బాలుడిని రక్షించేందుకు బోరుబావిలోకి దిగుతున్న సురేష్, (ఇన్‌సెట్‌లో) సురేష్
ద్వారకాతిరుమల: ఒక యువకుడి సాహసం.. బోరుబావిలో పడ్డ బాలుడి ప్రాణాలను కాపాడింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ప్రాణాలకు తెగించి మరీ రక్షించాడు ఆ యువకుడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని గుండుగొలనుకుంటలో బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మనెల్లి పూర్ణజశ్వంత్ (9) బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటి సమీపంలోని కమ్యూనిటీ హాలు వద్ద ఉన్న బోరుబావిలో పడిపోయాడు.
బాలుడు కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, శ్యామల కంగారుపడుతూ వెదుకులాడటం మొదలుపెట్టారు. రాత్రి 10 గంటల సమయంలో కమ్యూనిటీ హాలు వద్ద వెదుకుతున్న వెంకటేశ్వరరావుకు బాలుడి అరుపులు వినిపించాయి. దీంతో బోరుబావి వద్దకు వెళ్లి టార్చ్‌లైట్ వేసి చూడగా బాలుడు కనిపించాడు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్తులు, సమాచారాన్ని అందుకున్న భీమడోలు అగ్నిమాపక అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ బాలుడు పూర్ణ జశ్వంత్‌తో తల్లిదండ్రులు
బాలుడిని ఎలా బయటకు తీయాలని అంతా తర్జనభర్జనలు పడుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన, బాలుడికి దగ్గరి బంధువైన కోడెల్లి సురేష్ రాత్రి 11 గంటల సమయంలో తన నడుముకు తాడు కట్టుకుని ధైర్యంగా బోరుబావిలోకి దిగాడు. 400 అడుగుల లోతుగల బోరుబావిలో 30 అడుగుల లోతున ఒక రాయి వద్ద చిక్కుకుని ఉన్న బాలుడిని పైకి తీసుకొచ్చాడు.
ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన బాలుడిని చూసి అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సురేష్ సాహసాన్ని బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు మెచ్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన బోరుబావిని గ్రామస్తులు గురువారం ఉదయం పూడ్చేశారు. ద్వారకాతిరుమల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ బొండాడ మోహిని, వైఎస్సార్‌సీపీ నేత బొండాడ వెంకన్నబాబు, ఎస్‌ఐ టి.సుధీర్, గుండుగొలనుకుంట గ్రామ సర్పంచ్ బండారు ధనలక్ష్మి తదితరులు సురేష్‌ను ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment