చిత్తూరు కార్పొరేషన్: తాగునీటి అవస్థలకు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. జలజీవన్ మిషన్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 3,72,233 కొళాయి కనెక్షన్లు ఇవ్వగా మిగిలిన 1,25,220 కనెక్షన్లను 2024కల్లా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీచేశాయి. సీజన్ ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాలని సంకల్పించాయి. దీనిపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
జలజీవన్ లక్ష్యం ఇలా..
గ్రామంలోని అన్ని కుటుంబాలకు కొళాయి కనెక్షన్ ఇవ్వడం
స్థానిక తాగునీటి వనరుల లభ్యత, సమస్యను అధిగమించడం
ప్రస్తుత్తం ఉన్న తాగునీటి పంపిణీ వ్యవస్థ నుంచి మరింత మెరుగైన సేవలు అందించడం
అవసరమైన చోట అదనపు బోర్లు, తాగునీటి ట్యాంకులు, అదనపు పైప్‌లైన్‌లు వేయడం
ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించడం
రెండేళ్లలో ప్రతి గడపకూ తాగునీరు
జిల్లాలోని ప్రతి గడపకూ జలజీవన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా 2020–21 సంవత్సరంలో 2,82,755 కొళాయి కనెక్షన్లు, 2021–2022లో 89,478 కనెక్షన్లు ఇచ్చారు. దీనికి రూ.53 కోట్లమేర ఖర్చుచేశారు. అలాగే మరో రెండేళ్లలో 1,25,220 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం నిర్ధేశించుకున్నారు.
కొత్తపనులు ఇలా..
జలజీవన్ ద్వారా జిల్లాకు 9,916 తాగునీటి పనులు మంజూరయ్యాయి. వీటికి రూ.2,234 కోట్లు ఖర్చుచేయనున్నారు. 1,060 జగనన్న కాలనీల్లో బోర్లు, పైప్‌లైన్లతోపాటు ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో సమగ్ర రక్షిత నీటి పథకాలు ఆరు, రక్షిత నీటి పథకాలు 10,360 ఉండగా వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచనున్నారు. అలాగే పశ్చిమ మండలాల్లో కెనాల్స్ నుంచి నీటిని శుద్ధి చేసి సమస్య ఉన్న 20 మండలాలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయనున్నారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు.
నీటి సరఫరా మెరుగు
ఎండాకాలం తాగునీటి సరఫరా కష్టంగా ఉండేది. భూగర్భ జలాలు అడుగంటడంతో శివారు ప్రాంతాల్లో మంచినీటి పథకాలు పనిచేసేవి కావు. పొలాలు, ఇతర గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవస్థలు లేవు. జలజీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచినీటి పథకాలు మెరుగుపడ్డాయి. కొత్త పనులకు టెండర్లు పిలిచాం.
– విజయ్‌కుమార్, ఎస్‌ఈ ఆర్‌డబ్ల్యూఎస్
ఈమె పేరు సంగీత. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కురమైపల్లె గ్రామం. గతంలో నీళ్లు తెచ్చుకోవడానికి అష్టకష్టాలు పడేది. గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి మోటారు వద్ద, అక్కడ నీరు రాకపోతే చేతిబోరు వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడేది. నీళ్లులేక ఇంట్లో పనులు చేయాలన్నా ఇబ్బందిగా ఉండేది. సకాలంలో కూలికెళ్లలేక అవస్థలు ఎదుర్కొనేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటి వద్దే కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేయడంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఈమె పేరు వీరభద్రమ్మ(52). చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం, అగ్రహారం గ్రామవాసి. కిలోమీటరు దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. రోజూ అవస్థలు తప్పేవి కావు. ప్రస్తుతం జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించారు. ఇంటిముందే కొళాయి ఏర్పాటు చేయడంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. స్వచ్ఛమైన నీరు తాగుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment