
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో స్థానికుల భాగస్వామ్యం పెరిగినప్పుడే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తాగునీటి సరఫరాకు అవకాశం ఉంటుందని గ్రామీణ మంచినీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) ఉన్నతాధికారులు పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్‌డబ్ల్యూఎస్, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాల అధికారులు, ఎన్జీవో ప్రతినిధులతో రెండు రోజుల వర్క్‌షాప్ విజయవాడలో ప్రారంభమైంది.
ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి, జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరేరామ్ నాయక్, సీఈలు గాయత్రిదేవి, సంజీవరెడ్డి, రవికుమార్ అధికారులు, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఎన్జీవో ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు 40 ఎన్జీవో సంస్థలకు చెందిన 600 మంది ప్రతినిధులకు బాధ్యత అప్పగించింది.