చిన్నారుల మృతదేహాలు
మల్దకల్ (గద్వాల): ఒకటి నుంచి మూడో తరగతి వరకు చదువుతున్న ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు ఓ బావి గుంతలో పడి మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నాగర్‌దొడ్డిలో సోమవారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లప్ప, మాణిక్యమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో యమున(12), చిన్నారి (11), వెంకటేశ్వరి (10) మృత్యువాతపడ్డారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో 8 ఏళ్ల పాప ఈ ప్రమాదంలో మృతి చెందింది. అలాగే చిన్న కుర్వ వెంకటేశ్, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కవిత (11) మృత్యువాతపడింది.
సంఘటన జరిగిందిలా..
సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లలు సమీపంలో ఉన్న రిజర్వాయర్ వద్ద నీటిలో ఆడుకోవడానికి వెళ్లారు. నీటిలో కొంత లోపలికి వెళ్లగా ప్రమాదవశాత్తు ఐదుగురు చిన్నారులు బావి కోసం తీసిన పెద్ద గుంతలో పడిపోయారు. చిన్నారులు పెద్ద ఎత్తున కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగిపోయారు. సుమారు గంట తర్వాత అటువైపు వెళుతున్న రైతులు బావి గుంతలో పడిన చిన్నారులను చూశారు. రాత్రి 7.30 ప్రాంతంలో చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. ఐదుగురు బాలికలు ఒకేసారి మృత్యువాతపడడంతో నాగర్‌దొడ్డి గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment