న పలాస గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ డివిజన్ కేంద్రం ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో అనకాపల్లికి తరలి వెళ్లిపోయింది. దీని పరిధిలోని ప్రాజెక్టులను శ్రీకాకుళం డివిజన్లో విలీనం చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఈఈతో సహా మొత్తం 28 ఏఈలు, డీఈలు, ఇతర సిబ్బంది కూడా బదిలీ అయ్యారు. దీంతో సుమారు 25 ఏళ్ల అనుబంధానికి తెరపడినట్లయ్యింది. ఈ మేరకు అమరావతి ఇంజినీరింగ్ చీఫ్ నుంచి ఈ నెల 6న ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. విభజనే కారణం.. పలాస డివిజన్ కేంద్రం 1997లో ఏర్పాటైంది. దీని పరిధిలో నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలోని మొత్తం 20 మండలాలు ఉన్నాయి. ప్రధానమైన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టుతో పాటు సుమారు 807 గ్రామాలు ఈ కేంద్రం పరిధిలో ఉన్నాయి. ఉద్దాన ప్రాంత ప్రజలకు శుద్ధజలం అందించేందుకు సుమారు రూ.700 కోట్ల భారీ ఖర్చుతో మెగా ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. డీపీ, పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్‌ల ద్వారా మరో 2వేల గ్రామాలకు నీరు సరఫరా అవుతోంది. సీపీడబ్ల్యూఎస్ పథకాలు మరో 25 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ శ్రీకాకుళం డివిజన్ కేంద్రం పరిధిలోకి వెళ్లాయి. శ్రీకాకుళం డివిజన్ కేంద్రలో 18 మండలాలు ఉండేవి. అందులో పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనమయ్యాయి. రాజాం నియోజకవర్గంలోని రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి మండలాలు విజయనగరం జిల్లాలో విలీనమయ్యాయి. దీంతో 38 మండలాలతో ఉన్న ఈ రెండు డివిజన్ కేంద్రాలకు బదులు ప్రస్తుతం 30 మండలాలతో కేవలం శ్రీకాకుళం డివిజన్ కేంద్రంగానే ఉండబోతుందని ప్రస్తుత శ్రీకాకుళం ఈఈ రామకృష్ణ చెప్పారు. ప్రస్తుతం పలాసలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను జిల్లా పరిషత్‌కు బదిలీ చేశారు. ఈఈతో పాటు ఆరుగురు ఇంజినీర్లను అనకాపల్లికి బదిలీ చేశారు. మిగతా వారిని ఎస్సీ ఆఫీసుకు సరెండర్ చేశారు. పలాసలో ఉన్న ప్రస్తుత డివిజన్ కేంద్రం గతంలో ఉద్దానం ప్రాజెక్టు పరిధిలో ఉండేది. ఇక్కడి నుంచే ఉద్దానం ప్రాజెక్టు అధికారులు విధులు నిర్వర్తించేవారు. మళ్లీ వారి చేతుల్లోకి ఈ కార్యాలయం వెళ్లబోతుందని ఇక్కడ తాత్కాలికంగా పనిచేస్తున్న ఈఈ పి.పి సూర్యనారాయణ చెప్పారు. -
కదిలిస్తే క‘న్నీరే’
జోగిపేట : అందోలు మండలం కొడెకల్ గ్రామస్తులను కదిలిస్తే కన్నీటి కథే.. గ్రామంలో మంచినీటి ఇబ్బందు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళితుల కాలనీలో కాలనీవారే చందాలు వేసుకొని బోరు వేసుకోగా, గ్రామానికి నీరందించేందుకు వ్యవసాయ బోరును రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన బోరు నుంచి ట్యాంకు ద్వారా మినీ ట్యాంకును నింపి నీటిని పంపిణీ చేస్తున్నారు. గ్రామంలోని రెండు వీధుల్లోని కుటుంబాలు విరాళాలు వేసుకొని సొంతగా నీటి సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. నీటి కోసం పుట్టెడు కష్టాల్లో ఉన్న గ్రామాన్ని ఆదుకోవాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అటువైపు కన్నెత్తయినా చూడడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరిని కదిలించిన బుక్కెడు అన్నం లేకున్నా సరే.. నీరు వచ్చేటట్లు చూడండంటూ ప్రాధేయపడుతున్నారు. వ్యవసాయబోరు కొనుగోలు గ్రామస్తులు నీటి ఎద్దడిని నివారించాలని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తామే రూ.1.50 లక్షలతో వ్యవసాయ బోరును కొనుగోలు చేశారు. గ్రామ పంచాయతీకి వివిధ పద్దుల కింద వచ్చిన నిధులతో గ్రామానికి 2.కి.మీ దూరంలో ఉన్న నారాయణకు చెందిన వ్యవసాయ బోరును కొనుగోలు చేశారు. అయితే పంచాయతీలో కేవలం రూ.70వేలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలోనే ట్రాక్టర్‌పై ట్యాంకర్ ద్వారా గ్రామంలోని మినీ ట్యాంకుల్లోకి చేరవేస్తున్నారు. అక్కడి నుంచి గ్రామస్తులు బిందెలతో పట్టుకెళుతున్నారు. కన్నెత్తి చూడని అధికారులు అందోలు మండలంలో కొడెకల్‌లో ఉన్న మంచినీటి ఎద్దడి ఏ గ్రామంలో లేదు. ఇన్ని ఇబ్బందులు ఏ గ్రామంలోనూ లేవు. కనీసం దగ్గరలోని వ్యవసాయ బోరుబావిలో నుంచి తెచ్చుకుందామనుకున్నా ఆ పరిస్థితిలేదు. గత్యంతరం లేక సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలంతా చర్చించుకొని సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావిని కొనుగోలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పశువులకు ట్యాంకరు నీరే... గ్రామంలో ఉన్న పశువులకు నీటి కోరత తీవ్రంగా ఏర్పడింది. ఎక్కడా వాటికి నీటి వసతిలేకపోవడంతో ప్రజలకు పంపిణీ చేసే ట్యాంకర్ ద్వారా తీసుకువచ్చిన మంచి నీటిని నీటి తొటెల్లో పోస్తున్నారు. పశువులను అక్కడికి తీసుకువచ్చి నీటిని తాగిస్తున్నారు. ఇంత కరువు ఎన్నడూ చూడలే.. నేను పుట్టినప్పటి నుంచి నీటి కరువును ఇంతగా చూడలేదు. తినడానికి తిండి లేకున్నా మంచినీళ్లు మాత్రం తప్పనిసరిగా కావాలి. ప్రభుత్వం వాగులో బోర్లు వేసి పైపులైన్ ద్వారా గ్రామానికి నీటిని అందించాలి. - సామెల్, కొడెకల్ వాసి చందాలువేసి బోరు వేయించుకున్నాం గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎస్సీ వాడకు చెందిన 20 కుటుంబాలకు చెందిన మేము ఇంటికి రెండు వేలు వేసుకొని బోరు వేయించుకున్నాం. అయినా బోరు నుంచి సరిగా నీరు రావడంలేదు. గ్యాప్ ఇచ్చుకుంటూ నీళ్లు వస్తున్నాయి. - సాయమ్మ, కొడెకల్ గ్రామ మహిళ రూ.150 లక్షలతో బోరు కొనుగోలు చేశాం గ్రామంలో మంచినీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని రెండు బోర్లు వేయించగా ఫెయిలయ్యాయి. తప్పనిసరి పరిస్థితిలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయబోరును రూ.1.50 లక్షలకు పాలకవర్గ సభ్యుల అనుమతితో కొనుగోలు చేశాం. బోరు వద్ద నుంచి ట్యాంకర్ ద్వారా నీటిని గ్రామంలోని మినీ ట్యాంకులకు చేరవేస్తున్నాం. - రజిత శ్రీనివాస్‌రెడ్డి, గ్రామసర్పంచ్, కొడెకల్ -
గడ్డుకాలం
చీమకుర్తి : వరుణుడు కరుణించి ఎడతెరిపి లేకుండా రెండు వారాల పాటు మహారాష్ట్ర, కర్నాటకలో భారీవర్షాలు కురిస్తే తప్ప రానున్న రోజులు రైతులకు గడ్డుకాలమే. తాగటానికి నీళ్లు అంతంత మాత్రమే కాగా వ్యవసాయానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించటం లేదు. రామతీర్థం రిజర్వాయర్, నాగార్జునసాగర్ డ్యామ్‌లోని నీటి నిల్వలే ఇందుకు తార్కాణం. చీమకుర్తి ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం...రామతీర్థం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 85.34 మీటర్లు (1.53 టీఎంసీలు) కాగా దాని డెడ్‌స్టోరేజీ 74.93 మీటర్లు(0.26 టీఎంసీ). ప్రస్తుతం రిజర్వాయర్‌లో కేవలం 75 మీటర్లు మాత్రమే సాగర్ జలాలున్నాయి. వారం రోజుల పాటు ఒంగోలు సమ్మర్ స్టోర్ ట్యాంక్‌లకు తాగునీరు ఇవ్వడం వలన దాదాపు వచ్చే సెప్టెంబర్ వరకు ఒంగోలుకు తాగునీటి అవసరం ఉండకపోవచ్చని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఒంగోలులోని రెండు సమ్మర్‌స్టోర్ ట్యాంక్‌లకు కలిపి 5,800 మిలియన్ లీటర్లు నీటి అవసరం కాగా వారం రోజులుగా 3 వేల మిలియన్ లీటర్ల నీటిని వదిలారు. ఇంకా నీటి అవసరం ఉన్నప్పటికీ రెండు నెలల పాటు సర్దుకుపోవడానికి అవకాశం ఉంది. అయితే జిల్లాలోని తాగునీటి చెరువులు, ఇతర ట్యాంక్‌లకు కలిపి 1.5 టీఎంసీల అవసరం ఉందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల జిల్లా ఉన్నతాధికారులకు ఇండెంట్ ఇచ్చారు. ఆ నీటిని సరఫరా చేసే పరిస్థితిలో చీమకుర్తి రామతీర్థం రిజర్వాయర్ లేదని స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం ఆదివారం నాటికి నీటిమట్టం 510.5 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాగర్‌లో అది డెడ్‌స్టోరేజీ మట్టం. కాబట్టి సాగర్ నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. కోర్టు ఉత్తర్వులో లేక సీఎంల స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్ప తాగునీటికి సాగర్ నుంచి వదలరు. రానున్న రోజుల్లో జిల్లాలో తాగునీటికి కష్టకాలం ఏర్పడే ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్న గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. తాగునీటికే అలా ఉంటే ఇక వ్యవసాయానికి నీటిని ఏమిస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమై రెండు నెలలైంది. వరినార్లు పోసుకునే గడువు రావడంతో రైతులు చెరువులు, రామతీర్ధం రిజర్వాయర్లు, కాలువల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. సాగునీటి కొరతతో రైతులు వరినార్లు పోసుకోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలనే సూచన ఉన్నతాధికారుల నుంచి చేయించేందుకు ఇరిగేషన్ అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఒత్తిడి మేరకు రేపో మాపో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలంటూ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మంచినీటి సమస్యకు ముందస్తు చర్యలు
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ ఇలంబరితి ఖమ్మం జెడ్పీసెంటర్ : వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తూ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజా‘ సమావేశ మందిరంలో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో మంచినీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ అందించాలన్నారు. వచ్చే నెల 6న మంచినీటి పథకాల నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలపై కూలంకషంగా చర్చించనున్నట్లు చెప్పారు. మంచినీటి పథకాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు గ్రామపంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయూలన్నారు. విధివిధానాల రూపకల్పనకు ముందుగా ఒక మండలాన్ని పెలైట్ యూనిట్‌గా తీసుకుని పంచాయతీల ద్వారా మంచినీటి పథకాల నిర్వహణ చేపట్టేందుకు తీసుకోవాల్సిన అంశాలపై నివేదికలు రూపొందించాలని సూచించారు. నీటి సమస్య ఉన్న గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీరు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యలను నివారించేందుకు సర్పంచ్,ఎంపీడీవో,ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. అధికారులు ప్రతిపాదనలు అందిస్తే మంచినీటి పథకాల నిర్వహణకు జడ్పీ ద్వారా నిధులు మంజూరు చేరుుస్తామన్నారు. పథకాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించి నివేదికలు తయూరు చేయూలని సీఈవోను ఆదేశించారు. బోరుబావుల తవ్వకాలకు వినియోగించిన నిధుల ఖర్చు, వాటి పనితీరు తదితరఅంశాలపై టాస్క్ ఫోర్సు ద్వారా తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో వినయ్‌కృష్ణారెడ్డి, ఖమ్మం ,కొత్తగూడెం కార్యనిర్వాహక ఇంజనీర్లు మల్లేష్‌గౌడ్,రాఘవులు, డీఈలు,ఏఈలు తదతరులు పాల్గొన్నారు. -
నిజాయితీతో పనిచేయాలి..
⇒ అధికారులు అప్రమత్తంగా ఉండాలి ⇒ జిల్లాలో ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన ⇒ పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు.. ⇒ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జడ్పీసెంటర్ : పథకాల అమల్లో నిజాయితీతో పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశమందిరంలో పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు, కలెక్టర్ ఇలంబరితితొఓ కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఆకస్మికంగా ఉంటుందన్నారు. అధికారులందరూ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పథకాల అమల్లో పారదర్శకత పాటించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని తెలిపారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్‌పై పకడ్బందీ ప్రణాళికలు రచించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సీఎం భారీ ప్రాజెకుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ అధికారులపై ఉన్న నమ్మకంతోనే సవాల్‌గా ఈ పథకం తీసుకున్నారని, అందుకు అనుగుణంగా అధికారులు పని చేయాలన్నారు. కాకతీయ మిషన్‌ను ఏజెన్సీ, నాన్ ఏజెన్సీలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. అడవుల నరికివేతతో జాతికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా అడవులను నరికి వేశారని, తిరిగి మొక్కలను నాటి, జిల్లాను హరితవనంగా మార్చాలన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్ల విస్తరణ, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. జిల్లాలో ఆసరా అర్హులందరికీ అందలన్నారు. ఏ ఒక్క అర్హుడు ఆసరా అందలేదని ఫిర్యాదు చేసినా అధికారులే బాధ్యత వహించాలన్నారు. రెండు, మూడు రోజుల్లో గృహ నిర్మాణ పథకానికి సంబంధించి విధి, విధానాలను సీఎం ఖరారు చేస్తారని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు మెరుగైన సేవలందించాలన్నారు. అధికారులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంగా వ్యవహరించి, జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలపాలని సూచించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య పాల్గొన్నారు. -
మరుగున పడ్డాయి..
‘స్వచ్ఛభారత్’లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వాలు... నిధుల విడుదలలో జాప్యం చేస్తుండడంతో నిర్మాణాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అదీగాక ప్రజల అవగాహన లేమితో పాటు... ఏ శాఖ నిధులు విడుదల చేస్తుందనే విషయమై సరైన స్పష్టత లేకపోవడంతో అధికారులు సైతం అంతగా దృష్టి కేంద్రీకరించని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా వ్యాప్తంగా 97,547 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4,709 మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయి. * మరుగు దొడ్ల నిర్మాణంపై ఆసక్తి చూపని జనం * నిధుల విడుదలలో తీవ్ర జాప్యం * కట్టాల్సినవి 97,547... పూర్తి చేసినవి 4,709 * ఏ శాఖ నుంచి నిధులిస్తారో వెల్లడించని వైనం * పట్టించుకోని అధికారగణం మచిలీపట్నం : ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవాలని ప్రతి గ్రామ సభలోనూ కనీసం అరగంట సమయం కేటాయించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అయినా ప్రజల్లో అనుకున్నంత స్పందన రాలేదు. నిధుల లేమి ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 10వేలు మాత్రమే ఇచ్చేవారమని, ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 12వేలకు పెంచామని ప్రభుత్వం పదే పదే చెప్పినా వీటి నిర్మాణం మూడడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారయింది. ఇటీవలి కాలం వరకు ఇసుక కొరత మరుగుదొడ్ల నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లలో 50శాతానికి పైగా వినియోగంలో లేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 97,547 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు పూర్తి చేసినవి కేవలం 4,709 మాత్రమే. మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రస్తుతం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సిబ్బంది, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇందుకోసం ఏ శాఖ నుంచి నిధులు కేటాయిస్తారనే అం శంపై ప్రభుత్వం స్పష్టం చేయడం లేదని పలువురు ఎంపీడీవోలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేశామని రానున్న కాలంలో ఈ వ్యవహారాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించే అవకాశం ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. స్థలం కొరత, వాస్తు భయం... గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ సొంత మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రజలు వెనకంజ వేయాల్సిన దుస్థితి నెలకొంది. మరుగుదొడ్డి నిర్మించాలంటే నాలుగేసి వరలతో రెండు ట్యాంకులు నిర్మించాలనే నిబంధన విధించారు. మరుగుదొడ్డికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు ఇంటి ఆవరణంలో ఉంటే వాస్తు దోషం తగులుతుందనే అపోహతో వీటి నిర్మాణానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్డి అసలు లేని వారు దీనిని నిర్మించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే రూ. 12వేలు చాలవని, మరో రూ. 2 నుంచి రూ. 3వేలు అదనంగా ఖర్చు చేయాలనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. గతంలో కొందరు వ్యక్తులు మరుగుదొడ్లు నిర్మించడానికే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఈ సారి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో పని లేకుండా ఎవరికి వారే స్వచ్ఛందంగా మరుగుదొడ్లు నిర్మించుకుంటే విడతల వారీగా నగదు మంజూరు చేస్తామని చెబుతున్నా... ముందస్తుగా పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇసుక కొరతతో జాప్యం... ఒక మరుగుదొడ్డి నిర్మించాలంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రూ. 14,040 ఖర్చవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. 870 ఇటుకలు, 30 అడుగుల ఇసుక, 9 అడుగుల పెద్దకంకర, 8 వరలు, రెండు మూతలు, రెండు అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల పొడవు ఉన్న తలుపు, 10 అడుగుల పీవీసీపైపు, ఐదు అడుగుల రేకు, బేసిన్, పైప్‌లైన్ అవసరం. నలుగురు మేస్త్రీలకు ఖర్చు రూ. 1600లని ఇంజనీర్లు నిర్ణయించారు. మరుగుదొడ్డి నిర్మించుకునే వారే పనిచేసుకుంటే రూ. 1600 ఖర్చు కలిసి వస్తుందని ప్రాథమిక అంచనా వేశారు. మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయితే నాలుగు అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పు, దొడ్డి లోపల భాగం వైపు జాగా ఉండేలా మరుగుదొడ్డి నిర్మించాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం మరుగుదొడ్డి సొంతంగా నిర్మించుకోవాలనే నిబంధన ఉండటంతో ఇటీవల కాలం వరకు ఇసుక కొరత తదితర కారణాల వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఈ అంశం అమలులోకి రాలేదు. అయితే అధికారుల ఒత్తిడి మేరకు మరుగుదొడ్డి సొంతంగా నిర్మించుకున్న వారికి బిల్లులు రాని సంఘటనలుఉన్నాయి. ఇదిలా ఉండగా మరుగుదొడ్ల నిర్మాణంలో పాత కాలం నాటి పద్ధతులను ఉపయోగిస్తుండడంతో నేటికీ రోడ్ల వెంట దుర్గంధం వెదజల్లుతోంది. ఇటీవల అస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన నరేంద్రమోడీ తాను ప్రధాన మంత్రిగా ఉండి దేశంలో మరుగుదొడ్లు నిర్మించే అంశంపై దృష్టిసారించాల్సి వస్తోందని చెప్పడం గమనార్హం. నేపథ్యమిదీ... సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రాం (సీఆర్ఎస్పీ)ను 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం. మహిళల గౌరవాన్ని కాపాడడం. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన తాగునీరు అందేలా చూడడం, మురుగునీటి నిర్మూలన చేయడం. 1999 నుంచి ఈ కార్యక్రమాన్ని విసృ్తతం చేశారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారానే మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్ఎల్డబ్ల్యూఎం), కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లకు ఈ బాధ్యతలను అప్పగించారు. పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం పాటించిన పంచాయతీలకు నిర్మల్ గ్రామ్ పురస్కార్‌ను అందజేయాలని నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లా ఫార్ములా అమలు చేసేనా? గతంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వాణిమోహన్ మరుగుదొడ్ల నిర్మాణంపై కఠిన నిర్ణయాలే తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డుపై సరుకులు తీసుకోవాలంటే మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన విధించటంతో ఆ జిల్లాలో 80శాతానికి పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని అధికారులు అంటున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు రెండునెలల గడువు ఇచ్చి మూడవ నెలలో మరుగుదొడ్డి నిర్మాణం చేయని కుటుంబాలన్నింటికీ రేషన్ నిలిపివేయడంతో రాజకీయ నాయకుల నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చినా వాటిని పక్కన పెట్టడంతో ఆ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం ప్రక్రియ కొంతైనా ముందడుగు వేసిందనే వాదనను అధికారులు వినిపిస్తున్నారు. లక్ష్యాలివే.... * గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. * 2022 నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో కచ్చితమైన పారిశుద్ధ్యాన్ని పాటించి నిర్మల్ భారత్‌గా తీర్చిదిద్దడం. * ప్రజలు ఆనారోగ్యం పాలు కాకుండా అవగాహన కల్పించడం. * గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం. * పర్యావరణ పరిరక్షణపై విసృ్తత ప్రచారం చేయడం. * ప్రతి గృహానికీ మరుగుదొడ్డి నిర్మించడం. * ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతో పాటు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి, సన్న, చిన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ద్వారానే మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వడం. * ప్రభుత్వ భవనాలు, పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించడం. -
పిల్లిమొగ్గలు
ప్రొద్దుటూరు: అక్టోబర్ 2వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు చివరి సమయంలో వాయిదా వేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జిల్లాలోని మూడు ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకాన్ని గురువారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో ముందుగా స్థానిక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎమ్మెల్యేలకు సమాచారం అందించగా చివరి సమయంలో మీరు ప్రారంభోత్సవానికి రావద్దని తమకే ఇంత వరకు స్పష్టమైన సమాచారం లేదని చెప్పారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 8, 2014న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసిన రోజు. ఆ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారోత్సవ సభలో ప్రధానంగా 5 అంశాలపై హామీ ఇచ్చారు. 1. రుణమాఫీ విధివిధానాలపై కమిటీ, 2. వృద్ధాప్య, వికలాంగ పింఛన్ల పెంపు, 3. గ్రామాల్లో రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్, 4. ఆంధ్రప్రదేశ్‌లో బెల్టుషాపుల రద్దు, 5. రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు. ప్రస్తుతం ఆచరణలో ఈ హామీల అమలు తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ హామీల్లో భాగంగా ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కే జవహర్‌రెడ్డి గత నెల 30న జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 127 ప్రకారం ప్రతి మండలంలో కనీసం ఒక గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని అక్టోబర్ 2న ప్రారంభించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కనీసం 300 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని ప్రారంభించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ప్రభుత్వం ఇందుకు నిధులు కేటాయించకపోగా కేవలం దాతల సహకారంతో వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. అత్యధిక గ్రామాల్లో తెలుగు దేశం పార్టీ నేతలతో సహా దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కొన్ని సంస్థల సహకారంతో ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. జిల్లాకు సంబంధించి 14 ప్లాంట్లను ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ఈ పథకాన్ని సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ముందుగా బ్లూకలర్లోఉన్న బ్యానర్‌ను బుధవారం టీడీపీకి చెందిన పసుపుపచ్చ రంగులో తయారు చేశారు. కాగా ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఎక్కడ వైఎస్సార్సీపీలకు మంచి పేరు వస్తుందోనని తాత్కాలికంగా జిల్లాలో ఈ ప్రారంభోత్సవాలను వాయిదా వేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డిలు వేంపల్లి, కడప, రాజంపేట నియోజకవర్గాల్లో మాత్రమే ఈ వాటర్ ప్లాంట్లను ప్రారంభిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వాటర్ ప్లాంట్లను సిద్ధం చేసుకోవాలని ఎప్పుడు ప్రారంభించాల్సింది.. ఎలా ప్రారంభించాల్సింది తామే చెబుతామని ఉన్నతాధికారులు చెప్పినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పలువురు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
సీఎం గారూ.. అమృతం వద్దు..మంచినీళ్లు ఇవ్వండి
‘‘హైటెక్ సిటీ నిర్మించాను.. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్‌ను, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో నేనే పెట్టాను !’’ .. పదేపదే చంద్రబాబువల్లెవేసే మాటలు ఇవి. సాక్షి, చిత్తూరు: ‘ఇంటిబాగు పట్టనమ్మకు.. ఊరిబాగు కావాలంట!’ అన్న చందంగా ఉంది చంద్రబాబు తీరు! పాతికేళ్ల పైబడి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు.. జిల్లా ప్రజల ఆశీస్సులతో మరోసారి సీఎం పీఠమెక్కారు. రాష్ట్రచరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కానీ విధంగా 9ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ ఏం లాభం సొంత జిల్లాను పట్టిపీడిస్తున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించలేకపోయారు. ప్రతి ఎన్నికల్లోనూ ‘మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.. ఇది యథార్థం!’ అని మాటలతోనే ఊరించి తీరా గద్దెనెక్కాక ఉసూరుమనిపిస్తున్నారు. గొంతెమ్మకోరికలు కాకుండా మంచినీటి సమస్యను మాత్రం తీర్చండి చాలు అని ప్రతి ఎన్నికల్లో మొరపెట్టుకునే జిల్లావాసులు, ఆ ఒక్క సమస్య నుంచి మూడు దశాబ్దాలుగా బయటపడలేకపోతున్నారు. కాదు.. కాదు.. పాలకులు ఆదిశగా చర్యలకు ఉపక్రమించడంలేదు. ప్రజల్ని మోసం చేసింది పాలకులే! చిత్తూరు జిల్లాను మూడు దశాబ్దాలుగా మంచినీటి సమస్య పట్టిపీడిస్తోంది. చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లె, నగరి మునిసిపాలిటీలతోపాటు 1202 గ్రామాల ప్రజలను మంచి నీటి సమస్య వేధిస్తోంది. ఇందులో 1043 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మరో 159 గ్రామాల ప్రజలు వ్యవసాయబోర్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే చిత్తూరు మునిసిపాలిటీలో 120 ట్యాంకర్ల ద్వారా రోజూ మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మదనపల్లెలో 29ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటితో పాటుతిరుపతి మినహా దాదాపు ప్రతీ మునిసిపాలిటీలోనూ మంచినీటి సమస్య వేధిస్తోంది. ప్రైవేటుగా వందల ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి. బిందెనీటిని 2-3 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో మంచినీటి సరఫరా కోసం ఏటా ప్రభుత్వం 21.45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు ప్రతి నెలా లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. మదనపల్లెలో ప్రతినెలా 2.13 కోట్ల మంచినీటి వ్యాపారం జరుగుతుందంటే సమస్య తీవ్రత ఇట్టే తెలుస్తోంది. అలాగే చిత్తూరు కార్పొరేషన్లో ఇప్పటికీ మెజార్టీ వీధుల్లో మంచినీటి ప్రజలకు మంచినీటి కొళాయి ద్వారా నీరు అందడం లేదు. కార్పొరేషన్ ట్యాంకర్లు వస్తే పట్టుకుంటున్నారు. లేదంటే ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించినా దక్కేది ఉప్పునీరే! ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించినవి ఇవే.. పూతలపట్టు, తంబళ్లపల్లె, కుప్పం, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో తీవ్ర మంచినీటి సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు. ఇవి కాకుండా అన్ని మునిసిపాలిటీల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య గత 30 ఏళ్లుగా ఆయా ప్రాంతాలను పట్టిపీడిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ‘అయ్యా! మా దప్పిక తీర్చండి చాలు.. మి మ్మల్ని మరేకోరిక అడగం’ అని ఓటర్లు ప్రజాప్రతినిధులకు రెండుచేతులెత్తి మొక్కుతూనే ఉన్నారు. సమస్య పరిష్కారస్తారని ఆశతో ఓట్లేసి అందలం ఎక్కిస్తున్నారు. ప్రజలంతా నాయకుల్ని నమ్మి గెలిపిస్తే.. వారు మాత్రం 3దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. 9 ఏళ్లలో ఏం చేశావు బాబు ? 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చిత్తూరుతో పాటు జిల్లాలో మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదు. సొంతజిల్లా వాసుల దప్పిక తీర్చలేని ఈయన రాష్ట్రాన్నే ప్రపంచపటంలో పెట్టానని ప్రగల్భాలు చెబుతుంటారు. కానీ జిల్లా ప్రజలకు చేసేందేమీ లేదు. ఓట్ల పేరుతో మోసం చేయడం తప్ప! ఈయన వెంట ఉన్న నాయకులు కూడా మంచినీటి సమస్యను ఆదాయవనరుగా మార్చుకుని ట్యాంకర్ల సరఫరా పేరుతో నిధులు మింగుతున్నారే గానీ, సమస్య పరిష్కారానికి పాటుపడటం లేదు. ఈయనతో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా మూడేళ్లపైబడి సీఎంగా పాలన సాగించారు. ఈయన కూడా గద్దెదిగే ముందు 7,430 కోట్ల రూపాయలతో కండలేరు మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. 5,900 కోట్లతో టెండర్లు పిలిచారు. 150 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. కిరణ్ సీఎంగా తొలినాళ్లలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే నీళ్లు వచ్చేవే! కానీ చివర్లో ప్రకటించి ఆ పథకాన్ని నీటిపాలు చేశారు. ఈయన హాయంలోనే మంచినీళ్లు ప్రజల గుప్పిటకు చేరలేదు. కనీసం ఈదఫా అయిన చంద్రబాబు మంచినీళ్లు అందిస్తారేమోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి చంద్రబాబు జిల్లా ప్రజల దప్పిక తీరుస్తారా? లేదంటే ఎప్పటిలాగే తనదైన శైలిలో చేయిస్తారా? అనేది వేచి చూడాల్సిందే!! -
అవి‘నీటి’ వ్యూహకర్తలు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ నేతల ను సంతోషపరచడానికి అధికారులు నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. వారి ప్రాపకం కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. లబ్ధి చేకూర్చి వారికి దగ్గరైపోవాలని చూస్తున్నారు. నాలుగు కాసులొచ్చే అవకాశాలను కల్పిస్తే తమను ఇబ్బంది పెట్టరని తాపత్రయ పడుతున్నారు. అడిగినదానికల్లా తల ఊపేస్తున్నారు. ఇందుకు నామినేటెడ్ పద్ధతిలో టీడీపీ నాయకులకు ధారాదత్తం చేస్తున్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ పనులే ఉదాహరణ. ఈ విషయంలో అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఇటు జిల్లా పరిషత్ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించారన్న ఆరోపణలొస్తున్నాయి. ఇప్పుడున్న ఆర్డబ్ల్యూఎస్, జిల్లా పరిషత్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్లే. సహజంగా ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉంటాయి. ఇదే అక్కసుతో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతలు టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులపైనైతే ఒక సమీక్ష సమావేశంలో సాక్షాత్తు కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు బదిలీ తప్పదని అంతా భావించారు. కానీ కొద్ది రోజుల్లోనే లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడంతో టీడీపీ నేతల నుంచి మునుపటి వ్యతిరేకత కన్పించడం లేదు. అంతా అనుకూలంగా ఉన్నప్పుడు ఎందుకనుకున్నారో ఏమో గాని అంతా పాజిటివ్‌గా నడిచిపోతోంది. జిల్లాలో 24 భారీ మంచినీటి పథకాల నిర్వహణ పనులను నిబంధనల మేరకు ప్రతి ఏడాదీ టెండర్ల ద్వారా అప్పగించాలి. అత్యధిక పథకాలకు సంబంధించి ఈ ఏడాది మార్చితో గడువు ముగిసింది. మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉన్నా టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కన్ను మంచినీటి పథకాలపై పడింది. దీంతో అధికారులు భారీ మంచినీటి పథకాల నిర్వహణ పనులను నామినేటెడ్‌గా కట్టబెట్టేస్తున్నారు. నిబంధనల మేరకైతే రూ.లక్ష దాటిన పనులను టెండర్ల ద్వారా ఖరారు చేయాలి. కానీ, ఆ పనులను ముక్కముక్కలు చేసి టీడీపీ నేతలకు అప్పగిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే రామతీర్థం, చీపురుపల్లి సుజలధార, భోగాపురం, గొట్లాం, గోస్తనీ, గెడ్డపువలస ప్రాజెక్టులతో పాటు బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల్లోని పలు మంచినీటి పథకాలను నామినేటెడ్‌గా ధారాదత్తం చేశారు. ఒకరిపై ఒకరు నెపం.. ఇదే విషయమై సంబంధిత అధికారులను అడిగితే ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సంప్రదిస్తే పంచాయతీ అధికారాల బదలాయింపులో భాగంగా సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను జిల్లా పరిషత్‌కు అప్పగించేశామని, వాటికి టెండర్లు పిలిచి, నిర్వహణ పనులను అప్పగించాలని లేఖ రాశామని చెప్పారు. అయితే, జెడ్పీ అధికారులు టెండర్లు పిలవకపోవడం వల్ల, పాత కాంట్రాక్టర్లు కొనసాగేందుకు ఆసక్తి చూపకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో మంచినీటి పథకాల నిర్వహణ పనులను నామినేటెడ్‌గా అప్పగించాల్సి వస్తోందని చెప్పుకొస్తున్నారు. దీనిపై జిల్లా పరిషత్ అధికారులను వివరణ అడగ్గా అటువంటి లేఖ ఏదీ ఆర్డబ్ల్యూఎస్ నుంచి తమకు రాలేదని చెప్పుకొచ్చారు. అయినా మంచినీటి పథకాలను తమకు బదలాయించడమేంటని, జిల్లా పరిషత్ నిధులతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులే మంచినీటి పథకాలకు టెండర్లు పిలుస్తున్నారని, వారే పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇందులో తమ తప్పేమీ లేదన్నట్టుగా సమాధానాలు దాటవేస్తున్నారు. ఇలా ఒకరిపైకొకరు నెపాన్ని నెట్టుకొంటున్నారు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ రెండు శాఖల అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించే... సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు టెండర్లు పిలవకుండా నామినేటేడ్ పద్ధతిలో అప్పగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇందులో అధికారులు స్వామిభక్తి చాటుకున్నారని విమర్శలున్నాయి. మొత్తానికి టీడీపీ నేతల ఒత్తిళ్లు ఫలించాయి. వారి చేతిలోకి భారీ మంచినీటి పథకాలొచ్చాయి.