ఇన్నాళ్లూ అణిగిమణిగి ఉన్న శక్తులు ఆయన కుర్చీ దిగగానే రెచ్చిపోతున్నాయి
ఢిల్లీ కీలుబొమ్మలు, గుజరాత్ గులాములతో ప్రమాదం పొంచి ఉంది
కాంగ్రెస్ 420 హామీలు అమలయ్యేదాకా పోరుబాట
‘దీక్షా దివస్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి,కరీంనగర్: ‘కేసీఆర్ అంటే పేరు కాదని, కేసీఆర్ అంటే తెలంగాణ పోరు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇన్నాళ్లూ అణిగిమణిగి ఉన్న శక్తులు కేసీఆర్ కుర్చీ దిగిపోగానే రెచ్చిపోతున్నాయని... సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన ద్రోహులు తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ కీలుబొమ్మలు, గుజరాత్ గులాములతో తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉందని.. అందుకే తెలంగాణ చరిత్రను రేపటి తరానికి నరనరానా ఎక్కించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ‘దీక్షా దివస్’ కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణ భవన్‌లో, కరీంనగర్ జిల్లా అల్గునూరులో జరిగిన కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ అడుక్కుతినేదని కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంతో వాగుతున్నారు. ప్రజాపోరాటాన్ని కించపరుస్తున్నారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటును అవమానించారు. అలాంటి వారితో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం. తెలంగాణ ఏర్పాటుతో నష్టపోయిన శక్తులు మళ్లీ పెత్తనం కోసం ఆరాటపడుతున్నాయి. స్వతంత్య్రం సాధించడం ఎంత ముఖ్యమో, నిలబెట్టుకోవడం అంతే ముఖ్యం. కవులు, కళాకారులు, మేధావులు అంతా తెలంగాణపై జరుగుతున్న దాడిని గుర్తించి.. ప్రస్తుత తరంలోనూ ఆత్మగౌరవ స్ఫూర్తిని రగిలించాలి.
తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేస్తారట..
కేసీఆర్, తెలంగాణ ఆనవాళ్లను చెరిపేస్తానని రేవంత్ రెచ్చిపోతున్నారు. అందుకే తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చారి్మనార్‌ను తొలగించాలనే దుర్మార్గమైన ఆలోచన చేశారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తున్నారు. సచివాలయం ఎదుట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టి సిగ్గు లేకుండా ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో మన మీద తుపాకీ పట్టినోడు ఇప్పుడు ఏదోదో వాగుతున్నాడు. అదృష్టం వల్ల నీకు అధికారం ఉండవచ్చు. కానీ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆర్‌పై ఎనలేని అభిమానం ఉంది.
ఇక గుజరాతీ సర్దార్ వల్లభ్‌భాయ్ మనల్ని విడిపించారని, ఇంకో గుజరాతీ అభివృద్ధి నేరి్పస్తున్నారని చెబుతూ బీజేపీ నేతలు... తెలంగాణ సాయుధ పోరాటాన్ని, మలి దశ ఉద్యమాన్ని అవమానిస్తున్నారు. కేసీఆర్ పాలన కాలంలో అదానీ, ప్రధాని తెలంగాణలో అడుగుపెట్టే సాహసం చేయలేదు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ మీద పట్టుకోసం వస్తున్నారు. ఆత్మగౌరవం, అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లమవుతాం.
తెలంగాణ భవన్.. జనతా గ్యారేజ్
లగచర్లలో భూసేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం గిరిజనులు, దళితులు, బీసీలు, రైతులతో కలసి బీఆర్‌ఎస్ సాధించిన విజయం. మరొక రూపంలో భూములు కావాలని మళ్లీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకు గత్యంతరం. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయింది. ప్రజలకు ఎప్పుడు ఏ కష్టమొచి్చనా సరే తెలంగాణ భవన్ తలుపులు తీసే ఉంటాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది కేసీఆర్, బీఆర్‌ఎస్ మాత్రమే.
కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ
‘‘2001 మే 17వ తేదీన సింహగర్జన పేరిట కేసీఆర్ కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభ ఉద్యమ కాంక్షను, కేసీఆర్‌ను దేశానికి పరిచయం చేశాయి. తెలంగాణ ఉద్యమానికి జన్మ, పునర్జన్మ ఇచి్చన గడ్డ కరీంనగర్. తెలంగాణ పని అయిపోయిందన్న సమయంలో 2009లో నవంబరు 29న కేసీఆర్ దీక్షా దివస్‌తో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. ఆయన అరెస్టు రాష్ట్రమంతా నిప్పురాజేసింది. కేసీఆర్ ఆమరణ దీక్ష కారణంగా విధి లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచి్చంది. నాటి చరిత్ర ఇప్పటి 18, 20 ఏళ్ల పిల్లలకు తెలియదు. కేసీఆర్ సీఎంగా మంచి పనులు చేశారని మాత్రమే తెలుసు. కానీ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన విషయం వారికి తెలియాలి.’’
ఉద్యమ స్ఫూర్తిని చాటేలా దీక్షా దివస్
కేటీఆర్ నేతృత్వంలో బంజారాహిల్స్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అరి్పంచారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు ఆరు నెలల తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, పద్మారావుగౌడ్, మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దాసోజు శ్రవణ్, తలసాని సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment