
ఇద్దరు పసికందులు సహా ముగ్గురు మృతి
ఆరుగురికి గాయాలు
పుణే: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్‌పాత్‌పై వీరంతా నిద్రిస్తున్నారు.
అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment