మరుగున పడ్డాయి.. | peoples not intrest for toilets constructions | Sakshi
Sakshi News home page

మరుగున పడ్డాయి..

Published Mon, Nov 24 2014 3:10 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

మరుగున పడ్డాయి.. - Sakshi

మరుగున పడ్డాయి..

‘స్వచ్ఛభారత్’లో భాగంగా  ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వాలు... నిధుల విడుదలలో జాప్యం చేస్తుండడంతో నిర్మాణాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అదీగాక ప్రజల అవగాహన లేమితో పాటు...  ఏ శాఖ నిధులు విడుదల చేస్తుందనే విషయమై సరైన స్పష్టత లేకపోవడంతో అధికారులు సైతం అంతగా దృష్టి కేంద్రీకరించని పరిస్థితి నెలకొంది. దీంతో   జిల్లా వ్యాప్తంగా 97,547 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం  4,709 మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయి.
 
* మరుగు దొడ్ల నిర్మాణంపై ఆసక్తి చూపని జనం
* నిధుల విడుదలలో తీవ్ర జాప్యం
* కట్టాల్సినవి 97,547... పూర్తి చేసినవి 4,709
* ఏ శాఖ నుంచి నిధులిస్తారో వెల్లడించని వైనం
* పట్టించుకోని అధికారగణం

మచిలీపట్నం : ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవాలని ప్రతి గ్రామ సభలోనూ కనీసం అరగంట సమయం కేటాయించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అయినా ప్రజల్లో అనుకున్నంత స్పందన రాలేదు. నిధుల లేమి ఇందుకు కారణంగా తెలుస్తోంది.  గతంలో ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 10వేలు మాత్రమే ఇచ్చేవారమని, ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 12వేలకు పెంచామని ప్రభుత్వం పదే పదే చెప్పినా వీటి నిర్మాణం  మూడడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారయింది. ఇటీవలి కాలం వరకు ఇసుక కొరత మరుగుదొడ్ల నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపింది.

గతంలో నిర్మించిన మరుగుదొడ్లలో 50శాతానికి పైగా వినియోగంలో లేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 97,547 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు పూర్తి చేసినవి కేవలం 4,709 మాత్రమే. మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రస్తుతం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సిబ్బంది, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే  ఇందుకోసం ఏ శాఖ నుంచి నిధులు కేటాయిస్తారనే అం శంపై ప్రభుత్వం స్పష్టం చేయడం లేదని పలువురు ఎంపీడీవోలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేశామని రానున్న కాలంలో ఈ వ్యవహారాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించే అవకాశం ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
 
స్థలం కొరత, వాస్తు భయం...
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ సొంత మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రజలు వెనకంజ వేయాల్సిన దుస్థితి నెలకొంది. మరుగుదొడ్డి నిర్మించాలంటే నాలుగేసి వరలతో రెండు ట్యాంకులు నిర్మించాలనే నిబంధన విధించారు. మరుగుదొడ్డికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు ఇంటి ఆవరణంలో ఉంటే వాస్తు దోషం తగులుతుందనే అపోహతో వీటి నిర్మాణానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్డి అసలు లేని వారు దీనిని నిర్మించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే రూ. 12వేలు చాలవని, మరో రూ. 2 నుంచి రూ. 3వేలు అదనంగా ఖర్చు చేయాలనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. గతంలో కొందరు వ్యక్తులు మరుగుదొడ్లు నిర్మించడానికే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఈ సారి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో పని లేకుండా ఎవరికి వారే స్వచ్ఛందంగా మరుగుదొడ్లు నిర్మించుకుంటే విడతల వారీగా నగదు మంజూరు చేస్తామని చెబుతున్నా... ముందస్తుగా పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
 
ఇసుక కొరతతో జాప్యం...
ఒక మరుగుదొడ్డి నిర్మించాలంటే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం రూ. 14,040 ఖర్చవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. 870 ఇటుకలు, 30 అడుగుల ఇసుక, 9 అడుగుల పెద్దకంకర, 8 వరలు, రెండు మూతలు, రెండు అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల పొడవు ఉన్న తలుపు, 10 అడుగుల పీవీసీపైపు, ఐదు అడుగుల రేకు, బేసిన్, పైప్‌లైన్ అవసరం. నలుగురు మేస్త్రీలకు ఖర్చు రూ. 1600లని ఇంజనీర్లు నిర్ణయించారు. మరుగుదొడ్డి నిర్మించుకునే వారే పనిచేసుకుంటే రూ. 1600 ఖర్చు కలిసి వస్తుందని ప్రాథమిక అంచనా వేశారు.

మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయితే నాలుగు అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పు, దొడ్డి లోపల భాగం వైపు జాగా ఉండేలా మరుగుదొడ్డి నిర్మించాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం మరుగుదొడ్డి సొంతంగా నిర్మించుకోవాలనే నిబంధన ఉండటంతో ఇటీవల కాలం వరకు ఇసుక కొరత తదితర కారణాల వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు.

ఈ అంశం అమలులోకి రాలేదు.  అయితే అధికారుల ఒత్తిడి మేరకు మరుగుదొడ్డి సొంతంగా నిర్మించుకున్న వారికి బిల్లులు రాని సంఘటనలుఉన్నాయి. ఇదిలా ఉండగా మరుగుదొడ్ల నిర్మాణంలో పాత కాలం నాటి పద్ధతులను ఉపయోగిస్తుండడంతో నేటికీ రోడ్ల వెంట దుర్గంధం వెదజల్లుతోంది. ఇటీవల అస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన నరేంద్రమోడీ తాను ప్రధాన మంత్రిగా ఉండి దేశంలో మరుగుదొడ్లు నిర్మించే అంశంపై దృష్టిసారించాల్సి వస్తోందని చెప్పడం గమనార్హం.
 
నేపథ్యమిదీ...
సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రాం (సీఆర్‌ఎస్పీ)ను 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం. మహిళల గౌరవాన్ని కాపాడడం. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన తాగునీరు అందేలా చూడడం, మురుగునీటి నిర్మూలన చేయడం. 1999 నుంచి ఈ కార్యక్రమాన్ని విసృ్తతం చేశారు.  పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారానే మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఎల్‌డబ్ల్యూఎం), కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లకు ఈ బాధ్యతలను అప్పగించారు. పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం పాటించిన పంచాయతీలకు నిర్మల్ గ్రామ్ పురస్కార్‌ను అందజేయాలని నిర్ణయించారు.
 
పశ్చిమగోదావరి జిల్లా ఫార్ములా అమలు చేసేనా?
గతంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వాణిమోహన్ మరుగుదొడ్ల నిర్మాణంపై కఠిన నిర్ణయాలే తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డుపై సరుకులు తీసుకోవాలంటే మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన  విధించటంతో ఆ జిల్లాలో 80శాతానికి పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని అధికారులు అంటున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు రెండునెలల గడువు ఇచ్చి మూడవ నెలలో మరుగుదొడ్డి నిర్మాణం చేయని కుటుంబాలన్నింటికీ రేషన్ నిలిపివేయడంతో రాజకీయ నాయకుల నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చినా వాటిని పక్కన పెట్టడంతో ఆ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం ప్రక్రియ కొంతైనా ముందడుగు వేసిందనే వాదనను అధికారులు వినిపిస్తున్నారు.
 
లక్ష్యాలివే....
* గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం.
* 2022 నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో కచ్చితమైన పారిశుద్ధ్యాన్ని పాటించి నిర్మల్ భారత్‌గా తీర్చిదిద్దడం.
* ప్రజలు ఆనారోగ్యం పాలు కాకుండా అవగాహన కల్పించడం.  
* గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో  విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం.
* పర్యావరణ పరిరక్షణపై విసృ్తత ప్రచారం చేయడం.
* ప్రతి గృహానికీ మరుగుదొడ్డి నిర్మించడం.
* ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతో పాటు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి, సన్న, చిన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ద్వారానే మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వడం.
* ప్రభుత్వ భవనాలు, పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ పథకం ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించడం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement