
మృత్యు కుహరం
రెండేళ్ల బాలుడిని మింగిన బోరుబావి
బాలుడిని రక్షించేందుకు కృషి చేసిన యంత్రాంగం
వేలూరు జిల్లా ఆర్కాడులో ఘటన
వేలూరు: ఆర్కాడు సమీపంలోని సాంబశివపురం గ్రామానికి చెందిన కుట్టి విదేశాల్లో ఉన్నాడు. ఇతని భార్య గీత, కుమారుడు తమిళరసన్(2) ఇక్కడే ఉన్నారు. తమిళరసన్ అమ్మమ్మ, తాతయ్యల ఊరు కూరంబాడి. తమిళరసన్ అమ్మ గీతతోపాటు తాతగారింటికి ఆదివారం ఉదయం వెళ్లాడు. ఉదయం 8.10 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. చిన్నారి కనిపించక పోవడంతో తల్లి గీత, అవ్వ వెతుకుతుండగా, బోరు బావి నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆర్కాడు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా చిన్నారి 40 అడుగుల లోతులో ఉన్న ట్లు గుర్తించారు. వెంటనే సంఘటనా స్థలానికి జేసీబీలు, ప్రొక్లెయిన్లు రప్పించి బోరు బావి చుట్టూ మట్టి తీసే పనిలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 20 అడుగులు తవారు. చిన్నారికి బోరు బావిలో శ్యాస ఆడేందుకు ఆక్సిజన్‌ను వదిలారు. వెంటనే వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి రప్పించారు.
మంత్రి వీరమణి, ఎమ్మెల్యేలు శ్రీనివాసన్, మహ్మద్‌జాన్, కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ సెంథిల్‌కుమారి, ఆరోగ్యశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోర్‌వెల్‌లో చిన్నారి పడిన నాలుగు గంటల్లోనే ఎటువంటి శబ్దం రాకపోవడంతో అధికారులతో పాటు గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. గ్రామస్తులు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బండ రావడంతో మట్టి తొలగించడానికి అంతరాయం కలిగింది.
వెంటనే డ్రిల్లింగ్ ద్వారా బండను తొలగించి మట్టిని తీశారు. ఆ వెంటనే వర్షం రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నా తవ్వకాలు మాత్రం ఆపలేదు. మధ్యాహ్నం వరకు నుంచి సాయంత్రం వరకు బోరు బావి చుట్టూ తవ్వకాలు సాగించారు. సాయంత్రం 6.10 గంటలకు బాలుడిని వెలుపలికి తీశారు. వెంటనే అంబులెన్స్‌లో ఎక్కించి, ప్రథమ చికిత్స అందిస్తూ వాలాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చేరిన కొంత సేపటికే బాలుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మూడేళ్ల క్రితం బాలుడి తాత కనగసబ వ్యవసాయ భూమిలో 400 అడుగుల బోరు వేశాడు. బోరులో నీరు రాక పోవడంతో వాటిని రాళ్లతో మూసి వేసినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆ రాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించినట్లు తెలుస్తుంది.
ఉదయం
8.00 - చిన్నారి ఇంటి ముందు ఆటలాడుతున్నాడు
8.10 - బోర్‌బావిలో బాలుడు పడ్డాడు
8.30 - పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు
8.35 - బోరుబావిలో దారం వదిలారు
9.00 - అంబులెన్స్ వచ్చింది
9.20 - బోరుబావిలోకి ఆక్సిజన్ వదిలారు
9.30 - తవ్వకాలు కొనసాగించారు
సాయంత్రం
6.10 - బాలుడి వెలికి తీత
6.30 - వాలాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
6.45 - బాలుడు కన్నుమూసినట్లు అధికారుల ప్రకటన